Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

విషమ పరీక్ష

అయిదు రాష్ట్రాల శాసనసభలకు జరగనున్న ఎన్నికలు ప్రధానమైన రెండు పార్టీలు – బీజేపీకి కాంగ్రెస్‌ కు అగ్ని పరీక్ష లాంటివి. ఈ ఐదు రాష్ట్రాలలో విజయం బీజేపీ నాయకత్వంలోని ఎన్‌.డి.ఎ. కూటమికి, కాంగ్రెస్‌ నాయకత్వంలోని ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనకు ప్రధానమైనవే. ఈ ఎన్నికలు బీజేపీ మతతత్వ, విద్వేష పూరిత రాజకీయాల, కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ప్రచారం చేస్తున్నట్టు ‘‘మొహబ్బత్‌ కా దుకాన్‌’’ విధానాల నిగ్గు తేల్చనున్నాయి. ఇంకో కోణంలో చూస్తే ఈ ఎన్నికలు రెండు ప్రధాన పార్టీలలోనూ పాత తరం నాయకులకు ఇవే ఆఖరి ఎన్నికలు కావచ్చు. వయసు రీత్యా చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు (కె.సి.ఆర్‌.)కు 69 ఏళ్లు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు గెహ్లోత్‌ కు 72 ఏళ్లు. ఒక వేళ బీజేపీ రాజస్థాన్‌ లో గెలిస్తే ముఖ్యమంత్రి పదవికోసం పట్టుబట్టనున్న వసుంధరా రాజే సింధియాకు 70 ఏళ్లు. మధ్యప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ లోని ఇద్దరు నాయకులు వయసు మీరిన వారే. డిగ్విజయ్‌ సింగ్‌ కు 76 ఏళ్లయితే ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన కమల్‌నాథ్‌ కు కు 77 ఏళ్లు. వీరితో పోలిస్తే ప్రస్తుత బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వయసు తక్కువే. కానీ అక్కడ బీజేపీ గెలిచే అవకాశం దాదాపు లేదు. ఒక వేళ ఏదో మంత్రం పనిచేసి గెలిచినా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. చత్తీస్‌ గఢ్‌ లో ఇన్నాళ్లు బీజేపీ నాయకత్వం పక్కన పెట్టినా డా. రమణ్‌ సింగ్‌ కు చివరికి పోటీచేసే అవకాశం ఇచ్చింది. ఆయనకు 71 ఏళ్లు. పోటీ పడ్తున్న రెండు ప్రధాన పార్టీల ఎన్నికల వ్యూహం కూడా గమనించదగ్గ అంశమే. కాంగ్రెస్‌ లో ముందునుంచి కేంద్రంలోనే కాక రాష్ట్రాలలోనూ సకల విషయాలు నిర్ణయించేది అధిష్ఠాన వర్గమే. దీనికి భిన్నంగా వాజపేయి, అడ్వాణీ నాయకత్వంలో బీజేపీ కొనసాగినప్పుడు రాష్ట్రస్థాయి నాయకులకు స్వాతంత్య్రం ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్‌ స్థానిక నాయకులకు ప్రాధాన్యం ఇస్తూ ఉంటే బీజేపీ మునుపు కాంగ్రెస్‌ అనుసరించిన అధిష్ఠాన సంప్రదాయాన్ని అనుసరిస్తోంది. మోదీ మాటే చెల్లుతుంది. లేదా ఆయన మాట చెల్లేట్టు చూడడానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఉండనే ఉన్నారు. వీరిద్దరినీ దాటి ఏ స్థాయిలోనూ ఏ నిర్ణయమూ జరగదు. దీనికి మంచి ఉదాహరణ మోదీ ఇటీవలే మధ్యప్రదేశ్‌ ఓటర్లకు ఒక బహిరంగ లేఖ రాసి 2014, 2019లో లాగే తన ముఖం చూసి ఓటు వేయాలని అభ్యర్థించారు. మధ్యప్రదేశ్‌ లో తమ పీఠం కదులుతుందని గ్రహించినందువల్లే బీజేపీ ఏడుగురు లోకసభ సభ్యులను, ఒక బీజేపీ జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శిని శాసనసభ గోదాలో దింపింది. పోటీ చేస్తున్న లోకసభ సభ్యుల్లో ముగ్గురు కేంద్ర మంత్రులే. రాజస్థాన్‌ లో వసుంధరా రాజే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని బీజేపీ ప్రకటించక పోయినా బీజేపీ గెలిస్తే ఆమెను మించిన ప్రత్యామ్నాయం ఉండదు. కాంగ్రెస్‌ దృష్టితో చూస్తే గెహ్లోత్‌ కు సచిన్‌ పైలెట్‌ కు ఇటీవలి కాలం దాకా ఉప్పు-నిప్పు సంబంధాలే ఉన్నాయి. ఈ మధ్యే అధిష్ఠానం ఏదో సయోధ్య కుదిర్చినట్టుంది. అందుకే సచిన్‌ పైలెటు మౌనంగా ఉంటున్నారు.
ఏమైనా ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం బీజేపీ నాయకత్వంలోని ఎన్‌.డి.ఎ. మీద, కాంగ్రెస్‌ నాయకత్వంలోని ‘‘ఇండియా’’ కూటమి మీద 2024 ఎన్నికలలో కూడా ప్రతిఫలిస్తుంది. ‘‘ఇండియా’’ కూటమి అయిదు రాష్ట్రాలలో ప్రధానంగా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌ గఢ్‌లో ఎన్ని ఎక్కువ రాష్ట్రాలలో గెలిస్తే ఆ ఐక్యసంఘటన భవిష్యత్తు అంత జ్వాజ్వల్యమానంగా ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ కనక అత్తెసరు మెజారిటీతో గట్టెక్కితే మునుపటి ఎన్‌.డి.ఎ. భాగస్వాముల మద్దతు కోరవలసి వస్తుంది. రెండు పక్షాలు ప్రకటిస్తున్న సంక్షేమ పథకాల ప్రభావం కూడా గట్టిగానే ఉండొచ్చు. సంక్షేమ పథకాల పేరిట ప్రజలు పన్నుల ద్వారా చెల్లించిన సొమ్మును వివిధ పథకాల పేరుతో పందేరం చేయడం రేవడి (తాయిలాల) సంస్కృతి అని మోదీ ఎద్దేవా చేశారు. అయినా ఆ తాయిలాలు ప్రకటించకుండా ఉండడం ఏ పక్షానికీ కుదిరేట్టు లేదు. కాంగ్రెస్‌ సంక్షేమ పథకాల వాగ్దాలు చేస్తున్న దగ్గర నుంచి మోదీ ‘‘రేవడీల’’ మాట ఎత్తడమే మానేశారు. ఆఖరి ప్రయత్నంగా మధ్య ప్రదేశ్‌ లో బీజేపీ వాగ్దానాలు చేయడంలో పోటీ పడుతోంది. మహిళా ఓటర్ల సంఖ్య పెరుగుతోంది కనక వారు ఓటు చేసే తీరు కూడా నిర్ణాయకం అవుతుంది. ఈ ఎన్నికల ఫలితాల మీద బీజేపీకన్నా దాని మాతృ సంస్థ ఆర్‌.ఎస్‌.ఎస్‌.కే ఎక్కువ ఆసక్తి ఉంది. 2024 ఎన్నికలలో దేశవ్యాప్తంగా బీజేపీ విజయం సాధించడానికి అయిదు రాష్ట్రాల ఎన్నికలు ఆర్‌.ఎస్‌.ఎస్‌. దృష్టిలో చాలా ముఖ్యమైనవి. శాసనసభల ఎన్నికల మీద కంటే ఆర్‌.ఎస్‌.ఎస్‌. సార్వత్రిక ఎన్నికల మీదే ఎక్కువ శ్రద్ధ చూపుతోంది. ఒక వేళ మోదీ నాయకత్వంలోని బీజేపీ సార్వత్రిక ఎన్నికలలో ఓటమి పాలైతే ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఎందుకూ కొరకాకుండా పోతుంది. ఆ పై సంవత్సరం అంటే 2025లో ఆర్‌.ఎస్‌.ఎస్‌. శతవార్షికోత్సవం జరగాల్సి ఉంది. ఓటమి ఆ వార్షికోత్సవ సన్నాహాలను నీరు గార్చక తప్పదు. మోదీ, అమిత్‌ షా అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను తొలి గండంగా భావిస్తూ ఉండొచ్చు. కానీ 2024 ఎన్నికలు ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు చాలా కీలకం. అయిదు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీని గెలిపించడానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌. సర్వ శక్తులూ ఒడ్డక తప్పడం లేదు. 2024లో బీజేపీ ఓడిపోతే ఆర్‌.ఎస్‌.ఎస్‌. కుదేలవుతుంది. అందుకే ఈ ఎన్నికలు ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు సైతం జీవన్మరణ సమస్యే. మోదీ-షా చూపు శాసనసభ ఎన్నికల మీద ఉంటే ఆర్‌.ఎస్‌.ఎస్‌. లక్ష్యం 2024 ఎన్నికలలో విజయం సాధించడమే. పైగా మోదీ మీద ఉన్న భ్రమలు ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు క్రమగా తొలగిపోతున్నాయి. ప్రత్యామ్నాయ నాయకుడి కోసం ఆలోచనలు సాగుతున్నాయన్న వార్తలు తరచుగా వస్తున్నాయి. ఎన్నికల సమరాంగణంలో ఏదో ఒక పక్షం మాత్రమే గెలవవచ్చు. గెలిచిన పక్షం సంబరాలు చేసుకోవచ్చు. ప్రజల దృష్టితో, దేశ భవిష్యత్తు దృష్టితో చూస్తే మతతత్వ, విద్వేష రాజకీయాలు కొనసాగించే బీజేపీ ఓటమి అత్యవసరం. మూడోసారి మోదీ అధికారంలోకి వస్తే ఈ రెండు ఉపద్రవాలు మరింత విలయ నర్తనం చేస్తాయి. తక్షణావసరం ప్రజాస్వామ్య, రాంజ్యాగ, సెక్యులర్‌ తత్వం పరిరక్షణే. మన ఓటర్లకు ఈ తేడా గమనించే వివేకం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img