Monday, September 26, 2022
Monday, September 26, 2022

హమ్మయ్య! వరరవరరావుకు బెయిలు

బీమా కోరేగావ్‌ కేసులో ప్రసిద్ధ కవి వరవరరావుకు ఏడాదిన్నర న్యాయ పోరాటం తరవాత బుధవారం సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. అంతకు ముందు 2021 ఫిబ్రవరి 22న బొంబాయి హైకోర్టు ఆరు నెలల బెయిలు మంజూరు చేసింది. ఇప్పుడు ఆరోగ్య కారణాల రీత్యా సుప్రీంకోర్టు వరవరరావుకు పూర్తి స్థాయి బెయిలు మంజూరు చేసింది. దీనివల్ల 83 ఏళ్ల వరవరరావుకు కలిగే ప్రయోజనం ఏమిటంటే ఏదో చిలిపి కారణంతో ప్రాసిక్యూషన్‌ మోకాలు అడ్డితే తప్ప ఆయన మళ్లీ జైలుకు వెళ్లక్కర్లేదు. సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసినప్పటికీ బీమా కోరేగావ్‌ కేసు నడుస్తున్న మహారాష్ట్ర పరిధి, ముంబై నగర పరిధి దాటిపోకూడదని ఇంతకు ముందు బెయిలు మంజూరు చేసినప్పుడు బొంబాయి హైకోర్టు పెట్టిన ఆంక్షను తొలగించలేదు. ఈ బెయిలు ఆరోగ్య కారణాల రీత్యా మంజూరు అయినందువల్ల వరవరరావు ఆరోగ్య పరిస్థితి లేదా అనారోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌.ఐ.ఏ.)కు తెలియజేయాల్సి ఉంటుంది. బుధవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న క్రమంలో అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌ వి రాజు వాదన తీరు చూస్తే అవకాశం వస్తే కక్ష తీర్చుకోవడానికైనా ఆరోగ్య కారణాల రీత్యా మంజూరైన బెయిలును రద్దు చేయించే ప్రయత్నం కొనసాగదని చెప్పడానికి వీలు లేదు. బెయిలు మంజూరు చేసిన న్యాయమూర్తులు యు.యు. లలిత్‌, ఎస్‌ రవీంద్ర భట్‌, సుధాంశు ధులియాతో కూడిన బెంచి ఈ బెయిలును దుర్వినియోగం చేయకూడదని, సాక్షులతో మాట్లాడకూడదని, ఈ కేసులో దర్యాప్తును ప్రభావితం చేయకూడదని చెప్పింది. తనకు జరిగే వైద్యం గురించి ఎప్పటికప్పుడు ఎన్‌.ఐ.ఏ.కు తెలియజేయాలని కూడా ఆదేశించింది. మొత్తం మీద ఈ ఏడాదిన్నరగా వారానికొకసారి, రెండు వారాలకొకసారి, కోర్టు వాయిదా ఉన్నప్పుడల్లా ఏం జరుగుతుందో, ఈ ఉపశమనం ఎన్నాళ్లుంటుందో, తర్వాత ఏమవుతుందో అనే అనిశ్చితి, ఆందోళన ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుతో తొలగిపోయాయి. అదనపు సొలిసిటర్‌ జనరల్‌ విచారణ క్రమంలో అనుసరించిన వైఖరి, చేసిన వాదనలు చూస్తే న్యాయస్థానాల్లోనూ ఎప్పుడూ న్యాయమే జరుగుతుందని ఎందుకు చెప్పలేమో అర్థం అవుతుంది. అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి. రాజు వరవరరావును ఓ కిరాతకమైన నేరస్థుడిగా చిత్రించడానికి ప్రయత్నించారు. ఈ కేసులో పిటిషనర్‌కు విధించగల శిక్ష ఏమిటని న్యాయమూర్తి లలిత్‌ అడిగితే ‘‘మరణశిక్ష’’ అని రాజు జవాబిచ్చారు. పైగా వరవరరావు మీద ఇదివరకు ఉన్న 24 కేసుల గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. వరవరరావు మీద ఆ కేసులున్న మాట నిజమే. సికింద్రాబాద్‌ కుట్ర కేసుతో సహా అనేక కేసులు ఈ జాబితాలో ఉన్నాయి. కానీ ఈ కేసులన్నింటిలోనూ వరవరరావు నిర్దోషిగా తేలిన విషయాన్ని ఎస్‌.వి.రాజు కోర్టుకు చెప్పలేదు. అంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవ్యవస్థ ఇచ్చిన తీర్పుల మీద కూడా ఆయనకు నమ్మకం ఉందనుకోలేం. సుప్రీంకోర్టు మీద కించిత్తు గౌరవం ఉన్నా ప్రాసిక్యూషన్‌ తరఫు న్యాయవాది అయినా పనిగట్టుకుని న్యాయమూర్తులను పెడదారి పట్టించలేరు.
‘‘కేసు విచారణ ఎన్నాళ్లలో పూర్తవుతుంది’’ అని న్యాయమూర్తి లలిత్‌ వేసిన ప్రశ్నకు ‘‘నిందితులు పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ విచారణకు అడ్డంకులు సృష్టిస్తున్నార’’ని రాజు జవాబిచ్చారు. ‘‘విచారణ ఏ దశలో ఉంది?’’ ‘‘మీరు దీనికి ముగింపు ఎప్పుడు పలకదలచుకున్నారు?’’ ‘‘ఎంతమంది సాక్షులను విచారించాలి?’’ ‘‘నిందితులందరినీ ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదు?’’ ‘‘ఇంకా చార్జెస్‌ కూడ ఎందుకు ఫ్రేమ్‌ చేయలేదు?’’ వంటి ప్రశ్నలను న్యాయమూర్తులు లేవనెత్తినప్పుడు ఆయన దగ్గర నీళ్లు నమలడం తప్ప సమాధానమే కనిపించలేదు. ఈ కేసులో 400 మంది సాక్షులను విచారించవలసి ఉంది. ఒక్కొక్కరిని విచారించడానికి ఒక రోజు పడుతుందనుకున్నా కనీసం 400 పని దినాలు అవసరం అవుతాయి. న్యాయస్థానాల్లో విచారణ తంతు తెలిసిన వారెవరైనా మొత్తం కేసు తెమలడానికి కనీసం పదేళ్లయినా పడ్తుందన్న నిర్ధారణకే వస్తారు. విచారణ ప్రక్రియ మొదలు కావాలంటే నిందితుల మీద ఆరోపణల, సాక్ష్యాధారాల ప్రతులను నిందితులకు ఇవ్వవలసి ఉంటుంది. ఇదే విచారణకు మొదటి మెట్టు. ఆ పని ప్రాసిక్యూషన్‌ ఇంతవరకు చేయనే లేదు. పదహారు మంది నిందితుల్లో ఇద్దరికి మాత్రమే ఆరోపణల, సాక్ష్యాధారాల ప్రతులను అందించారు. అదంతా ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉన్న సరంజామానే. అదంతా కలిపి మాట్లాడితే తడిసి మోపెడు (ఎలక్ట్రానిక్‌ పరిభాషలో ఒక టి.బి.) ఉంటుంది. ఆ సమాచారం ప్రతులు తీసి ఇవ్వడం ప్రాసిక్యూషన్‌కు ఎప్పటికి సాధ్యం అవుతుందో తెలియదు. ఇద్దరు నిందితులకు మాత్రమే ఆ ప్రతులు అందించారు. అందుకే ఈ కేసు విచారణ పూర్తి కావడానికి పదేళ్లు పడ్తుందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఆనంద్‌ గ్రోవర్‌ అన్నారు. మూడేళ్లుగా నిందితులు జైలులోనే ఉన్నా ప్రభుత్వ పక్షం నిందితుల విచారణే మొదలు పెట్టలేదు. వరవరరావును ఓ భయంకరమైన నేరస్థుడిగా చూపించడానికి ఎన్‌.ఐ.ఏ. తరఫు న్యాయవాది పడరాని పాట్లు పడ్డారు. గతంలో బొంబాయి హైకోర్టు బెయిలు ఇచ్చినప్పుడు వరవరరావు ఆ బెయిలు షరతులను ఉల్లంఘించిన దాఖలాలూ లేవు. వరవరరావు మీద ఉన్న కేసు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం అసలు బెయిలు ఇవ్వడానికే అవకాశం లేదని కూడా ఎస్‌.వి.రాజు అన్నారు. కానీ ఇలాంటి కేసుల్లోనే న్యాయస్థానాలు బెయిలు మంజూరు చేసిన ఉదంతాలు ఉన్నాయి. కానీ బొంబాయి హైకోర్టు బెయిలు మంజూరు చేసినప్పుడు ప్రాసిక్యూషన్‌ దాన్ని సవాలు చేయకపోవడం ఇలాంటి కేసుల్లో బెయిలు అసాధ్యం అనడానికి వీలు లేదని నిరూపిస్తోంది. ఆరోగ్య కారణాల మీద బెయిలు మంజూరైన 17 నెలల కాలంలో కూడా వరవరరావు మూడు సార్లు ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది. అయినా అదనపు ప్రాసిక్యూటర్‌ జనరల్‌ మాత్రం ఆయన ఆరోగ్యం దివ్యంగా ఉందని వాదించారు. వరవరరావుకు ఇప్పుడు బెయిలు మంజూరు అయి ఉండవచ్చు. కానీ వయసు, ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుంటే స్వస్థలంలో కాకుండా ముంబై పరిధిలోనే ఉండాలన్న ఆంక్ష ఇబ్బందికరమే. బీమా కోరేగావ్‌ కేసు మోపడంలో ప్రభుత్వ లక్ష్యమే నిందితులను విచారించకుండానే క్షోభకు, శిక్షకు గురిచేయాలన్నట్టుగా ఉంది. ఈ కేసులో ప్రభుత్వ పక్షం అనుసరించిన వైఖరి కారణంగా మరో నిందితుడు, గిరిజనుల అభ్యున్నతి కోసం జీవితాంతం పాటుబడ్డ స్టాన్‌ స్వామి నిర్బంధంలో ఉండగానే మరణించారు. మరో న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్‌కు మాత్రం బెయిలు మంజూరు అయింది. ఈ కేసులో వరవరరావుతో సహా 16 మందిని అరెస్టు చేసి మూడేళ్లు దాటింది. ఇంతవరకు విచారణ ఊసే లేదు. అసలు విచారణ దిశగా ఒక్క అడుగూ పడ్డ దాఖలాలు లేవు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img