Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

సముద్ర తీరంలో ఎర్ర బావుటా రెపరెపలు

వ్యవస్థాపరంగా కోస్తా ఆంధ్ర ప్రాంతంలోనే కమ్యూనిస్టు పార్టీ ముందు రూపు దిద్దుకుంది. దీనికి జాతీయ ఉద్యమ నేపథ్యం ఉంది. కాంగ్రెస్‌లో అంతర్భాగంగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న వారిలో పురోగమన భావాలుగల వారు, సోషలిస్టు సిద్ధాంతాన్ని అభిమానించే వారు కమ్యూనిస్టు పార్టీలో చేరారు. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు లాంటి దిగ్దంతలు సర్కారు జిల్లాల్లో కమ్యూనిస్టు పార్టీకి బలమైన పునాదులు వేశారు. తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మొదట కామ్రేడ్స్‌ అసోసియేషన్‌, ఆంధ్ర మహాసభ నాయకత్వంలో సాయుధ పోరాటంలో పాల్గొన్న వారు క్రమంగా ఆ పోరాట క్రమంలోనే కమ్యూనిస్టు పార్టీ వేపు ఆకర్షితులయ్యారు. ఈ పోరాట ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేసిన చండ్రరాజేశ్వరరావు లాంటి వారు ఆంధ్రమహాసభకు హాజరయ్యారు. అది ఇక్కడి వామపక్ష భావాలుగల వారికి ఉత్తేజం కలిగించింది. స్వాతంత్య్రోద్యమంతో పాటు తెలుగు వారి సంస్కృతిని పరిరక్షించడం, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి బంధ విముక్తమై తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలన్న ఆకాంక్ష ఆ రోజుల్లో బలంగా ఉండేది. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా ఉన్న పిల్లలమర్రి వెంకటేశ్వర్లు శాసన సభలో చేసిన ఒంటరి పోరాటం చక్రవర్తుల రాజగోపాలాచారి ప్రభుత్వాన్ని గడగడ లాడిరచింది. మొత్తం మీద 1953లో ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. ఆ తరవాత కమ్యూనిస్టు పార్టీ నిజాం పరిపాలనలో ఉన్న తెలుగువారితో సహా తెలుగు మాట్లాడే వారందరూ ఐక్యం కావడానికి ఉద్యమించారు. విశాలాంధ్ర అన్న నినాదం కమ్యూనిస్టులు ఇచ్చిందే. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో కమ్యూనిస్టులు 1955లో ఆంధ్ర ప్రాంతంలో అధికారంలోకి వస్తారన్న భయం కాంగ్రెస్‌నే కాక పాలక పక్షాలకు ఊడిగంచేసే సాంస్కృతిక, కళారంగాలలోని వారిని కూడా హడలెత్తించింది. అందువల్ల 1955ఎన్నికలలో కమ్యూనిస్టులను ఓడిరచ డానికి రాజకీయ, సాంస్కృతిక రంగాలలోని వారు విచిత్రంగా వియ్యమంది ఒక్కుమ్మడిగా దాడిచేశారు. సాయుధ పోరాటం కారణంగా 1948 సెప్టెంబర్‌ 17న తెలంగాణా బంధవిముక్తమైంది. అధికారం కాంగ్రెస్‌ చేతుల్లోకి వెళ్లినా కమ్యూనిస్టులు గణనీయమైన విజయాలే సాధించారు. 1952 లో మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికలలో సీపీఐ సత్తా చాటింది. సాయుధ పోరాట సమర సేనాని రావి నారాయణరెడ్డి అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూకన్నా ఎక్కువ ఓట్లు సాధించి కమ్యూనిస్టుల సత్తా చాటారు. మరో వేపు పెండ్యాల రాఘవరావు ఒక పార్లమెంటు స్థానంతో పాటు రెండు అసెంబ్లీ సీట్లలో కూడా గెలిచి ప్రజా పోరాట ప్రభావం దశదిశలా చాటి చెప్పారు. 1956 లో ఆంధ్ర రాష్ట్ర అవతరణతో తెలుగు వారందరూ ఒకే రాజకీయ వ్యవస్థలో భాగంగా ఉండాలన్న దీర్ఘకాలిక స్వప్నం సాకారమైంది. 1952లో జైలులో ఉండగానే డా.రాజ్‌ బహదూర్‌గౌర్‌ రాజ్యసభకు ఎన్నికకావడం అపురూపమైన సందర్భం. ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తరవాత మరోసారి పోటీ చేయాలన్న పార్టీ నాయకత్వ సూచనను తిరస్కరించి రాజ్‌ బహదూర్‌గౌర్‌ తాను హైదరాబాద్‌ కమ్యూనిస్టు శాఖకు కార్యదర్శిగా ఉండడానికే ఇష్టపడ్డారు. ఇలాంటి ఉదంతాలు కమ్యూనిస్టులకు పదవీ వ్యామోహంలేదని నిరూపిస్తాయి. తెలంగాణాలో సాయుధ రైతాంగ పోరాటానికి దీటుగానే సర్కారు జిల్లాల్లోనూ కమ్యూనిస్టు పార్టీ చల్లపల్లి జమీందారు ఆగడాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటం చరిత్రాత్మకమైంది. కంబరిగాం పోరాటం కూడా నిరుపమానమైంది. ఇంతటి పోరాట చరిత్రకలిగిన కమ్యూనిస్టు పార్టీకి ఆ దశలో ప్రజల అండదండలు దండిగా అందాయి. చట్ట సభల్లో ప్రాతినిధ్యం రీత్యా చూస్తే ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీ బలహీనంగాఉన్నట్టు కనిపించవచ్చు. తెలుగుమాట్లాడే రెండు రాష్ట్రాలతో పాటు జాతీయస్థాయిలోనూ కమ్యూనిస్టులు బలహీనపడ్డట్టు కనిపిస్తూ ఉండవచ్చు. అయితే కమ్యూనిస్టుపార్టీల బలం కేవలం చట్ట సభల్లో సీట్లసంఖ్యమీద ఆధారపడి ఉండేదికాదు. ప్రజోద్యమాలను నిర్మించడంలో కమ్యూనిస్టు పార్టీ శక్తి సామర్థ్యాలు ఏమిటి అన్నదే ప్రధానం. ఆ దృష్టితోచూస్తే కమ్యూనిస్టుపార్టీ ప్రభావం విస్మరించడానికి వీలు లేనిదిగానే ఉంది.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం నుంచి మూడురోజులపాటు విశాఖ పట్నంలో ఆంధ్ర కమ్యూనిస్టు సమితి 27వ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విశాఖపట్నంలో ఎర్ర జెండాలు రెపరెపలాడు తున్నాయి. రాష్ట్ర మహాసభల కోసం జరుగుతున్న ఏర్పాట్లు ప్రజలను ఉత్సాహభరితం చేస్తున్నాయి. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో పరిశ్రమలు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఇప్పటికీ చాలానే ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో కార్మిక సంఘాలను నిర్మించడంలో అనేక మంది నాయకులు తమ సర్వస్వం ధార పోశారు. కార్మికోద్యమ ఛాయలు నేటికీ విశాఖ పట్నం ప్రాంతంలో బలంగా నిలిచి ఉండడానికి కారణం ఇదే. చట్ట సభల్లో ప్రాతినిధ్యంతో సంబంధం లేకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నది కచ్చితంగా వామపక్షాలే. అందులో సీపీఐ పాత్ర ఎన్నదగింది. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని నినదించి సాధించుకున్న ఆ కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడానికి మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు ప్రయత్నిస్తోంది. విశాఖలోని కార్మికవర్గం దాదాపు ఆరువందలరోజులుగా ఈ ప్రైవేటీకరణను ప్రతిఘటిస్తూనే ఉంది. అందుకే విశాఖలోనే కాక ఉత్తరాంధ్ర అంతటా సీపీఐ ప్రభావం స్పష్టంగానే కనిపిస్తోంది. అలాంటి చోట రాష్ట్ర మహాసభలు జరగడం ఆహ్వానించదగిన పరిణామం. ఇతర కోస్తా జిల్లాలలోనూ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి పాలక వర్గాల ప్రజా వ్యతిరేక ధోరణిని ప్రతిఘటించడానికి సీపీఐ శ్రేణులు నిరంతరం పోరాడుతూనే ఉన్నాయి. ప్రభుత్వం యథేచ్ఛగా వ్యవహరించి ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకోకుండా సీపీఐ చేసిన, చేస్తున్న పోరాటాలకు మన్ననలు అందు తున్నాయి. వనరుల లేమితో బాధపడ్తున్న ఉత్తరాంధ్ర, ప్రకృతి సహకారం లేని రాయల సీమ, అన్నీ ఉన్నా పాలకవర్గాల దుష్ట నీతివల్ల అందవలసిన ప్రయోజనాలు అందకుండా పోతున్న దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ, డెల్టా ప్రాంతాలలోనూ కమ్యూనిస్టు పార్టీ పోరుబాట పట్టకపోతే ప్రజలు మరెంత కష్టాలు పడవలసి వచ్చేదో. పాలక పక్షాల అవినీతికర విధానాలను, ఆశ్రిత పక్షపాతాన్ని, దుష్ట విధానాలను నిలవరించే శక్తి సీపీఐకి ఉందని అడుగడుగునా రుజువు అవుతూనే ఉంది. కేవలం రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారానికి పాటు పడడంతోనే కమ్యూనిస్టు పార్టీ సంతృప్తి పడడానికి అవకాశంలేదు.
మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత విద్వేష రాజకీయాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జనాన్ని మతాల వారీగా చీల్చడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా ప్రజల మధ్య సఖ్యతకు పూచీపడ్డ సెక్యులర్‌విధానాలు క్రమంగా మంటగలిసి పోతున్నాయి. మతతత్వ బీజేపీ తెలుగు మాట్లాడే రాష్ట్రాలలోనూ అధికారం సంపాదించాలని నానా యాతన పడుతోంది. అదే సాధ్యమైతే దశాబ్దాలుగా కొనసాగించిన పోరాట ఫలితాలు నట్టేట మునిగిపోతాయి. ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం కోసం నిత్యపోరాటం కొనసాగిస్తూనే మతతత్వాన్ని నిరోధించడానికి పాటుపడవలసిన బాధ్యత సీపీఐపైఉంది. ఈ మహాసభల్లో దానికి అనుగుణమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందుతుందని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img