Friday, August 19, 2022
Friday, August 19, 2022

సర్దుబాటురాక… సరిదిద్దుకోలేక…!

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ గాడితప్పింది. పాలన సరిగా లేకపోతే కాస్త సంక్షోభం నెలకొంటుంది…దాన్ని అటుఇటుగా సరిచేసుకోవచ్చు. అసలు పాలనే చేతకాకపోతే…సరిదిద్దేలెలా? ఏపీ పరిస్థితి చూస్తే ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న విన్యాసాలు విచిత్రంగా వున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చతికిలపడిరదని ఆర్థిక నిపుణుల అంచనా. ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా పథకాల నుంచి వేతనాల వరకు డబ్బులు సర్దుకోలేక, దారితప్పిన వ్యవస్థను సరిదిద్దుకోలేక నానా అవస్థలు పడుతున్నది. చివరకు ఏ ఖాతాలు దొరికితే..ఆ ఖాతాల నుంచి డబ్బులను లాగేసుకునే పనిలోపడిరది. ‘అవునా…ఖాతాలో డబ్బులు మాయమయ్యాయా? అదెలా?’ అని అధికారులు సైతం అవాక్కయ్యే పరిస్థితి దాపురించింది.
రాష్ట్ర ప్రభుత్వం డీఏ బకాయిలను జీపీఎఫ్‌ ఖాతాలకు జమ చేసినట్లే చేసి, వెనక్కి ఉపసంహరించుకోవడంతో ఒక్కసారిగా ఉద్యో గులు ఆందోళనలో పడ్డారు. జీపీఎఫ్‌ నిబంధనల ప్రకారం ఖాతాలో ఎవరు జమ చేసినా…విత్‌డ్రా చేసే అధికారం కచ్చితంగా ఉద్యోగికి మాత్రమే వుంటుంది. అలా రాష్ట్రంలో 90 వేల మంది ఉద్యోగుల ఖాతాల నుంచి రూ.800 కోట్ల వరకు డీఏ బకాయిలు మాయ మయ్యాయి. ఇది మామూలు విషయం కాదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సమ తుల్యతను ప్రశ్నిస్తున్నది. గతంలోనూ ఇలాగే జీపీఎఫ్‌ ఖాతాల్లో డబ్బులు గల్లంతయ్యాయి. కానీ కొద్ది రోజుల్లోనే ఆ సొమ్ములు ఆ ఖాతాల్లో తిరిగిపడ్డాయి. కొన్ని మాసాల క్రితం గ్రామ సర్పంచ్‌ల ఖాతాల్లోని డబ్బులు కూడా మాయమయ్యాయి. వారంతా లబోదిబోమన్నారు. చివరకు సమస్య సద్దుమణిగింది. రైతుభరోసా పథకం కింద 6 వేల రూపాయలను లబ్ధిదారునికి ఇవ్వాల్సి వుంటుంది. దాంట్లో మొదట్నించీ రూ.500 చొప్పున కోత విధించి ఇవ్వడం మొదలుపెట్టారు. తాజాగా అమ్మఒడి పథకంలో విద్యార్థి తల్లికి రూ.15000 జమ చేయాల్సి వుంటుంది. కానీ అందులో రూ.2 వేలు కోత విధించి ఇస్తున్నారు. సంక్షేమ పథకాలు పెట్టడం తప్పుకాదు. వాటి నిర్వహణకు సరైన ఆర్థిక విధానాన్ని అవలంబించడం గొప్ప విషయమవుతుంది. ఇతర పథకాల విషయంలోనూ దాదాపుగా ఇదే జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తన పంథాను మార్చుకోలేదా? అన్న ప్రశ్న తలెత్తిన ప్రతిసారీ…తమకు తెలిసినంత వరకూ అది సాధ్యం కాకపోవచ్చని ఆర్థిక విశ్లేషకులు నర్మగర్భంగా చెపుతూనే వున్నారు. ప్రభుత్వం అవలం బిస్తున్న అస్తవ్యస్థ విధానాల ఫలితమే ఇదని తేలింది.
ఇదేదో ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాలకు చెందిన సమస్య ఒక్కటే కాదు. కొన్ని రెవెన్యూ ఖాతాల్లో హఠాత్తుగా సొమ్ములు వచ్చి పడ్డాయని, అంత వరకు ఖర్చుచేసినట్లుగా చూపించి ఉన్నపళంగా మార్చిలో ఖర్చు చేయ లేదంటూ ఆ నిధులను చూపించారని ఇటీవల కాగ్‌ సైతం తప్పుబట్టింది. ఆర్థిక సంవత్సరమంతా ఒక లెక్క…ఆర్థిక సంవత్సరం ముగిసే సమయం వచ్చేసరికి ఇంకో లెక్క. జగన్‌ సర్కారు ఆర్థిక విన్యాస ప్రక్రియ కౌటిల్యునికి కూడా అవగతం కాకపోవచ్చు. గత మూడేళ్ళుగా ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఏటా ప్రభుత్వం తన అప్పును తక్కువ చేసి చూపించేందుకు, రెవెన్యూ లోటును, ద్రవ్యలోటుకు సంబంధించిన భారీ సంఖ్యలను కుదించి చూపించడానికి వైసీపీ ప్రభుత్వం ఆద్యంతం తాపత్రయపడుతోంది. పీడీ ఖాతాల మాయాజాలంలో భాగంగానే ఇదంతా జరుగుతోందన్న ఆరోపణ లేకపోలేదు.
ఒక సగటు జీవి తనకు వ్యక్తిగతంగా ఉన్న అప్పులను తక్కువగా చేసి చూపించుకోవడం వల్ల సమాజంలో డాంబికాలు తప్ప గొప్పగా పెరిగే హోదా ఏముంటుంది? రుణగ్రస్థుడను కాదని చెప్పడం వల్ల పెద్దగా ఒరిగే దేమీ లేదు. కాకపోతే అప్పుల్లేని వ్యక్తిగా బయటకు కన్పిస్తాడు కనుక ఇంకో వ్యక్తి కొత్తగా అప్పు ఇచ్చే అవకాశం కొంతశాతం మేరకు వుండవచ్చు. బహుశా ఈ ఆశతోనే అప్పులను తక్కువ చేసి చూపించడానికి జగన్‌ ప్రభుత్వం ఇటువంటి వ్యయప్రయాసలకోరుస్తున్నది. అప్పులతప్పును కప్పి పుచ్చడానికి ఇంకో తప్పు చేయాల్సి వస్తున్నది. ఇదే ‘ఖాతాల్లో నిధుల గల్లంతు’ కథనాల నేపథ్యకథా విశేషం. గల్లంతయిన డబ్బును సర్కారు తిన వచ్చు, తినకపోవచ్చు, వాడవచ్చు, వాడుకోకపోవచ్చు. ప్రతియేటా మార్చి నెలాఖరుకల్లా జనానికి చూపించే జమాఖర్చుల లెక్కల మాయాజాలంలో భాగంగానే ఇదంతా చేయవచ్చు. ఏదేమైనా, లోపభూయిష్టమైన ప్రభుత్వ ఆర్థిక నిర్వహణను ఇది ఎత్తిచూపుతోంది.
జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ ఖాతాలన్నీ ప్రభుత్వ అకౌంట్‌లో భాగంగానే పరిగణిస్తారు. ఈ మొత్తాలను ప్రభుత్వం వాడుకొని, ఉద్యోగులకు వడ్డీని చెల్లిస్తుంది. ఈ విధంగా ప్రభుత్వం వసూలు చేసే మొత్తాలతో పాటు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు తిరిగి చెల్లించిన మొత్తాల మధ్య వ్యత్యాసం కచ్చితంగా ప్రభుత్వ రుణంగా పరిగణనలోకి వస్తుంది. అందుకే కాగ్‌ ఈ మొత్తాలను ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసిన అప్పుగా జమ కడుతుంది. మార్చి నెలాఖరునాటికి పీడీ ఖాతాల్లో ఎంత మొత్తం నిల్వ వుంటే అదంతా ప్రభుత్వ అప్పుగానే పరిగణించాల్సి వుంటుంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి ప్రస్తుత ప్రభుత్వం ఖాతాల్లో నిల్వలను మాయం చేయడం, వాడుకున్న తర్వాత కొన్నాళ్లకు వాటిని జమ చేయడం వంటి చర్యలకు పూనుకుంటున్నది. ఎప్పటికప్పుడు సర్కారు చేసే ఈ విన్యాసాల వల్ల ఉద్యోగుల నెత్తి బొప్పికడు తోంది. దమ్ములేని ప్రభుత్వం దరిద్రానికి దారిచ్చినట్లయింది.
వైఎస్‌ఆర్‌సీపీ ‘నవరత్నాలు’తో అధికారంలోకి వచ్చిన తర్వాత ‘ఆల్‌ హ్యాపీస్‌’ అన్న చందంగానే ప్రభుత్వ తీరు నడి చింది. రోజులు గడిచేకొద్దీ సమస్యలు మొదలయ్యాయి. పథకాలతో లాక్కోలేక పీక్కోలేక నానా తంటాలు పడుతోంది. ఆఖరికి పథకాల లబ్ధిలో కోత లకు ఉపక్రమించింది. ఈ కన్నాలంటినీ కప్పడానికి ఇలా జీపీఎఫ్‌ ఖాతాల పైనా, సర్పంచ్‌ల ఖాతాలపైన విరుచుకు పడాల్సి వస్తున్నది. రాష్ట్రంలో నవ రత్నాలు తప్ప ఏ రంగమూ పరిపుష్ఠంగా కనబడటం లేదు. పారిశ్రామి కీకరణ ఆగిపోయింది. గతంలో కుదిరిన ఎంవోయూలకే కొత్తగా శంకు స్థాపనలు జరుగుతున్నాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు చితికిపోతు న్నాయి. గతమూడేళ్లుగా సంవత్సరానికి 10 శాతం వరకూ ఎంఎస్‌ ఎంఈలు మూతపడిపోతున్నాయి. అలాగని ప్రాతపదిక సౌకర్యాలకు వెచ్చించే నిధులూ ఏమి లేవు. ఏ ఒక్కరికీ ఉపశమనం కలిగించలేని ప్రస్తుత ఆర్థిక విధానాలను మార్చుకోకపోతే ఏపీ భవిత గల్లంతే!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img