Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

సామాజిక న్యాయానికి చెల్లు చీటీ?

ఆర్థికంగా బలహీనవర్గాలకు విద్యాసంస్థలలోనూ, ఉద్యోగా ల్లోనూ 10 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి 2019 జనవరిలో సరిగా సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం సరైందేనని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సోమవారం తీర్పు చెప్పింది. అయితే ఈ రాజ్యాంగ ధర్మాసనంలో అయిదుగురు న్యాయమూర్తులు ఉంటే ముగ్గురు ఈ రిజర్వేషన్లు సరైనవేనని చెప్తే ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యు.యు.లలిత్‌ కూడా ఉండడం ప్రత్యేకంగా గమనించదగిన అంశం. ఈ రిజర్వేషన్లు సరైనవేనని చెప్పిన ముగ్గురు న్యాయమూర్తులు ఇవి రాజ్యాంగ సమ్మతమేనని అంటే మిగతా ఇద్దరు న్యాయమూర్తులు మాత్రం ఈ పది శాతం రిజర్వేషన్లు షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తరగతుల వారికి వర్తించకపోవడం వివక్ష చూపడమేనని అభిప్రాయపడి భిన్నమైన తీర్పు ఇచ్చారు. ఏడాదికి ఎనిమిది లక్షల రూపాయలకన్నా తక్కువ ఆదాయం ఉన్న వారు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కిందకు వస్తారు. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవారైతే అయిదెకరాలకు మించని భూమి ఉన్నవారు: వెయ్యి చదరపు గజాలకన్నా మించని నివాసస్థలం ఉన్నవారు, అదే మునిసిపాలిటీల్లో అయితే 100 చదరపు గజాలు, మునిసిపాలిటీలు కాని పట్టణ ప్రాంతాలలో అయితే 200 చదరపుగజాలకు మించి నివాసస్థలంఉన్నవారు ఆర్థికంగా వెనుకబడినవర్గం కిందకు రారు. కానీ జాతీయ తలసరి ఆదాయం తాజా లెక్కల ప్రకారం సంవత్సరానికి లక్షా యాభైవేలరూపాయలు మాత్రమే ఉంది. అలాంటప్పుడు ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం మించని వారికి అంటే జనాభాలో ఎంత శాతం మందికి ఈ పది శాతం రిజర్వేషన్లు సర్దుబాటు చేయవలసి వస్తుందో చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. అల్పసంఖ్యాక వర్గాలవారు నడిపే సంస్థల్లో ఈ పదిశాతం రిజర్వేషన్లు వర్తించవు. 2019 జనవరిలో ఈ చట్టం తీసుకొచ్చిన తరవాత ఈ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక చట్రానికి విరుద్ధమైనవని వాదిస్తూ సుప్రీంకోర్టులో దాదాపు 40 పిటిషన్లు దాఖలైనాయి. రాజ్యాంగం ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే రిజర్వేషన్లు వర్తించాలి. రిజర్వేషన్లు కల్పించినప్పుడు ఆర్థిక వెనుకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ సూత్రం ప్రకారం చారిత్రకంగా అత్యంత పాశవికంగా అణచివేతకు గురై సామాజిక, విద్యా రంగాలలో వెనుకబడినవర్గాల వారికి రిజర్వేషన్లు వర్తింపచేశారు. వీటి అసలు లక్ష్యం సామాజిక న్యాయం దక్కేలా చూడడం. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం అంటే సామాజిక న్యాయాన్ని అటకెక్కించి నిచ్చెన మెట్ల కులవ్యవస్థను పదిల పరచడానికి ప్రయత్నించడమే. కానీ ఈ రిజర్వేషన్లను ఖరారు చేసినప్పుడే ఇతర వెనుకబడిన కులాల వారికి తోడ్పడే చర్య తీసుకోవలసిన అవసరం ఉందని అంబేద్కర్‌ వ్యాఖ్యానించారు. ఆ విషయం తేల్చడంకోసం కాకా కాలేల్కర్‌ కమిషన్‌ ఏర్పాటైంది. కానీ ఆ కమిషన్‌ నివేదిక సమర్పించిన సమయంలో కాలేల్కర్‌ తాను ఈ నివేదికను నమ్మడంలేదని స్వయంగా అనడంతో అప్పుడు వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించే ఆలోచన ముందుకు సాగలేదు. ఆ తరవాత మండల్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా ఇతర వెనుకబడిన వర్గాల వారికి సుదీర్ఘ పోరాటం తరవాత రిజర్వేషన్లు దక్కాయి.
మౌలికంగా సామాజిక, విద్యా రంగాలలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయానికి సోపానాలు నిర్మించాలన్నది రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం. అందుకే ఆర్థిక వెనుకుబాటుతనం ప్రస్తావన తీసుకు రాలేదు. అయితే మండల్‌ నివేదిక అమలుచేసే సమయంలో సుప్రీంకోర్టు కల్పించుకుని వెనుకబడిన తరగతులవారిలో సంపన్న వర్గాన్ని మినహాయించాలని చెప్పింది. దీనివల్ల రెండు పరిణామాలు ఎదురయ్యాయి. ఒకటి: ఒక సముదాయం కోసం ఉద్దేశించిన రిజర్వేషన్లు వ్యక్తులకు వర్తింప చేసినట్టయింది. రెండు: రాజ్యాంగ నిర్మాతలు ఉద్దేశించని ఆర్థిక వెనుకబాటు తనానికి రిజర్వేషన్ల కల్పనలో స్థానం కల్పించినట్టయింది. రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన కోసం కాదు. కానీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు చెల్లుతాయని చెప్పిన ముగ్గురు న్యాయమూర్తులు రిజర్వేషన్ల మౌలిక ప్రయోజనాన్ని పరిగణనలోకి తీసుకున్నట్టులేదు. భిన్నాభిప్రాయం వ్యక్తంచేసిన ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఈ అంశాన్ని అభ్యంతరం పెట్టకుండా ఇదివరకే రిజర్వేషన్లు వర్తిస్తున్న ఎస్‌.సి., ఎస్‌.టి., ఇతర వెనుకబడిన వర్గాలకు ఆర్థికంగా వెనుకబాటు తనం కింద రిజర్వేషన్లు దక్కకపోవడాన్ని అంగీకరించలేదు. పేదరికానికి ప్రభుత్వ విధానాలే కారణం. ఆ విషయం మోదీ పాలనలో మరింత స్పష్టంగా కనిపిస్తోంది. అంతరాలు పెరిగిపోతున్నాయి. సంపద కొద్దిమంది చేతుల్లో పోగుకాకుండా చూడాలన్న రాజ్యాంగ నిర్దేశాన్ని మోదీ సర్కారు తుంగలోతొక్కి ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లకు తెర తీసింది.
సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన మెజారిటీ తీర్పు మరో కొత్త సమస్యను ముందుకు తీసుకు వచ్చింది. 1992లో సుప్రీం కోర్టే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని చెప్పింది. తాజా తీర్పు ఆ పరిమితిని తొలగించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారికి పది శాతం రిజర్వేషన్లు చేరిస్తే అవి 60 శాతానికి పెరుగుతాయి. ఈ సమస్య అక్కడితో ఆగదు. వివిధ రాష్ట్రాలలో అనేక వర్గాల వారు తమకూ రిజర్వేషన్లు కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రాంతంలో కాపులు, ఉత్తరాదిన జాట్లు, మహారాష్ట్రలో మరాఠాలు, గుజరాత్‌లో పాటిదార్లు తమకు రిజర్వేషన్లు కల్పించాలంటున్నారు. రిజర్వేషన్లపై పరిమితి తొలగించినందువల్ల ఆ వర్గాలన్నీ మళ్లీ ఉద్యమబాట పట్టినా ఆశ్చర్యం లేదు. పేదరికానికి కారణం ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాలే. వాటిని మార్చడం ఆశ్రిత పెట్టుబడి దారీ విధానం అనుమతించదు. ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడానికే 2019లో మోదీ సర్కారు చట్టం తీసుకు రావడం సామాజిక న్యాయానికి మంగళం పాడడానికే. ఇది కచ్చితంగా రాజ్యాంగ నిర్మాతల సంకల్పానికి, రిజర్వేషన్ల ప్రయోజనానికి భిన్నమైందే. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు సక్రమమేనని చెప్పిన న్యాయమూర్తులు దినేశ్‌ మహేశ్వరి, బేలా త్రివేదీ, జె.బి.పార్దీవాలా అసలు లక్ష్యాన్ని పరిగణించినట్టు లేదు. ఇతర వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు అమలు చేసినప్పుడు సంపన్న వర్గాన్ని తొలగించడంతోనే ఆర్థిక వెనుకబాటుతనం అన్న ప్రమాణాన్ని శంఖంలో పోసినట్టయింది. ఇప్పుడు రిజర్వేషన్ల పరిధిలోకి రాని వారినీ ఆర్థిక వెనుకబాటుతనం పేరుతో రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకొచ్చినట్టయింది. సుప్రీంకోర్టుతీర్పు సమస్యను పరిష్కరించడానికి బదులు పాములబుట్టను తెరిచినట్టయింది. దీనివల్ల అనేక కొత్తసమస్యలు ఉత్పన్నం కాకతప్పదు. ఈ తీర్పును పున:స్సమీక్షించ మని కోరడం సహజమే. అప్పుడైనా మరింత విస్తృత బెంచి ఏర్పాటుచేసి ఈ తీర్పులో విస్మరించిన అంశాలను సమీక్షించక తప్పదు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు దాదాపు పూజ్యమైన స్థితిలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్ల ఆశచూపడం మాయ చేయడమే. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లకోసం పోరాటాన్ని ముమ్మరం చేయడం, తాజా తీర్పు విస్తృతమైన బెంచి పరిశీలించడం తప్ప గత్యంతరం లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img