Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

సిద్ధూ రాజీనామా అధిష్ఠానం వైఫల్యమే

పంజాబ్‌ ముఖ్యమంత్రిగా అమరేంద్ర సింగ్‌ రాజీనామా చేసి పది రోజులైంది. అమరేంద్ర సింగ్‌ మీద తిరుగుబాటు చేసిన నవ జ్యోత్‌ సింగ్‌ సిద్ధూను పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిని చేసి రెండు నెలలైనా కాలేదు. అంతర్గత సంక్షోభాన్ని పరిష్కరించడానికి కాంగ్రెస్‌ అధిష్ఠానవర్గం సిద్ధూకు రాష్ట్ర కాంగ్రెస్‌ పదవి కట్టబెట్టి, అమరేంద్ర సింగ్‌ చేత రాజీనామా చేయిస్తే సరిపోతుందని భావించింది. గుడ్డిలో మెల్లెగా పంజాబ్‌లో 32 శాతం మంది దళితున్నారు కనక చరణ్‌ జిత్‌ సింగ్‌ చన్నీకి ముఖ్యమంత్రి స్థానం కట్టబెట్టింది. ఇదేదో మంచి ఎత్తుగడే అనుకుంటున్న సమయంలో పి.సి.సి. అధ్యక్ష స్థానానికి రాజీనామా చేసి సిద్ధూ కాంగ్రెస్‌ అధిష్ఠానవర్గానికి దిమ్మ తిరిగేట్టు చేశారు. తనను గద్దె దించినందుకు సహజంగానే అమరేంద్ర సింగ్‌లో అసంతృప్తి గూడు కట్టుకుని ఉంటుంది కనక ఆయన ఏం చేస్తారు, బీజేపీలో చేరతారా లేక కొత్త పార్టీ పెడతారా అన్న విషయాల మీద అధిష్ఠానం మీమాంసలో పడి ఉండగా సిద్ధూ తన పేచీకోరుతనాన్ని, అహకార పూరిత ధోరణిని బాహాటంగా ప్రదర్శించారు. అమరేంద్ర సింగ్‌ను గద్దె దించినంత మాత్రాన సిద్ధూ శాంతించలేదు. తనకే ముఖ్యమంత్రి పదవి కావాలన్న ఆయన కోర్కెను అధిష్ఠానం తీర్చలేదు. అయితే వచ్చే ఏడాది పంజాబ్‌ శాసనసభ ఎన్నికలలో మాత్రం సిద్ధూ నేతృత్వంలోనే పోటీ చేస్తామని పంజాబ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడు హరీశ్‌ రావత్‌ ప్రకటించినా సిద్ధూకు సంతృప్తి కలగలేదు. ఎన్నికలు జరిగి, ఆ ఎన్నికలలో పి.సి.సి. అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ను గెలిపించి అప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కోసం వేచి చూసే ఓపిక సిద్ధూకు ఏ కోశానా లేదు. చన్నీ మంత్రివర్గంలో తన మద్దతుదార్లకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం మళ్లీ ఆయన ఆగ్రహించడానికి కారణం అయి ఉండవచ్చు. అదీ కాక కాంగ్రెస్‌లో తనకు గిట్టని ఎస్‌.ఎస్‌.రణధావాకు ప్రధానమైన మంత్రిత్వ శాఖ ఇవ్వడం సిద్ధూ అసలే జీర్ణించుకోలేక పోయినట్టున్నారు. సిద్ధూకు మద్దతుగా చన్నీ మంత్రివర్గ సభ్యురాలు రజియా సుల్తానా కూడా రాజీనామా చేశారు. సిద్ధూ ప్రవర్తనా తీరు మామూలు జనం గ్రహించినట్టుగా కూడా అధిష్ఠానానికి అర్థమైనట్టు లేదు. దళిత ఓట్లను రాబట్టుకోగలిగితే మళ్లీ విజయం సాధించ వచ్చుననుకున్నట్టుంది. దళిత ఓట్లు ముఖ్యమైనవే కావచ్చు కానీ ఏ వర్గం వారూ కట్టకట్టుకుని ఏ పార్టీకీ ఓటు వేయరు అన్న వాస్తవం కాంగ్రెస్‌ అగ్ర నాయకులకు ఎందుకుఅర్థంకాలేదో తెలియదు. అసమ్మతి, అంతర్గత కుమ్ము లాటలు అధికారంలోకివచ్చే అవకాశంఉన్న అన్నిపార్టీలలోనూ సహజమే. క్రమ శిక్షణ నెలకొల్పడం అధిష్ఠానం బాధ్యత. ఈ విషయంలో కాంగ్రెస్‌ ఏమాత్రం పరిపక్వత, దూరదృష్టి ప్రదర్శించలేదు. అమరేంద్ర సింగ్‌ను అవమానించడంలో అధిష్ఠానం అసమ్మతివాదులతో జట్టు కట్టింది. పంజాబ్‌ శాసనసభ ఎన్నికలలో విజయావకాశాలను కాంగ్రెస్‌ చేజేతులా వదులు కుంటున్నట్టు కనిపిస్తోంది. నిజానికి కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికలలో ఏ రాజకీయపక్షంనుంచీ పెద్ద సవాలేమీలేదు. ఆం ఆద్మీ పార్టీ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. మరింత బలం పెంచుకోవడానికి కేజ్రీవాల్‌ పార్టీ ప్రయత్నించవచ్చు. మాయావతి నాయకత్వంలోని బీఎస్పీకూడా తన బలాన్ని సంఘటితంచేసుకోవడానికి యథాశక్తి ప్రయత్నించవచ్చు. భారతీయ జనతా పార్టీకి పంజాబ్‌లో చెప్పుకోదగ్గ పట్టు లేదు. అకాలీ దళ్‌ ముందున్నంత బలంగాలేదు. ఈ విశ్లేషణలను గమనిస్తే కాంగ్రెస్‌కే అనుకూలాంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ సకల అవకాశాలనూ దుర్వినియోగం చేసుకోవడానికి కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం కంకణం కట్టుకున్నట్టుంది.
సిద్ధూతో రాజీకి అమరేంద్ర సింగ్‌ నిరాకరించలేదు. అధిష్ఠానవర్గం ఆ దిశగా ఆలోచించినట్టే లేదు. ఆ పని చేయాలంటే సిద్ధూ క్రమశిక్షణతో వ్యవహరించేట్టు చేయాల్సింది. ఆ శక్తి అధిష్ఠానానికి సంపూర్ణంగా లోపించింది. సిద్ధూ చపల చిత్తుడనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను ముఖ్యమంత్రిని కానివ్వనని అమరేంద్ర సింగ్‌ చెప్తూనే ఉన్నారు. అందుకే అమరేంద్ర సింగ్‌ తన భవిష్యత్‌ వ్యూహాన్ని బయట పెట్టడం లేదు. అమరేంద్ర సింగ్‌ పాలన మీద ప్రజల విశ్వాసం క్రమంగా సన్నగిల్లుతూ వచ్చిందనడంలో అనుమానంలేదు. అమరేంద్ర సింగ్‌కు ఉన్న జనాదరణ ఏమిటో అంచనా వేయడానికి సి-ఓటర్‌, ప్రశ్నం సంస్థ సర్వేలు నిర్వహించాయి. సి-ఓటర్‌ సర్వే ప్రకారం 60 శాతం మంది అమరేంద్ర సింగ్‌ పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాట నిజమే. 16 శాతం మంది ఫరవాలేదన్నారు. కేవలం 15 శాతం మంది మాత్రమే అమరేంద్ర సింగ్‌ పని తీరు తమకు పూర్తి సంతృప్తి కలిగించిందన్నారు. అంటే ఇది మాత్రమే అమరేంద్ర సింగ్‌కు ఉన్న నికరమైన మద్దతు. ఈ మద్దతును కోల్పోయినా ఫరవాలేదని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావించిందనుకోవాలా! ప్రశ్నం సంస్థ నిర్వహించిన సర్వేలో అమరేంద్ర సింగ్‌ను ముఖ్యమంత్రి స్థానం నుంచి తొలగించడం సబబేననుకుంటున్నారా అని అడిగితే 12 శాతం మంది కాదన్నారు. అమరేంద్ర సింగ్‌ను గద్దె దించడం ఆయన స్థానంలో చన్నీని ముఖ్యమంత్రిని చేయడం సరైన వ్యూహమేనని 63 శాతం మంది అభిప్రాయపడ్డారు. 13 శాతం మంది అమరేంద్ర సింగ్‌ను తొలగించడాన్ని సమర్థించినా చన్నీని ముఖ్యమంత్రిని చేయడాన్ని మెచ్చలేదు. ముఖ్యమంత్రిని మార్చినంత మాత్రాన కాంగ్రెస్‌కు మేలు జరుగుతుందన్న హామీ లేదని ఈ జనాభిప్రాయం రుజువు చేస్తోంది. పంజాబ్‌ మంత్రివర్గంలో జరిగిన మార్పులు తనకు అసంతృప్తి కలిగించాయని సిద్ధూ బాహాటంగానే చెప్తున్నారు. అంటే చన్నీ ప్రభుత్వం తన సైగల మేరకు నడుచుకోవాలన్నది సిద్ధూ ఆంతర్యం అనుకోవాలి. చన్నీ కూడా సిద్ధూకు సన్నిహితుడనే భావన ఉండేది. కానీ తన చేతిలో కీలుబొమ్మగా ఉండడానికి చన్నీ అంగీకరించకపోవడంతో సిద్ధూ ఏకంగా పి.సి.సి. అధ్యక్ష స్థానానికి రాజీనామా చేసి మరోసారి తిరుగుబాటు జెండా భుజాన వేసుకున్నారు. అయితే ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతానంటున్నారు. సిద్ధూ ముఖ్యమంత్రి కాకుండా చేయగలిగిందల్లా చేస్తానని అమరేంద్ర సింగ్‌ ప్రతిజ్ఞ చేస్తున్నారు. అంటే పరస్పర విరోధులైన ఈ ఇద్దరు నాయకులు కలిసి కాంగ్రెస్‌ను మరింత కుళ్లబొడవడానికి సిద్ధపడుతున్నారన్న మాట. కాంగ్రెస్‌కు కలిగే నష్టం అంతా కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆం ఆద్మీ పార్టీకి ఉపకరించవచ్చు. పంజాబ్‌లో పట్టు సంపాదించుకోవడానికి కేజ్రీవాల్‌ సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. ఆయన బుధవారం పంజాబ్‌లో పర్యటిస్తున్నారు. ఎంతమంది వారించినా, హెచ్చరించినా ప్రియాంకా గాంధీ మాత్రం సిద్ధూను పి.సి.సి. అధ్యక్షుడిగా చేయడానికి ప్రధాన కారకురాలు. ఆ నిర్ణయం సిద్ధూ రాజీనామాతో దిద్దుకోలేని పొరపాటు అని తేలిపోయింది. దళితుడికి ముఖ్యమంత్రిని చేయడంవల్ల కలుగుతుందనుకున్న ప్రయోజనం కాస్తా సిద్ధూ అహంకార ధోరణి కారణంగా నిష్ప్రయోజనం అయ్యేట్టు కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img