Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

విశ్వ గురువుకు అప్రదిష్ట?!

వారం రోజులపాటు ఇంగ్లండ్‌లో గడిపిన కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ మన దేశంలోని స్థితిగతుల గురించి, ప్రజాస్వామ్యానికి ఏర్పడుతున్న ముప్పు గురించి మాట్లాడారు. విదేశాలలో మన దుస్థితిని గురించి ప్రస్తావించినందుకు దేశ పరువు ప్రతిష్ఠలు మంటగలిసి పోయాయని బీజేపీ నానాయాగీ చేస్తోంది. మనదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడితే ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని రాహుల్‌ గాంధీ కేంబ్రిడ్జ్‌ విశ్వ విద్యాలయంలో మాట్లాడుతూ అన్నారు. ఇది కేవలం ఆరోపణో, ఆయన వ్యక్తిగత అభిప్రాయమో కాదు. దేశంలో ఉన్న వాస్తవ పరిస్థితే. అయినా దీన్ని అంగీకరించడానికి సిద్ధంగాలేని బీజేపీ రాహుల్‌ గాంధీ దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించారని గోల పెడ్తోంది. జరుగుతున్న తప్పులను ఎత్తి చూపడం, పరిస్థితిని చక్క దిద్దడానికి ప్రయత్నించడం దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించడం ఎలా అవుతుందో బీజేపీనాయకులకే తెలియాలి. ఉన్న పరిస్థితిని అంగీకరించక పోతే దిద్దుబాటుకు అవకాశం ఎక్కడ ఉంటుంది? సుభిక్షంగా ఉన్న దేశంపై రాహుల్‌ గాంధీ దుష్ప్రచారం చేస్తున్నారని ‘‘గోలీ మారో సాలోంకో, దేశ్‌ కే గద్దారాంకో’’ అని హుంకరించిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ దెప్పి పొడిచారు. ముస్లింల మీద విద్వేషం నింపడానికి ఆయన వాడిన భాష ఎంత హేయమైందో చెప్పక్కర్లేదు. మోదీ ఆయనను కేంద్రంలో మంత్రినిచేసి విద్వేష ప్రచారమే తమ విధానం అని రుజువు చేశారు. మోదీ హయాంలో జరుగుతున్న పరిణామాలను లోతుగా పరి శీలించి చూస్తేగానీ ఎవరివల్ల దేశ ప్రతిష్ఠ దెబ్బ తింటోందో అర్థం కాదు. అమెరికా నడిగడ్డ నుంచి ప్రధానమంత్రి మోదీ డోనాల్డ్‌ ట్రంప్‌ తరఫున ప్రచారంచేసిన విషయం సహజంగానే బీజేపీకి గుర్తుండదు. అంతర్జాతీయంగా తానే అగ్ర నాయకుడినని నిరూపించుకోవడానికి అష్ట కష్టాలు పడ్తున్న మోదీ తప్ప ఇతర దేశాలలో ఏ ప్రధానమంత్రీ పరాయి నాయకుడి తరఫున ప్రచారం చేయరు. చదువు సంస్కారం దండిగా ఉన్నాయనుకునే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ప్రతిపక్ష నాయకులను డెటాల్‌తో నోరు కడుక్కోవాలని అనడమూ బీజేపీ నాయకుల దృష్టిలో అప్రతిష్ఠాకరం కాదు. లండన్‌లో రాహుల్‌ గాంధీ మాటలు ప్రేలాపలనలని బీజేపీ నాయకులు అనడం మాత్రం మర్యాదకరమైన భాషే నట. దేశ ప్రధాని కావడం తన జన్మహక్కు అని రాహుల్‌ గాంధీ అనుకుంటున్నారు కానీ ఆయన ఎన్నటికీ ప్రధానమంత్రి కాలేరని బీజేపీ నాయకులు శాపనార్థాలకు దిగారు. రాహుల్‌ ప్రధానికావడం, కాకపోవడం ఆయన లండన్‌లో చేసిన ప్రసంగాలకు సంబంధించినంత మేర విషయాంతరమే. భారత్‌లో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉందని తనతో సహా అనేకమంది ప్రతిపక్ష నాయకుల మీద మోదీ ప్రభుత్వం పెగాసస్‌ సహాయంతో నిఘా పెట్టిందని రాహుల్‌ అన్న మాటలో అసత్యం ఏమిటో తెలియదు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో చర్చకు వచ్చినా ఇంతకీ తాము పెగాసస్‌ గూఢచర్య పరిజ్ఞానాన్ని ఉపయోగించారో లేదో మోదీ సర్కారు చెప్పనేలేదు. దేశ భద్రత ముసుగులో ఈ విషయంలో నిజానిజాలు బయటపెట్టకుండా మోదీ సర్కారు తప్పించుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగా ఉండడానికి కావలసిన పార్లమెంటు సవ్యంగా పని చేయడం, మీడియాకు స్వేచ్ఛ, న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించడం, ఆలోచనలను వెల్లడిరచే అవకాశం లేకుండా పోతున్నాయని రాహుల్‌ అన్న మాటలో అవాస్తవం ఉందనడానికి విమర్శలకు దిగిన బీజేపీ నాయకులు ఒక్క రుజువూ చూపలేదు. అధికార పార్టీ విద్వేష, హింసాత్మక విధానాలు అనుసరిస్తుందనీ వారి సిద్ధాంతం పిరికితనంతో కూడిరదని రాహుల్‌ గాంధీ అనడం సహజంగానే బీజేపీ నాయకులకు బాధాకరంగానే ఉంటుంది. సత్యం ఎప్పుడూ నిష్ఠూరంగానే కనిపిస్తుంది. ‘‘చైనా మనకన్న చాలా శక్తిమంతమైన దేశం. అలాంటి దేశంతో ఎలా కయ్యం పెట్టు కుంటాం?’’ అని సాక్షాత్తు విదేశాంగ మంత్రి జై శంకర్‌ వ్యాఖ్యానించడాన్ని పిరికితనం అనడంలో అనౌచిత్యం ఏముందో మరి!
ఘనతవహించిన ప్రధానమంత్రి మోదీ విదేశీ గడ్డ మీదే మన దేశాన్ని అనేకసార్లు అపహాస్యం చేశారు. భారతీయులుగా పుట్టినందుకు దేశ వాసులు సిగ్గు పడ్తున్నారన్నారు. షాంఘాయ్‌, కాలిఫోర్నియా, టొరంటో, సియోల్‌, అబూ దాబీలాంటి చోట్ల కూడా మోదీ ప్రతిపక్షాలను ఎద్దేవా చేశారు. ఇది అంతర్గత రాజకీయాలను ఇతర దేశాలలో ప్రస్తావించడం కాదని దబాయించడం బూటకానికి అలవాటుపడిన బీజేపీకి మాత్రమే సాధ్యం. మోదీ చేతిలో మినహాయింపులు లేని అధికార కేంద్రీకరణ, సంపద కొద్దిమంది పారిశ్రామికవేత్తల చేతిలో కేంద్రీకృతం కావడం మొదలైనవన్ని ప్రజాస్వామ్యానికి విఘాతం కల్గించేవే అని రాహుల్‌ గాంధీయే చెప్పక్కర్లేదు. సవ్యంగా ఆలోచించగలిగిన వారందరూ ఈ అంశాలు గ్రహిస్తూనే ఉన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మనం ఐదవ స్థానంలో ఉన్నామని మోదీ ఎప్పుడూ బోరవిరుచుకుని చెప్తూ ఉంటారు. కానీ 194 దేశాల తలసరి ఆదాయ సూచీలో భారత్‌ 144వ స్థానంలో ఉంది. ప్రపంచంలో ఆకలి సూచీలో కూడా 121 దేశాలలో భారత్‌ 107వ స్థానంలో ఉంది. ఈ విషయంలో పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, మైన్మార్‌, శ్రీలంక కూడా మనకన్నా మెరుగ్గా ఉన్నాయి. 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందిస్తున్నా శిశువుల ఎదుగుదల విషయంలో మనం హీనస్థితిలోనే ఉన్నాం. పత్రికా స్వేచ్ఛలో మనం 142వ స్థానం నుంచి 150వ స్థానానికి దిగజారాం. 2016లో 135వ స్థానంలో ఉండేవాళ్లం. మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత మీడియామీద దాడులు పెచ్చరిల్లాయి. స్త్రీ-పురుషుల మధ్య అంతరాలను పరిశీలించినా రాజకీయాలలో, విద్యాభివృద్ధిలో, ఆర్థిక స్థితి, ఆరోగ్యం విషయాల్లో భారత మహిళలు 146 దేశాల జాబితాలో 135వ స్థానంలో ఉన్నారు. అనేక రకాలుగా పేదరికంలో ఉన్నవారు దేశంలో 22 కోట్ల మంది ఉండడం సిగ్గుచేటు. సామాజిక విద్వేషాల విషయంలో పది అంకెను ప్రమాణంగా తీసుకుంటే మనం 9.4వ స్థానంలో ఉండడం అత్యంత దయనీయం.
వంద స్మార్ట్‌ సిటీలు అని 2015లో ఊదరగొట్టిన మోదీ ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదు. బెంగళూర్‌ ఇంతకు ముందు 79వ స్థానంలో ఉంటే ఇప్పుడు 93వ స్థానానికి, ముంబై 78వ స్థానం నుంచి 90వ స్థానానికి, దిల్లీ 68వ స్థానం నుంచి 89వ స్థానానికి, హైదరాబాద్‌ 67వ స్థానం నుంచి 92వ స్థానానికి దిగజారాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నిసార్లు ప్రభుత్వాలు అంతర్జాల సంబంధాలపై ఆంక్షలు విధించాయో అందులో సగం మోదీ సర్కారు విధించిన ఆంక్షలే కనిపిస్తాయి. చట్టబద్ద పాలనలోనూ మనం 140 దేశాల సూచీలో 77వ స్థానంలో ఉన్నాం. ఇవన్నీ ఇలా ఉంటే సుఖసంతోషాల సూచీలో 149 దేశాలలో మనం 136వ స్థానంలో ఉండడంలో ఆశ్చర్యం ఏముందిగనక. దేశం ఎవరివల్ల అప్రదిష్ఠ పాలవుతుందో ఆలోచించలేని జడత్వం విశ్వ గురువు అనుకుంటున్న ఈ దేశవాసులకు ఉందనుకోవడం మూర్ఖత్వమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img