Friday, June 9, 2023
Friday, June 9, 2023

సీబీఐపై మోదీకి ఎంత ప్రేమో!

సీబీఐ పనితీరు ఎప్పటి నుంచో విమర్శలకు గురవుతోంది. దాడులు మాత్రం చేస్తుంది. దీనివల్ల ఫలానా ప్రముఖులపై సీబీఐ దాడి జరిగిందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఆ తరవాత ఈ దాడులవల్ల ఫలితం ఏమిటో దశాబ్దాలు గడిచినా తెలియదు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హఠాత్తుగా సీబీఐ వజ్రోత్సవాల సందర్భంగా ప్రశంసలు కురిపించారు. వాస్తవాన్ని పరిశీలిస్తే మోదీ ప్రశంసలు దాడులకే వర్తిస్తుందేమో. సీబీఐతోపాటు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌(ఈ.డీ.), ఆదాయపు పన్నుశాఖను కూడా ప్రతిపక్ష నాయకులను అపఖ్యాతి పాలు చేయడానికి మోదీ వాటంగా ఉపయోగించుకుంటున్నారు. సీబీఐ పనితీరు ఎంత భేషుగ్గా ఉందో తెలుసుకోవడానికి ఆ విభాగం తన ముఖం తాను అద్దంలో చూసుకుంటే చాలు. ఆ దృశ్యం భయానకంగా ఉంటుంది కనకే మోదీ స్వయంగా ప్రశంసలు గుప్పించాల్సి వచ్చిందేమో. దేశంలోకెల్లా అత్యున్నత దర్యాప్తుసంస్థ పనితీరు నాసిరకంగా ఉన్నా తాను చెప్పినట్టు నడుచుకుంటు న్నందువల్లే మోదీ సీబీఐని పొగిడి ఉంటారు. అందుకే సీబీఐ ‘‘సమర్థంగా’’ పనిచేస్తోంది అని మోదీ కితాబిచ్చారు. ఆయన దృష్టిలో సీబీఐ సామర్థ్యం తాను చెప్పినట్టల్లా వినడమే కాబోలు. వాస్తవం మోదీ పొగుడుతున్న సామర్థ్యానికి పూర్తి విరుద్ధంగా ఉంది. కేవలం ఏడాదిన్నర కింద సుప్రీంకోర్టు సీబీఐ పనితీరుమీద తీవ్రమైన అసంతృప్తి వ్యక్తంచేసింది. సీబీఐ, ఈ.డీ, ఆదాయపు పన్నుశాఖ పనిగట్టుకుని ప్రతిపక్ష నాయకులను వేధిస్తోందని ఇటీవలే 14 రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టులో ఫిర్యాదు దాఖలు చేశాయి. గత మార్చి 24వ తేదీన అంటే దాదాపు వారం రోజుల కిందే కేంద్రం చేతుల్లో ఉన్న దర్యాప్తు సంస్థలు ఎంతగా వేధిస్తున్నాయో పేర్కొంటూ ప్రతిపక్ష పార్టీలు దాఖలుచేసిన పిటిషన్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ దృష్టికి తీసుకొచ్చారు. దర్యాప్తు సంస్థల దాడులకు గురైన వారిలో 95శాతం ప్రతిపక్షాల వారే. ప్రతిపక్షాల అర్జీపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసు విచారణ జరిగి తీర్పు వెలువడితే తప్ప మోదీ పొగడ్తల సారమేమిటో తేలదు. సీబీఐ దాడుల్లో ఎక్కువ భాగం ప్రతిపక్షాల మీదే. 2004 నుంచి 2014 మధ్య అంటే కాంగ్రెస్‌ నాయకత్వంలోని యు.పి.ఏ. ప్రభుత్వ హయాంలో 72 మంది రాజకీయ నాయకుల మీద సీబీఐ దర్యాప్తు చేస్తే అందులో 43 శాతం మంది మాత్రమే అప్పటి ప్రతిపక్షానికి చెందిన వారున్నారు. అంటే ప్రతిపక్షాల మీద జరిగిన దాడులు 60 శాతంకన్నా తక్కువే. ఇప్పటి లెక్కలు చూస్తే 95 శాతం ప్రతిపక్ష నాయకులే సీబీఐ దాడులకు గురవుతున్నవారి జాబితాలో ఉన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరొక్టొరేట్‌ వ్యవహారం కూడా ఇలాగే ఉంది. 2014 కు ముందు ఈ వ్యవస్థ దర్యాప్తుకు గురైన రాజకీయ నాయకులు 54శాతం అయితే ఇప్పుడది 95శాతానికి పెరిగింది. ద్రవ్యఅక్రమ చెలామణిచట్టం (పి.ఎం.ఎల్‌.ఎ.) కింద అనేక కేసులు మోపితే కేవలం 23 సందర్భాలలో మాత్రమే నిందితులు దోషులుగా తేలారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 981 మంది మీద పి.ఎం.ఎల్‌.ఎ. చట్టం కింద కేసులు దాఖలైతే 2021-22 నాటికి అవి 1,180కు పెరిగాయి.
సీబీఐని పొగడడంలో కూడా మోదీ తన మునుపటి గుణాన్ని మానుకోలేదు. అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతూ అభివృద్ధి, ప్రజాస్వామ్యం దిగదుడుపు అవుతున్న దశలో సీబీఐ ప్రశంసనీయంగా పనిచేస్తోందని మోదీ అన్నారు. ఈ దేశంలో అవినీతి ఆనవాలు లేకుండా చేయడం సీబీఐ బాధ్యత అని ఆయన అన్నారు. ప్రతిపక్ష నాయకులలో ఉందంటున్న అవినీతిని అంతమొందించడమే ఆ వ్యవస్థ ఉద్దేశం అని మోదీ ఆంతర్యం కాబోలు. ఎంతటి శక్తిమంతులైన వారు అవినీతికి పాల్పడినా వెనుక ముందు చూడకుండా చర్య తీసుకోవాలని మోదీ అన్నారు. అయితే సీబీఐలో పనిచేసే ఉన్నతాధికారులందరికీ మోదీ ఉద్దేశం ఏమిటో తెలుసు కనక వారు అధికార పక్షానికి చెందినవారి అవినీతి జోలికి వెళ్లరు. ఇదివరకు ప్రతిపక్షంలో ఉండి తరవాత బీజేపీలో చేరిన వారి మీద దాఖలైన కేసులను మరుగు పరచే నైపుణ్యం కూడా మోదీ హయాంలో సీబీఐకి దక్కింది. ప్రతిపక్ష నాయకుల మీద కేసులైతే దండిగా నమోదవుతున్నాయి కానీ వారి నేరం ఏమిటో రుజువు చేయడానికి అవసరమైన సాక్ష్యాధారాలు సేకరించడంలో సీబీఐ విఫలమవుతోంది. అధికారపక్షం పనుపుపై దాడులుచేస్తే పరిస్థితి ఇలాగే ఉండక తప్పదు. ఇంతకు ముందు సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న జోగీందర్‌ సింగ్‌ అత్యున్నత న్యాయస్థానం ఎదుటే తమ వ్యవస్థ పంజరంలో చిలక లాంటిదని ఒప్పేసుకున్నారు. ఇప్పుడు సీబీఐ పాలక పక్షానికి కావలి కుక్కలా మారిపోయింది.
కేసు దాఖలుచేస్తే సరిపోదు, దర్యాప్తు కూడా చేయాలి, దోషులకు శిక్ష పడేట్టు చేయాలి అని 2021 సెప్టెంబర్‌లోనే సుప్రీంకోర్టు సీబీఐకి చురక అంటించింది. విధి నిర్వహణలో సీబీఐ అధికారుల నిర్లక్ష్యాన్ని అత్యున్నత న్యాయస్థానం ఎత్తి చూపింది. న్యాయస్థానం ప్రస్తావించిన నిర్దిష్ట సందర్భంలో దాడిచేసిన 542 రోజుల తరవాత కాని కేసు దాఖలు కాలేదు. ఇదీ సీబీఐ అసలు సామర్థ్యం. ప్రస్తుతం పదవిలో ఉన్న, లేదా మాజీ ఎంపీలు, 1,991 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు లేదా మాజీల మీద కనీసం ఆరోపణలు కూడా ఖరారు చేయలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీల మీద (మాజీలతో సహా) 3096 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 952 కేసులు అయిదేళ్లుగా అపరిష్కృతంగానే మిగిలి పోయాయి. విచారణ కొలిక్కిరాక ముందే 14 మంది నిందితులు మరణించారు కూడా. రాజకీయ నాయకులకు సంబంధించిన కేసుల దర్యాప్తులో సీబీఐ కాళ్లీడుస్తోంది. అధికారపక్షం ఆజ్ఞల మేరకు ప్రతిపక్ష నాయకులను వేటాడడానికే సీబీఐకి సమయం చాలడంలేదు. సీబీఐ, ఈడీ లాంటివి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండొచ్చు. కానీ ఆ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నందువల్లే కొన్ని రాజకీయ పార్టీలు తమ రాష్ట్రాలలో సీబీఐని అడుగుపెట్టనివ్వడం లేదు. ఇలాంటి వ్యవస్థలు నిష్పక్షపాతంగా, అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల ఆదేశాలకు తలొగ్గకుండా పని చేయాలి. కానీ ఏ పక్షం అధికారంలో ఉన్నా ఆ సంస్థల చేత ఊడిగమే చేయించుకుంటున్నాయి. మోదీ హయాంలో ఇది మరింత బాహాటంగా కొనసాగుతోంది. ఈ వ్యవస్థలు మోదీ ప్రభుత్వం చేతిలో ఆయుధాలుగా మారాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img