Friday, December 1, 2023
Friday, December 1, 2023

రైతు చట్టాలను పార్లమెంటు చర్చించాలి

మోదీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత అనేక ప్రజా వ్యతిరేక, కార్మికుల, రైతుల వ్యతిరేక చట్టాలను చేసింది. వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించే చట్టాలను రద్దు చేయాలని ఎనిమిది నెలలుగా దిల్లీ సరిహద్దులో లక్షలాది మంది రైతులు మహత్తర పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ, ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు అనేక మాయోపాయాలను అనుసరించింది. బహుశా రైతులు సుదీర్ఘ పోరాటం చేయటం ఇదే ప్రథమం. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నందున తమ సమస్యలను సభ ప్రత్యేకంగా చర్చించి పరిష్కరించాలని కోరుతూ రైతులు దిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద ఉద్యమం చేస్తున్నారు. రైతులు ప్రత్యేకంగా ‘కిసాన్‌ సంసద్‌’ పార్లమెంట్‌ను జులై 22న నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా నిర్దేశిత మార్కెట్‌ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్ల చట్టం ఎపిఎంసిపై చర్చించారు. ఇదే సమయంలో పార్లమెంట్‌ ఉభయ సభల్లో రైతుల చట్టాల రద్దు డిమాండ్‌ మారుమోగింది. చట్టసభ సభ్యులందరికీ, అలాగే దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్లి సమస్య తీవ్రతను చెప్పేందుకు దేశ రాజధాని దిల్లీలో పార్లమెంట్‌ సమావేశాలు ముగిసే వరకు ధర్నా చేయనున్నారు. వ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకే దుష్టచట్టాలను ప్రభుత్వం చేసిందని దేశవ్యాప్తంగా రైతులు విశ్వసిస్తున్నారు. దేశ మంతటా రైతులు ఉద్యమాలు చేశారు. రైతులకు అంతర్జాతీయ సంఫీుభావం, మద్దతు వచ్చింది. రైతు చట్టాలపై చర్చించవలసిందేనని ప్రతిపక్ష సభ్యులు పట్టుపట్టినా పెద్ద సమస్యను చర్చించేందుకు సైతం ప్రభుత్వం తిరస్కరించటం చూస్తేనే పాలకులు ఎవరి కోసం పనిచేస్తున్నా రనేది తేలికగా అర్థమవుతుంది. రైతుల డిమాండ్‌ను పరిష్కరించాలని ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌నూ మోదీ ప్రభుత్వం లెక్క చేయడం లేదు. పైగా బీజేపీ మంత్రి ఒకరు రైతులను ‘విధ్వంసకారులు’ అని నోరు పారేసుకోవడం సిగ్గుచేటు. దీనిపైన ప్రతిపక్షాలేగాక పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరేందర్‌సింగ్‌ కూడా తీవ్రంగా స్పందించారు. ఇంతటి దుర్మార్గమైన వ్యాఖ్య చేసిన మంత్రి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాత్రింబవళ్లు కష్టపడి దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతుల పట్ల బీజేపీ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి మంత్రి వ్యాఖ్య చాలు.
అవసరమైతే 2024లో లోక్‌సభకు ఎన్నికలు జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. ఒకవైపు వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసే చట్టాల రద్దు కోసం రైతులు సుదీర్ఘ పోరాటం జరుపుతున్న సమయంలో విద్యుత్‌ బిల్లును రూపొందించటం సమస్యను మరింత తీవ్రతరం చేసింది. విద్యుత్‌ బిల్లు 2021 పై పంజాబ్‌ రైతులు తీవ్ర ఆగ్రహం ప్రకటించారు. విద్యుత్‌ బిల్లు తీసుకురావడం ద్వారా మోదీ ప్రభుత్వం తన నిరంకుశ వైఖరిని మరోసారి ప్రదర్శించింది. వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని వాగ్దానం చేసిన మోదీ చివరికి రైతులను కూలీలుగా మార్చేందుకు మూడు చట్టాలను తీసుకువచ్చారని వ్యవసాయ నిపుణులు చేసిన విశ్లేషణలను పట్టించు కోలేదు. తాజాగా దిల్లీలో రైతులు ధర్నా చేస్తూ తమ పోరాట పటిమను నిరూపించుకోగా, రైతులు ఏమైతేనేమి అనుకుంటూ ప్రభుత్వం భీష్మించుకుని కూచున్నది. సమస్య పరిష్కారం గాకుండా ప్రతిష్టంభన ఏర్పడిరది. చర్చలకు సిద్ధమేనని మోదీ ప్రభుత్వం పదే పదే చెప్తూ కాలం గడుపుతోంది. చట్టాలలోని అభ్యంతరకర అంశాలను నిర్దిష్టంగా తమ ముందుంచితే చర్చిస్తామని వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఒక మెలిక పెట్టారు. ముందుగా చట్టాల రద్దును ప్రకటించేదాక ఉద్యమం ఆపేది లేదని రైతులు తమ ధృడ సంకల్పాన్ని ప్రకటించారు. ఈ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని మోదీ చెప్పే మాటలు వట్టి బూటకమేనని కిసాన్‌ సంసద్‌లో స్పష్టం చేశారు. ఈ మూడు చట్టాల వల్ల జరిగే నష్టాలను వివరించిన సంసద్‌ను మంత్రి సందర్శిస్తే తెలుస్తుందని రైతు నాయకులు అన్నారు. పరిష్కారమార్గాన్ని చేపవలసిన ప్రభుత్వం రైతులపై పగపట్టినట్టుగా వ్యవహరించడం దారుణం.
జులై 26తో రైతుల పోరాటానికి ఎనిమిది నెలలు పూర్తవుతుంది. రైతులు, ప్రభుత్వ ప్రతినిధులైన, మంత్రుల మధ్య పదిసార్లు చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదు. 2021 జనవరి 26న రిపబ్లిక్‌డే సందర్భంగా దిల్లీని దిగ్భందం చేసేందుకు లక్షలాది మంది రైతులు సమీకృతులయ్యారు. అయితే రైతు ఉద్యమాన్ని కించపరిచేందుకే ప్రభుత్వం అనేక రకాల ఎత్తుగడలు వేసింది. ప్రభుత్వం చేసిన కుట్రపూరిత చర్యలు బయటపడిన తర్వాత రైతులు, కార్మికులేగాక మధ్యతరగతి ప్రజలు సైతం రైతు ఉద్యమం పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక రంగానికి ఎంతగానోతోడ్పడే వ్యవసాయరంగాన్ని మోదీప్రభుత్వం కాలరాసేందుకే నిశ్చయించుకున్నదని నమ్మడానికి జరిగిన పరిణామాలు వీలు కల్పిస్తున్నాయి. కొత్తగా చర్చలకు ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోవడం లేదు. 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ఉద్యమాన్ని విస్తరించి ఉధృతం చేసేందుకు రైతులు నిశ్చయించారు. బీజేపీకి ఓటు చేయవద్దని, మోదీ ప్రభుత్వం మాటలు నమ్మవద్దని ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు ప్రచారం చేయ నున్నారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని క్విట్‌ఇండియా దినోత్సవం రోజున ఆగస్టు 9న ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. దేశ ద్రోహ చట్టం ఇంకా అవసరమా? రద్దు చేయడం మంచిదన్న సంకేతాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన రోజునే హర్యానా పోలీసులు 100 మంది రైతులపై దేశద్రోహం నేరంమోపి కేసులు పెట్టి రైతులను మరింతగా అవమాన పరచడం ప్రభుత్వాల నిరంకుశత్వాన్ని తేటతెల్లం చేస్తోంది. జంతర్‌ మంతర్‌కు కొంచెం దూరంలో ప్రతిపక్షాలు ప్లకార్డులు ధరించి రైతు చట్టాలు రద్దుచేయాలని డిమాండ్‌ చేసినంత మాత్రాన ఈ ప్రభుత్వం వినిపించుకొనే స్థితిలో లేదు. దిల్లీ సరిహద్దులు` సింఘా, ఘాజీపూర్‌, టిక్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడానికి రైతులు నిశ్చయించుకున్నారని సంకేతాలున్నాయి. ప్రభుత్వం పార్లమెంట్‌ రైతులచట్టాలపై ప్రత్యేకంగా చర్చించి సమస్యను పరిష్కరించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img