Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

రైలు పట్టాలపై ఘోరకలి

శుక్రవారం చీకటి పడుతుండగా ఒడిశాలోని బాలసోర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో మూడు రైళ్లు ప్రమాదానికి గురై రైలు పట్టాలు రక్త సిక్తమయ్యాయి. ఈ ప్రమాదంలో 261 మంది మరణించారని, దాదాపు వెయ్యి మంది గాయపడ్డారని రైల్వే శాఖ సమాచారం. గాయపడిన వారిలో 400 మంది పరిస్థితి విషమంగా ఉంది. అందువల్ల మృతుల సంఖ్య పెరిగినా పెరగొచ్చు. శనివారం సాయంత్రానికి రైలు పెట్టెల్లో చిక్కుకుపోయిన వారిని వెలికి తీసే కార్యక్రమం పూర్తి అయింది. బాలాసోర్‌ నుంచి భువనేశ్వర్‌ దాకా ఉన్న ఆసుపత్రులన్నీ రైలు ప్రమాద క్షతగాత్రులతో నిండిపోయాయి. వందలాది అంబులెన్సులు నిర్విరామంగా పనిచేశాయి. హౌరా నుంచి చెన్నై వెళ్లవలసిన కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌, కర్నాటకలోని యశ్వంత్‌పూర్‌ (బెంగళూరు) నుంచి హౌరా వెళ్లవలసిన ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఒక గూడ్స్‌ రైలు కూడా ప్రమాదంలో చిక్కుకున్నాయి. మూడు రైళ్లు బాలాసోర్‌ స్టేషన్‌కు దగ్గరలోనే ప్రమాదానికి గురి కావడం అందునా హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్‌ షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలబడి ఉన్న గూడ్స్‌ రైలును ఢీకొని పట్టాలు తప్పి గుండెలవిసే ప్రమాదానికి గురికావడం విచిత్రమే కాదు దుర్భరమైన వైపరీత్యం. పట్టాలు తప్పిన కోరమండల్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలు పెట్టెలు పక్కనున్న రైలు పట్టాలపై పడిపోయాయి. ఈ లోగా యశ్వంత్‌పూర్‌ నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ పట్టాలపై ఉన్న రైలు పెట్టెలను ఢీకొన్నది. దానితో ఈ రైలులోని మూడు నాలుగు పెట్టెలు కూడా పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదానికి మానవ తప్పిదం కారణమా లేక సాంకేతిక లోపమా అన్న చర్చ దీర్ఘకాలమే జరుగుతుంది. రైల్వే మంత్రిత్వశాఖ ఆదేశం ప్రకారం దర్యాప్తు బృందం పనిచేసిన తరవాత ఒకటో నాలుగో కారణాలు చూపుతూ నివేదిక వెలువడుతుంది. ఇదంతా ఎప్పుడు ప్రమాదం జరిగినా కొనసాగే తంతే. సాంకేతిక లోపం అని తేలితే ఏ గొడవా ఉండదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ముమ్మరంగా అమలు చేస్తామని రైల్వే శాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కూడా పక్కకుతోసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దర్జాగా ప్రకటించేస్తారు. అక్కడికి ఓ తంతు పూర్తి అవుతుంది. మానవ తప్పిదం అని తేలితే చిన్న చితక రైల్వే ఉద్యోగులు బలై పోతారు. ఇంతకన్నా ఘోరమైన రైలు ప్రమాదాలు ఇంతకు ముందూ జరిగాయి. ప్రాణనష్టం కూడా అపారంగానే ఉంది. బిహార్‌లోని సహర్సా వద్ద భాగమతి నదిలో 1981 జూన్‌ ఆరో తేదీన రైలు పడిపోవదంతో కనీసం 750 మంది ప్రాణాలు వదిలారు. ఉత్తరప్రదేశ్‌ లోని ఫిరోజాబాద్‌ వద్ద 1995 ఆగస్టు 20న పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌ కాళింది ఎక్స్‌ప్రెస్‌తో ఢీకొనడంతో 358 మంది మరణించారు. అలాగే 1999 ఆగస్టు రెండున అవధ్‌-అస్సాం ఎక్స్‌ప్రెస్‌ బ్రహ్మపుత్ర మెయిలును ఢీకొన్నప్పుడు 268 మంది ప్రాణాలు పోయాయి. బ్రహ్మపుత్ర మెయిలులో సైనికులూ ఉన్నారు. 1998 నవంబర్‌ 26న జమ్మూ తావీ-సీల్దా ఎక్స్‌ప్రెస్‌ పంజాబ్‌లోని ఖనాలో అమృత్‌సర్‌ వెళ్తున్న స్వర్ణ దేవాలయ మెయిలును ఢీకొని 212 మంది ప్రాణాలు వదిలారు. ఒక్కసారి మాత్రం 2010 మే 28న మావోయిస్టు తీవ్రవాదులు దాడి చేయడంవల్ల ముంబై వెళ్తున్న హౌరా కుర్లా లోకమాన్య తిలక్‌ వెళ్లాల్సిన గ్యానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లోని 170 మంది మరణించారు.
భారతీయరైల్వే జనజీవనాడి అంటాం. రోజూ లక్షలాది మంది లక్షలాది కిలోమీటర్ల మేర రైళ్లలో ప్రయాణిస్తుంటారు. వీరిలో సామాన్య జనమే అధిక సంఖ్యలో ఉంటారు. ప్రమాదం అంటేనే అనుకోకుండా జరిగే ఘటన. కానీ ఇలాంటి అనూహ్య, అవాంఛిత ఘటనలను నివారించే అవకాశమే లేదా అన్నది అసలు ప్రశ్న. ప్రమాదాలను నివారించడానికి ‘‘కవచ్‌’’ అని ఓ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఇది ప్రమాదం జరిగే సూచన ఉన్నప్పుడు ముందు రైళ్ల వేగం తగ్గించి ఆ తరవాత రైళ్లనే నిలిపివేస్తుంది. శుక్రవారం ప్రమాదం జరిగిన మార్గంలో ఈ ‘‘కవచ్‌’’ సదుపాయం లేదట. ఎందుకులేదు అన్న ప్రశ్నకు సమాధానంలేదు. అయితే ‘‘కవచ్‌’’ సదుపాయం అన్ని మార్గాలలోనూ కల్పించడం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. రైలు మార్గంలో ప్రతి కిలోమీటరుకు ఈ సదుపాయం కల్పించడానికి 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయట. అంటే మన దేశంలో ఉన్న లక్షా 15 వేలకిలోమీటర్ల మేర రైల్వేమార్గం అంతటా ఈ ‘‘కవచ్‌’’ సదుపాయం కల్పించాలంటే 34,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది పెద్ద మొత్తం అయిన మాట వాస్తవమే. కానీ జనం ప్రాణాలను రక్షించవలసిన బాధ్యతతో పోలిస్తే ఆ ఖర్చు భరించవలసిందే. ఇలాంటి ఏర్పాట్లు అధికవ్యయం నెపంతో వాయిదా వేసి రూ.65,000 కోట్లు ఖర్చుపెట్టి వెయ్యి వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టవలసిన తొందర ఈ ప్రతి రైలును తానే స్వయంగా ప్రారంభించి మురిపెం తీర్చుకునే మోదీ అత్యుత్సాహం తీర్చుకోవడానికి మించిన ప్రయోజనం అయితే ఏమీలేదు. ముందు ఉన్న రైలు మార్గాలను ప్రమాద రహితంగా చేయడం మీద దృష్టి ఉంచాలిగా! ఆ తరవాత ఎక్కువడబ్బు చెల్లించి ప్రయాణించగలిగే వారి కోసం వాయువేగంతో (ఆమాటా బూటకమే) నడిచేరైళ్లను ప్రవేశపెట్టొచ్చు. ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది కాదా? పైగా రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్వయంగా ఇంజనీరు. ఆయనకు కచ్చితంగా ఈ పాటి జ్ఞానం ఉండకుండా ఉండదు. కానీ ఏ మంత్రి అయినా మోదీ చాటు వ్యవహారమే అయినప్పుడు మంత్రులను నిందించి ప్రయోజనంలేదు. కవచ్‌లాంటి వ్యవస్థ ఈమార్గంలో కూడా ఉండిఉంటే ప్రమాదం జరిగినా మృతుల సంఖ్య ఇంత భారీగా ఉండేదికాదు. 2009లో జాచ్‌పురాలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 13 బోగీలు పట్టాలు తప్పినప్పుడు మృతుల సంఖ్య 16కే పరిమితం అయింది. ఈ గుణపాఠం అన్ని సందర్భాలలో ఎందుకు పనిచేయదో. ప్రాణాలు కోల్పోయిన వారొక్కొక్కరికీ పది లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రెండేసి లక్షలు, ఓ మోస్తరు గాయాలు తగిలిన వారికి రూ.50,000పరిహారం ప్రకటించి రైల్వేశాఖ దొడ్డమనసు ప్రదర్శించి ఉండొచ్చు. అదీ మంచిదే. కానీ ఇలాంటి ప్రమాదాల నివారణకు అన్ని మార్గాల్లోనూ ‘‘కవచ్‌’’ లేదా అంతకన్నా మెరుగైన సాంకేతిక ఏర్పాట్లు లేకపోవడానికి బాధ్యత ఎవరిది? రైలు ప్రమాదం జరిగితే మంత్రిపదవికి రాజీనామాచేసిన లాల్‌ బహదూర్‌ శాస్త్రి లాంటి వారి త్యాగధనులు ఇప్పుడు ఎటూ కనిపించరు. నిజానికి అది సరైన పరిష్కారమూకాదు. సకల విజయా లను తన ఖాతాలో వేసుకునే మోదీ ఈ ప్రమాదానికి ఏమేరకు బాధ్యత తీసుకుంటారు అనేది జవాబు ఆశించకూడని ప్రశ్నగా మిగిలిపోక తప్పదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img