నెలకు పై నుంచి కొనసాగుతున్న ఇజ్రాయిలీ దాడిలో ఉత్తర గాజా శవాలు గుట్టలుగా, బాంబులవల్ల శిథిలమైన మట్టి దిబ్బలుగా మారిపోయింది. అనేక మంది ఇప్పటికే ఉత్తర గాజా వదిలి దక్షిణ గాజాకు వెళ్లిపోయారు. తాజాగా రెండు లక్షల మంది దక్షిణా గాజా వెళ్లారని యుద్ధ నివారణ బాధ్యత నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైన ఐక్యరాజ్యసమితి చెప్తోంది. చినుకుకు చినుకుకు మధ్య నుంచి వెళ్తూ తడవకుండా వెళ్లాలని ప్రయత్నించే వారి లాగా బాంబులు, తుపాకులమోత మధ్య ఏదో ఓ రకంగా దక్షిణా గాజావేపు వెళ్లడానికి నానాయాతన పడ్తున్నారు. అయినా పలస్తీనియన్లు ఇజ్రాయిలీ సేనలతో పోరాడుతూనే ఉన్నారు. హమాస్ కార్యకర్తలు ఆసుపత్రులలో శరణుపొందారని వాదిస్తున్న ఇజ్రాయిల్ చివరకు ఆసుపత్రులను కూడా వదలకుండా బాంబులు ప్రయోగిస్తూనే ఉంది. ఆ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులు, బాలింతలు, నవజాత శిశువులు, వైద్య సిబ్బంది చిక్కుకుపోయి ఉన్నారు. గాజాకు విద్యుత్ సరఫరా లేకుండాచేసి వారాలు గడుస్తోంది. అయినా వైద్యులు గుడ్డి వెలుతురులోనే రోగుల ప్రాణాలు కాపాడడానికి నిర్విరామంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆసుపత్రులకు మందులు, భోజన పదార్థాలు, కడకు మంచినీళ్లు అందడం కూడా దుర్లభమైపోయింది. మత్తుమందు కూడా కరువైన సమయంలో వైద్యులు రోగులకు మత్తు ఇవ్వకుండానే శస్త్ర చికిత్సలు చేయవలసిన దుస్థితిలో చిక్కుకున్నారు. ఉత్తర గాజాలో ఒకే ఒక ఆసుపత్రి ఒ.సి.హెచ్.ఎ. అరకొర వసతులతో పనిచేస్తోంది. గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి షిఫాను కూడా ఇజ్రాయిలీ సాయుధ బలగాలు చుట్టుముట్టాయి. డజన్ల కొద్దీ రోగుల, శిశువుల ప్రాణాలకు పెద్ద ప్రమాదం ఎదురవుతోంది. ఈ ఆసుపత్రిలో ఉన్నవారిని రెడ్‌క్రాస్ పర్యవేక్షణలో ఖాళీ చేయించాలని హమాస్ అభ్యర్థిస్తోంది. విచక్షణా రహితంగా రోగులమీద, యుద్ధంతో సంబంధంలేని ప్రజలను ఊచకోతకోస్తున్న ఇజ్రాయిల్ యుద్ధ నేరాలకు పాల్పడుతుంటే అడిగే దిక్కే లేదు. ఎక్కడ చూసినా విధ్వంసమే కనిపిస్తోంది. షిఫా ఆసుపత్రిని హమాస్ సైనిక ప్రయోజనాలకు వినియోగిస్తోందని ఇజ్రాయిల్ వితండ వాదానికి దిగుతోంది. వందలాది మంది రోగులు, వైద్యులు గత ఆరు వారాలుగా ఆ ఆసుపత్రిలోనే చిక్కుకు పోయారు. శిథిలాలకింద పడి ఉన్న వారిలో తమ వారిని వెతుక్కోవడానికి పలస్తీనియన్లు పడ్తున్నపాట్లు హృదయ విదారకంగా ఉన్నాయి. ఇప్పటికే పదిహేను లక్షల మంది అంటే గాజా జనాభాలో మూడిరట రెండువంతుల మంది ఉత్తర గాజా వదిలి వెళ్లినట్టు అంచనా. తమ దాడులు మిలిటెంట్ల మీదేనని ఇజ్రాయిల్ బుకాయిస్తున్నా అనేకమంది మహిళలు, పిల్లలు ఈ దాడుల్లో ప్రాణాలు వదులుతూనే ఉన్నారు. గాజాలో పలస్తీనియన్లు లేకుండా చేయడమే ఇజ్రాయిల్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇజ్రాయిల్ పొరుగున ఉన్న దేశాలైన జోర్డాన్, ఈజిప్టులో శరణు పొందాలనుకునే వారిని ఆ దేశాలు అనుమతించడంలేదు. ఈ యుద్ధ సమయంలో జోర్డాన్, లెబెనాన్, ఇరాన్ తప్ప ఆ ప్రాంతంలోని ముస్లిం దేశాలన్నీ అమెరికాకు తాబేదార్లుగా వ్యవహరిస్తున్నాయి. గాజా దక్షిణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన శరణార్థుల శిబిరాలు కిక్కిరిసి ఉన్నాయి. 160 మందికి కలిసి ఒక మరుగుదొడ్డి మాత్రమే ఉందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చెప్పక్కర్లేదు.
గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి అయిన అల్ షిఫాలో 179 మృత దేహాలను ఆ ఆవరణలోనే మూకుమ్మడిగా పూడ్చేశారు. ఆసుపత్రికి ఇంధన సరఫరా లేనందువల్ల జాగ్రత్తగా చికిత్స చేయవలసిన (ఐ.సి.యు.) ఏడుగురు బాలలతోపాటు మరో 29 మందిని నిర్దాక్ష్షిణ్యంగా మూకుమ్మడిగా పూడ్చి పెట్టవలసి వచ్చింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచే ఇజ్రాయిల్ గాజాకు విద్యుత్తు, మంచి నీటి సరఫరా లేకుండా చేసింది. ఇజ్రాయిల్‌ను సమర్థిస్తున్న అమెరికాకు, ఇతర పశ్చిమ దేశాలకు ఇవి యుద్ధ నేరాలుగా కనిపించడంలేదు. ఈ దేశాలు నరహంతకులకు మద్దతిస్తున్న సమయంలో ఇలాంటి మానవతా చర్యలను ఆశించడం దండగ. కుళ్లిన శవాల కంపు అల్ షిఫా ఆసుపత్రి అంతా నిండిపోయింది. విద్యుత్తు, నీరు, ఆహారం లేని అమానవీయ పరిస్థితుల్లో వైద్యులు రోగుల, క్షతగాత్రుల ప్రాణాలు కాపాడలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు. ఈ ఆసుపత్రి నేలమాళిగలో దాగి ఉన్న హమాస్ కార్యకర్తలు అక్కడి నుంచి సొరంగాలు నిర్మించుకున్నారని ఇజ్రాయిల్ వాదిస్తోంది. ఆసుపత్రి చుట్టూ ఎక్కడ చూసినా సాయుధులైన ఇజ్రాయిలీ సేనలే తారసపడ్తున్నాయి. హమాస్ ప్రధాన కేంద్రమే ఈ ఆసుపత్రి నేలమాళిగలో ఉందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. గత వారం ఇజ్రాయిలీ సైనిక దళాలు, శతఘ్నులు ఆసుపత్రి చుట్టూ మోహరించినందువల్ల ఆ ఆసుపత్రికి 72 గంటలపాటు బయటి ప్రపంచంతో సంబంధాలే లేకుండాపోయాయి. గాజాలో రెండవ పెద్ద ఆసుపత్రి అయిన అల్ ఖుద్స్‌కు వారంరోజుల పాటు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అంతర్జాతీయ మానవతావాద చట్టం ప్రకారం యుద్ధ సమయంలో రెండు పక్షాల వారు ఆసుపత్రులను, వైద్య సిబ్బందిని కాపాడాలి. కానీ మానవత్వం ఊసేలేని నెతన్యాహూ నాయకత్వంలోని ఇజ్రాయిల్ ఈ నియమాలను పాటిస్తుందనుకోవడం భ్రమ. ఐక్యరాజ్య సమితి ఇలాంటి నియమాలను గుర్తుచేస్తూ ధర్మ పన్నాగాలు వల్లిస్తోంది తప్ప కిరాతకమైన దాడులని నిరోధించే పనిమాత్రం చేయడంలేదు. ప్రమాదకర ప్రాంతాలనుంచి బాలలను తరలిస్తామని ఇచ్చిన హామీని ఇజ్రాయిల్ నిలబెట్టుకోనేలేదు. నెలలు నిండక ముందు జన్మించిన బాలలను కాపాడడానికి విద్యుత్ సరఫరా లేనందువల్ల ఇంక్యుబేటర్లు పని చేయడంలేదు. వారిని వెచ్చగా ఉంచడంకోసం విధిలేక అట్ట పెట్టెలు వాడవలసి వస్తోంది. జనరేటర్లు పని చేయడానికి ఇంధనమూ అందడంలేదు. ఇజ్రాయిల్ ఇంతటి మారణ హోమానికి పాల్పడుతున్నా పశ్చిమ దేశాలు కనీసం సానుభూతి కూడా వ్యక్తంచేయడం లేదు. నెమ్మది నెమ్మదిగా ఇప్పుడే వివిధ దేశాలు ఇజ్రాయిల్‌ను అన్యాపదేశంగా ఖండిరచడం మొదలు పెట్టాయి. ఈ ఒత్తిడి కారణంగా ఇజ్రాయిల్ చాలా ‘‘దయార్ద్ర’’ హృదయంతో పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి వీలుగా రోజూ కొద్దిసేపు యుద్ధ విరామం పాటిస్తామంటోంది. అయితే హమాస్ వద్ద బందీలుగా ఉన్న వారినందరినీ విడుదల చేయాలన్న షరతు విధిస్తోంది. అనేక యుద్ధాలు జరిగినా ఇంత కిరాతకమైన దాడులు మునుపెన్నడూ జరిగిన దాఖలాలు లేవు. అమెరికా అండ ఉన్న ఇజ్రాయిల్ లాంటి దేశాలు అసత్య ప్రచారం ఆసరాగానే దాడులు కొనసాగిస్తాయి. సద్దాం హుసేన్ ఇరాక్‌లో అధికారంలో ఉన్నప్పుడు అమెరికా సరిగ్గా ఇలాంటి అసత్య ప్రచారమే చేసింది. ఇరాక్ దగ్గర రసాయనిక ఆయుధాలు, భారీఎత్తున మానవ విధ్వంసక ఆయుధాలు ఉన్నాయని ప్రచారం చేసింది. ఐక్యరాజ్యసమితి మూడుసార్లు ఇరాక్‌లో సోదాలు జరిపినా ఇలాంటి ఆయుధాల జాడే దొరకలేదు. హమాస్‌ను అంతమొందించాలన్న లక్ష్యంతో మొదలైన ఇజ్రాయిల్ దాడికి కూడా అబద్ధాలే ఆసరాగా ఉన్నాయి.