Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

రిజర్వేషన్ల లక్ష్యం నెరవేరిందా!

రిజర్వేషన్లు నిరంతరం కొనసాగవలసిన ప్రక్రియ అని రాజ్యాంగ నిర్మాతలు అనుకోలేదు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగం రూపొం దించే దశలో ఉన్న అభిప్రాయం. ఈ కొలమానం ప్రకారం చూస్తే హిందువులలోని షెడ్యూల్డ్‌ కులాలవారు (ఎస్‌.సి.), గిరిజనులు (ఎస్‌.టి.) వర్గాలవారు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల వారిని రిజర్వేషన్లు అవసరమైన వారిగా భావించారు. అయితే షెడ్యూల్డ్‌ కులాల వారు హిందూమతంలో ఉన్న వారే అన్న ఆలోచనతో మొట్ట మొదట వారికే రిజర్వేషన్లు వర్తింప చేశారు. కానీ మతం మార్పిడివల్ల సిక్కు, క్రైస్తవ, ఇస్లాం మతస్థుల్లో కూడా ఎస్‌.సి.ల పరిస్థితి అంత గొప్పగా లేదు అని రుజువైంది. అంటే మొదట హిందువుల లోని దళితులకే రిజర్వేషన్లు వర్తించాయన్న మాట. గిరిజనులు (ఎస్‌.టి.) నిజానికి అందరూ హిందూమత చట్రంలోని వారు కాదు. కానీ ఓట్ల కోసం, హిందూమత పరిధి విస్తరించడంకోసం బీజేపీ గిరిజనులంద రినీ హిందువులని వాదిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం క్రైస్తవం లోకి మారిన దళితులకు షెడ్యూల్డ్‌ కులాల స్థాయి కల్పించాలా లేదా అని తేల్చడానికి ఓ జాతీయ కమిషన్‌ ఏర్పాటు చేయాలను కుంటోంది. దీనికి ఒక మంత్రి అధిపతిగా ఉండవచ్చు. షెడ్యూల్డ్‌ కులాల వారు ఇతర మతాల్లోకి మారితే వారికి ఎస్‌.సి.స్థాయి ఇవ్వొచ్చునా లేదా అని ఈ జాతీయ కమిషన్‌ పరిశీలిస్తుంది. 1952నాటి దర్యాప్తు సంఘాల చట్టం కింద ఈ కమిషన్‌ ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. హిందువులు, సిక్కులు, బౌద్ధులు అయిన దళితులకు ఎస్‌.సి. స్థాయి ఉంది. క్రైస్తవులకు, ముస్లింలకు ఆ సదుపాయం లేదు. ఇదీ మొదట్లో ఉండేది కాదు గానీ 1950లో రాష్ట్రపతి ఉత్తర్వు ఆ తరవాత సవరణల ఆధారంగా సిక్కు, బౌద్ధ మతం స్వీకరించిన దళితులకు ఎస్‌.సి. స్థాయి, దానితో పాటు రిజర్వేషన్ల సదుపాయం దక్కింది. ఈ విషయంలో కొన్ని పిటిషన్లు ఇప్పటికే సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నాయి. 2020 జనవరిలో దళిత క్రైస్తవులు తమకు ఎస్‌.సి. స్థాయి కల్పించాలని సుప్రీంకోర్టులో అర్జీ దాఖలు చేశారు. అంటే ఎస్‌.సి. హోదాకు మత పరిధి ఉండకూడదని ఈ పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్‌ను విచారిస్తున్న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. సుప్రీం ఇచ్చిన నోటీసుకు కేంద్రం సమాధానం ఇవ్వలేదు కానీ కొత్త కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది. మొదట ఎస్‌.సి.లుగా ఉన్న వారు మతం మారినందువల్ల వారు ఎస్‌.సి.స్థాయి కోల్పోయారు. ఒకవేళ దళిత క్రైస్తవుల అభ్యర్థనను మన్నించి వారిని ఎస్‌.సి. జాబితాలో చేరిస్తే ఎస్‌.సి. జనాభాపై ఏ మేరకు ప్రభావం ఉంటుందో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న కమిషన్‌ పరిశీలించవలసి వస్తుంది. రాష్ట్రపతి ఉత్తర్వు కారణంగా మతం మారిన దళితులు ఎస్‌.సి. స్థాయి కోల్పోయారు. షెడ్యూల్డు కులాల వారు ఇతర మతాల్లోకి మారిన తరవాత వారి ఆచార వ్యవహారాలు, సామాజిక, ఆర్థిక స్థితి, ఇతర అంశాలు, వివక్ష ఏ మేరకు మారాయో కూడా కొత్తగా ఏర్పాటు చేసే కమిషన్‌ పరిశీలించవలసి ఉంటుంది. ఈ కమిషన్‌లో న్యాయవ్యవస్థ ప్రతినిధి, ఉద్యోగ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి వ్యక్తి కూడా ఉండొచ్చు. అంటరానివారినే ముందు ఎస్‌.సి.లుగా పరిగణించారు. అంటరానితనం హిందూ మతానికే పరిమితం అనుకున్నారు. 1950నాటి రాజ్యాంగ ఉత్తర్వును తొలగించి ఎస్‌.సి.స్థాయి కల్పించడానికి మతంతో లంకె పెట్టకూడదని రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌ 2007లో సిఫార్సు చేసింది. అంటే గిరిజనులలాగే మతంతో నిమిత్తం లేకుండా ఎస్‌.సి.లను కూడా పరిగణించాలని చెప్పినట్టయింది. కానీ రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌ ఈ సిఫార్సు చేయడానికి తగిన క్షేత్ర పరిశీలన ఏమీ జరగలేదు కనక కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఈ సిఫార్సును అంగీకరించలేదు. 2008లో మైనారిటీలు, ముస్లింలలో, క్రైస్తవులలో దళితుల పరిస్థితిని మదింపు వేయడానికి ఏర్పాటు చేసిన కమిషన్‌ దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలను ఎస్‌.సి.లుగా పరిగణించవచ్చునని చెప్పింది. అయితే ఈ నిర్ధారణకు రావడానికి ఉపయోగించుకున్న సమాచారం విశ్వసనీయమైంది కాదన్న భావనతో ఆ సిఫార్సును కూడా అంగీకరించ లేదు. క్రైస్తవ, ఇస్లాం మతంలో ఉన్న దళితుల గురించి సమాచారం సమగ్రంగా అందుబాటులో లేదు. 2011 జనాభా లెక్కల్లో దళిత క్రైస్తవులు 2.4 కోట్లు, ముస్లిం దళితులు 13.8 కోట్లు ఉన్నారని తేలింది. వీరిలో మతం మారిన వారు ఎంతమందో నికరంగా చెప్పే అవకాశం లేదు. ఈ అంశాన్ని తేల్చాలంటే పూర్తి స్థాయి కమిషన్‌ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
దీనికి మరో కోణమూ ఉంది. మండల్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు సందర్భంగా 20 రాష్ట్రాలలో దళిత క్రైస్తవులను ఇతర వెనుకబడిన కులాల (ఓ.బి.సి.) జాబితాలో చేర్చారు. ఈ ప్రాతిపదికన ప్రభుత్వోద్యోగాల్లో, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కూడా కల్పించారు. వీరికి ఓ.బి.సి.లకు దక్కే ఉపకార వేతనాలు ఇతర ప్రయోజనాలూ కూడా అందుబాటులో ఉన్నాయి. తమను ఎస్‌.సి.లలో చేర్చాలని, బి.సి.లలో చేర్చాలని అడిగే సామాజిక వర్గాల వారు చాలా మందే ఉన్నారు. ఎస్‌.సి.లకు రిజర్వేషన్లు కల్పించాలనుకున్న ప్పుడు రాజ్యాంగ నిర్మాతలు విదేశీ మతాలు అనుకునే వాటిని అనుసరించే వారిని పరిగణనలోకి తీసుకోలేదు. అయితే క్రమంగా ముస్లింలలో ఉన్న కొన్ని సామాజిక వర్గాల వారికి బి.సి. జాబితాలో చోటు దక్కింది. ఎస్‌.సి., ఎస్‌.టి.లకు రిజర్వేషన్లు కల్పించినప్పుడే ఇతర వెనుక బడిన కులాల వారు కూడా ఉన్నారని అంబేద్కర్‌ గుర్తు చేశారు. అంటే వెనుకబాటుతనాన్ని రూపు మాపడానికి రిజర్వేషన్లు ఉపకరిస్తాయనే కదా!
అయితే రిజర్వేషన్లను ఏ దశ లోనూ పేదరిక నిర్మూలనా చర్యగా పరిగణించలేదు అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే రిజర్వేషన్లకు ఆర్థిక ప్రాతిపదిక కూడా లేదు. కానీ ఇతర వెనుకబడిన కులాల వారికి రిజర్వేషన్ల సదు పాయం కల్పించే సమయంలో సుప్రీంకోర్టు వెనుకబడిన కులాల్లో సంపన్న శ్రేణి అనే వర్గాన్ని ప్రవేశ పెట్టి రిజర్వేషన్లలో ఆర్థిక అంశాలకు చోటిచ్చినట్టయింది. అలాగే వివిధ రాజకీయ పార్టీలు అగ్రవర్ణాలవారిలో కూడా ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆ పేర రిజర్వేషన్లు ఇస్తామని వాగ్దానాలు చేస్తూనే ఉన్నాయి. 2019 లోకసభ ఎన్నికలకు ముందు ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీజేపీ సర్కారు నిర్ణయించింది. ఇది కొన్ని రాష్ట్రాలలో అమలవుతోంది కూడా. ఇంతకీ రిజర్వేషన్లు పేదరిక నిర్మూలనా చర్య కానప్పుడు, ఆర్థిక ప్రాతి పదిక ఎలా జొరబడిరదో తెలియదు. సామాజికంగా వెనుకబడిన వర్గాలనే పరిగణించాలంటే ఒక నిర్దిష్ట సామాజిక వర్గంలో వెనుకబాటుతనం లేకుండా చేయడంలో ఈ 75 ఏళ్ల కాలంలో విఫలమైనట్టే!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img