మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిందే రెండు రాజకీయ సంకటాలలో చిక్కుకున్నారు. శివసేనను చీల్చి బీజేపీతో కలిసి ముఖ్యమంత్రిని అయిపోయానని ఆనందించే అవకాశం కూడా షిందేకు లేకుండా పోతోంది. ముఖ్యమంత్రి స్థానంలో షిందే ఉన్నా 288 మంది సభ్యులుగల శాసనసభలో ఆయన నాయకత్వంలోని శివసేనలో ఉన్నది మహా అయితే 40 మంది. ఉపముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీలో 105 మంది శాసనసభ్యులున్నారు. ఇది ఆయన పదవికి ఉన్న భద్రత ఏపాటిదో తెలియజేస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల తరవాత అదే సంవత్సరం అక్టోబర్‌లో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగవలసి ఉంది. శివసేనను షిందే చీల్చగలిగినప్పటికీ ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనకు జనం మద్దతు ఉందనిపిస్తోంది. అంటే పార్లమెంటు ఎన్నికలు, ఆ తరవాత జరిగే శాసనసభ ఎన్నికలు షిందేకు అగ్నిపరీక్షే. మరో వేపు మూడు దశాబ్దాల నుంచి కొనసాగుతున్న మరాఠాల రిజర్వేషన్ పోరాటం ఈ మధ్య కాలంలో మళ్లీ ఊపందుకుంది. జాల్నా జిల్లాలోని అంతర్వాలి సారథి గ్రామానికి చెందిన యువ మరాఠా కార్యకర్త మనోజ్ జరంగే పాటిల్ పదిహేను రోజుల కింద మరాఠాలకు రిజర్వేషన్ల కోసం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆయనను ఆసుపత్రిలో చేర్పించి దీక్షను భగ్నం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడంవల్ల ఆందోళన మరింత ఉధృతం అయింది. మనోజ్ పాటిల్ ఓ దశాబ్ద కాలం నుంచి రాజకీయాలలో ఉన్నా ఆయన పేరు నెల కిందటి దాకా చాలామందికి తెలియదు. తాను ఏ పార్టీకి చెందని వాడినని చెప్పుకుంటారు. మరాఠాలకు రిజర్వేషన్లు సంవేదనలకు సంబంధించిన అంశం కనక ఆయన దీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికలలో, ఆ తరవాత జరిగే శాసనసభ ఎన్నికలలో బీజేపీకి ఉన్న జనాదరణ ఏమిటో అంచనా వేయడానికి బీజేపీ చేయించిన సర్వే ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీకి ఉన్న 105 మంది శాసనసభ్యులలో, 21 మంది లోకసభ సభ్యులలో 40 శాతం మంది ఓడిపోతారని ఈ సర్వే ఫలితాలు సూచించాయి. అయితే వచ్చే ఎన్నికలలో అభ్యర్థులను మారిస్తే ఫలితాలు మెరుగుపడవచ్చునన్న వాదనలూ వినిపిస్తున్నాయి. గుజరాత్‌లో కిందటి శాసనసభ ఎన్నికలకు ముందు మొత్తం ప్రభుత్వాన్నే టోకున మార్చేయడంవల్ల బీజేపీ మళ్లీ అధికారం సంపాదించగలిగింది. బీజేపీ పనుపున నిర్వహించిన సర్వేలో శాసనసభ్యుల, ఎంపీల పనితీరు, ప్రజలతో వారి సంబంధాలు, బీజేపీ కార్యనిర్వాహక సభ్యులకు జనంతో ఉన్న సంబంధాలు, సామాజిక మాధ్యమాలను వారు ఏ మేరకు వినియోగించుకుంటున్నారు అన్న అంశాలపై కూడా జనాభిప్రాయం సేకరించారు. ఈ అంశాలేవీ ప్రస్తుతానికి బీజేపీకి అనుకూలంగా లేవు. మోదీ మళ్లీ ప్రధాని కావాలనుకుంటున్న వారు ఉన్నారు కానీ బీజేపీ తరఫున ఎన్నికైన ప్రజా ప్రతినిధులపై అసంతృప్తి తీవ్రంగా ఉంది. దీనికి భిన్నంగా బీజేపీ మాత్రం 170 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటామని తమ కూటమి మొత్తం 48 లోకసభ స్థానాలను కైవశం చేసుకుంటుందని వాదిస్తోంది. 2019 లోకసభ ఎన్నికల సమయంలో బీజేపీ-శివసేన మధ్య ఎన్నికల పొత్తు ఉండేది. అందువల్ల బీజేపీ 23 లోకసభ స్థానాలను, శివసేన 18 స్థానాలను సాధించగలిగాయి. అంటే 48లో 41 సీట్లు ఎన్.డి.ఎ. కూటమికే దక్కాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మనోజ్ పాటిల్ ప్రారంభించిన మరాఠా రిజర్వేషన్ల ఆందోళన క్రమంగా విస్తరిస్తోంది. గ్రామాలకు కూడా పాకుతోంది. గత రెండు వారాలుగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు మనోజ్ పాటిల్‌ను పరామర్శించడంలో తలమునకలై ఉన్నారు. ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ కూడా జాల్నా వెళ్లి వచ్చారు. పాటిల్ నిరాహార దీక్ష ప్రారంభించిన తరవాత పరిస్థితి చక్కదిద్దడానికి ముఖ్యమంత్రి షిందే గత ఆరవ తేదీన ఒక ఆదేశం జారీ చేశారు. మరాఠాలలో కుంబీలైనవారు తాము ఆ కులానికి చెందిన వాళ్లమని సర్టిఫికేట్ అందజేస్తే ఓబీసీ రిజర్వేషన్లు వర్తింప చేస్తామని షిందే ప్రకటించారు. మరాఠాల ఆందోళనకు సుదీర్ఘ చరిత్ర ఉన్నప్పటికీ ఆ వర్గం వెనుకబడిరది కాదు. షిందే, శరద్ పవార్ కూడా మరాఠాలే. రాష్ట్ర జనాభాలో 31 శాతం మంది మరాఠాలే. రాజకీయాల్లో ఆధిపత్యమూ వారిదే. 1960లో ప్రత్యేక మహారాష్ట్ర ఏర్పడినప్పటినుంచి 20 మంది ముఖ్యమంత్రులైతే అందులో 12 మంది మరాఠాలే. విద్యాశాఖలో మరాఠాలు 54 శాతం ఉంటే సహకార చక్కెర ఫ్యాక్టరీలలో 70 శాతం, వ్యవసాయ భూమిలో 70 శాతం ఆ వర్గం చేతిలోనే ఉంది. కానీ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ హయాంలో ఓబీసీల రిజర్వేషన్లు అమలు అయిన తరవాతే మరాఠాలకు రిజర్వేషన్లు కావాలన్న డిమాండు తలెత్తింది. మండల్ నివేదిక అమలయ్యే దాకా వీరు ఎప్పుడూ వెనుకబడిన వర్గాల వాళ్లమని చెప్పుకోలేదు. కానీ వ్యవసాయ రంగం మీద ఆధారపడిన మరాఠాలే ఎక్కువ కనక, క్రమంగా ఆ రంగంలో ఆదాయాలు తగ్గుతున్నందువల్ల మరాఠా యువతలో రిజర్వేషన్లు కావాలన్న వాదన మొదలైంది. 2014కు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం వీరికి 16 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అయితే ఈ హామీ అమలు చేయడానికి ఏ అధ్యయనమూ జరగలేదు. ఏ కమిషన్‌నూ నియమించలేదు. తరవాత అధికారంలోకొచ్చిన ఫడ్నవీస్ ప్రభుత్వం కూడా ఈ రిజర్వేషన్లు అమలు చేసింది. ఆయన హయాంలోనే రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. విద్యాశాఖలో 12 శాతం, ఉద్యోగాల్లో 13 శాతం మరాఠాలకు ప్రత్యేకించడాన్ని ముంబై హైకోర్టు సమర్థించింది. 2021లో సుప్రీంకోర్టు ఈ రిజర్వేషన్లు చెల్లవని ప్రకటించింది. అందుకని ఎన్నికలు మొగదలలో ఉన్న సమయంలో మళ్లీ రిజర్వేషన్ల అంశం తెరమీదకు వచ్చింది. అధికారంలో ఉన్న షిందే ప్రభుత్వం షరతులతో రిజర్వేషన్ల అమలుకు అంగీకరించింది. మునుపు కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం, ఆ తరవాత ఫడ్నవీస్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఈ రిజర్వేషన్లకు సమ్మతించాయి కనక ప్రధాన రాజకీయ పార్టీలు ఏవీ రిజర్వేషన్ల డిమాండును వ్యతిరేకించే పరిస్థితిలేదు. కానీ సుప్రీంకోర్టు కొట్టేసిన తరవాత అమలు చేయడం ఎలా అన్నదే సమస్య. షిందే ఉదారంగా ప్రకటించిన రాయితీని మళ్లీ సవాలు చేయరన్న భరోసా ఏమీ లేదు. ఓబీసీ రిజర్వేషన్ల కోటా లోంచే కుంబీలకు రిజర్వేషన్లు కల్పించడంపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఓబీసీిలకు ప్రస్తుతం 19 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బీజేపీ గెలిచే అవకాశాలు సన్నగిల్లుతున్నాయన్న సర్వేల సూచనలు ఒక వేపు, రిజర్వేషన్ల రగడ మరో వేపు షిందే ప్రభుత్వాన్ని సంకటస్థితిలో పడవేస్తున్నాయి.