Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

వైరుధ్యాల మధ్యే ఐక్యత

ప్రతిపక్షాల ఐక్యత అన్న మాట ఎప్పుడూ అధికార పక్షాన్ని గద్దె దింపే లక్ష్యంతోనే మొదలవుతుంది. మోదీ  తొమ్మిదేళ్ల పాలన పుణ్యమా అని మళ్లీ ప్రతిపక్షాల ఐక్యత అన్న మాట గట్టిగా వినిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల నాయకులు, ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ప్రతిపక్ష ఐక్యత గురించే మాట్లాడుతున్నాయి. ఫ్రతిపక్ష ఐక్యతా యత్నాలు ఇంతకు ముందూ సాగాయి. కానీ అప్పుడు కాంగ్రెస్‌ ను గద్దె దించడానికి ప్రతిపక్షాలు ఐక్యం కావాలనుకుంటే ఇప్పుడు విద్వేష పూరిత రాజకీయాలతో వాతావరణాన్ని కలుషితం చేస్తున్న, రాజ్యాంగాన్ని విరూపం చేస్తున్న సంఫ్‌ు పరివార్‌ లో అంతర్భాగమైన బీజేపీకి ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒకప్పుడు ప్రతిపక్ష ఐక్యతలో ప్రస్తుతం కేంద్రంలొ అధికారంలో ఉన్న సంఫ్‌ు పరివార్‌ రాజకీయ అంగం భాగస్వామి అయితే ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రతిపక్ష ఐక్యతా యత్నాల్లో ప్రధాన భాగస్వామిగా ఉంది. ప్రాంతీయ పార్టీల నాయకులు, ఒకప్పుడు బీజేపీతో అంటకాగిన నాయకులు కూడా మారిన పరిస్థితుల కారణంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఐక్యం కావాలంటున్నాయి. ప్రతిపక్ష ఐక్యతా యత్నాలకు ఈ దేశంలో సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ నెల 23వ తేదీన బిహార్‌ రాజధాని పట్నాలో ప్రతిపక్షాల సమావేశం జరగ బోతోంది. స్వాతంత్య్రం వచ్చి రెండు దశాబ్దాలైనా గడవక ముందే మన దేశంలో ప్రతిపక్ష ఐక్యత అన్న మాట వినిపించింది. దీనికి ప్రధాన చోదక శక్తి సోషలిస్టు నాయకుడు డా. రాం మనోహర్‌ లోహియా. ఈ ప్రతిపక్ష ఐక్యతా ప్రయోగం 1967లో తొమ్మిది రాష్ట్రాలలో సాధ్యమంది. ఉత్తరాదిలోని తొమ్మిది రాష్ట్రాలలో సం యుక్త విధాయక్‌ దళ్‌ మంత్రివర్గాలు ఏర్పడ్డాయి. అప్పుడు ప్రతిపక్షాల ఐక్యతా లక్ష్యం కాంగ్రెస్‌ను గద్దె దించడం కనక సంయుక్త విధాయక్‌ దళ్‌ మంత్రివర్గాల్లో ప్రస్తుత బీజేపీకి పూర్వరూపమైన జనసంఫ్‌ు, భారత కమ్యూనిస్టు పార్టీ కూడా కలిసే పనిచేశాయి. అయితే సంయుక్త విధాయక్‌ దళ్‌ మంత్రివర్గాలు రెండున్నరేళ్లయినా కొనసాగలేదు. అంటే ప్రతిపక్షాల ఐక్యత నిలవలేదు. సైద్ధాంతిక విరోధాలు ప్రతిపక్ష ఐక్యత నిలవక పోవడానికి కారణం కాకపోవచ్చు. నిజానికి కాంగ్రెస్‌ వ్యతిరేకత తప్ప ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి అన్న ఆలోచన అప్పటికి లేదు. ఆ తరవాత 1975లో ఎమర్జెన్సీ విధించినందువల్ల ఇందిరా గాంధీ మీద విముఖత విపరీతంగా పెరిగింది. అప్పుడూ కాంగ్రెస్‌ ను గద్దె దించాలను కున్నారు. ఈ ఉద్యమానికి లోక్‌ నాయక్‌ జై ప్రకాశ్‌ నారాయణ్‌ మద్దతు ఉంది. ఆ ఉద్యమాన్నే సంపూర్ణ విప్లవం అనే వారు. అంత వరకు సంఫ్‌ు పరివార్‌ లో ప్రధాన భాగమైన భారతీయ జనసంఫ్‌ు రాజకీయంగా గొప్ప శక్తి కాదు. కానీ ఎమెర్జెన్సీకి బద్ధ వ్యతిరేకత, కాంగ్రెస్‌ ఏలుబడిలో జరుగు తోందంటున్న అవినీతి, దాన్ని వ్యతిరేకించాలన్న సంకల్పం ఉన్నందువల్లే భారతీయ జనసంఫ్‌ు కూడా కేంద్ర స్థానంలోకి వచ్చింది. ఆ దశలో జనతా మోర్చా, చరణ్‌ సింగ్‌ నాయకత్వంలోని భారతీయ లోక్‌దళ్‌, స్వతంత్ర పార్టీ రాజ నారాయణ్‌, జార్జ్‌ ఫెర్నాండెజ్‌ నాయకత్వంలోని సోషలిస్టు పార్టీ, భారతీయ జనసంఘ కలిసి 1977 జనవరి 23న జనతా పార్టీగా ఏర్పడ్డాయి. 1967లో ప్రతిపక్షాల కలయిక మాత్రమే ఉంది కానీ 1977లో అది ఒక ఉమ్మడి పార్టీ అవతరణకు దారి తీసింది. జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఎమర్జెన్సీ ఉద్యమ కాలంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. నిర్వహించిన పాత్ర, దానికి సంపూర్ణ విప్లవోద్యమ నాయకుడు లోక్‌ నాయక్‌ జయ ప్రకాశ్‌ నారాయణ్‌ ఆశీర్వాదం భారతీయ జనసంఫ్‌ు కు గౌరవ ప్రదమైన స్థానం కల్పించడానికి దోహదం చేశాయి. జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఎమర్జెన్సీ అనంతర పరిణామాలలోని విశేషం. కానీ జనతా పార్టీలో అంతర్భాగంగా ఉన్న మునుపటి భారతీయ జనసంఫ్‌ు నాయకులు నిజానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌. కుదురుకు చెందిన వారు కనక ద్వంద్వ సభ్యత్వం అన్న సమస్య ఎదురైంది. భారతీయ లోక్‌ దళ్‌ ప్రాభవం పరిమితం. సోషలిస్టు పార్టీ పరిస్థితీ అదే. ఎమర్జెన్సీ నేపథ్యంలో పెల్లుబికిన కాంగ్రెస్‌ వ్యతిరేకత అంతిమంగా భారతీయ జనసంఫ్‌ు కు గౌరవ స్థానం దక్కడానికి ఉపయోగపడిరది. కానీ జనతా పార్టీ ప్రయోగమూ నిలబడలేదు. రెండున్నరేళ్లలో జనతా ప్రభుత్వం పతనమైంది. 1980లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ మళ్లీ అపూర్వమైన మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. సంయుక్త విధాయక్‌దళ్‌ మంత్రివర్గాలలోనూ, జనతా పార్టీలోనూ జనసంఫ్‌ుకు ప్రాధాన్యం ఉండేది. జనతా పార్టీ పతనం తరవాత మునుపటి జనసంఫ్‌ులో ఉన్న వారు 1980లో భారతీయ జనతా పార్టీ అని కొత్త పార్టీ ప్రారంభించారు. 

ప్రతిపక్షాల ఐక్యతా రాగంలో బీజేపీ ఎక్కువ కాలం శ్రుతి కలప లేదు. 1989-90లో నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పడినప్పుడు, 1996-98 మధ్య యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు అందులో బీజేపీకి భాగస్వామ్యం లేదు. మతతత్వ శక్తులను దూరంగా ఉంచాలన్న ఆలోచన వల్ల బీజేపీని మినహాయించడం మొదలైంది. కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రతిపక్ష ఐక్యత అప్పటి ప్రతిపక్ష ఐక్యతలో ప్రధానాంశం. ప్రస్తుతం ప్రతిపక్షాల ఐక్యతలోనూ అంతర్వైరుధ్యాలు ఉన్నాయి. ప్రతిపక్షాల ఐక్యత కోసం కృషి చేస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్‌, భారత రాష్ట్ర సమితి (మునుపు టి.ఆర్‌.ఎస్‌.) నాయకులు కూడా కాంగ్రెస్‌తో కలిసి నడవడానికి విముఖంగా ఉన్నారు. కానీ ఈ రెండు పార్టీల నాయకులైన మమతా బెనర్జీ, చంద్రబాబునాయుడు కూడా ప్రతిపక్ష ఐక్యతారాగమే విని పిస్తున్నారు. పట్నా సమావేశానికి కె.సి.ఆర్‌., ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి హాజరు కావడం లేదు. కానీ మమతా బెనర్జీ, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ హాజరుకావడం విశేషం. బి.జె.డి.,బి.ఆర్‌.ఎస్‌., వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీలు పట్నా సమావేశానికి హాజరు కాకపోయినా ఈ పార్టీలు విస్తృతార్థంలో సెక్యులర్‌పార్టీలుగానే లెక్క. ఇటీవలే హిమాచల్‌లో, కర్నాటకలో బీజేపీని గద్దెదింపిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖడ్గే, సీనియర్‌ నాయకుడు రాహుల్‌గాంధీ హాజరుకావడం ప్రతిపక్ష ఐక్యతను మరో అడుగుముందుకు తీసుకెళ్లే అంశమే. కాంగ్రెస్‌ ఇటీవలికాలంలో తన సైద్ధాంతికపునాదిని వెతుక్కుం టోంది. ఫెడరలిజం, సెక్యులరిజం, ప్రజాస్వామ్యం, సమ్మిళిత రాజకీయం అన్న అంశాలకు కట్టుబడి ఉండే వారితో పని చేయడానికి కాంగ్రెస్‌ సుముఖంగా ఉంది. మోదీ పాలనవల్ల సరిగ్గా ఈ అంశాలకే విఘాతం కలిగింది కనక ఇది ప్రతిపక్షాలను ఐక్యం చేయడానికి ఉపకరిస్తుంది. ప్రతిపక్షాలు వేస్తున్న ప్రతి అడుగూ ఆచి తూచి వేస్తున్నట్టుగా, లక్ష్య సిద్ధి మీద ఏకాగ్రత ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక కావాల్సిందల్ల లక్ష్య శుద్ధే. ఈ ఐక్యతకు సైద్ధాంతిక సారూప్యత కుదరాలనుకోవడం అత్యాశ కావచ్చు కానీ కనీస ఉమ్మడి కార్యక్రమం మాత్రం అవసరం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img