Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

సంక్షోభంలో ఇజ్రాయిల్‌

పలస్తీనియన్లను పూర్తిగా తుడిచి పెట్టడానికి సుప్రీంకోర్టును సంస్కరించాలన్న ఇజ్రాయిల్‌ మితవాద ప్రధాన మంత్రి నెతన్యాహూ ప్రయత్నాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆదివారం ఇజ్రాయిల్‌ అంతటా తీవ్ర నిరసన ప్రదర్శనలు జరిగాయి. దీనివల్ల దేశప్రజల్లో చీలికలు వస్తాయి కనక సుప్రీం కోర్టును సంస్కరించాలన్న ప్రతిపాదనను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నానని నెతన్యాహూ ప్రకటించారు. ఇజ్రాయిల్‌లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసమే జనం నిరసనకు దిగారు. అయితే ఇజ్రాయిల్‌ ఇప్పటికీ ప్రజాస్వామ్య దేశం అని నమ్మేవారు ఎక్కువగానే ఉన్నారు. ఇజ్రాయిల్‌లో ఉన్న పలస్తీన పౌరుల విషయంలో వివక్ష దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. పలస్తీనియన్ల భూభాగాన్ని ఇజ్రాయిల్‌ ఆక్రమించింది. గాజా నది పశ్చిమతీరంలో, తూర్పు జెరూ సలెంలో పలస్తీనియన్ల అణచివేత కొనసాగుతూనే ఉంది. పలస్తీనియన్ల ఉనికి దేశ జనాభా స్వరూపాన్ని మార్చివేస్తుంది అన్న విషప్రచారం మొదటి నుంచీ ఉంది. నెతన్యాహూ తలపెట్టిన సంస్కరణలకు వ్యతిరేకంగా దేశంలోకెల్లా పెద్ద కార్మికసంఘం ఈ నిరసన ప్రదర్శనలకు పిలుపు ఇచ్చింది. ఆదివారం ఇజ్రాయిల్‌ అంతటా సంపూర్ణమైన బంద్‌ జరిగింది. దుకాణాలు, బ్యాంకులే కాకుండా చివరకు ఆసుపత్రులు కూడా మూతపడ్డాయి. నెతన్యాహూ తలపెట్టిన సంస్కరణల ప్రధాన ఉద్దేశం న్యాయమూర్తులను నియమించే కమిటీపై పూర్తి ఆధిపత్యం సంపాదించడమే. ఈ విషయంలో మన దేశంలోని పరిస్థితికి ఇజ్రాయిల్‌లో స్థితిగతులకు సామ్యం కనిపిస్తోంది. నెతన్యాహూ అనుకున్న సంస్కరణలు కనక అమలులోకి వస్తే సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఖాతరు చేయకుండా ఉండొచ్చు. ప్రధానమంత్రి ఆ పదవికి అర్హుడు కాడనీ నిర్ధారించడానికి వీలుండదు. అలాగే ప్రధానమంత్రిని పదవీచ్యుతుణ్ని చేయడం కూడా సాధ్యంకాదు. ఈ సంస్కరణల అంతరార్థం ఏమిటంటే తన మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై సుప్రీం కోర్టు విచారణ జరపకుండా అడ్డుకోవడమే. నెతన్యాహూ మీద లంచ గొండితనం, మోసం, విశ్వాస ఘాతుకం లాంటి ఆరోపణలు ఉన్నాయి. తాను ఏ తప్పూ చేయలేదనీ తనను అనవసరంగా వేటాడుతున్నారని నెతన్యాహూ అందరు నియంతల్లాగే వాదిస్తున్నారు. నెతన్యాహూ మదిలో ఉన్న సంస్కరణలను శక్తిమంతమైన సైన్యంలోని కొన్ని వర్గాలతో పాటు సమాజంలోని అన్నివర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ సంస్కరణల ప్రతిపాదనను నెతన్యాహూ గత జనవరి నాలుగో తేదీన చేశారు. ముందుగా అనుకున్నట్టయితే ఈ ప్రక్రియ ఏప్రిల్‌ నాటికి పూర్తి కావాలి. సంస్కరణల ప్రతిపాదన వాయిదా వేయడంవల్ల నెతన్యాహూకు దక్కేదల్లా సంస్కరణల అమలును కాలయాపన చేయడమే. సంస్కరణల వల్ల ఏ సమస్యా పరిష్కారం కాకపోగా నెతన్యాహూ పట్టు మరింత బిగుస్తుంది. వాయిదా వేయడం కాదు ఈ ప్రతిపాదనే మానుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సంస్కరణలను వ్యతిరేకించిన రక్షణ మంత్రిని నెతన్యాహూ బర్తరఫ్‌ చేయడంకూడా పరిస్థితి సంక్షోభదశకు వెళ్లడానికి కారణం. అయితే నెతన్యాహు ప్రతిపాదనను సమర్థించే వారు కూడా ప్రదర్శనలకు దిగారు. ఇజ్రాయిల్‌ పార్లమెంటు నెసెట్‌ వద్ద కూడా రెండుపక్షాల ప్రదర్శనలు కొనసాగాయి. పోలీసులు రెండు పక్షాలను విడదీయవలసి వచ్చింది. సుప్రీంకోర్టుకు కళ్లెం వేయాలన్న ప్రయత్నాలను ఇజ్రాయిల్‌ అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్‌ కూడా వ్యతిరేకించారు. నెతన్యాహూ కనక సంప్రదింపులకు సిద్ధపడితే ఈ సమస్య ఓ కొలిక్కి రావచ్చు. కానీ అది ఆయన తత్వం కాదు.
నెతన్యాహూ ప్రతిపాదన ప్రకారం సుప్రీంకోర్టు తీర్పులను తిరగ తోడడానికి సాధారణ మెజారిటీ ఉంటే చాలు. ఇజ్రాయిల్‌ పార్లమెంటులో 120 మంది సభ్యులు ఉంటారు. అంటే 61 మంది సభ్యులు సమర్థిస్తే సుప్రీంకోర్టు ఏ నిర్ణయాన్ని అయినా ఖాతరు చేయకుండా ఉండొచ్చు. నిజానికి ఈ సంస్కరణల ప్రతిపాదన నెతన్యాహూది కాదు. ఇజ్రాయిల్‌ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైన లికుడ్‌ పార్టీ నాయకుడు, న్యాయశాఖ మంత్రి యారివ్‌ లెవిన్‌ సంస్కరణలకు పట్టుబడుతున్నారు. పార్లమెంటులోని శాసన, న్యాయ కమిటీ అధ్యక్షుడైన మతభావాలు మెండుగా ఉన్న జియానిస్టు నాయకుడు ఎం.కె. సించా రోతం కూడా సంస్కరణలకోసం ఆతృత కనబరుస్తున్నారు. ఈ ఇద్దరు నాయకులకు సుప్రీంకోర్టు అంటే చాలా కాలం నుంచే గిట్టదు. శరణార్థులు అన్నా సరిపడదు. ఈ శరణార్థులలో తీవ్రమైన మతతత్వం ఉన్న మిర్జాహీ వర్గానికి చెందినవారు ఉన్నారు. ఇజ్రాయిల్‌లోని మితవాదులు 2005లో గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయిల్‌ వైదొలగాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈసడిస్తూనే ఉన్నారు. 2019 నుంచి ఇజ్రాయిల్‌లో అయిదు సార్లు ఎన్నికలు జరిగాయి. నాలుగు సార్లు జరిగిన ఎన్నికలలో ఏ పక్షానికీ మెజారిటీ రాలేదు. కానీ గత నవంబర్‌లో జరిగిన ఎన్నికలలో నెతన్యాహూ నాయకత్వంలోని లికుడ్‌ పార్టీకి మెజారిటీ సమకూరింది. ఆ తరవాతే ఇజ్రాయిల్‌ చరిత్రలో ఎన్నడూ లేనంతటి మితవాదప్రభుత్వం ఏర్పడిరది. గాజా నది పశ్చిమ తీరాన్ని సంపూర్ణంగా ఆక్రమించడం, స్వలింగ సంపర్కులకు హక్కులు కల్పించే అనుకూల చట్టాన్ని రద్దుచేయడం మొదలైనవి నెతన్యాహూ ఎజెండాలో ప్రధానాంశాలు. ఇజ్రాయిల్‌లో లాంఛనప్రాయమైన రాజ్యాంగం లేనందువల్ల రాజ్య వ్యవస్థలోని వివిధ అంగాల మధ్య సమతూకం కాపాడడానికి సుప్రీంకోర్టు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సంస్కరణలవల్ల ప్రజాస్వామ్య సూత్రాలు అంతరిస్తాయని, చట్టబద్ధ పాలన మాయమవుతుందన్న భయంవల్లే జనంలో వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంది. ఈ నిరసనోద్యమానికి నిర్దిష్ట నాయకుడంటూ ఎవరూ లేరు. సైన్యంలోని ఒక వర్గంతో పాటు సాంకేతిక రంగంలోని వారు కూడా నెతన్యాహూ ప్రయత్నాలకు విముఖంగా ఉన్నారు. ఇజ్రాయిల్‌కు మద్దతిచ్చే దేశాలు కూడా దేశం ఏ దారిలో వెళ్తుందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామరస్యం కుదర్చడానికి ఇజ్రాయిల్‌ అధ్యక్షుడు చేసిన ప్రయత్నం విఫలమైంది. రక్షణ మంత్రి యోవ్‌ గలాంట్‌ ను బర్తరఫ్‌ చేసినందుకు కూడా వ్యతిరేకత మరింత పెరిగింది. నెతన్యాహూ రాజీ పడడానికి సిద్ధంగా ఉన్నాడని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అత్యంత మితవాదుల ఒత్తిడి ఆయన మీద విపరీతంగా ఉన్నందువల్ల దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మితవాద పార్టీల మాట చెల్లకపోతే అవి ప్రభుత్వాన్ని పడదోసే అవకాశం కూడా ఉంది. అలా జరిగితే ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నెతన్యాహూ ప్రయత్నించినా చాలా ప్రతిపక్ష పార్టీలకు ఆయనమీద బొత్తిగా విశ్వాసం లేదు. అధికారపక్షం మంకుపట్టు పట్టి సంస్కరణలు తీసుకొస్తే ఇంతకు ముందు ఎన్నడూ లేని రాజ్యాంగ సంక్షోభం ఏర్పడవచ్చు. ఈ సంస్కరణలు అమలుచేస్తే వాటిని సుప్రీంకోర్టు ఏకమొత్తంగా కొట్టివేస్తే సంక్షోభం మరింత తీవ్రం కాక తప్పదు. ఈ సంస్కరణలే అమలులోకి వస్తే పలస్తీనియన్ల పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. ఇంకో వేపు ఇజ్రాయిల్‌ను వ్యతిరేకించే ఇరాన్‌ లాంటి దేశాలు ఈ పరిణామాలను ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి. ఇజ్రాయిల్‌ బలహీనపడడం కన్నా ఇరాన్‌ లాంటి దేశాలకు కావలసింది ఏమీ ఉండదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img