Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

శరద్‌ పవార్‌ నిగూఢ రాజకీయాలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌ నాథ్‌ షిండే భవిష్యత్తు వచ్చే నెల 15వ తేదీలోగా తేలనున్న నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయాలలో కాకలుతీరిన యోధుడు, అద్భుతమైన వ్యూహకర్త, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌పార్టీ (ఎన్‌.సి.పి.) అధినేత శరద్‌ పవార్‌ ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్న తీరువల్ల ఆయన బీజేపీకి చేరువ అవుతున్నారేమో అన్న అనుమానం కలుగుతోంది. మరో వేపు శరద్‌ పవార్‌ అన్న కుమారుడు, మొన్నటి దాకా ఉద్ధవ్‌ ఠాక్రే మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అజిత్‌ పవార్‌ ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవాలన్న ఆతృతలో ఉన్నారు. ఇంకో వేపు ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ 2024 సార్వత్రిక ఎన్నికలలో కూడా ఏక్‌ నాథ్‌ షిండే నాయకత్వంలోనే పోటీ చేస్తాం అంటున్నారు. కానీ షిండే స్థానంలో ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రి కావచ్చునన్న వదంతులూ ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు కనక షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను అనర్హుల్ని చేస్తే ఎన్‌.సి.పి.ని చీల్చి అయినా అధికారం నిలబెట్టుకోవడానికి బీజేపీ ప్రయత్నించక మానదు. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు తీర్పు షిండే వర్గానికి వ్యతిరేకంగా వస్తుందేమోనన్న భావన కలగజేస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విచారణ క్రమంలో చేసే వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా తీర్పు ఉన్న సందర్భాలు కొల్లలుగా ఉన్నాయి. మహా రాష్ట్ర రాజకీయాలు సుదీర్ఘ కాలం ఠాక్రేల చుట్టే తిరిగాయి. ఒక ఏడాది నుంచి పవార్‌, ఆయన కూతురు సుప్రియా సూలే, సోదరుడి కుమారుడు అజిత్‌ పవార్‌ చక్రం తిప్పే స్థితిలోకి వచ్చారు. శరద్‌ పవార్‌ మదిలో ఏం ఉందో చెప్పడం ఎప్పుడైనా కష్టమే. శరద్‌ పవార్‌ తో పాటు అజిత్‌ పవార్‌ ఎప్పుడు ఏ ప్రకటన చేసినా అందులో రాజకీయ అర్థాలు చాలా నిగూఢంగా ఉంటాయి. 2019 నవంబర్‌లో అజిత్‌ పవార్‌ ఉన్నట్టుండి బీజేపీతో కలిసి గుట్టుచప్పుడు కాకుండా ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించేశారు. అప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ప్రభుత్వం నిలబడలేదు. ఆ సమయంలోనే శరద్‌ పవార్‌ తన చాణక్య నీతిని అంతా ప్రయోగించి ఎన్‌.సి.పి.తో పాటు ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వంలోని శివసేన, కాంగ్రెస్‌ను కలిపి మహా వికాస్‌ అఘాధీ ఏర్పాటుచేసి రాష్ట్రపతి పాలన విధించకుండా అడ్డుకోగలిగారు. ఈ ప్రభుత్వం దాదాపు మూడున్నరేళ్లు బాగానే సాగింది. కానీ ఏక్‌నాథ్‌ షిండే శివసేనను చీల్చి, ఆ పార్టీకి చెందిన నలభై మంది శాసనసభ్యుల మద్దతు సంపాదించి, బీజేపీకి 105 మంది సభ్యులు ఉన్నప్పటికీ బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయిపోయారు. ఈ చీలికను నివారించడం శరద్‌ పవార్‌కు సాధ్యం కాలేదు. మహా వికాస్‌ అఘాధీ ఏర్పాటులో కీలకపాత్ర శరద్‌పవార్‌దే అయినా చాలా సందర్భాలలో ఆయన చేసే వ్యాఖ్యలు ఆ కూటమికి విరుద్ధంగానూ, అంతుపట్టకుండాను మిగిలిపోతున్నాయి. రాజకీయంగా సంకట స్థితి ఉన్నప్పుడల్లా అజిత్‌ పవార్‌ మాయమై పోతారంటారు. గత వారం కూడా ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. దీనితో ఆయన బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి కావడానికి ఉబలాట పడ్తున్నారన్న వాదన బయలు దేరింది. కానీ 2019లో అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించినప్పుడు గానీ, ఇప్పుడు గానీ శరద్‌ పవార్‌ ఆయన మీద ఏ చర్యా తీసుకోక పోవడంలోనూ ఏదో అంతరార్థం ఉండే ఉంటుంది. ఎన్‌.సి.పి. ఎమ్మెల్యేలలో అజిత్‌ పవార్‌కు మంచి పట్టే ఉందంటారు. అయితే అది శరద్‌పవార్‌కు ఉన్న ఆధిపత్యాన్ని మించింది కాదని పదే పదే రుజువు అవుతోంది. ఒకవేళ షిండే వర్గానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడినా అధికారం వదులుకోవడానికి 105 మంది సభ్యులున్న బీజేపీ ఎటూ సిద్ధపడదు కనక అజిత్‌పవార్‌ను చేరాదీయాలని చూస్తోందంటున్నారు. ఎమ్మెల్యేలను కొనడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య కనక ఏదీ అసాధ్యం కాకపోవచ్చు.
శరద్‌ పవార్‌ అధికారంలో లేక దాదాపు పదేళ్లు అవుతోంది. అయినా ఎన్‌.సి.పి. మీద ఆయన పట్టు ఏ మాత్రం సడలలేదు. బీజేపీ ఎన్‌.సి.పి. ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి వీలు లేకుండా ఉండేలా చూడడానికే ఈ మధ్య కాలంలో శరద్‌ పవార్‌ బీజేపీకి అనుకూలంగా మాట్లాడు తున్నట్టున్నారు. జాతీయ రాజకీయాల దృష్టితో చూస్తే శరద్‌ పవార్‌ శక్తిమంతమైన ప్రతిపక్ష నాయకుడే. కానీ బీజేపీనుంచి తన పార్టీకి ముప్పు తప్పించడానికే ఆయన బీజేపీ చెవికి ఇంపైన రీతిలో మాట్లాడుతున్నారు. అందుకే అదానీ విషయంలో మెతక ధోరణి అనుసరించడంతో పాటు, ఈ విషయం నిగ్గు తేల్చడానికి సం యుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయడం దండగ అన్నారు. అలాగే ప్రధానమంత్రి మోదీ విద్యార్హతల గురించిన చర్చ కూడా నిరుపయోగమైందని తేల్చేశారు.
రాజకీయాలలో గాలి ఎటు వీస్తోందో పసిగట్టడంలో శరద్‌ పవార్‌ అగ్రగణ్యుడు. పవార్‌ ఆచరాణాత్మక రాజకీయ నాయకుడు. అజిత్‌ పవార్‌ వేసే పిల్లిమొగ్గలను కూడా తనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆయన దిట్ట. ముఖ్యమంత్రి కావడంతో పాటు పార్టీ మీద పట్టు సాధించాలన్న ఆలోచన అజిత్‌ పవార్‌ కు ఉందన్న విషయం శరద్‌ పవార్‌ కు తెలియక కాదు. అన్నింటికన్నా మించి పదవి కోల్పోయినా శివసేన మీద ఆధిపత్యం ఇప్పటికీ ఉద్ధవ్‌ ఠాక్రేదేనన్న విషయం ఎన్‌.సి.పి. అధినేతకు తెలుసు. షిండే తిరుగుబాటు కారణంగా శివసేన చీలిపోయినా శివసేన నాయకుడంటే ఇప్పటికీ ప్రజల దృష్టిలో ఉద్ధవ్‌ ఠాక్రేనే. ఒక వేళ సుప్రీంకోర్టు తీర్పు షిండేకు వ్యతిరేకంగా ఉంటే మళ్లీ మహా వికాస్‌ అఘాధీకి పగ్గాలు అప్పగించే సకల సామర్థ్యాలు శరద్‌ పవార్‌ కు ఉన్నాయి. అప్పుడూ అజిత్‌ కు దక్కేది ఉపముఖ్యమంత్రి పదవే. రెండవ శ్రేణి నాయకుడిగా ఎన్నాళ్లు కొనసాగాలన్నది అజిత్‌ పవార్‌ బాధ. పైగా ఎన్‌.సి.పి. నాయకుల మీద కేంద్ర దర్యాప్తు సంస్థల కత్తి వేలాడుతూనే ఉంది. ఆ కత్తి మెడమీదికి రాకుండా డాలు సిద్ధంగా ఉంచుకోగలిగిన నేర్పు శరద్‌ పవార్‌ సొంతం. ఈ కత్తి భయమే అజిత్‌ పవార్‌కు అధికారం లేకపోతే ఎలా అన్న ఆందోళన కలిగిస్తూ ఉన్నట్టుంది. ఆయన పునీతుడు కావాలంటే బీజేపీతో చేయి కలపాల్సిందే. కానీ శరద్‌పవార్‌ ఆలోచన అంతకన్నా అనేక యోజనాల ముందు ఉండే ఉంటుంది. ఉద్ధవ్‌ ఠాక్రేకు జనం మద్దతు ఎంత ఉన్నప్పటికీ ఆయన క్షతగాత్రుడే. 2024 ఎన్నికలలో మహా వికాస్‌ అఘాధీ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి ఎన్‌.సి.పి.కే దక్కాలని శరద్‌ పవార్‌ బేరం పెట్టకుండా ఉండరు కదా. అజిత్‌ పవార్‌కు అంత ఓపిక లేకపోవడమే తంటా.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img