Sunday, June 11, 2023
Sunday, June 11, 2023

వికటించిన మందే మళ్లీ

వికటించిన వైద్యాన్నే మోదీ సర్కారు మళ్లీ ఆశ్రయించింది. ఆరున్నరేళ్ల కింద 2016 నవంబర్‌ 16 రాత్రి ఎనిమిది గంటలకు ప్రధానమంత్రి మోదీ రేడియో, టీవీల్లో ప్రత్యక్షమై వెయ్యి, 500 రూపాయల నోట్లు ఆ రాత్రి 12గంటల తరవాత చెల్లవని ప్రకటించి అందరినీదిగ్భ్రాంతికి గురిచేశారు. దీనివల్ల ప్రధానంగా సామాన్యులు ఇబ్బందిపడ్డారు. ఆ విధానం నల్ల డబ్బును వెలికి తీయడానికి ఏం మాత్రం ఉపకరించలేదు. ఎన్ని నోట్లు చెలామణిలో ఉండేవో దాదాపు అన్ని నోట్లు రిజర్వు బ్యాంకుకు చేరాయి. వీటిలో నల్లవేవో, తెల్లవేవో ప్రభుత్వంగానీ, రిజర్వు బ్యాంకు గానీ ఎప్పుడూ చెప్పలేదు. పెద్దనోట్లను రద్దు చేస్తున్నామని ప్రకటించిన కేంద్రం ఈ పరిణామంతో డబ్బు చెలామణి తగ్గి జనం ఇబ్బంది పడ్తున్న నేపథ్యంలో రెండువేల రూపాయలను ముద్రించింది. నల్లధనాన్ని చెలామణిలో లేకుండా చేయడం, తీవ్రవాదాన్ని కట్టడం చేయడం, నకిలీ నోట్లను కట్టడి చేయడం నోట్ల రద్దుకు ప్రధాన లక్ష్యాలని అప్పుడు మోదీ ప్రకటించారు. ఈ లక్ష్యాల్లో ఏవి ఎంతవరకు నెరవేరాయో లెక్క మాత్రం తేల్చలేదు. అంటే సాధించిన ఫలితం ఏమీలేనట్టే. జనం మాత్రం కష్టాల పాలయ్యారు. రోజుల తరబడి అనేక గంటల పాటు బ్యాంకుల ముందు నిలబడాల్సి వచ్చింది. ఈ క్రమంలో కనీసం వందమంది ప్రాణాలు పోయాయి. ఇప్పుడు రెండు వేల రూపాయల నోట్లు రద్దు చేసినప్పుడు వీటిని మార్చుకోవడానికి మరింత వెసులుబాటు ఇచ్చారు. వచ్చే మంగళవారం నుంచి మొదలు పెట్టి సెప్టెంబర్‌ 30దాకా మార్చుకోవచ్చు. అయితే ఇలా మార్చు కోవడానికి ఓ పరిమితి ఉంది. ఒక విడత పదినోట్లు మాత్రమే మార్చు కోవడానికి వీలుంటుంది. అపారంగా ఈ నోట్లను దాచినవారు అన్నింటినీ మార్చుకోవడం కుదరకపోవచ్చు. ఇంతకు ముందు పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం అంతకన్నా పెద్ద నోట్లను విడుదల చేయడంలో ఆంతర్యం ఏమిటో అంతుబట్టలేదు. నిజానికి రెండు వేల రూపాయల నోట్లు దాచుకోవడం సులభమైంది. 2016లో పెద్ద నోట్ల రద్దు విషయం అప్పటి ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీకి కూడా తెలియదనే వారు. ఇప్పుడు మాత్రం మోదీ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు రిజర్వు బ్యాంకు శుక్రవారం రెండువేల రూపాయల నోట్ల ఉపసంహరణ విషయం బయట పెట్టింది.
రెండువేల నోట్లు విడుదలైన తరవాత చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ 18037 బిలియన్‌ డాలర్లు. ఇది చెలామణిలో ఉన్న మొత్తంలో 37.3 శాతం. వాస్తవానికైతే అప్పుడూ ఈ విషయం రిజర్వు బ్యాంకు నోటే ద్వారానే రావలసింది. కానీ ఇది మహత్తర కార్యమని భావించిన మోదీ తానే ప్రకటించారు. రెండువేల రూపాయల నోట్లను భారీగా డబ్బు దాచుకునే వారికి దివ్యంగా ఉపయోగ పడుతుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎస్‌.సి. గార్గ్‌ గత సంవత్సరమే హెచ్చరించారు. విచిత్రం ఏమిటంటే రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేసే ఉద్దేశం లేదని గత డిసెంబర్‌లో పార్లమెంటులో ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఇంతలోనే మారిన పరిస్థితి ఎంత తీవ్రమైందో మాత్రం కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. ఈ నోట్లు దొంగచాటుగా డబ్బు దాచుకునే వారికి వర ప్రసాదమైనాయి. అంటే ఇవి సంపన్నులకే ఉపయోగపడ్డాయి. రెండు వేల రూపాయల నోట్లు సామాన్యులను ఇబ్బంది పాలు చేశాయి. చిల్లర మార్చుకోవడమూ సమస్య అయింది. ప్రస్తుతం నోట్ల ఉపసంహరణ, వాటిని మార్చుకోవడానికి కల్పించిన వెసులుబాటు నల్లధనం ఉన్న వారికే మరోసారి ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుంది. ఇది గతంలో మోదీ అనాలోచితంగా పెద్ద నోట్లను రద్దు చేయడంవల్ల సంపన్నులకు, ధన రాశులు దాచుకున్న వారికి ఉపకరించిన దానికన్నా ఎక్కువ ప్రయోజనమే చేకూరుస్తుంది. మోదీ ఆరున్నరేళ్ల కింద పెద్ద నోట్లు రద్దుచేసినప్పుడు ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. లక్షలాది ఉద్యోగాలు పోయాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కకా వికలైనాయి. వీటిలోనే ఎక్కువ ఉపాధి కల్పించే అవకాశం ఉండేది. 500, వెయ్యి నోట్లను రద్దు చేసినప్పుడు నల్లధనం ఏమన్నా వెలికి వచ్చిందా అంటే అదీ లేదు. 2016లో రద్దు చేసిన నోట్లలో 99.3 శాతం రిజర్వూ బ్యాంకుకు చేరాయి. అంటే ప్రత్యక్షంగా నల్లధనం అని తేలిందేమీ లేదు. ఇప్పుడూ నల్లధనం తగ్గే అవకాశాలు ఏమీ ఉండవు. రెండువేల నోట్ల ఉపసంహరణ వల్ల నల్లధనం ఉన్నవారు లబ్ధి పొందకుండా కట్టుదిట్టం చేస్తామంటున్నారు. 2016లో రద్దుచేసినప్పుడు చెదురు మదురుగా కొంతమంది మీద దాడులు జరగడం తప్ప పెద్దగా సాధించింది ఏమీ లేదు. 2016లో విధించిన నిబంధనల ప్రకారం ఎక్కువ నోట్లు మార్చుకోవడానికి వీల్లేదన్నారు. ఒక రోజు కేవలం నాలుగు వేల రూపాయల విలువగల నోట్లే మార్చుకోవచ్చన్నారు. బ్యాంకులో ఉన్న తమ డబ్బులో రూ.20,000 తీసుకోవచ్చునన్నారు. ఇవన్నీ పేదలనే ఇబ్బందుల్లో పడేశాయి. తాము కష్టపడి సంపాదించిన సొమ్ము కూడా వాడుకునే వీలు లేకుండా పోయింది. ఈసారి కూడా ఒక్క విడతలో మార్చుకోగలిగిన మొత్తం ఇరవై వేలే. అలా ఎన్ని విడతలైనా ఒక్కరేజే మార్చుకోగలగడం సంపన్నులకే ప్రయోజనం. ఇది నల్లడబ్బు తెల్లగా మార్చుకోవడానికి ఉపకరిస్తుంది.
అసలు ఇప్పుడు నోట్ల ఉపసంహరణ ఆంతర్యం ఏమిటో తెలియదు. చిరిగిపోయిన, నలిగిపోయిన నోట్లను వెనక్కు తీసుకోవడానికే అని రిజర్వు బ్యాంకు వాదన నమ్మశక్యంగా లేదు. అదే కారణం అయితే పాతనోట్లు ఇచ్చి కొత్త నోట్లు తీసుకోమనొచ్చుగా. నల్లడబ్బు, తీవ్రవాదం, నకిలీ నోట్ల ప్రస్తావన ఇప్పుడు చేయడం లేదు. ప్రధాన మంత్రి మోదీ పనితీరు చూస్తే మొదట ఏదో ఓ పని చేసేసి తరవాత ఆలోచిస్తారు. మళ్లీ వెయ్యి రూపాయల నోట్లు వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. నోట్లు ఎక్కువగా చెలామణిలో ఉంటే అవినీతి అంతగా పెరుగుతుందన్నది మోదీ సిద్ధాంతం. అలాగైతే 2016లో చెలామణిలో ఉన్న నోట్లు 17.7 లక్షల కోట్లు అయితే ఇప్పుడు 30.18 లక్షల కోట్ల నోట్లు చెలామణిలోకి వచ్చాయి. దీని బాధ్యత ప్రభుత్వానిదేగా. చేసిన తుగ్లక్‌ పనే పదేపదే చేయడం అంటే ఇదే. పరిణామాల గురించి ఆలోచించకుండా కొత్త విధానాలు అమలు చేయడం మోదీ శైలి. ఈ సారి తీసుకున్న నిర్ణయం మెరుగైన ఆర్థిక విధానమూ కాదు. సముచిత ఆలోచనా కాదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img