Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

రోగం కన్నా ప్రాణాంతక చికిత్సా!

ఒక మతాన్నో, కులాన్నో కించపరచడానికి విద్వేష ప్రచారం అనేక రకాలుగా ఉండవచ్చు. కానీ దృశ్య మాధ్యమాల ద్వారా విద్వేష ప్రచార ప్రభావం అపారమైన దుష్ప్రభావం కల్గిస్తుంది. సమాజాన్ని నిట్టనిలువునా చీలుస్తుంది. ఈ వాస్తవాన్ని ఎట్టకేలకు సుప్రీంకోర్టు కూడా గ్రహించింది. దృశ్య మాధ్యమాల ద్వారా విద్వేష ప్రచారం విచ్చలవిడిగా కొనసాగుతుంటే చూస్తూ కూర్చొని మౌన ప్రేక్షక పాత్ర పోషిస్తారా అని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇలాంటి విద్వేష ప్రచారాన్ని నియంత్రించాలనీ, ఈ పని చేయ డానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని న్యాయమూర్తులు కె.ఎం. జోసఫ్‌, హృషీకేశ్‌ రాయ్‌తో కూడిన బెంచి ఇటీవల ప్రశ్నించింది. విద్వేష ప్రచారంవల్ల టీవీ చానళ్లకు ప్రేక్షకుల సంఖ్య పెరగొచ్చు. లాభాలూ గడిరచ వచ్చు. ప్రభుత్వం ఈ విద్వేషాన్ని నిరోధించడానికి చట్టం తీసుకొచ్చేలోపు తామే కొన్ని మార్గదర్శక సూత్రాలు జారీ చేస్తామని కూడా న్యాయ మూర్తులు పేర్కొన్నారు. శాసనాలు చేయవలసిన చట్టసభలు తమ పని చేయనప్పుడు న్యాయవ్యవస్థ కలగజేసుకున్న సందర్భాలు ఇదివరకూ ఉన్నాయి. టీవీ చానళ్లలో ఎవరితోనైనా ముఖాముఖి కార్యక్రమమో, బృంద చర్చలో నిర్వహిస్తున్నప్పుడు దీనికి నిర్దిష్ట పద్ధతి ఉండాలి. ఈ కార్యక్రమాలు నిర్వహించే వారి అంటే ఆంకర్ల పాత్ర ఏమిటి అని ఆలోచించవలసిన అవసరాన్ని న్యాయమూర్తులు గుర్తు చేశారు. ఆంకర్‌ పాత్ర పోషించే వారే చర్చలో మిగతా వారికన్నా ఎక్కువ మాట్లాడితే లేదా సుదీర్ఘమైన ప్రశ్నలు సంధిస్తే ఆ చర్చలో పాల్గొనే వారు తమ అభిప్రాయం చెప్పడానికి చాలా తక్కువ సమయం ఉంటుందన్నది నిజమే. కొన్ని టీవీ చానళ్లలో ఆంకర్ల ధోరణి ఇలాగే ఉంది. ఈ ఆంకర్లు చర్చకు దోహదం చేయరు. ఎదుటి వారిని మాట్లాడనివ్వరు. తమ మనసులో ఉన్న మాటను ఎదుటి వారు చెప్పేటట్టు బలవంత పెడ్తారు. ఇది మన టీవీ చర్చల కార్యక్రమాల్లో నిత్యకృత్యమే. చర్చలో పాల్గొనే వారి పంథా కనక సదరు ఆంకర్‌కు నచ్చకపోతే వారిని కించపరుస్తూ ఉంటారు అని కూడా న్యాయ మూర్తి జోసఫ్‌ అభిప్రాయపడ్డారు. అదీ నిజమే. టీవీ కార్యక్రమాల ద్వారా ప్రసారమవుతున్న విద్వేష పూరిత ప్రచారాన్ని నిరోధించాలని అభ్యర్థిస్తూ దాఖలైన కొన్ని పిటిషన్లను విచారించే సమయంలో న్యాయమూర్తులు విద్వేష ప్రచారం ఎంత కీడు చేస్తుందో చాలా స్పష్టంగానే చెప్పారు. తమ ఆలోచనా ధోరణికి అనువైన వారికి మాట్లాడడానికి ఎక్కువ సమయం ఇవ్వడం, తమ ధోరణికి భిన్నంగా మాట్లాడే వారి మాటకు పదే పదే అడ్డు తగలడం, వారిని చీదరించుకునేట్టు వ్యవహరించడం టీవీ చర్చా కార్య క్రమాల్లో చూస్తూనే ఉన్నాం. వ్యవస్థాపరమైన నిరోధక చర్యలు కొరవడితే ఈ విద్వేష ప్రచారం కొనసాగుతూనే ఉంటుందని న్యాయమూర్తి జోసఫ్‌ గుర్తు చేశారు. అందువల్ల పని చేసే చోట లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి విశాఖ కేసులో నిర్దేశించిన మార్గదర్శకల్లాంటి వాటి అవసరం ఉందని కూడా న్యాయమూర్తి జోసఫ్‌ అభిప్రాయపడ్డారు. విద్వేష ప్రచారం వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించడమే కాక, జాతి సమైక్యతను కూడా దెబ్బ తీస్తుంది. ఇందులో సందేహం లేదు. ఇలాంటి విద్వేష ప్రచారం సాగే దృష్టాంతాల జాబితా తయారు చేసి ఇస్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పంపుతామనీ ఆ తరవాత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో పరిశీలిస్తామని జులైలోనే న్యాయమూర్తి ఖాన్విల్కర్‌ నాయకత్వంలోని బెంచి తెలియజేసింది. మహమ్మద్‌ ప్రవక్తను తూలనాడే విద్వేష ప్రచారాన్ని నిలువ రించాలని మౌలానా మహమూద్‌ అసద్‌ మదానీ దాఖలు చేసిన పిటి షన్‌ను విచారించే క్రమంలో న్యాయమూర్తి ఖాన్విల్కర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు ఈ కేసును ఆరు వారాల పాటు వాయిదా వేశారు. ప్రస్తుతం న్యాయమూర్తి జోసఫ్‌ నాయకత్వంలోని బెంచి ఈ పిటిషన్‌ను విచారిస్తోంది. నిరక్షరాస్యులతో సహా అశేష ప్రజానీకం చూసే టీవీ కార్య క్రమాల్లో విద్వేష ప్రచారం అత్యంత ప్రమాదకరమైందని ప్రత్యేకంగా చెప్పక్క ర్లేదు. ఇలాంటి కార్యక్రమాలవల్ల సెక్యులరిజం మీద దాడి పెచ్చరిల్లుతుందనీ గుర్తు చేయాల్సిన అగత్యం లేదు.
వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛకు మన రాజ్యాంగం పూచీ పడ్తోంది. ఈ రెండూ ప్రజాస్వామ్యానికి జీవగర్రల్లాంటివి. కానీ వీటిని ఉప యోగించే నెపంతో దుర్వినియోగం చేయడాన్ని నిరోధించవలసిందే. అందులో సందేహం లేదు. కానీ ఆ పని ఎవరు చేయాలనేది తీవ్రంగా ఆలోచించవలసిన అంశం. మన రాజ్యాంగంలోని 19(1) అధికరణం ప్రకారం పరోక్ష రీతిలో పత్రికా స్వేచ్ఛ ఉంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు అనేక సార్లు విడమర్చింది. కానీ ఈ స్వేచ్ఛకు హేతుబద్ధమైన నియంత్రణా ఉండాలనీ రాజ్యాంగమే చెప్తోంది. కానీ నియంత్రించేది ఎవరు అన్న ప్రశ్న దగ్గరే పేచీ వస్తోంది. ఇంతవరకు పత్రికలు, ప్రసార సాధనాలు స్వీయ నియంత్రణ పాటించాలన్న అవగాహనతోనే పత్రికా స్వేచ్ఛను వినియోగించు కుంటున్నాయి. దీనికి అప్పుడప్పుడు ప్రభుత్వం అడ్డు తగిలిన సందర్భాలు లేకపోలేదు. ఈ ప్రస్తావన వచ్చినప్పుడల్లా పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వం హరించిందన్న వాదన వినిపిస్తూ ఉంటుంది. ఎమర్జెన్సీలో అలా పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు పడిన మాట వాస్తవమే. ఆ రోజుల్లో కూడా ప్రభుత్వం కొద్దిగా లొంగి ఉండమని అంటే ప్రభుత్వానికి మోకరిల్లిన సందర్భాలు న్నాయి. ప్రస్తుతం ఆచరణలోకానీ, చట్టపరంగా కానీ ఎమర్జెన్సీ లేని మాట వాస్తవమే. ఆచరణలో పరిస్థితి అంతకన్నా భయానకంగా ఉంది. ఇప్పుడు కొన్ని పత్రికలు, ప్రధానంగా టీవీ చానళ్ల లాంటివి ప్రభుత్వానికి స్వచ్ఛం దంగా ఊడిగం చేసే స్థాయికి దిగజారాయి. ఇలాంటి మీడియానే గోదీ మీడియా అంటున్నాం. ప్రధాన స్రవంతిలోని మాధ్యమాలు అనుకునే వాటిలో చాలా మాధ్యమాలు గోదీ మీడియాగానే మారి పోయాయి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పక్షం చేసే విద్వేష ప్రచారాన్ని దశదిశలా వ్యాపింప చేసే కర్తవ్యాన్ని ఈ మాధ్యమాలు భుజాన వేసుకున్నాయి. ఇదంతా ప్రజాస్వామ్యానికి చేటు తెచ్చేదే. కానీ సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు భావిస్తున్నట్టుగా నియంత్రణాధికారం ప్రభుత్వానికి అప్పగిస్తే ప్రమాదం మరింత తీవ స్థాయికి చేరడమే కాదు, మీడియా అస్తిత్వమే కోల్పోవచ్చు. మీడియా మీద నియంత్రణ ఎంత అవసరమైనా నియం త్రణాధికారం ప్రభుత్వం చేతిలో ఉండాలనడం అత్యంత భయానక స్థితికి దారి తీస్తుంది. న్యాయమూర్తులు ఈ దృక్కోణంతో ఆలోచిస్తున్నట్టు లేదు. స్వీయ నియంత్రణే స్వేచ్ఛకు రక్షా కవచం. కానీ పెట్టుబడుల విషపుత్రికగా మారిన కొన్ని మీడియా సంస్థలు స్వచ్ఛంద బానిసత్వానికి పాల్పడడం విచిత్రమైన పరిస్థితి. అసలు కర్తవ్యాన్ని పక్కకు తోసేసి ప్రభుత్వానికి ఊడిగం చేయడానికి మీడియా సిద్ధపడడం ప్రజాస్వామ్యాన్ని కుళ్లబొడుస్తోంది. ఆ పని ఇప్పటికే జరిగిపోతోంది. బానిస బుద్ధి, లాభాపేక్ష మాత్రమే ప్రధానం అని భావించే మీడియాను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి కట్టబెట్టడం అత్యంత ప్రమాదకరం. సుప్రీంకోర్టు ఈ దిశగా ఆలోచిస్తుందని ఆశిద్దాం. రోగం కన్నా వైద్యం ప్రాణాంతకం కాకూడదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img