Monday, January 30, 2023
Monday, January 30, 2023

రాహుల్‌ వ్యాఖ్యలు రేపిన చిచ్చు

కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ప్రారంభించిన భారత్‌ జోడో యాత్ర దక్షిణాదిలో విశేష ఆదరణ పొందినప్పటికీ మహారాష్ట్రలో ప్రవేశించిన తరవాత హిందుత్వవాద స్ఫూర్తి ప్రదాత సావర్కర్‌ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సావర్కర్‌ బ్రిటీష్‌ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పి జైలు నుంచి విడుదలైన బీరువు అని రాహుల్‌ గాంధీ అన్నారు. మొన్నటిదాకా కాంగ్రెస్‌తో కలిసి అధికారంలో ఉన్న ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వంలోని శివసేన వర్గానికి సైతం ఇది మింగుడు పడలేదు. రాహుల్‌ వ్యాఖ్యలను తాము అంగీకరించబోమని ఉద్ధవ్‌ ఠాక్రే తెగేసి చెప్పారు. సావర్కర్‌ అండమాన్‌ జైలు నుంచి భారత ప్రధాన భూభాగంలోని మరో జైలుకు మారడానికే అనేక మహజర్లు పెట్టుకున్నారు. చివరకు బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని తానుగానీ, తన నాయకత్వంలోని హిందూ మహాసభ వారు కానీ వ్యతిరేకించ బోరని, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనబోమని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చి జైలు నుంచి విడుదలయ్యారు. ఇది చరిత్ర. దీన్ని నిరాకరించడానికి ఆస్కారం లేదు. అయితే సావర్కర్‌ను అభిమానించేవారు ఈ వాస్తవాన్ని అంగీకరించరు. అండమాన్‌ జైలులో దుర్భర పరిస్థితుల్లో శిక్ష అనుభవించిన వీరుడు సావర్కర్‌ అన్నది ఆయన అభిమానుల విశ్వాసం. విశ్వాసానికి వాస్తవాలతో సంబంధం ఉండదు. అందుకే రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు మహారాష్ట్రలో చిచ్చురేపాయి. ఏక నాథ్‌ షిండే శివసేనను చీల్చి బీజేపీతో కలిసి గత జూన్‌లో ముఖ్యమంత్రి అయిన దగ్గరి నుంచి ఉద్ధవ్‌ ఠాక్రే తన అస్తిత్వాన్నే కాక మైనారిటీలో పడిన శివసేన ఉనికిని కాపాడుకోవడానికి తంటాలు పడుతున్నారు. సావర్కర్‌ మహారాష్ట్రీయుడు. అందువల్ల మహారాష్ట్రీయులకు ఆయన మీద అభిమానం ఉండడంలో ఆశ్చర్యం లేదు. సుదీర్ఘకాలం బీజేపీతో కలిసి నడిచిన శివసేన 2019 శాసనసభ ఎన్నికల తరవాత కాంగ్రెస్‌, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌.సి.పి.)తో కలిసి ‘‘మహా వికాస్‌ అఘాడి’’ ఏర్పాటు చేసింది. హిందుత్వవాదంలో బీజేపీ కన్నా రెండాకులు ఎక్కువ చదివినట్టు వ్యవహరించే శివసేన కాంగ్రెస్‌, ఎన్‌.సి.పి.తో కలిసి అధికారం కోసం కూటమి ఏర్పాటు చేయడం అధికార రాజకీయాల్లో భాగం. కాంగ్రెస్‌, ఎన్‌.సి.పి.తో సహ వాసం చేసినంత మాత్రాన ఉద్ధవ్‌ ఠాక్రే హిందుత్వ వాదాన్ని విడ నాడారని కాదు. మహారాష్ట్రలో, మరీ ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని అనుకునే ముంబైలో శివసేనకు చీలక ముందుదాకా తిరుగులేని ఆధిపత్యం ఉండేది. ‘‘మహా వికాస్‌ అఘాడి’’ ఏర్పడేదాకా శివసేన బీజేపీతో కలిసే ప్రస్థానం కొనసాగించింది. కానీ తనకు మిత్రపక్షాలుగా ఉన్న ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసి తన ఆధిపత్యం కొనసాగించడం బీజేపీ రాజకీయ వ్యూహాల్లో ప్రధానమైంది. ఆ కారణంగానే 2019 లో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల తరవాత శివసేనకు బీజేపీతో సంబంధాలు బెడిసిపోయాయి. అప్పటినుంచి శివసేనను నామరూపాలు లేకుండా చేయాలని బీజేపీ ప్రయత్నిస్తూనే ఉంది. శివసేనకు అస్తిత్వమే లేకుండా చేస్తామని ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మహారాష్ట్రలో పర్యటించినప్పుడు భీష్మ ప్రతిజ్ఞ లాంటిది చేశారు. ఈ దశలో రాహుల్‌ గాంధీ సావర్కర్‌ మీద చేసిన వ్యాఖ్యలు బీజేపీకో, శివసేన చీలికవర్గం నాయకుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌ నాథ్‌ షిండేకో మింగుడుపడకపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ అస్తిత్వ పోరాటంలో తలమునకలై ఉన్న ఉద్ధవ్‌ ఠాక్రే కూ రాహుల్‌ వ్యాఖ్యలు ఏ మాత్రం రుచించలేదు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన శివసేన నాయకుడు సంజయ్‌ రౌత్‌ అయితే రాహుల్‌ వ్యాఖ్యల మీద మండి పడ్డారు. ఇక మహా వికాస్‌ అఘాడి కొనసాగక పోవచ్చునని ఉద్ధవ్‌ ఠాక్రే స్వయంగా ప్రకటించారు. సవర్కర్‌పై రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు అక్షర సత్యాలు అయినప్పటికీ అవి మహా వికాస్‌ అఘాడిలో భాగస్వామ్య పక్షమైన ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వంలోని శివసేన వర్గానికి కూడా ఆమోదయోగ్యం కాకపోవడంలో విచిత్రం ఏమీలేదు. బీజేపీతో ఉన్న పొరపచ్చాలు, అధికారంలోకి రావాలన్న ఆరాటంతోనే ఉద్ధవ్‌ ఠాక్రే కాంగ్రెస్‌, ఎన్‌.సి.పి.తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ కూటమికి నిజానికి ఎలాంటి సైద్ధాంతిక సారూప్యతా లేదు. మహా వికాస్‌ అఘాడి లోని మూడు పక్షాల మధ్య భావ సారూప్యత ఎన్నడూ లేదు.
ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లూ ఉద్ధవ్‌ ఠాక్రే మంచి పేరే తెచ్చు కున్నారు. కరోనా సమయంలో ఆయన నాయకత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా పనిచేసిందని అందరూ చెప్పుకున్నారు. 2021లో జరిగిన ఒక సర్వే ప్రకారం 13 మంది ముఖ్యమంత్రుల జాబితాలో అందరికన్నా ఎక్కువ జనాదరణ ఉన్న నాయకుడని తేలింది. ఆ సర్వేలో పాల్గొన్న ఓటర్లలో దాదాపు సగంమంది మళ్లీ తాము ఉద్ధవ్‌ ఠాక్రేకే ఓటు వేస్తామని చెప్పారు. సైద్ధాంతిక ప్రాతిపదిక లేశ మాత్రం కూడా లేని కూటములు దీర్ఘకాలం కొనసాగడం సాధ్యంకాదని మరోసారి రుజువైంది. మహా వికాస్‌ అఘాడి విచ్ఛిన్నం అయిపోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. రాహుల్‌ వ్యాఖ్యలు సిద్ధాంతపరంగా సావర్కర్‌ విధానాలను ఎండగట్టడానికే అయిఉండొచ్చు. ఆయన విసుర్లు అక్షర సత్యాలే కావచ్చు. కానీ ఆధిపత్య రాజకీయాలకే పరిమితమైన సమయంలో రాజకీయపార్టీలు మొట్టమొదట వదులుకునేది సిద్ధాంతాలనే. హిందుత్వ రాజకీయాలను విడనాడారన్న విమర్శలను కాచుకోవడానికైనా హిందుత్వను మళ్లీ ఆలింగనం చేసుకోవడం ఉద్ధవ్‌ ఠాక్రేకు అనివార్యం. దీనివల్ల ఆయన పార్టీ బలం పుంజుకుంటుందన్న భరోసా ఏమీలేదు. ఇంతకు మునుపు శివసేన ఎన్నికల చిహ్నం పులి. పులి బక్కపడ్డా చారికలు బక్క పడవు అంటారు. అందుకే ఉద్ధవ్‌ మళ్లీ హిందుత్వ ఆవాహనలో పడిపోయారు. అధికారం కోల్పోయిన తరవాత ఆయన వర్గం బలహీన పడిరది. హిందుత్వను విడనాడారన్న షిండే విమర్శను పరాస్తం చేయాలంటే మళ్లీ హిందుత్వ రాజకీయాలు అనుసరించాలని ఉద్ధవ్‌ ఠాక్రే భావిస్తున్నట్టున్నారు. అందులోనూ ఆశ్చర్యం లేదు.
బీజేపీ కల్పిస్తున్న ఆటంకాలనుంచి బయట పడడానికి, అధికారంలోకి రావడానికి ఉద్ధవ్‌ ఠాక్రే మహా వికాస్‌ అఘాడి ఏర్పాటు చేశారు తప్ప ఆయనకు గానీ, ఆయన పార్టీకిగానీ హృదయ పరివర్తన ఉందన్న దాఖలాలు ఎప్పుడూ కనిపించలేదు. కనిపిస్తాయనుకోవడం అత్యాశ. సావర్కర్‌ మీద రాహుల్‌ విమర్శల నేపథ్యంలో ఉద్ధవ్‌ ఆగ్రహించడంలో వింతేమీ లేదు. కానీ ఆయన మరింత తీవ్రంగా హిందుత్వను అనుసరిస్తే ఆయన పార్టీకి ఒరిగేదీ కూడా ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే షిండే ఇప్పటికే బీజేపీతో మమేకమై తానే అసలైన హిందుత్వవాదిని అని చెప్పుకుంటున్నారు. ఉద్ధవ్‌ మళ్లీ ఎంత హిందుత్వ పోకడలు పోయినా బీజేపీ కరుణించదు. ఉద్ధవ్‌ను మళ్లీ అక్కున చేర్చుకునే అవకాశమే ఉండదు. మహారాష్ట్రలో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర కొనసాగిస్తున్నప్పుడు సావర్కర్‌ ప్రస్తావన తీసుకురాకుండా ఉండాల్సిందని వాదిస్తున్న వారికి కొదవ లేదు. కానీ హిందుత్వ రాజకీయాలను ఎదుర్కోవాలంటే సైద్ధాంతిక పోరాట గోదాలోకి దిగక తప్పదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img