Monday, January 30, 2023
Monday, January 30, 2023

రిజర్వేషన్లకూ హడావిడే

ఓబీసీలకు రిజర్వేషన్లను కల్పించే హక్కును రాష్ట్రాలకు ఇస్తూ ఇటీవల పార్లమెంట్‌ బిల్లును ఆమోదించింది. ఇది చట్టరూపం దాల్చి అమలులోకి రానున్నది. ఈ బిల్లుపైనా పాలక, ప్రతిపక్షాలు కూలంకషంగా చర్చించాకే ఆమోదించాలి. సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేసే రిజర్వేషన్ల చట్టాన్ని రెండురోజుల్లో హడావిడిగా రూపొందించింది. భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్‌. అంబేద్కర్‌ అణగారిన వర్గాలైన ఎస్‌సి, ఎస్టీలకు రిజర్వేషన్లను పొందుపరిచాక అనేక మార్పులు చేర్పులు జరిగాయి. రాజ్యాంగ సవరణ (127వ సవరణబిల్లు)`2021ని పార్లమెంటుఉభయసభలూ ఆమోదించాయి. మూడేళ్ల నాడు రాజ్యాంగ సవరణ(102వ సవరణ) చట్టం 2018 ద్వారా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ (ఎస్‌సిబిసి) ను ఏర్పాటు చేశారు. ఎస్‌సి, ఎస్టీలకు 338 ఆర్టికల్‌ ద్వారా రిజర్వేషన్లు కల్పించారు. ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి 338 బి ద్వారా జాతీయ కమిషన్‌కు అవకాశం కలిగింది. అంతేకాదు ఎస్‌సి, ఎస్టీల జాబితాలో ఓబీసీలను కలిపివేశారు. ఆనాడు కూడా పెద్దగా లోతైన చర్చలు జరగకుండా వీటిని ఉభయసభలూ ఆమోదించాయి. ఇది సరైన పద్ధతి, నిర్ణయంకాదని న్యాయకోవిదులూ, సామాజిక శాస్త్రవేత్తలూ విమర్శించారు. ఈ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ చట్టంలో చోటు చేసుకొన్న తప్పిదాలను, లోపాలను సవరించేందుకే తాజా సవరణ చట్టం తెచ్చారు. ఈ చట్టం ద్వారా మెడికల్‌ విద్యా కోర్సుల్లో 27 శాతం ఓబీసీిలకు, 10 శాతం ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు అవకాశం కల్పిస్తారు. రాష్ట్రాల నుండి అనేక హక్కులను లాక్కున్న కేంద్రం రిజర్వేషన్లను కల్పించే హక్కును కట్టబెట్టడం విశేషం. కొన్ని వేల సంవత్సరాలుగా మనదేశంలో అనేక కులాలు, ఉపకులాలు ఉన్నాయి. ఈ కులాల ప్రజలు తరతరాలుగా అణచివేతకు, చిత్రహింసలకు, వివక్షకు గురవుతున్నారు. ఈ వాస్తవాన్ని గ్రహించే రాజ్యాంగంలో వీరికి రిజర్వేషన్ల రక్షణ కల్పించారు. ఇటీవల చేసిన చట్ట సవరణ ప్రకారం ఓబీసీల జాబితాలో ఏఏ కులాలను, ఉపకులాలను చేర్చాలనేది రాష్ట్రాలు నిర్ణయిస్తాయి. అనేక కులాలు, ఉపకులాల ప్రజలు రిజర్వేషన్ల కోసం డిమాండ్‌ చేస్తున్నారు. ఇంతటి ముఖ్యమైన అంశంపైన కూడా సమగ్ర చర్చ జరగకపోవడం విచారకరం. ఈ చట్టాన్ని రాజకీయ పక్షాలు, లబ్ధి పొందే గ్రూపులు ఆహ్వానించగా ఓబీసీల జాబితాలో ఎవరిని చేర్చాలనేది పెద్ద తలనొప్పిగా తయారవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కులాలు, ఉపకులాల ప్రజల్లో ఆధిపత్య గ్రూపులు ఆందోళనలు చేయడం, ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అనేక గ్రూపులు తమకు తగినంత శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే ఆందోళనకు తలపడవచ్చు. కందిరీగల తుట్టెను కదిలించి నట్లయినా కావచ్చు.
అయితే కులాల జనాభా గణాంకాలు అందుబాటులో లేవు. దాదాపు ఏడు దశాబ్దాలుగా ఈ గ్రూపుల జనాభా గణాంకాలు సేకరించిన ప్రభుత్వాలు లేవు. కులాల వారీ సామాజిక, ఆర్థిక స్థితిగతులపై మాత్రమే జనాభా గణనను నిర్వహించారు. ఈసారి ఆర్థిక, సామాజిక స్థితిపైన జనాభా గణన జరిగితే అప్పుడు కులాల, ఉపకులాల జనాభాను గణించవలసి ఉంటుంది. తాజా చట్టం అమలుకు ఇదొక ఆటంకంగా మారే అవకాశం ఉంటుంది. ఆధిపత్య గ్రూపుల ఒత్తిళ్లు, ఆందోళనలను నివారించడానికి ఆయా కులాల జనాభా గణనను అనుసరించి దామాషా పద్ధతిలో రిజర్వేషన్ల కోటాను నిర్ధారించడం మంచి పరిష్కారం కావచ్చు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత కూడా అగ్రవర్ణాలకే ఎక్కువ అవకాశాలు, ప్రయోజనాలు దక్కాయి. స్వాతంత్య్ర లక్ష్యాలు నేటికీ నెరవేర లేదు. వర్ణవివక్ష, అంటరానితనం స్వాతంత్య్రం పొంది 74 ఏళ్లు గడిచిన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో కులమతాలతో నిమిత్తం లేకుండా దేశ ప్రజలంతా పాల్గొన్నారు. ఆ తర్వాత కొంతకాలం ఆయా మతాలు, కులాల ప్రజల సఖ్యత, సోదరభావం కొనసాగింది. ఇటీవలకాలంలో మతాలు, కులాల ప్రభావం పెరిగి విద్వేషాలు అధిక మయ్యాయి. దేశ విభజన నాడు జరిగిన మహా విషాదకర దుర్ఘటనలను గుర్తు చేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపివ్వడం అగ్నిపై ఆజ్యం పోసినట్లు కావచ్చు. మతాల మధ్య చిచ్చు రేపినా రేపవచ్చు.
ఓబీసీల జాబితా రూపకల్పనకు చేసిన చట్టం తక్షణం ఉత్తరప్రదేశ్‌కు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి యోగి 2019లోనే 17 ఓబీసీ కులాల స్థాయిలను ఎస్సీ, ఎస్టీల స్థాయిలకు పెంచి వారికి ప్రయోజనం కల్పించాలని నిర్ణయించారు. అవసరమైన కసరత్తు చేశారని తెలుస్తోంది. ఓబీసీలుగా ఏ ఏ కులాలు, ఉపకులాల వారిని చేర్చాలని నిర్ణయించే హక్కును రాష్ట్రాలకు కల్పించినందున ఈ అవకాశాన్ని 2022 ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీఎన్నికలకు చక్కగా వినియోగించుకోవచ్చు. ఈ చట్టాన్ని తక్షణం అమలు చేసినా చేయకపోయినా వాగ్దానాలు గుప్పించి ప్రయోజనంపొందేందుకు గొప్ప అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ఇది ఉపయోగపడవచ్చు. యూపీలో యోగి ప్రభుత్వానికి బ్రాహ్మణ వర్గం దూరమైనందున బీజేపీ కేంద్ర నాయకత్వం అనేక వ్యూహాలు పన్నుతోంది. బ్రాహ్మణులను దగ్గరకు చేర్చుకునేందుకు కాంగ్రెస్‌ నుంచి బ్రాహ్మణ నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు. చాలా బ్రాహ్మణ ప్రాంతాల్లో పలుకుబడి కలిగిన వికాస్‌ దూబేను కాల్చి చంపడంతో ఆ వర్గం యోగిపై ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10శాతం రిజర్వేషన్‌ కల్పించే వీలుచిక్కింది. బ్రాహ్మణులను ఆకట్టుకొనేందుకు ఈ రిజర్వేషన్లు తోడ్పడవచ్చు. ఇప్పుడీ చట్టాన్ని తీసుకురావడం మోదీ వ్యూహంలో భాగం కావచ్చు.
బ్రిటీష్‌ పాలనలో బ్రాహ్మణులు, అలాంటి అగ్రవర్ణాలకే ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర అవకాశాలు దక్కాయి. క్రమంగా తమకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని అణగారిన వర్గాల నుండి డిమాండ్లు వచ్చాయి. 1882, 1891లలో కొల్హాపూర్‌ ప్రెసిడెన్సీ పాలనలో బ్రాహ్మణేతరులకూ రిజర్వేషన్లు కల్పించింది. 1921లో మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వం రిజర్వేషన్ల జాబితాలో ఆరు తరగతుల వారిని చేరుస్తూ ప్రభుత్వ ఆర్డర్‌ జారీ చేసింది. బ్రాహ్మణులు, బ్రాహ్మణేతర హిందువులు, మహమ్మదీయులు, ఇండియన్లు, ఇండియన్‌ క్రిస్టియన్లు, ఆంగ్లో ఇండియన్లు, యూరోపియన్లకు అవకాశం కల్పించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన మేరకు కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ విద్యాసంస్థల్లో ఎస్‌సి, ఎస్టీలకు 20శాతం సీట్లు కేటాయించించింది. ఈ సంస్థల్లో ప్రవేశానికి అర్హత మార్కులలో ఎస్‌సీ, ఎస్టీలకు ఐదుశాతం మినహాయింపు ఇచ్చారు. అయితే 1982లో ఎస్‌సీలకు 15శాతం, ఎస్టీలకు 7.5శాతంగా నిర్ణయించారు. 1992లో సుప్రీంకోర్టు రిజర్వేషన్ల కోటా 50శాతానికి మించరాదని ఆంక్ష విధించింది. అయినప్పటికీ తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కోర్టువిధించిన ఆంక్షకు మించి రిజర్వేషన్లు కల్పించాయి. రిజర్వేషన్లు కల్పించిన తరగతులు అభివృద్ధి చెందితేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అణగారినవర్గాల పరిస్థితి నేటికీ పెద్దగా మెరుగు పడలేదు. ఎన్ని ప్రభుత్వాలువచ్చినా వారిస్థితిగతుల్లో మార్పు రాకపోవడానికి పాలకవర్గాలే కారణం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img