Saturday, June 3, 2023
Saturday, June 3, 2023

రాహుల్‌కు ఊరట

దొంగలందరికీ మోదీ అన్న ఇంటి పేరు ఎందుకుంటుంది అని 2019లో ఒక ఎన్నికల ప్రచార సభలో అన్నందుకు సూరత్‌లోని ఓ కింది కోర్టు రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన కేసులో సోమవారం బెయిలు లభించింది. సూరత్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధించిన 24 గంటల్లోనే ఆఘమేఘాల మీద ఆయన లోకసభ సభ్యత్వం కూడా రద్దయిపోయింది. లోకసభ సభ్యుడిగా ఆయనకు కేటాయించిన ఇల్లు కూడా ఖాళీ చేయాలని ఆదేశించడమూ వెంటనే జరిగిపోయింది. రాహుల్‌కు సెషన్స్‌ కోర్టు బెయిలు అయితే మంజూరు చేసింది. అది దాదాపు నెలరోజుల కోసమే. అంతకు ముందే రాహుల్‌ కు విధించిన రెండేళ్ల జైలుశిక్ష నెలరోజులపాటు అమలు చేయకూడదని శిక్ష విధించిన చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ చెప్పారు. ఈ తీర్పు తరవాత 11 రోజులకు రాహుల్‌కు బెయిల్‌ మంజూరైంది. ఈ కేసులో తదుపరి విచారణ ఏప్రిల్‌ 13వ తేదీన జరుగుతుంది. అప్పుడు రాహుల్‌ స్వయంగా కోర్టుకు హాజరు కానక్కరలేదు. అయితే ఇప్పుడు బెయిలు దొరికింది కనక రాహుల్‌ గాంధీ లోకసభ సభ్యత్వం కూడా పునరుద్ధరిస్తారని చెప్పడానికి వీలు లేదు. ఇటీవలే లక్షద్వీప్‌ నుంచి ఎన్నికైన నేషనలిస్టు కాంగ్రెస్‌పార్టీ లోకసభ సభ్యుడు మహమ్మద్‌ ఫైజల్‌కు కూడా ఇలాగే బెయిలు మంజూరు అయింది. అయితే ఆయన లోకసభ సభ్యత్వం మాత్రం వెంటనే పునరుద్ధరించలేదు. నెల రోజులు జాప్యం చేశారు. రాహుల్‌ గాంధీకి బెయిలు మంజూరు కావడంలో పెద్ద విశేషం ఏమీ లేదు. బెయిలు మంజూరు అయిన వెంటనే ‘‘నేను సత్యం కోసం పోరాడతాను’’ అన్న మహాత్మా గాంధీ సూక్తిని రాహుల్‌ ట్విట్టర్‌ లో పునరుద్ఘాటించారు. శిక్ష పడ్డప్పుడు కూడా ఆయన ఇదే పని చేశారు. సత్యం కోసం పోరాడడమే కాదు మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆశ్రిత పక్షపాత విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని కూడా చెప్పారు. రాహుల్‌ గాంధీ సెషన్స్‌ కోర్టులో బెయిలుకోసం అర్జీ పెట్టుకోవడానికి వెళ్లినప్పుడు ఆయనతో పాటు ప్రియాంకా గాంధీ కూడా ఉన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేల్‌ భగేల్‌, హిమాచల్‌ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌తో పాటు అనేకమంది కాంగ్రెస్‌ నాయకులు కూడా సూరత్‌ వెళ్లారు. సూరత్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తల హడావుడి చాలా ఎక్కువగా కనిపించింది. ఆ పట్టణంలో అనేక చోట్ల ‘‘రాహుల్‌ భయపడొద్దు’’, ‘‘సత్యమేవ జయతే’’ లాంటి బ్యానర్లు, పోస్టర్లు కనిపించాయి. వందలు, వేల సంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు కోర్టు ఆవరణ దగ్గరకు వచ్చారు. రాహుల్‌తో పాటు తామూ కోర్టులోకి వెళ్లడానికి ప్రయత్నించారు. ఇవన్నీ రాజకీయ బల ప్రదర్శనకు ఉద్దేశించిన కార్యక్రమాల్లో భాగం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ గుజరాత్‌ ప్రభుత్వం రాహుల్‌ కు మద్దతు తెలియజేయడానికి వచ్చిన కాంగ్రెస్‌ కార్యకర్తలను భారీ సంఖ్యలో అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడానికి తమ చేతిలో ప్రభుత్వాధికారం ఉందని నిరూపించు కుంది.
రాహుల్‌కు శిక్ష విధించినప్పుడు న్యాయస్థానం తీర్పును రాజకీయ దుష్ప్రచారానికి వినియోగించుకున్నట్టే బీజేపీ ఆయన బెయిలు కోసం వెళ్లడాన్ని కూడా రాజకీయ ధృక్కోణం నుంచే చూసింది. బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు దగ్గరనుంచి మొదలుపెట్టి అనేకమంది బీజేపీ నాయకులు రాహుల్‌ను ఎద్దేవా చేయడానికి తమ ట్విట్టర్‌ ప్రతిభనంతా కనబరిచారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అయితే ‘‘బెయిలు తెచ్చుకోవడానికి రాహుల్‌ మందీ మార్బలంతో స్వయంగా సూరత్‌ వెళ్లనక్కర్లేదు. బెయిలుకోసం దోషిగా తేలిన వ్యక్తి స్వయంగా వెళ్లనక్కర్లేదు. సాధారణంగా దోషిగా తేలిన వారెవరూ స్వయంగా వెళ్లరు. మందీ మార్బలాన్ని వెంటేసుకుని రాహుల్‌ సూరత్‌కు వెళ్లడం ఓ నాటకం’’ అన్నారు. అప్పీలుకు వెళ్లిన కోర్టు మీద ఒత్తిడి తీసుకు రావడానికే రాహుల్‌ జనాన్ని వెంటేసుకు వెళ్లారు. ఇది పిల్ల చేష్ట. కాని ఈ దేశంలో కోర్టులు ఇలాంటి ఎత్తుగడలకు లొంగిపోవు’’ అని రిజిజు కసిగా వ్యాఖ్యానించారు. ఆయనతో పోటీపడి బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్దా ‘‘రాహుల్‌ దొంగలందరికీ మోదీ అన్న ఇంటిపేరు ఎందుకు ఉంటుంది’’ అనడాన్ని ప్రస్తావిస్తూ రాహుల్‌ 2019లో చేసిన వ్యాఖ్యలు వెనుకబడిన తరగతుల వారిని కించపరచడమేనన్న కుతర్కాన్ని ప్రదర్శించారు. రాహుల్‌ చేసిన వ్యాఖ్యల్లో లలిత్‌ మోదీ, నీరవ్‌ మోదీతో పాటు నరేంద్ర మోదీ పేరు కూడా ఉంది. ఇందులో నరేంద్ర మోదీ తప్ప మిగతా ఇద్దరు వెనుకబడిన తరగతుల వారు కాదు.
కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అన్న బీజేపీ ప్రణాళికలో భాగంగానే రాహుల్‌ను ‘‘పప్పు’’ లాంటి మాటలతో గేలి చేయడానికి బీజేపీ సకల ప్రయత్నాలూ చేసింది. ఇంతకు ముందు రాహుల్‌ గాంధీ రాజకీయాలలో అంత సీరియస్‌గా ఉండేవారు కాదు. ఆయన మాటలు కూడా యథాలాపంగా ఉండేవి. కానీ ఇటీవలి కాలంలో రాహుల్‌లో పరిపక్వత స్పష్టంగా కనిపిస్తోంది. భారత్‌ జోడో యాత్ర తరవాత ఆయన వ్యక్తిత్వంలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ యాత్ర జనంలో కాంగ్రెస్‌పై ఆదరణ పెంచించి. ఇది బీజేపీకి మింగుడు పడకపోవడమే కాదు 2024లో సార్వత్రిక ఎన్నికలు జరిగే సమయానికి రాహుల్‌ పలుకుబడి మరింత పెరిగితే తమ గతేమిటి అన్న బాధ బీజేపీని కుంగదీస్తోంది. ఎక్కడో కర్నాటకలోని కోలార్‌లో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్‌లోని సూరత్‌ కోర్టులో పరువు నష్టం దావా వేయడం, ఆ దావా వేసిన వ్యక్తి పూర్ణేశ్‌ మోదీ మధ్యలో తానే విచారణపై స్టే విధించాలని కోరడం, మళ్లీ లోకసభలో రాహుల్‌ ప్రభుత్వాన్ని కడిగేసిన తరవాత విచారణ మళ్లీ చేపట్టాలని కోరడం, అమితవేగంగా విచారణ పూర్తి అయి శిక్షపడడం మొదలైన పరిణామాల వెనక రాజకీయాలు లేవంటే నమ్మలేం.
న్యాయస్థానాలను కూడా తమ రాజకీయాలకు వాడుకోవడం బీజేపీ అధికారంలోకి వచ్చిన తరవాతే పెరిగిపోయింది. రాజకీయ విమర్శల ఆధారంగా కోర్టుల్లో పరువునష్టం దావాలు వేయించి ప్రత్యర్థులను కట్టడి చేయాలనుకోవడం కుటిల రాజకీయాల్లో భాగమే. మరో వేపు ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్‌ సింగ్‌ మోదీ డిగ్రీ నకిలీదని రుజువు చేయడానికి ప్రయత్నించారు. రాహుల్‌ కేసుతో దీనికి సంబంధం లేకపోయినప్పటికి మోదీ డిగ్రీ అసలుదో నకిలీదో తేల్చడానికి విచారణకు ఆదేశిస్తే మోదీ లోకసభ సభ్యత్వానికి కూడా ప్రమాదం ఏర్పడుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img