Friday, February 3, 2023
Friday, February 3, 2023

సుప్రీంకోర్టు మాటే బేఖాతరు

మన సమాజం ఎలా ఉండాలని అనుకున్నామో, ఎలా ఉందో చూస్తే సమాజాన్ని వికృతీకరించడంలో విద్వేషప్రచారం ఎంత హానికరంగా తయారైందో అర్థం అవుతుంది. విద్వేష ప్రచారాన్ని నిలవరించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని గురువారం సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు బెంచీలు ఎత్తి చూపాయి. ఒక బెంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ నాయకత్వంలో ఉంటే, రెండో బెంచి న్యాయమూర్తి కె.ఎం.జోసెఫ్‌ నాయకత్యంలోనిది. ఏ మతం ఆసరాగా విద్వేషం రెచ్చగొట్టకూడదని ప్రభుత్వం అంగీకరించింది. ఏ మతం అన్న మాట వాడడంలోనూ విద్వేషానికి కారణం కాని మతాలను కూడా ప్రభుత్వం ఒకే గాటనకట్టి చూపించాలన్న ప్రయత్నం కనిపిస్తోంది. 2021 డిసెంబర్‌లో హరిద్వార్‌, దిల్లీలో రెండు ధర్మసన్సద్‌లు నిర్వహించారు. ఈ ధర్మసన్సద్‌లలో ముస్లింల మీద విద్వేషం విరజిమ్మారు. ఇలాంటి ప్రసంగాలు సమాజాన్ని నిట్టనిలువునా చీల్చేస్తాయి. మెజారిటీ మతం తరఫున మాట్లాడుతున్నాం అనుకునే వారు విద్వేషం పెంచడానికి కృషిచేస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని గత ఏడెనిమిదేళ్ల పరిస్థితి గమనిస్తే అర్థం అవుతుంది. ఈ ధోరణిపై దేశమంతటా తీవ్ర నిరసన వ్యక్తమైంది. అయినా ఉత్తరాఖండ్‌ పోలీసులు, దిల్లీ పోలీసులు గాఢ నిద్రలోంచి మేల్కొనకపోవడం విచిత్రంగానే కాదు అత్యంత ప్రమాదకరంగా తయారైంది. ఈ అంశం మీద కొంత మంది సుప్రీంకోర్టుకెళ్లారు. సుప్రీం కోర్టు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడమే కాక జవాబుదార్లుగా ఉండవలసిన వారికి నోటీసులు కూడా జారీచేసింది. విచిత్రం ఏమిటంటే గత ఏప్రిల్‌లో సుప్రీంకోర్టులో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు దిల్లీ పోలీసులు ధర్మసన్సద్‌లో విద్వేష ప్రసంగాలు ఏవీ జరగలేదని బాహాటంగా అబద్ధమాడారు. పైగా విద్వేష ప్రసంగాలు అంటున్న మాటలు ఒక మతం వారిని చైతన్యవంతులను చేయడానికి, ముప్పు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని మాత్రమే హెచ్చరించారని దిల్లీ పోలీసులు జంకు, గొంకు లేకుండా సాక్షాత్తు సుప్రీంకోర్టులోనే చెప్పారు. సుప్రీంకోర్టు పోలీసుల దుస్సాహసాన్ని గట్టిగా తప్పుబట్టినప్పుడు దిల్లీ పోలీసుల స్వరం 2022 మేలో మారింది. అప్పుడు ఒక ప్రమాణ పత్రం దాఖలు చేసి విద్వేషం రెచ్చగొట్టిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కానీ ఇప్పటిదాకా ఈ విషయంలో ఎలాంటి చర్యా తీసుకోకపోవడం అంతకన్నా కఠిన వాస్తవం. గురువారం ఈ అంశం మళ్లీ సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చినప్పుడు ఎనిమిది నెలలు గడిచినా పోలీసులు ఏ చర్యా తీసుకోలేదని రుజువైంది. ఈ అంశం సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ప్రస్తావనకు వచ్చింది. దర్యాప్తు మీరు ఏ విధంగా చేస్తున్నారు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విద్వేష ప్రసంగం 2021 డిసెంబర్‌లో జరిగితే ఐదు నెలల తరవాత ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేశారు. ఎనిమిదినెలల తరవాత కూడా మీరు చేసింది ఏమీ లేదుగదా అని సుప్రీంకోర్టు నిలదీసింది. 2022 మే నాలుగు తరవాత మీరేం చర్యలు తీసుకున్నారు అని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. మీరు ఎంతమందిని అరెస్టు చేశారు? దర్యాప్తు ఏ దశలో ఉంది ఎంతమందిని ప్రశ్నించారు అని అడగాల్సి వచ్చింది. పోలీసుల దగ్గర ఈ ప్రశ్నలకు సమాధానమే లేదు. రెండువారాలలోగా దర్యాప్తు అధికారి మా ప్రశ్నలకు జవాబు చెప్పాలి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిజానికి 2018లోనే సుప్రీంకోర్టు విద్వేషప్రచారంపై తహసీం పూనావాలా కేసులో మార్గదర్శకాలు జారీచేసింది. అంతకన్నా ముందే 2014లోనూ విద్వేష ప్రసంగాలను ఆషామాషీ వ్యవహారంగా చూడకూడదని చెప్పింది. విద్వేష ప్రసంగాలు చివరకు మానవ హననానికి దారి తీస్తాయి. అధికారంలో ఉన్నవారి దన్ను లేకపోతే ఏ పోలీసు అధికారీ సుప్రీంకోర్టు ఆదేశాన్ని పాటించకుండా ఉండడం సాధ్యం కాదు. 

న్యాయమూర్తులు కె.ఎం.జోసెఫ్‌, నాగరత్న విచారించిన కేసులోనైతే అసలు ఈ విషయంలో ప్రభుత్వ జోక్యమే ఉండకూడదు. కానీ పోలీసులు ఏ మాత్రం ఖాతరు చేయనందువల్ల ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామి కావలసి వచ్చిందని ఈ న్యాయమూర్తులు అన్నారు. ప్రధాన న్యాయమూర్తి విచారించిన కేసు కోర్టు ధిక్కారానికి సంబంధించింది. మహాత్మాగాంధీ మనవడు తుషార్‌గాంధీ ఈ కేసు దాఖలు చేశారు. న్యాయమూర్తి జోసెఫ్‌ నాయకత్వంలోని బెంచి ముందు ధర్మసన్సద్‌ల వ్యవహారం విచారణకు వచ్చింది. విద్వేష వ్యవహారాన్ని సుప్రీంకోర్టు ఎంత తీవ్రంగా పట్టించుకుందో ప్రభుత్వం అంతకన్నా ఎక్కువ అలసత్వం ప్రదర్శిస్తోంది. అయితే అత్యున్నత న్యాయస్థానం ఇలాంటి సందర్భాలలో నిర్దిష్టమైనచర్య తీసుకోకుండా కార్యనిర్వాహక వర్గాన్ని అభ్యర్థిస్తున్న రీతిలో మాట్లాడడం కూడా ఓ వైపరీత్యమే. నిర్లక్ష్యం చేసిన అధికారులపై కోర్టు ధిక్కార కేసు మోపవలసింది. కానీ అలా జరగలేదు.
నిజానికి విద్వేష ప్రసంగాలవంటి విషయంలో పోలీసులు ఎవరో ఫిర్యాదు చేసే దాకా ఆగనక్కర్లేదు. నేరుగా కేసు నమోదు చేయవచ్చు. అలా చేయకపోగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశం పాటించకపోవడం చాలా ప్రమాదకరం. 2020లో ఉత్తరాదిలో మతకలహాలు పెచ్చరిల్లిన దశలోనే భారత శిక్షాస్మృతిలో సెక్షన్‌ 295ఎ ప్రవేశ పెట్టాల్సి వచ్చింది. అయినా పోలీసులు చట్టం ప్రకారం తమ బాధ్యతలు నిర్వహించడానికి వెనుకాడుతున్నారంటే ఏ ప్రభుత్వానికీ పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించడం ఇష్టంలేదు. అసలు సమస్య విద్వేషం అంటే ఏమిటి అని నిర్ణయించడంలోనే ఉంది. ఇక్కడ మతాన్ని దృష్టిలో ఉంచుకునే వ్యవహరిస్తుండడం దారుణం. జంతర్‌ మంతర్‌లో కొద్ది కాలం కిందట పోలీసుల సమక్షంలోనే విద్వేషం రెచ్చగొట్టే సాహసం ప్రభుత్వ దన్ను లేకుండా జరిగిందికాదు. ఇదంతా పోలీసులు మైనారిటీలకు వ్యతిరేకంగా ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పోలీసుల మద్దతు తమకు ఉందన్న భరోసా హిందుత్వ వాదులకు ఉండడంలో ఆశ్చర్యం ఏముంటుంది? విద్వేషాన్ని రెచ్చగొట్టే వారికి, పోలీసులకు మధ్య ఒక విధమైన ఏకాభిప్రాయం ఉన్నట్టు అడుగడుగునా రుజువవుతోంది. ఇప్పుడు మరింత నగ్నంగా చెలరేగిపోతోంది. వెయ్యేళ్ల నుంచి హిందూ సమాజం ఇతర మతాలవారితో యుద్ధం కొనసాగిస్తోందనీ దీనికి స్పందనా తీవ్రంగానే ఉంటుందని ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేత మోహన్‌ భగవత్‌ అన్న మాటల వెనక అంతరార్థమే పోలీసుల నిర్లక్ష్యానికి కారణం అనడానికి గొప్ప పాండిత్యం అవసరంలేదు. పోలీసులే సుప్రీంకోర్టు మాట పట్టించుకోనప్పుడు టీవీ ఆంకర్ల మీద సుప్రీంకోర్టు ఆగ్రహం ప్రదర్శిస్తే ప్రయోజనం ఉంటుందని అనుకోలేం. టీవీ ఆంకర్లలో అనేకమంది గోదీ మీడియాలో భాగమన్నది బహిరంగ రహస్యమేగా! వాక్‌స్వాతంత్య్రాన్ని, భావప్రకటనా స్వేచ్ఛను బాహాటంగా ఉల్లంఘించేవారు ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నవారే. ఇంత జరుగుతున్నా మెతక వైఖరి అనుసరించే అత్యున్నత న్యాయస్థానం హిత బోధలు నిష్ప్రయోజనంగానే మిగిలిపోతాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img