Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

సైన్స్‌ లేకపోతే భక్తి ప్రచారమే లేదు!

డాక్టర్‌ దేవరాజు మహారాజు

మతము తలకు నెక్క / మతి పాదములకు జేరు/ మతము చిచ్చుపెట్టు మనుషులందు / మతము మట్టుబెట్టు మానవ విలువలు / మతము హితము కాదు మత్తు తప్ప అని అన్నాడొక తెలుగు కవి. ‘‘విద్యావంతులైనప్పటికీ మత విశ్వాసాలతో మూర్ఖంగా ప్రవర్తించేవారిని జబ్బు చేసిన మనుషులుగా పరిగ ణించాలి’’ అని అన్నారు హిందీ చలనచిత్ర గీత రచయిత జావెద్‌ అక్తర్‌. ఇప్పుడు మీడియాలో వస్తున్న వార్తలు, వార్తా కథనాల్ని గమనిస్తే ప్రథమ స్థానం రాజకీయాలది. చిన్న పత్రికల నుండి పెద్ద పత్రికల దాకా, ప్రాంతీయ టెలివిజన్‌ ఛానళ్ళ నుండి జాతీయ అంతర్జాతీయ ఛానళ్ళ దాకా ఏది చూసినా మీకు 50 శాతం లేదా అంతకంటే ఎక్కువగా రాజకీయాంశాలే ఉంటాయి. గల్లీ నాయకుల నుండి దిల్లీ నాయకుల దాకా వారి ఉపన్యాసాలు, వారి పర్యటనలు వగైరా. తరవాతి స్థానం 30 శాతం సినిమాలది. సినిమాలు ప్రదర్శించడం, సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు, సినిమా పాటలు పాడిరచడం వగైరా. 10 శాతం క్రీడా రంగ వార్తలు. 7 శాతం సామాజిక సమస్యలు 2.5 శాతం సాహిత్య కళా రంగాలకు చెందిన వార్తలుంటాయి. ఇవన్నీ పోగా మిగిలిన 0.5 శాతం శాస్త్ర, వైజ్ఞానిక రంగానికి చెందిన సమాచారం ఉంటుంది. ఏ రాకెట్‌ ప్రయోగం జరిగి నప్పుడో తప్ప, ఇవి ఎప్పుడూ ప్రధాన వార్తలు కావు. సైన్సుకు సంబంధించిన 0.5 శాతం సమయం / స్థలం పక్కన పెడితే, 95.5 శాతంలో అంతర్లీనంగా భక్తి ప్రవహిస్తూ ఉంటుంది. రాజకీయ నాయకుల నుండి క్రీడాకారులు, సినిమా నటులు గుళ్ళు దర్శించే వార్తలు. గుళ్ళో హారతుల ప్రత్యక్ష ప్రసారాలు, క్రీడాకారుణులు బోనాలెత్తుకోవడం, తీర్థయాత్రలు, దర్శనీయ పుణ్య స్థలాలు, స్థల పురాణాలు, మహిమలు, స్వాముల ఉద్బోధలు, ప్రవచనాలు వగైరా వగైరా కార్యక్రమం ఏదైనా దాని నేపథ్యంలో భక్తి ప్రచారం జోరుగా సాగుతుంది. మామూలు టెలివిజన్‌ ఛానళ్ళు, మామూలు పత్రికలూ కాక ప్రత్యేకంగా భక్తి ప్రచారానికి ఛానళ్ళు, పత్రికలూ ఉన్నాయి.
ఒక నవ యువకుడు అందమైన అమ్మాయిని ప్రేమిస్తున్నాడనుకుందాం. అది వారిద్దరి వ్యక్తిగత విషయం. దాన్ని లైవ్‌ ప్రసారం చేయనక్కరలేదు. అలాగే, ఈ భక్తీ అలాంటిదే! ఒక వ్యక్తి ఒక దేవుడితో అనుసంధానమైనాడనుకుందాంకానివ్వండి. అది అతడి/ఆమె వ్యక్తిగత విషయం. దానికి ప్రత్యక్ష ప్రసారాలు, ప్రచార ఆర్భాటాలు ఎందుకూ? ఒక యాభై యేళ్ళ కిందట ఇలాంటి కార్యక్రమాలు లేవు. భక్తులు నచ్చిన గుళ్ళకు వెళ్ళి వచ్చేవారు. ఇప్పుడు ఈ విపరీత ధోరణు లేమిటీ? కొత్తగా అందుబాటులోకొస్తున్న శాస్త్ర వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని భక్తి ప్రచారానికి వాడుకోవడం అవసరమా? సమాజాన్ని వెనక్కి నడిపించే ప్రయత్నాలు చేయడం భావ్యమా? ముందుకు దూసుకెళ్ళగల కొత్త కారుని రివర్స్‌గేర్‌లో వెనక్కి నడిపిస్తుంటే చూసేవాళ్ళు నవ్వుకుంటారు గానీ ప్రశంసించరు. ఒక ప్రాంతీయ పార్టీ రాజకీయ నాయకుడు ఉన్నాడనుకుందాం. అతని అనుచరులంతా అతని వ్యక్తిగత పూజకు ప్రాధాన్యమిస్తారు. కారణం తప్పకుండా అతను తమకు ఏదో పదవి ఇస్తాడని ఆశ. వ్యక్తిగత పూజయినా, దేవుడి పూజయినా కోర్కెల చిట్టాతో పూజలు చేయడమే కదా? అక్కడ సమర్పణ భావం, త్యాగనిరతి ఏదీ? సహృదయమేమీ? వ్యాపారం తప్ప? ‘‘కొన్ని కోట్ల నల్ల డబ్బు నీ హుండీలో వేస్తాను. నువ్వు నాకు తెల్లడబ్బు ప్రసాదించు స్వామీ!’’ అనేకదా కోరుకునేది? ‘‘నీకు బంగారు కిరీటం చేయిస్తాను. నన్ను స్కాముల్లోంచి బయటపడేయమనే’’ కదా వేడుకునేది? నిష్కామ కర్మ చేసేవారు ఏరీ? ఎక్కడ? భక్తి పేరుతో జరుగు తున్న మోసాలు, దుర్మార్గాలు, అమానవీయ అంశాలు కలిసి జరిపే ఈ వ్యాపా రాన్ని ఏమందాం? మొక్కులు తీర్చడానికి ప్రజా ధనాన్ని వాడే రాజకీయ నాయ కులనేమందాం? భక్తి ఒక లాభసాటి వ్యాపారమైపోయిందన్న విషయం రుజువైంది కదా? సామాన్య ప్రజలు ఇలాంటి విషయాలు ఆలోచించాలి. తమలో తాము చర్చించుకోవాలి. ఇక్కడ ఒక విషయం గమనిద్దాం. ప్రజల సొమ్ము భక్తికి పోతోంది. మరి ఆ భక్తి సొమ్ము ప్రజలకు చేరాలి కదా? చేరడం లేదు ఎందుకూ? భక్తులకు వసతుల పేరుతో ఏసీ సూట్స్‌ కడతారు, కొత్త ఆలయాలు, కొత్త మండపాలు కడతారు కానీ, సామాన్య జనానికి కావల్సిన కనీస అవసరాలకు ఖర్చు పెడుతున్నారా? ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు చేయాలి గాని, మూఢ విశ్వాసాలు మరింత బలపడడానికి ఖర్చు చేయడం సబబా? ఇవన్నీ దేశ పౌరులు ఆలోచించవల్సిన విషయాలు. ఈ వివరాలన్నీ ఇవ్వడం ఎందుకంటే మనం దేనికి ప్రాధాన్యమిస్తున్నామో, బేరీజు వేసుకోవడానికే తప్ప ఎవరినో, దేనినో విమర్శించడానికి కాదు. గుళ్ళు, గోపురాలు, ప్రార్థనా స్థలాలు ఇప్పుడు దర్శనీయ స్థలాలు కాదు, పరిస్థితి మారిపోయింది. అవగాహన పెరిగింది. విశ్వ రహస్యాల్ని ఛేదిస్తున్న పరిశోధనశాలలే మనకిప్పుడు దర్శనీయ స్థలాలు! దర్శించి అక్కడి విషయాలు, విశేషాలు గ్రహించి, ఆ సారాంశాన్ని భావితరాల వారికి అందిస్తూ ఉండాలి. మూఢ నమ్మకాల్ని వ్యాప్తి చేసే పుణ్యస్థలాలు కాదు, మాటల వాడకంలో కూడా మార్పు రావాలి. అలవాటు ప్రకారం ‘స్వర్గస్థు’లయ్యారు లాంటి పదాలు మానుకుంటే మంచిది. స్వర్గం ఎక్కడుందనీ? చనిపోవడమంటే ప్రకృతిలో ఐక్యమవడం, మట్టిలో కలిసిపోవడం. అంతే! భక్తితో సంబంధం లేకుండా శాస్త్ర పరిజ్ఞానం పెరుగుతూ వస్తోంది. శాస్త్ర పరిజ్ఞానం లేకపోతే మాత్రం భక్తి ప్రమోషన్‌/ప్రచారం ఉండదు. ఎందుకంటే భక్తి ప్రచారం పూర్తిగా శాస్త్ర పరిజ్ఞానం మీద ఆధారపడి ఉంది. గర్భగుడిలో జరిగే హారతి కార్యక్రమం కావొచ్చు, స్వామి కళ్యాణాలే కావొచ్చు, దేవుడి ఊరేగింపులే కావొచ్చు, దీపోత్సవాలో బ్రహ్మోత్సవాలో ఏవైనా కావొచ్చు. ఒక్క హిందూ మతానికి సంబంధించినవే కాదు, అన్ని మతాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలూ జనానికి చేరాలంటే ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా ఈ రోజుల్లో తప్పనిసరి! ప్రత్యక్ష వ్యాఖ్యానాలు, టెలివిజన్‌ ప్రసారాలు, పత్రికల ప్రత్యేక కథనాలు అవసరం. అన్నింటికీ ఆధారం శాస్త్ర పరిజ్ఞానం మాత్రమే. ఈ విషయం ఇంత స్పష్టంగా చెప్పేది ఎందుకంటే, మత సంబంధమైన, దైవ సంబంధమైన అన్ని కార్యక్రమాలకు ‘సైన్సే’ దిక్కవుతోంది! విచారించదగ్గ విషయమేమిటంటే మత మహానుభావులెవరూ, ‘సైన్సు’ గురించి మాట్లాడరు. కనీసం తెలుసుకోరు. ప్రయత్నమూ చేయరు. కలర్‌ ప్రింటింగ్‌ ఏ దేవుడి సృష్టో ఎవరైనా చెప్పగలరా? మైకు, ప్లాస్మా టీవీలు, కలర్‌ లైట్లు, డిజిటల్‌ డిస్‌ప్లేలు, ఆన్‌లైన్‌ బుకింగ్‌లు, ప్రసాదాల అమ్మకం ఒక్కటేమిటి? అన్నిటికి అన్నీ శాస్త్ర పరిజ్ఞానం మూలంగా నడుస్తున్నాయి. ఇవన్నీ ఏ మతానికి సంబంధించిన ఏ దేవుడు పెట్టిన భిక్షా కావు. లక్షల మంది భక్తులు ఇన్ని తీర్థయాత్రలకు, పుణ్య క్షేత్రాలకు, పవిత్ర స్థలాలకు తిరుగుతున్నారంటే బస్సు, రైలు, విమానాల బుకింగ్‌లు ఆన్‌లైన్‌లో చేసుకుంటున్నారంటే ఏ దేవుడి ప్రమేయం, ఏ మత ప్రమేయం ఇందులో ఉందీ? ఆలోచించనక్కరలేదా? మనిషి నిరంతర శోధన వల్ల, పరిశ్రమ వల్ల, కృషి వల్ల సాధించుకున్న వైజ్ఞానిక ఫలితాల్ని అప్పనంగా తమ తమ మూఢ భక్తికి, దాని మీద ఆధారపడ్డ వ్యాపారాలకూ వాడుకుంటున్నారు. తప్పకుండా ఇది నిరసించాల్సిన విషయం. పోనీ, వాడు కున్నా, ఏమైనా కృతజ్ఞతా భావం వ్యక్తం చేస్తారా అంటే అదీ ఉండదు. పైగా శతాబ్దాలుగా ఒక్కొక్కటిగా సాధించుకుంటూ వస్తున్న మనిషి విలువను, ఔన్న త్యాన్ని తగ్గించి ‘అంతా ఆ పై వాడి దయ’ అని తమ అజ్ఞానాన్ని ప్రకటించు కుంటారు. ఈ పరిస్థితి మారాలి! ఎవడి విశ్వాసం వాడి వరకే ఉంచుకుని, మానవ విజయాల్ని గుర్తించాలి. వాడి ఆత్మ విశ్వాసాన్ని పెంచాలి. అంతేగాని ‘‘నువ్వు పాపాత్ముడివి’’ అని ఎవడూ ఎవడికి చెప్పగూడదు.
మానవీయ విలువల గూర్చి, మానవత్వం గురించి, వైజ్ఞానిక విజయ పరంపర గురించి నాలుగు మంచి మాటలు చెప్పేవాళ్ళు మనకు కావాలి! మానవ జన్మ తుచ్ఛమైందనీ, పునర్జన్మల గురించి, జాతకాల గురించి చెప్పే మోసగాళ్ళను ఎంత దూరం పెడితే అంత మంచిది. సైన్సు మూల సూత్రాలను కాస్త తెలుసుకుని రమ్మనాలి. ఇంగితజ్ఞానం లేక అనర్గళంగా మాట్లాడే మహానుభావులు ఎంతటి వారైనా కావొచ్చు. నిస్సందేహంగా వారు అమాయకులో, అవివేకులో, అహం భావులో అయి ఉంటారన్నమాట! సమాజానికి వీరితో పనే లేదు. సమాజ స్వరూ పాన్ని అర్థం చేసుకుని, దాన్ని భవిష్యత్తులోకి నడిపించే వారితో మనకు ‘దోస్తానా’ ఉండాలే గాని, వెనక్కి నడపాలనుకునే వారిని వెనకే విడిచిపెట్టడం మంచిది. పనికిరాని వారి పరిజ్ఞానమంతా ఆత్మజ్ఞానం పేరుతో, దైవజ్ఞానం పేరుతో, ఆత్మ దర్శనం పేరుతో జనాన్ని నేరుగా మోసం చేయడమే! అనుమానం లేదు. దాన్ని నేరంగా పరిగణించే రోజు రావాలి! ప్రజాస్వామ్య వ్యవస్థలో దేశ రాజ్యాంగమే అన్నిటికీ ముఖ్యం. అందువల్ల ప్రపంచంలోని భక్తులందరూ నిజాలు గ్రహించడం ప్రారంభించాలి. వైజ్ఞానిక ప్రగతిని సాధించిన శాస్త్రవేత్తలకు కృతజ్ఞులై ఉండాలి. మనిషి సాధించిన విజయాలకు అబ్బురపడాలి. కల్పించుకున్న మాయలు మంత్రాలకూ కాదు. భ్రమలకు, అభూత కల్పనలకూ కాదు.
ఒక్కటంటే ఒక్కరోజు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరికరాల్ని పక్కన పెట్టి భక్తి కార్యక్రమాలు కొనసాగించమనండి చూద్దాం. భక్తిని ఒక పనిముట్టుగా వాడుకుంటూ జనాన్ని తమ గుప్పిట్లో పెట్టుకునే రాజకీయ, సినీ రంగాలు కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పక్కన పెట్టి తమ మనుగడ సాగించుకోమనండి… చూద్దాం! ‘తిన్నింటి వాసాలు లెక్కించినట్టు’ సైన్సును అన్ని రకాలుగా ఉపయో గించుకుంటూ దాన్ని అశ్రద్ధ చేయడం, దాని గూర్చి మాట్లాడక పోవడం మూర్ఖత్వం. మనిషి ఔన్నత్యాన్ని తగ్గించే ప్రయత్నం చేసే ఏ రంగమైనా వృధానే. రాగల కాలాలలో ‘‘పాండిత్యాని’’కి ‘‘జ్ఞానాని’’కి నిర్వచనాలు మార్చుకునే అవసరం వస్తుంది. మనిషి ఆత్మావలోకనం చేసుకోవడం, మనిషి తనను గూర్చి తాను తెలుసుకోవడం అంటే ఏకకణ జీవి నుండి ఇప్పటి మనిషి దాకా చేస్తూ వచ్చిన ప్రయాణం తెలుసుకోవడం! మానవుడిగా మారిన తర్వాత మానవత్వాన్ని నిలుపు కుంటూ మనిషి స్థాయిని మరింత ఉన్నతంగా పెంచుకోవడం మాత్రమే!! చివరగా ఒక మాట! మనం నిర్ణయాలు తీసుకునేప్పుడు మతానికీ, సైన్సుకు మధ్య ఘర్షణ వస్తే, సైన్సు వైపు నిలబడి సైన్సు సూచించిన మార్గాన్ని ఎంచుకోవడమే విజ్ఞత! ఆధునికత కూడా!! బి.పి. ఉన్నవాళ్ళు ఉప్పు తినడం మానేస్తున్నారు. షుగర్‌ ఉన్నవాళ్ళు చక్కెర తినడం మానేస్తున్నారు. మరీ? దైవభీతి ఉన్న జనం మోసాలు చేయడం మానుతున్నారా?
వ్యాస రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవ శాస్త్రవేత్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img