వర్షాలను వెన్నంటి విషజ్వరాల విజృంభణ ఏటా కొనసాగుతున్నా.. అందుకు తగిన ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వానలు, వరదల తర్వాత తెలుగురాష్ట్రాల్లో జనాన్ని జబ్బులు చుట్టుముట్టాయి. వానలు మొదలయ్యాక వాతావరణం చల్లబడి మురుగునీరు, చెత్త పోగుపడిన చోట్ల భారీ సంఖ్యలో దోమల సంతతి ఈ వ్యాధుల విజృంభణకు కారణమౌతోంది. గత వారం, పది రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో డెంగీ, మలేరియా కేసులు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. పట్టణాల్లో వైరల్ జ్వరాలు, పల్లెలు, ఏజెన్సీల్లో మలేరియా ఉధృతి తీవ్రంగా ఉంది. విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం, తిరుపతి సహా పెద్ద నగరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు జ్వర పీడితులతో కిక్కిరిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కలిపి ఈ నెల 20 నుంచి 26వ తేదీ మధ్య 70,812 మంది జ్వరలక్షణాలతో వచ్చారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారి సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మలేరియా, డెంగీ కేసులు అనధికారికంగా మరింత ఎక్కువగా ఉంటున్నాయి. శరీర ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ విపరీతమైన నీరసం బాధితులను ఇబ్బంది పెడుతోంది. నిరుడీ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,840 మలేరియా కేసులు నమోదుకాగా, ఈ ఏడాది ఆగస్టు 25వ తేదీ వరకు 4,610 కేసులు నమోదయ్యాయి. డెంగీ కేసులు గత ఏడాది కన్నా ఈ ఏడాది ప్రస్తుతానికి తగ్గాయి. 2023లో 3,252 కేసులు నమోదుకాగా, ఈ ఏడాది ఆగస్టు 25 వరకు 2,955 కేసులు వెలుగుచూశాయి. గత ఏడాది తక్కువగా ఉన్న చికున్ గున్యా ఈ ఏడాది మళ్లీ విజృంభిస్తోంది. గత ఏడాది కేవలం ఐదు కేసులు మాత్రమే నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటికే 99 కేసులు బయటపడ్డాయి. వాంతులు, విరేచనాలు, తీవ్రమైన తలనొప్పి, కండరాలు కీళ్ల నొప్పులు, ఆకలి మందగించడం వంటి లక్షణాలు డెంగీ, మలేరియా జ్వరాల బారినపడిన వారిలో కనిపిస్తున్నాయి. సాధారణ జలుబు లక్షణాలు, ఫ్లూజ్వర లక్షణాలూ దాదాపు ఒకేలా ఉంటున్నాయి. దీంతో వచ్చింది జలుబా? ఫ్లూ జ్వరమా? అన్నది తేలడం లేదు. పొడి దగ్గు, గొంతు నొప్పితోపాటు జ్వరం 101 డిగ్రీలకంటే ఎక్కువగా ఉండడంతో పాటు ఒళ్లనొప్పులు, తలనొప్పి, బడలిక వంటివీ ఎక్కువగా ఉంటున్నాయి. లేవటానికే కష్టమవుతోంది. పిల్లల్లో ఎడినో, ఇన్‌ఫ్లూయెంజా వైరస్ జ్వరాలను ఎక్కువగా గుర్తిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలూ కనిపిస్తున్నాయి. వర్షాకాలానికి తోడు పారిశుద్ధ్య లోపం వల్ల నగరాలు, పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా దోమల బెడద ఎక్కువగా ఉంటోంది. నీరు, గాలి కాలుష్యం తోడై జ్వరాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ జ్వరాల ప్రభావం ప్రధానంగా జులై నుంచి నవంబరు వరకూ ఉంటుంది. రాష్ట్రంలో గత రెండేళ్లతో పోల్చితే మలేరియా, చికున్ గున్యా కేసులు పెరగ్గా డెంగీ కేసులు తగ్గాయి. గిరిజనులు అధికంగా నివసించే ప్రాంతాలున్న పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలోని గ్రామాల్లో జ్వర పీడితులు ఎక్కువగా ఉన్నారు. మన్యం జిల్లాలో జ్వరాల బెడద మరీ ఎక్కువగా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మలేరియా కేసులు అత్యధికంగా 2,378 నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో 1,246, విజయనగరం జిల్లాలో 504 చొప్పున మలేరియా కేసులు బయటపడ్డాయి. విశాఖ జిల్లాలో 353, తిరుపతి జిల్లాలో 240, కర్నూలు జిల్లాలో 211 డెంగీ కేసులు నమోదయ్యాయి. తిరుపతి జిల్లాలో 47, చిత్తూరు జిల్లాలో 19, ఏలూరు జిల్లాలో 15 చికున్ గున్యా కేసులను గుర్తించారు. సీజనల్ వ్యాధుల్లో డయేరియా ఒకటి. రాష్ట్రవ్యాప్తంగా 56 చోట్ల అతిసారం కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు రెండు వేల మందికి పైగా అతిసారం బారిన పడ్డారు. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అసలే ధరాభారంతో సతమతమౌతున్న పేద, మధ్యతరగతి ప్రజానీకాన్ని ఈ విషజ్వరాలు ఆర్థికంగా చిదిమేస్తున్నాయి. జ్వరపీడితులు ఇంట్లో ఇద్దరుంటే చికిత్స కోసం కనీసం రూ.10 వేల వరకు ఖర్చవుతోంది. దాన్ని భరించడం వారి వల్ల కావడంలేదు. తెలంగాణలో దాదాపు రాష్ట్రమంతా విష జ్వరాలు విజృంభించాయి.
మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటివి ఇంతగా ప్రకోపించ డానికి ప్రధాన వాహకాలుగా ముఖ్య ప్రతినాయక పాత్ర పోషిస్తున్నది దోమలు, వ్యాధికారక పరాన్న జీవులే. అందుకు ముందుగా తప్పుపట్టాల్సింది పారిశుద్ధ్య నిర్వహణ లోపాలు, స్థానిక సంస్థల నిర్లక్ష్యాలనే. పరిసరాల పరిశుభ్రత, రోడ్ల తక్షణ మరమ్మతులు, ఘనవ్యర్థాల నిర్వహణ తదితరాలన్నింటా పాలకుల పూర్తి నిర్లక్ష్యం, అలసత్వం మేటవేసుకుపోయి ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నాయి. వీటికి ఆహార కల్తీ తోడై సామాన్య జనం ప్రాణాలు తోడేస్తున్నది. ఈ అనర్ధానికి పారిశుద్ధ్యంపై శ్రద్ధ కొరవడడం, మురికినీటి గుంటలు తదితర కారణాలేనని పదేపదే రుజువవుతూనే ఉంది. అయినా పాలకులు సరైన గుణపాఠాలు నేర్వని ఫలితంగా సామాన్యులు విషజ్వరాలకు బలవుతున్నారు. పట్టణాలు, పల్లెలు, ఏజెన్సీ ప్రాంతాలనే తేడా లేకుండా విషజ్వరాల ఉద్ధృతి- ఎక్కడికక్కడ పారిశుద్ధ్య లోపాలను, ఆయా శాఖల మధ్య సమన్వయ రాహిత్యాన్ని ప్రస్ఫుటీకరిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా.. పురపాలక, పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, వైద్య ఆరోగ్యశాఖల మధ్య సమన్వయరాహిత్యం, వాటి వైఫల్యాలే ఈ వ్యాధుల వీరంగానికి ప్రధాన కారణం. ఇది ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితమైన వైపరీత్యం కాదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపు పరిస్థితి ఇలానే ఉంది. చికున్ గున్యా, డెంగీ, మలేరియా పోటీపడి విజృంభించడానికి కారణాలేమిటో లోతుపాతులెరిగి తక్షణ దిద్దుబాటు చర్యలతో యంత్రాంగం యుద్ధసన్నద్ధత చాటాల్సిన తరుణమిది. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతమైన సమన్వయంతో పకడ్బందీ జాతీయ వ్యూహాన్ని పట్టాలకు ఎక్కిస్తేనే తప్ప ప్రజారోగ్యం తెరిపిన పడదు. సమస్య మూలాలు సజీవంగా ఉన్నంతవరకూ, దోమలపై పోరు పటిష్ఠంగా సాగనంతకాలం డెంగీ, మలేరియా, అతిసార, టైఫాయిడ్ తదితర వ్యాధులు కోరలు చాస్తూనే ఉంటాయి. ప్రజల ప్రాణాలను ఆబగా హరిస్తూనే ఉంటాయి. ప్రజారోగ్యాన్ని ఉపేక్షించినంత కాలం ఎన్నెన్ని అభివృద్ధి వ్యూహాలైనా జాతి సమగ్రవికాసానికి దోహదపడవు అనే వాస్తవాన్ని గుర్తెరిగి పాలకులు వ్యవహరించాలి.