Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

సామాన్యుడి దృష్టిలో స్వాతంత్య్రం

దేశ అభివృద్ధి అంటే ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం. ప్రజలు అన్ని విషయాలలో మేలైన జీవితం అనుభవించడానికి అనువైన సామాజిక, ఆర్థిక, పరిస్థితులు ఏర్పరచడం. అ బాధ్యత పరిపాలకులది. సామాన్యుడికి అవసరమైన కనీస వసతులు అంటే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా మత స్వేచ్ఛకు, భావనా ప్రకటనను హరించకుండా ప్రభుత్వాలు హామీ ఇవ్వాలి. రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలి.పేద ఓటరుసైతం గతంలో ఎన్నికైన ప్రజాప్రతినిధి చేసిన వాగ్దానాలు నెరవేర్చారా లేదా అని చూసుకుని విశ్వసనీయమైన వ్యక్తికి తన ఇష్టప్రకారం ఓటువేసే అవకాశం ఉండాలి. ప్రజాప్రతినిధులు తాము చేసిన వాగ్దానాలను నెరవేర్చినప్పుడు మాత్రమే మళ్లీ ఎన్నుకోవాలన్న విచక్షణను ప్రదర్శించే పరిస్థితి ఓటరుకు ఉందా? సామన్యుడి సంపాదనకు అందుబాటులో విద్య, వైద్యం అందుతున్నదా! సమాజంలో వివిధకులాలు, మతాల మధ్య సమాజంలో సఖ్యత, సామరస్యత అవసరం. ప్రతిఒక్కడికి తనిష్టాయిష్టాలను వ్యక్తం చేసే, అసమ్మతిని తెలియపరిచే లేదా పాలకులు చేసిన వాగ్దానాలను ఎందుకు నెరవేర్చలేదని, తమకు ప్రయోజనం లేని విధానాలను ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించే పరిస్థితులు ఉండి తీరాలి. ఇవన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థకు సూచిక అవుతుంది. అంతేకాదు, రాజ్యాంగం ప్రకారం, పరిపాలన అమలుగాకపోతే ఎందుకు జరగడంలేదని ప్రశ్నించే అవకాశం ఉండాలి. రోజుకు మూడు పూటలా తినడానికి ఆహారం, శుభ్రంగా ఉండటానికి అవసరమైన నీరు, కప్పుకోడానికి ఏదో ఒక గుడ్డ, కనీస నివాసవసతి సామాన్యుడు కోరుకుంటాడు. పూర్వకాలంలో రాజు, నేడు ప్రధాన పరిపాలకుడు ప్రజలకు తండ్రి వంటివాడని చెప్తారు. తండ్రి సంతానాన్ని ఒకేవిధంగా చూస్తాడు. అందరికీ ఆహారం, విద్య, వైద్యం, నివాసవసతి కల్పించాలని ఆరాటపడతాడు. ప్రధాన పాలకుడు తండ్రిలాంటి వాడైనప్పుడు ప్రజలను కులాలు, మతాలవారిగా విభజించి ఆనందపడాలని అనుకోడు. నిజంగా అలా అనుకున్నట్లయితే అతను పాలకుడు కాదు. అత్యంత క్రూరమైన మనస్తత్వం గలవాడవుతాడు. సమాజంలో జీవించడానికి, పాలకుడిగా కొనసాగడానికి ఎంతమాత్రం అర్హుడుకాదు. అలాంటి వ్యక్తి పాలించేటప్పుడు అది ప్రజాస్వామ్య వ్యవస్థకాదు. ప్రజలను విచ్చలవిడిగా, క్రూరంగా హింసిస్తూ సమాజాన్ని అల్లకల్లోల పరుస్తూ, ఏకపక్షంగా, నిరంకుశంగా నిర్ణయాలు తీసుకుంటూ ఇందుకు భిన్నంగా ఉపన్యాసాలు చేస్తూ, ప్రజలను నమ్మించడానికి గారడీ విన్యాసాలు చేసేపాలకుడిని ఏమనాలో ఈతి బాధలను అనుభవించే ప్రజలే నిర్ణయించాలి. మన దేశం ఉన్నత ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిఉందని ప్రచార ఆర్భాటాన్ని చేస్తూ ఆచరణలో నిరంకుశంగా పాలించే నాయకుడిని నియంత అంటే సబబుగా ఉంటుందేమో..!
స్వాతంత్య్రం వచ్చాక తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన ప్రసంగంలో దేశప్రజల అభ్యున్నతిని కోరుతూ అమలు చేయనున్న అంశాలను ప్రకటించారు. శాస్త్రీయ దృక్పధం భావనను ప్రజలలో పెంపొందించాలని, సైన్సు దేశంలో మూఢనమ్మకాలను, మత ఛాందసాన్ని రూపుమాపి ప్రజలందరి అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. శాస్త్రీయ దృక్పధం పేదరికాన్ని, అజ్ఞానాన్ని, రోగాలను, అసమానతలను తొలగిస్తుందని ప్రకటించారు. అంతేకాదు, దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని వక్కాణించారు. ప్రస్తుతం కావలసింది కూడా శాస్త్రీయ దృక్పధాన్ని ప్రజల్లో విస్తరించడం. ఇందుకుపూర్తి భిన్నంగా మోదీ ఆలోచన, ఆచరణ ఉన్నదని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు. గత తొమ్మిది సంవత్సరాల కాలంలో మోదీ సైన్సును దిగజార్చి మతఛాందసాన్ని కులమతాల మధ్య విభజనను, సమాజంలో అలజడిని, అసహనాన్ని పెంచారన్న అభిప్రాయం ప్రజలలో ఎక్కువగా ఉందని పత్రికలలో విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య దేశమేనని పాలకులు జబ్బలు చరుచుకుంటున్నారు. కానీ, ప్రజాస్వామ్య లక్షణాలు బాగా దిగజారి పోయాయని దేశ, విదేశీ సర్వేల సూచికలు అంచనావేస్తున్నాయి. అయితే కొత్తగా దేశభక్తులుగా ప్రచారం చేసుకునేవాళ్లు అంగీరించబోరు. బలమైన ప్రతిపక్షం ఉండటం ప్రజా స్వామ్యానికి ఒక సూచిక. ప్రతిపక్షం బలంగా లేనప్పుడు ప్రధాన పాలకుడు నిరంకుశంగానే వ్యవహరిస్తారు. ఉన్నతంగా రాజనీతిజ్ఞతతో ప్రసంగించ వలసిన వేదికనుంచి ఎన్నికల ప్రసంగం చేయడం ద్వారా వేదిక ఔన్నత్యాన్ని దిగజార్చినట్లు భావించాలి.
సామాన్యప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించవలసిన వాటికి బదులుగా ఆశ్రితులను నల్లకుబేరులుగా మార్చిన ఘనత మోదీదేనని చెప్పాలి. మోదీ పాలనలో తీసుకున్న చర్యలలో ఏదికచ్చితంగా విజయ మైందో చెప్పడానికి ఏమున్నాయని వివరించడానికి లేకనే ఎన్నికల ప్రచార వేదికగా ఎర్రకోటను ఉపయోగించుకున్నారు. సామాన్య జనానికి తొమ్మిదేళ్ల కాలంలో ఒరిగిందేమీ లేదు. ఈ విషయాన్ని అణగారిన వర్గాల ప్రజలు ఢంకాబజాయించి చెప్తారు. అడవుల్లో బతుకుతూ పాలకులపై ఆధారపడ కుండా జీవనం సాగించే ఆదివాసీలనుసైతం ఆయా ప్రాంతాలనుంచి ఖాళీచేయించి కార్పొరేట్లకు కట్టబెట్టడానికి మోదీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నది. దేశాన్ని మార్చివేస్తానని, తక్కువమందితో ప్రభుత్వం ఏర్పాటుతో మేలైన పరిపాలన అందిస్తానని, గుజరాత్‌ మోడల్‌పాలన అమలు చేస్తానని మోదీ ఉవ్వెత్తున ప్రచారంచేసి, వందలాది వాగ్దానాలుచేసి వాటిని పూర్తిగా మరిచిపోయారు. గుజరాత్‌ నమూనా అంటే అక్కడ ఎంతో అభివృద్ధి జరిగిందని 2014 మీడియాకూడా నమ్మి ప్రచారంలో భాగస్వామి అయింది. అయితే గుజరాత్‌లో 2002లో ఒకేరోజులో రెండువేలమంది దాకా మైనారిటీల ఊచకోత కోసిన అత్యంత దుర్మార్గమైన ప్రయోగాన్ని దేశంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తారని ఎవరూ ఊహించలేదు. గుజరాత్‌తోపాటు కశ్మీర్‌లో, మణిపూర్‌, రాజస్థాన్‌లలో ప్రయోగం చేస్తున్నారని ఆనవాళ్లు బలపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీ నాయకత్వంలోని మోదీ ప్రభుత్వం సామాన్యప్రజలను పట్టించుకొని వారి అభివృద్ధికి కృషిచేస్తుందని ఆశించడం భ్రమేనని తొమ్మిదేళ్లకాలంలో అనుభవం స్పష్టం చేస్తోంది. అన్ని నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సామాజిక, ఆర్థిక అసమానతలు అత్యంత వేగంగా అధికమవుతున్నాయి. మత,కుల విభజన విద్వేషం పెచ్చరిల్లుతోంది. అల్లర్లు విస్తరిస్తున్నాయి. అవినీతి విజృంభించింది. కర్నాటక అవినీతికి మారుపేరైంది. అయినప్పటికీ మోదీ ఎక్కడ మాట్లాడినా ఇండియా కూటమి అత్యంత అవినీతితో కూడుకున్నదని ఆరోపించడం మోదీకి మాత్రమే చెల్లుతోంది. అన్నిటికంటే ముఖ్యంగా దేశాన్ని హిందూరాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యాన్ని బాహాటంగా అంగీకరిస్తున్నారు. మతఛాందసం, ఉన్మాదం వంటి విచ్ఛిన్న సమాజాన్ని పునరుద్దరించాలని, శాస్త్రీయ దృక్పధాన్ని పూర్తిగా నిర్మూలించాలని మోదీ అనుసరిస్తున్న విధానాలు అత్యంత ప్రమాదకరం. ఇంతకాలం గుడ్డిగా అనుసరిస్తున్న హిందువులు సైతం మోదీ చెప్పేదొకటి, చేసేది మరొకటి అని తెలుసుకుంటున్నారని కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవలసిన అవసరం గతం కంటే నేడు మరింత ఎక్కువగా ఉంది. నిరుద్యోగులు, విద్యావంతులు ముఖ్యంగా మీడియా వీటిని గుర్తించవలసిన అవసరం ఉందని నేటి పరిస్థితులు హెచ్చరిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img