Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

సుప్రీంకోర్టు చేసిన న్యాయం

అత్యున్నత న్యాయస్థానం వ్యవహార సరళి మూసపోసినట్టు ఎప్పుడూ ఒకే విధంగా ఉండకపోవచ్చు. న్యాయమూర్తుల దృక్పథం దీనికి కారణం అయి ఉండొచ్చు. హక్కుల కార్యకర్త, న్యాయవాది తీస్తా సెతల్వాద్‌ కేసులో సరిగ్గా ఇలాగే జరిగింది. 2002లో గుజరాత్‌ మారణకాండ సమయంలో కిరాతకంగా హత్యకు గురైన ఎహసాన్‌ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ ఈ కేసులో అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా విచారించాలని చాలాకాలంగా న్యాయ పోరాటం చేస్తున్నారు. జకియా జాఫ్రీకి ఈ కేసులో తీస్తా సెతల్వాద్‌ మొదటి నుంచీ దన్నుగా నిలిచారు. జకియా అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పైగా తీస్తా సెతల్వాద్‌్‌ లాంటి వారి మీద న్యాయమూర్తులు ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. సెతల్వాద్‌ లాంటి వారు జకియా జాఫ్రీ కేసును సంవత్సరాల తరబడి సాగదీస్తూ న్యాయ ప్రక్రియకే విఘాతం కలిగిస్తున్నారని వీరి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. అంతే ఈ వ్యాఖ్యల ఆధారంగా గుజరాత్‌ పోలీసులు తీస్తా సెతల్వాద్‌, మాజీ పోలీసు అధికారులు ఆర్‌.బి.శ్రీకుమార్‌, సంజీవ్‌ భట్‌ మీద హడావుడిగా కేసులు మోపారు. సంజీవ్‌ భట్‌ ఇదివరకే జైలులో ఉన్నారు. సెతల్వాద్‌ను, శ్రీ కుమార్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. సెతల్వాద్‌ గుజరాత్‌ హైకోర్టులో బెయిలు కోసం దరఖాస్తు పెట్టుకుంటే ఫలితం లేనందువల్ల ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యు.యు.లలిత్‌, న్యాయమూర్తులు ఎస్‌. రవీంద్ర భట్‌, సుధాంశు ధులీతో కూడిన బెంచి శుక్రవారం సెతల్వాద్‌కు తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. అయితే దర్యాప్తులో సహకరించాలని, తన పాస్‌పోర్టు గుజరాత్‌ హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. అలాగే సెతల్వాద్‌కు పూర్తి స్థాయి బెయిలు మంజూరు చేసే విషయంలో హైకోర్టుదే తుది నిర్ణయం అని కూడా స్పష్టం చేసింది. అదే సుప్రీంకోర్టులోని మరో బెంచి చేసిన వ్యాఖ్యలు సెతల్వాద్‌ అరెస్టుకు కారణమైతే శుక్రవారం బెయిలు అర్జీని పరిశీలించిన బెంచి ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రదర్శిస్తున్న భిన్న వైఖరికి తార్కాణం. కానీ బెయిలు మంజూరు చేసిన సందర్భంగా సుప్రీంకోర్టులో జరిగిన సంవాదం, ఆ తరవాత తీసుకున్న నిర్ణయం ఆసక్తికరమైనవి. జూన్‌ 25నుంచి సెతల్వాద్‌ నిర్బంధంలోనే ఉన్నా అందులో మొదటి ఏడు రోజులు పోలీసుల అధీనంలోనే ఉన్నా ఇంతవరకు చార్జిషీటే దాఖలు చేయకపోవడం ఏమిటని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను నిలదీశారు. కనీసం సాక్ష్యులనైనా విచారించలేదు. ఆమె బెయిలు కోసం ఆగస్టు 2న హైకోర్టుకు వెళ్తే బెయిలు ఇవ్వకపోగా కేసు విచారణను ఆరు వారాల పాటు అంటే సెప్టెంబర్‌ 19కి వాయిదా వేశారు. ఇలాంటి వ్యవహారాలలో అందునా ఒక మహిళ పెట్టుకున్న అర్జీ ఉన్నప్పుడు ఇంత సుదీర్ఘకాలం ఎలా వాయిదా వేస్తారు అని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు తుషార్‌ మెహతా దగ్గర సమాధానం లేదు. సెతల్వాద్‌ మీద హత్య చేయడం, శారీరకంగా దాడి చేయడం లాంటి తీవ్రమైన ఆరోపణలు లేనప్పుడు, ఆమెను ప్రశ్నించడం ముగిసినప్పుడు బెయిలు నిరాకరించడమే కాక సుదీర్ఘ కాలం వాయిదా వేయడం ఏమిటని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. మోదీ ప్రభుత్వాన్ని నిలదీసే వారికి బెయిలు రాకుండా అడుగడుగునా అడ్డు పడడం, ఏదో ఒక సాకుతో వారు ఎక్కువ కాలం జైలులో ఉండేట్టు చేయడమే ప్రభుత్వ వైఖరి అని స్పష్టంగా కనిపిస్తోంది.
బెయిలు మంజూరు చేసిన సందర్భంగా సుప్రీంకోర్టులో జరిగిన సంవాదం, ఆ తరవాత తీసుకున్న నిర్ణయం ఆసక్తికరమైనవి. తీస్తా సెతల్వాద్‌ విషయంలో సుదీర్ఘ వాయిదాలు వేసిన కేసులు, పూర్వోదంతాలు ఏమున్నాయో చెప్పమని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ప్రశ్నలు వేస్తున్నప్పుడు దిక్కు తోచని సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా నిందితురాలి గురించి నేర విచారణా ప్రక్రియ స్మృతి (సీఆర్‌.పి.సి.) సెక్షన్‌ 161, 164 ప్రకారం ఇచ్చిన వాంగ్మూలాల గురించి ప్రస్తావించారు. 164 ప్రకారం ఇచ్చే వాంగ్మూలాలు సీల్డ్‌ కవర్లో ఉంటే మీకెలా వచ్చాయి అని తుషార్‌ మెహతాను బెంచి ప్రశ్నించింది. సెతల్వాద్‌ గుజరాత్‌ ప్రభుత్వాన్ని, న్యాయవ్యవస్థను అపఖ్యాతి పాలు చేస్తున్నారనీ మెహతా వాదించారు. తుషార్‌ మెహతా ప్రస్తావించిన వాంగ్మూలాల పస ఏమిటో సెతల్వాద్‌ తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ తేల్చేశారు. ఈ వాంగ్మూలాలను న్యాయస్థానం ఇదివరకే తోసిపుచ్చిన వాస్తవాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సెతల్వాద్‌ మీద పోలీసులు చేసిన అభియోగం జకియా జాఫ్రీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా చేసినవే తప్ప మరేమీ లేదని ప్రధాన న్యాయమూర్తితో కూడిన బెంచి వ్యాఖ్యానించింది. గుజరాత్‌ హైకోర్టులో కేసులు ఎక్కువగా ఉన్నందువల్ల సుదీర్ఘ వాయిదాలు వేయవలసి వస్తోందన్ని తుషార్‌ మెహతా వాదనను ఖండిస్తూ రెండు రోజుల్లోనే బెయిలు మంజూరు చేసిన సందర్భాలు ఇటీవలి కాలంలోనే 28 ఉన్నాయని కపిల్‌ సిబల్‌ గుర్తు చేశారు. సెతల్వాద్‌ ఏ వ్యవస్థకూ, ఏ న్యాయమూర్తికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భమే లేదని సిబల్‌ అన్నారు. సెతల్వాద్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చిన వారు ఇంతకు ముందు ఆమె దగ్గర పని చేసేవారని, ఆమె తొలగించినందువల్ల వారు ఇలాంటి వాంగ్మూలాలు ఇచ్చారని సిబల్‌ నిరూపించారు. సెతల్వాద్‌ కృషివల్ల 2002 గుజరాత్‌ మారణకాండ బాధితులు అనేక కేసులు దాఖలు చేయగలిగారనీ చాలా సందర్భాలలో కోర్టులు వారికి న్యాయం చేశాయని కూడా సిబల్‌ తెలియ జేశారు. సెతల్వాద్‌ బెయిలు కోసం పెట్టుకున్న దరఖాస్తు గుజరాత్‌ హైకోర్టు పరిశీలనలో ఉంది కనక ఆ విచారణకు ఆటంకం కలిగించ కూడదని సుప్రీంకోర్టుకు చెప్పే సాహసం కూడా తుషార్‌ మెహతా చేశారు. హైకోర్టులో న్యాయం జరగ లేదనుకున్నప్పుడు ఎవరైనా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చునన్న సహజ న్యాయ సూత్రాన్ని కూడా ఆయన ఖాతరు చేయలేదు. తీస్తా సెతల్వాద్‌ తప్పు చేశారా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. ఆమెకు బెయిలుకు అర్హత ఉందా లేదా అన్నదే అసలు చర్చనీయాంశం. గుజరాత్‌ ప్రభుత్వం ఆమెకు బెయిలు మంజూరు చేయకుండా ఎన్ని అడ్డంకులు కల్పించాలని చూసినా సుప్రీంకోర్టు బెయులు హక్కు అన్న సూత్రానికి కట్టుబడి ఉందని భావించి తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా సానుకూల పరిణామం. న్యాయవ్యవస్థ కూడా అధికారంలో ఉన్న వారికి దాసోహం అన్న రీతిలో వ్యవహరించడానికి వేసిన అడ్డుకట్ట. ఏదో కేసు విషయంలో సుప్రీం వ్యాఖ్యల ఆధారంగా సెతల్వాద్‌ మీద కేసు మోపారు. సుప్రీం వ్యాఖ్యలకు వక్రభాష్యం చెప్పే వారికి ఈ బెయిలు గుణపాఠం కావాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img