డిజిటల్ సదుపాయాలు కల్పించడంలో మన దేశం అభివృద్ధి చెందిన దేశాలకన్నా చాలా ముందుందని అవకాశం వచ్చినప్పుడల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుండెలు బాదుకుంటూ గొప్పలు చెప్పుకుంటారు. కోట్ల మంది బ్యాంకు ఖాతాలను అంతర్జాలంతో అనుసంధానం చేయడంవల్ల సామాన్య ప్రజలకు కూడా అంతర్జాలం ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించే అవకాశం వచ్చిందంటుంటారు. డిజిటల్ సదుపాయాలను అందరికీ అందుబాటులోకి తేవడంవల్ల ఈ సాంకేతిక సదుపాయం ఉన్న వారికి, లేని వారికి మధ్యన ఉన్న విభజన రేఖ క్రమంగా చెదిరిపోతోందని మోదీ ఘనంగా చెప్తుంటారు. ఆయన స్వోత్కర్షల నిజస్వరూపం తెలుసుకోవడానికి శుక్రవారం రోజే మూడు పరిణామాలు జరిగాయి. మొదటిది కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించే కేరళలోని వాయనాడ్ లో ఉన్న ఆయన కార్యాలయానికి ఇంటర్నెట్ సదుపాయంతో పాటు టెలిఫోన్ సదుపాయం కూడా లేకుండా చేశారు. రెండవది 105 దేశాలకు చెందిన 300 పై చిలుకు అంతర్జాతీయ సంస్థలు ఇంటర్నెట్ సదుపాయానికి చీటికీ మాటికీ ప్రభుత్వమే అంతరాయం కలిగిస్తోంది కనక ఈ విషయంలో ప్రభుత్వ విధానాలను పున:పరిశీలించాలని కోరాయి. మూడవది ప్రజలకు ఉండవలసిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడానికి సర్వాధికారాలను ప్రభుత్వమే గుప్పెట పెట్టుకుంటోందని భారత సంపాదక మండలి (ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా) విమర్శించింది. భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బి.ఎస్.ఎన్.ఎల్.)గురువారం సాయంత్రం వాయనాడ్‌లోని రాహుల్ గాంధీ కార్యాలయానికి ఇంటర్నెట్, టెలీఫోన్ సదుపాయాలు తొలగించింది. రాహుల్ గాంధీ లోకసభ సభ్యుడిగా అనర్హుడయ్యారు కనక ఈ సదుపాయాలు తొలగించామని బి.ఎస్.ఎన్.ఎల్. నిర్మొహమాటంగానే చెప్పింది. దిల్లీలోని బి.ఎస్.ఎన్.ఎల్. కార్యాలయం ఆదేశాల మేరకే ఈ పని చేశారట. రాహుల్ దొంగలందరి ఇంటిపేరు మోదీ అనే ఎందుకు ఉంటుంది అని 2019లో వ్యాఖ్యానించినందుకు సూరత్ లోని ఒక కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. రెండేళ్లు అంతకన్నా ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన వారికి చట్ట సభల సభ్యులుగా ఉండే అధికారం లేదు కనక ఆ మర్నాడే ఆయన లోకసభ సభ్యత్వం రద్దు చేశారు. కానీ సూరత్ సెషన్స్ కోర్టు ఆయనకు ఈ కేసులో బెయిలు మంజూరు చేసింది. అయినా ఆయన లోకసభ సభ్యత్వం మాత్రం పునరుద్ధరించలేదు. పైగా ఉన్న సదుపాయాలూ తొలగించారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 300 సంస్థలు ఇంటర్నెట్ సదుపాయాలు నిలిపివేయడానికి భారత్‌లో ఉన్న చట్టపరమైన నిబంధనలను పున:పరిశీలించాని కోరుతూ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశాయి. 2016వ సంవత్సరంలో భారత్‌లో ఇంటర్నెట్ సదుపాయాలకు కత్తెర వేసిన సందర్భాలను లెక్క కడ్తే ప్రపంచంలో ఇలా ఈ సదుపాయం తొలగించిన ఉదంతాలలో 58 శాతం ఉన్నాయి. ఇండియా పౌరహక్కుల నిఘా సంస్థ, అంతర్జాతీయ, అంతర్జాల స్వేచ్ఛ ఫౌండేషన్, పత్రికా స్వేచ్ఛ ఎలా అమలవుతుందో నిఘా వేసి ఉంచే రిపోర్టర్స్ వితవుట్ బార్డర్స్ లాంటి అనేక మానవ హక్కుల సంఘాలు ఇంటర్నెట్ సదుపాయాలను హరించడంపై ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. వివిధ కారణాలవల్ల ప్రభుత్వం ఇంటర్నెట్ సదుపాయాలకు కత్తెర వేయడంవల్ల కేవలం అంతర్జాలాన్ని వినియోగించుకునే వారికే కాక డిజిటల్ వేదికలను పరోక్షంగా వినియోగించుకునే సామాన్యులు కూడా ఇబ్బందులు పడవలసి వస్తుంది. చాలామంది జీవనోపాధే ఈ రోజుల్లో ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉంది. డిజిటల్ రూపంలో ప్రభుత్వం అందజేసే సదుపాయాలు కూడా అందుబాటులో ఉండవు. భారత్‌లో ప్రాథమిక హక్కులను కాపాడడానికి ఇంటర్నెట్ సదుపాయం అత్యవసరమని కీప్ ఇట్ ఆన్ అనే ఈ 300 సంస్థలతో కూడిన బృందం అశ్వినీ వైష్ణవ్‌కు రాసిన లేఖలో తెలియజేసింది. 2022లోనే 84 సందర్భాలలో భారత ప్రభుత్వం ఇంటర్నెట్ సదుపాయాలను లాగేసింది. గత అయిదేళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ఉదంతాలను పరిశీలించి చూస్తే ఇంటర్నెట్‌ను హరించడంలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇంటర్నెట్ సదుపాయం లేకపోతే జనం తమ వాళ్లతో మాట్లాడలేరు. ఒక్కో సారి జీవనోపాధికే అవకాశం ఉండదు. విద్యార్థుల విద్యాభ్యాసానికి, చాలా సందర్భాలలో వైద్య సేవలకు కూడా అంతరాయం కలుగుతుంది.
ఇంటర్నెట్ సదుపాయం లేకుండా చేస్తే అపారమైన నష్టం కలుగుతుందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషనర్ ఇదివరకే వ్యాఖ్యానించారు. ఇంటర్నెట్ సదుపాయం లేకుండా పోయినందువల్ల 2022లో భారత్‌కు 184.3 మిలియన్ డాలర్ల మేర ఆర్థికనష్టం కల్గిందని ఒక అంచనా. దీనివల్ల 12,07,43,890 మంది ఇబ్బంది పడ్డారు. చిన్నా పెద్దా వ్యాపారులు కూడా నష్టపోయారు. 2021లో ఇదే కారణం వల్ల 583 మిలియన్ డాలర్ల మేర నష్టం కలిగింది. 2018లో అయితే ఇంటర్నెట్ సదుపాయం లేకుండా చేసినందువల్ల స్థూల జాతీయ ఉత్పత్తి (జి.డి.పి.)లో 0.8 శాతం కొరత ఏర్పడిరది. ఏదో ఉపాధి ఉన్న వారికి కలిగే నష్టంతో పాటు నిరుద్యోగులకూ ఇంటర్నెట్ లేనందువల్ల నష్టం కలుగుతుంది. అవ్యవస్థీకృత రంగంలో కలిగే నష్టాన్ని ఎటూ పూర్తిగా అంచనా వేయలేం. పెట్టుబడి పెట్టే వారికి, వినియోగదారులకూ నష్టం తప్పదు. ఇంటర్నెట్ సదుపాయం లేకుండా చేయడానికి అనుసరించే విధానాలకు బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు అనేకమార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తప్పనిసరి అయితే, విధి లేనప్పుడు తప్పితే ఇంటర్నెట్ సహా సకల రకాల టెలీకమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం కలిగించ కూడదని కూడా అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించింది. ఒక హైకోర్టు అయితే తొలగించిన ఇంటర్నెట్ సదుపాయాన్ని పునరుద్ధరించాలని ఆదేశించింది. ఈ సదుపాయం జీవనాడి లాంటిది కనక అది లేకుండా చేయడానికి ఉన్న నిబంధనలు లోపభూయిష్టంగా ఉన్నాయని కమ్యూనికేషన్ మంత్రిత్వశాఖకు అనుబంధంగా ఉన్న పార్లమెంటరీ స్థాయీసంఘం 2021 డిసెంబర్‌లో తెలియజేసింది. ఈ సంఘం ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి దాదాపు 12 సిఫార్సులు చేసింది. కానీ ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు. స్థాయీసంఘం సూచనల మీద ఏం చర్య తీసుకున్నారో తెలియజేసే నివేదికపైనా ఈ సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం సర్వాధికారాలను తన గుప్పిట్లోనే ఉంచుకోవడంవల్ల పత్రికా స్వేచ్ఛకు తీవ్ర ఆటంకం కలుగుతోందని భారత సంపాదకుల మండలి అభిప్రాయపడిరది. నూతన సమాచార సాంకేతికత నిబంధనలకు చేసిన సవరణలు, సర్వాధికారాలను ప్రభుత్వానికి దఖలు పరిచేలా ఉన్నాయి. వార్తల్లో నిజమైనవి ఏమిటో, బూటకపు వార్తలు ఏమిటో తేల్చే బాధ్యత ప్రభుత్వమే చేపట్టడంకన్నా పత్రికా స్వేచ్ఛకు పెద్ద విఘాతం ఏమీ ఉండదు. వాస్తవం ఏమిటో, బూటకం ఏమిటో తేల్చడానికి ప్రభుత్వానికి ఉన్న కొలమానాలు ఏమిటో అంతుపట్టదు. దీని మీద న్యాయ పర్యవేక్షణ కూడా లేదు.