Monday, September 25, 2023
Monday, September 25, 2023

రాజ్యాంగానికే ఎసరు

రాజ్యాంగాన్ని చడీచప్పుడూ లేకుండా ఇష్టానుసారం ఉల్లంఘించడం, ఎద్దేవా చేయడం సంఫ్‌ు పరివార్‌ ఎప్పటి నుంచో చేస్తున్న పని. చాలా కాలంపాటు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌.ఎస్‌.ఎస్‌.) అసలు రాజ్యాంగాన్ని అంగీకరించనే లేదు. మొన్న మొన్నటి దాకా ప్రస్తుత పాలకులు రాజ్యాంగాన్ని మార్చేస్తారు అన్న మాట వినబడితే అది వదంతేమో అనుకున్నాం. కానీ సంపూర్ణ సత్యం అని క్రమంగా రుజువు అవుతోంది. ప్రధాని ఆర్థిక సలహా మండలి అధ్యక్షుడు వివేక్‌ దెబ్రాయ్‌ స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ప్రస్తుత రాజ్యాంగాన్ని పక్కకు నెట్టేసి 2047 కల్లా కొత్త రాజ్యాంగం రూపొందించుకోవాలని చెప్పారు. ఆయన ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితుడు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేసి తమకు అనుకూలమైన రాజ్యాంగాన్ని సిద్ధం చేసుకోవాలన్న ఆలోచన సంఫ్‌ు పరివార్‌ కు రాజకీయ అంగమైన బీజేపీ మనసులో ఎప్పటి నుంచో ఉంది. వివేక్‌ దెబ్రాయ్‌ ఆ వాదనను సరికొత్తగా లేవనెత్తారు. లేదా ఆయన చేత ఈ మాట అనిపించి ఉంటారు. ఆయన రాజ్యాంగం గురించి మాట్లాడం బీజేపీ నాయకుల పద్ధతిలోనే ఉంది. బీజేపీలో అందరూ అన్నింటి గురించి మాట్లాడతారు. వివేక్‌ దెబ్రాయ్‌ రాజ్యాంగం గురించి మాట్లాడి బీజేపీ రాజకీయాలను ముందుకు తోయడంలో ఆశ్చర్య పడవలసింది ఏమీ లేదు. స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి ఆర్‌.ఎస్‌.ఎస్‌. అవకాశం వచ్చినప్పుడల్లా రాజ్యాంగాన్ని తూర్పార పడ్తూనే ఉంది. ఎం.ఎస్‌. గోల్వార్కర్‌ దగ్గర నుంచి ప్రస్తుత బీజేపీ నాయకులందరూ రాజ్యాంగాన్ని కించ పరుస్తూనే వచ్చారు. ఇప్పుడూ అదే పనిలో ఉన్నారు. ప్రస్తుత ప్రధానమంత్రి కూడా రాజ్యాంగాన్ని తూలనాడిన వారే. మన రాజ్యాంగం ఓ చిక్కు ముడి లాంటిది. పశ్చిమ దేశాల్లోని రాజ్యాంగాలలోని అక్కడో ముక్క ఇక్కడో ముక్క తీసి రాజ్యాంగాన్ని తయారు చేశారు అని సంఫ్‌ు పరివార్‌ వారు విమర్శిస్తూ ఉంటారు. అందులో మనదంటూ ఏమీ లేదన్నది సంఫ్‌ు పరివార్‌ అభిప్రాయం. మన జాతీయ దీక్ష గురించి అందులో ఒక్క ముక్కైనా ఉందా అని ప్రశ్నిస్తారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రార్థనలో ప్రజాస్వామ్య, సెక్యులర్‌ రాజ్యాంగం మీద విద్వేషం వెళ్లగక్కుతూనే ఉంటారు. స్వాతంత్య్రం రావడానికి ఒక్క రోజు ముందు విడుదలైన ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధికార పత్రిక ‘‘ఆర్గనైజర్‌’’ లో అసలు మన జాతి నిర్మాణాన్నే తూలనాడారు. హిందుస్థాన్‌ హిందువులది మాత్రమేనన్నది ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రగాఢంగా నమ్ముతుంది. దేశ నిర్మాణం ఆ పునాదిపైనే నిర్మించాలని సంఫ్‌ు పరివార్‌ చెప్తూ ఉంటుంది. హిందూ సంప్రదాయాలు, సంస్కృతి, భావనలు, ఆకాంక్షలే వ్యక్తం కావాలన్నది సంఫ్‌ు పరివార్‌ ఆలోచన. సంఫ్‌ు పరివార్‌ ఆలోచన ఇదే అయినా ఆ రాజ్యాంగం ఆధారంగానే చాయ్‌ అమ్ముకునే వ్యక్తి ప్రధాన మంత్రి అయ్యారన్న విషయం కావాలనే మరిచి పోతారు. అంతకు ముంది వాజపేయి నాయకత్వంలో మూడు సార్లు అధికారంలోకి వచ్చిందీ ఈ రాజ్యాంగంఆధారంగానే. అంటే అధికారం దక్కించుకోవడానికి రాజ్యాంగాన్ని ఉపయోగించుకోవడం, అధికారం దక్కిన తరవాత దాన్ని ఛిద్రం చేయడం సంఫ్‌ు పరివారు లక్ష్యం.
మరీ విచిత్రం ఏమిటంటే నవంబర్‌ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది సాక్షాత్తు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీనే. రాజ్యాంగాన్ని పునర్లిఖించాలన్న ఆలోచన కేవలం వివేక్‌ దెబ్రాయ్‌ ది మాత్రమే కాదు. వాజపేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడే రాజ్యాంగాన్ని మార్చడానికి న్యాయమూర్తి ఎం.ఎన్‌.వెంకటాచలయ్య నాయకత్వంలో ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. అయితే అప్పుడు ఆ సిఫార్సులను అమలు చేయలేదు. వివేక్‌ దెబ్రాయ్‌ ప్రధాన వాదన ఏంటిటంటే ప్రస్తుత రాజ్యాంగం కార్యనిర్వాహక వర్గానికి అంటే ప్రభుత్వానికి ఆటంకాలు కలిగిస్తోందట. అంటే న్యాయ పరిశీలన కిట్టడం లేదన్న మాట. న్యాయమూర్తులను ఎంపిక చేసే అధికారం కొలీజియం దగ్గరే ఉండడం బీజేపీకి అస్సలు కిట్టదు. మొన్నటి దాకా న్యాయ శాఖ మంత్రిగా ఉన్న కిరణ్‌ రిజుజు కొలీజియం విధానాన్ని, సుప్రీంకోర్టును ఎన్ని సార్లు విమర్శించారో లెక్క లేదు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ కర్‌ అదే పాట పాడుతుంటారు. దేశాభివృద్ధికి ప్రస్తుత రాజ్యాంగమే హిందుత్వ వాదులకు ప్రధాన అడ్డంకిగా కనిపిస్తోంది. పార్లమెంటు ఆమోదించే చట్టాలు రాజ్యాంగ బద్ధమైనవి అవునో కాదో పరిశీలించే అవకాశం న్యాయవ్యవస్థకు ఉండడం సంఫ్‌ు పరివార్‌ కు పొసగదు. సుప్రీంకోర్టుకు పరిశీలనావకాశం లేకుండా చేయడంతో పాటు 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా రూపొందిన రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే సంఫ్‌ు పరివార్‌ కు ఒళ్లు మంట. మన రాజ్యాంగం అంటే ఏముంది బ్రిటిష్‌ వారు తీసుకొచ్చిన 1935 నాటి భారత చట్టాన్ని యధా తధంగా రాజ్యాంగంలో చేర్చడమే కదా అన్న పాత వాదనను వివేక్‌ దెబ్రాయ్‌ మళ్లీ లేవనెత్తారు. రాజ్యాంగాన్ని అనేక సార్లు సవరించాం కనక మునుపటి స్వరూపం లేదు కదా అందుకని కొత్తది రాసుకోవాలని చూస్తున్నారు.
కొలీజియం మీద కోపంతోనే న్యాయమూర్తుల నియామక జాతీయ కమిషన్‌ ఏర్పాటుకు బీజేపీ హయాంలోనే బిల్లు ఆమోదించారు. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. న్యాయవ్యవస్థ అంటే కిట్టక పోవడానికి ఇలాంటి పరిణామాలూ కారణమే. ఇంకో విచిత్రం ఏమిటంటే ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పులిచ్చి రాజ్య సభ సభ్యుడై పోయిన మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ప్రశ్నిస్తున్నారు. న్యాయమూర్తిగా ఉన్నప్పుడు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సమర్థిస్తూ తీర్పులిచ్చిందీ ఆయనే. అంటే న్యాయమూర్తిగా ఉన్నప్పుడు పవిత్రమైందిగా కనిపించిన అంశం రాజకీయ వేష ధారణ చేయగానే ప్రశ్నార్థకమైందేమో. రాజ్యాంగాన్ని వందకన్నా ఎక్కువ సార్లు సవరించి ఉండవచ్చు. ఇక ముందూ సవరణలు అవసరం కావచ్చు. రాజ్యాం సవరణల ద్వారా తప్పు జరిగిందనిపించినప్పుడు మళ్లీ సవరించి ఆ తప్పు దిద్దుకున్న సందర్భాలూ ఉన్నాయి. రాజ్యాంగ రచన ఆషామాషీగా జరిగింది కాదు. ఆనాడున్న వివేకవంతులు రెండున్నరేళ్ల పాటు పడిన శ్రమ ఫలితం అది. రాజ్యాంగం అతుకుల బొంత అంటున్న వారు వివేక్‌ దెబ్రాయ్‌ కన్నా ముందు కూడా ఉన్నారు. కానీ ఆ అతుకుల బొంత చాలా అందమైంది. ప్రపంచ రాజ్యాంగాలలోకెల్లా మన రాజ్యాంగానికి గౌరవం ఉంది. రాజ్యాంగం ఎంత మహత్తరమైంది అయినా దాని ప్రయోజనం అమలుచేసే వారిమీదే ఆధారపడి ఉంటుందని అంబేద్కర్‌ రాజ్యాంగ నిర్ణాయకసభ ఆఖరి సమావేశంలోనే చెప్పారు. ఇప్పుడు అలాంటి వారి చేతిలోనే ప్రభుత్వం ఉంది. ఇజ్రాయిల్‌లో పార్లమెంట్‌ ఆమోదించే చట్టాలను న్యాయవ్యవస్థ పరిశీలించే అవకాశం లేకుండా చేశారు. బీజేపీకి కావాల్సింది కూడా అదే అనిపిస్తోంది. నియంతృత్వం చెలాయించాల్నుకునే వారికి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే, సెక్యులరిజాన్ని సమర్థించే రాజ్యాంగం అడ్డంకిగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోనే వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం రోజున మళ్లీ కలుద్దాం అని మోదీ అన్నారు. అంటే మూడో సారీ విజయం సాధించగలమన్న ధీమా ఆయనకు ఉన్నట్టుంది. అలాగే జరిగితే, కొత్త రాజ్యాంగాన్ని రాస్తే భవిష్యత్తులో అనేక తరాల వారు ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, న్యాయ వ్యవస్థ స్వతంత్రత లాంటి మాటలను మరిచి పోవాల్సిందే. ఈ మౌలిక అంశాలను పరిరక్షించే బాధ్యత పౌరులదే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img