Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

హిందువుల ఓట్ల కోసం కాంగ్రెస్‌ వెంపర్లాట

వరసగా రెండు ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన తరవాత కూడా కాంగ్రెస్‌కు దారీ తెన్నూ కనిపించడం లేదు. హిందూ ఓట్లలో తమకూ వాటా ఉండాలని కాంగ్రెస్‌ తాపత్రయ పడ్తోంది. హిందువులు దేశ జనాభాలో అత్యధిక సంఖ్యాకులు కనక తాము ఆ మతం వారి ఓట్లను వదులుకోలేమన్న భావన కాంగ్రెస్‌లో గూడు కట్టుకుంది. అందుకే రాహుల్‌గాంధీ అయిదేళ్ల కింద గుజరాత్‌ శాసనసభకు ఎన్నికలు జరిగినప్పుడూ విసుగు లేకుండా కనిపించిన దేవాలయం గడపల్లాతొక్కి తానూ హిందువునే అని నిరూపించుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. తాను జంధ్యం వేసుకునే బ్రాహ్మణుడినేనని చెప్పుకోవడానికి ఎన్ని తంటాలు పడ్డారో లెక్కలేదు. భారత్‌ జోడోయాత్ర సందర్భంగా కూడా ఆయన ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. కాంగ్రెస్‌ ఇన్ని దశాబ్దాలుగా అనుసరించిన సెక్యులర్‌ విధానాన్ని ఇప్పుడు అంతగా పట్టించుకోవడం లేదు. కానీ మోదీ నాయకత్వంలో చెలరేగిపోతున్న హిందుత్వను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్‌కు మిగిలిన ప్రత్యామ్నాయ మార్గమల్లా సెక్యులర్‌బాట పట్టడమే. కానీ ఆ సెక్యులర్‌ విధానం పరిధి, పరిమితులు ఏమిటోకూడా కాంగ్రెస్‌కు అంతు చిక్కడం లేదు. 2014లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం ఎదుర్కొన్న తరవాత ఈ ఓటమికి కారణాలు అన్వేషించడానికి ఎ.కె.ఆంటొనీ నాయకత్వంలో సోనియా గాంధీ ఒక కమిటీ ఏర్పాటు చేశారు. బీజేపీ అనుసరించిన హిందుత్వవాదమే కాంగ్రెస్‌ ఓటమికి ప్రధాన కారణమని ఆంటొనీ కమిటీ తేల్చింది. ఎన్నికల్లో విజయం సాధించాలంటే హిందువుల ఓట్లు కూడా అవసరమేనని ఈ కమిటీ అభిప్రాయపడిరది. ఈ నివేదికను అప్పుడే కాంగ్రెస్‌ అటక మీదకు తోసేసింది తప్ప కార్యాచరణ పథకం ఏదీ రూపొందించలేదు. ఆందుకే 2019 సార్వత్రిక ఎన్నికలలోనూ మరోసారి ఓటమి పాలైంది. అక్కడినుంచి కాంగ్రెస్‌ ప్రాభవం కేంద్రంలోనే కాక దేశమంతా దినదినం క్షీణిస్తూనే వస్తోంది. ఇప్పట్లో తేరుకునే అవకాశమే కనిపించడం లేదు. నిజానికి 2019 ఎన్నికలలోనే పరిస్థితి మోదీకి అనుకూలంగా లేదు అన్న అంచనాలు కనిపించాయి. కానీ బీజేపీ మునుపటి కన్నా ఎక్కువ మెజారిటీతో అధికారం సంపాదించి తన పాలనను సుస్థిరం చేసుకుంది. కాంగ్రెస్‌మాత్రం కుదేలైంది. ప్రత్యామ్నాయం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. 2014 లో ఓటమి ఎదురైన దాదాపు ఎనిమిదన్నరేళ్లకు ఎ.కె.ఆంటొనీ మళ్లీ తన మునుపటి సిఫార్సును పునరుద్ఘాటిస్తున్నారు. ముస్లింల ఓట్లతో పాటు హిందువుల ఓట్లూ విజయం సాధించడానికి అత్యవసరం అని అంటున్నారు. నిజానికి ఆంటొనీ క్రియాశీల రాజకీయాల నుంచి విరమించుకున్నారు. కానీ ఆయన ఇప్పటికీ గౌరవనీయమైన నాయకుడే. ఆయన మాటకు ఇప్పటికీ విలువఉంది. పట్టించుకునేవారు ఎవరు అనేదే అసలు సమస్య. మోదీని ఓడిరచడానికి కాంగ్రెస్‌కు హిందువుల ఓట్లు కూడా అవసరమేనన్నది బ్రహ్మ రహస్యం ఏమీకాదు. కానీ ఓటమితో తేరుకోని కాంగ్రెస్‌ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. సుదీర్ఘకాలం అధికారానికి అలవాటుపడిన కాంగ్రెస్‌కు, ఆ పార్టీ నాయకులకు అధికారం లేకపోయేసరికి పరిస్థితి అగమ్య గోచరంగా కనిపిస్తోంది. కేవలం ముస్లింల ఓట్లతో కాంగ్రెసే కాదు, ఏ పార్టీ గెలిచిన సందర్భమే లేదు. దేశంలో అత్యధిక సంఖ్యాకులు హిందువులైనప్పుడు 20శాతం కూడా దాటని మైనారిటీలన్నీ కట్టగట్టుకుని బీజేపీకి వ్యతిరేకంగా ఓటువేసినా ఫలితం ఏమీ ఉండదు. విజయం సాధించడానికి ఏ పార్టీకైనా భిన్నవర్గాల వారి మద్దతు అవసరమే. కాంగ్రెస్‌ దశాబ్దాలుగా అనుసరించిన సెక్యులర్‌ విధానానికి తిలోదకాలిచ్చింది. ముస్లింల సమస్యల గురించి మాట్లాడితే తమకు ఎక్కడ ముస్లింలను సంతృప్తిపరిచే రాజకీయాలు అనుసరిస్తున్నారన్న ముద్ర పడుతుందోనన్నది కాంగ్రెస్‌ను తాజాగా పీడిస్తున్న భయం. మెజారిటీ మతస్థులైన హిందువులందరూ కట్టగట్టుకుని మోదీకే ఓట్లు వేయడంలేదు. ఆ మాటకొస్తే ఏ పార్టీకీ ఆ సౌలభ్యం ఎప్పుడూ లేదు. ముస్లింలు కూడా మూకుమ్మడిగా ఒకే పార్టీకి ఓటువేసిన ఉదాహరణా లేదు.
మతతత్వం, ప్రలోభాలు, ధనప్రభావం, కండబలం ఎన్నికలలో విజయం సాధించడానికి కొంతమేరకు ఉపకరిస్తూ ఉండవచ్చు. కానీ అవి మాత్రమే విజయానికి సోపానాలు కావు. నిర్దిష్టమైన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం కాంగ్రెస్‌ మానేసి చాలాకాలం అయింది. జాతీయోద్యమక్రమంలో ఎదిగిన కాంగ్రెస్‌ ఆనాటి సిద్ధాంత ప్రాతిపదికలను గాలికి వదిలేసింది. కుహనా సెక్యులరిజం అని అడ్వాణీ దూషిస్తుంటే కాంగ్రెస్‌ కూడా అదే నిజమనుకుంది. అసలైన సెక్యులర్‌ విధానం అంటే ఏమిటో నిరూపించడానికి కాంగ్రెస్‌ ఇటీవల ప్రయత్నించిన సందర్భమే లేదు. బీజేపీలాగే హిందుత్వంవేపు మొగ్గితే ఓట్లు రాలవు అన్న వాస్తవాన్ని కాంగ్రెస్‌ గ్రహించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ముస్లింలు కాంగ్రెస్‌కు అండగా నిలిచిన ఇటీవలి సందర్భాలలో కూడా కాంగ్రెస్‌ మీద అభిమానం కారణంకాదు. బీజేపీని ఓడిరచగలిగే సత్తాఉన్న రాజకీయ పక్షంకోసం ముస్లింలే కాదు, మతతత్వాన్ని నిరసించే వారందరూ అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ముస్లింలు వివిధ ప్రాంతీయ పార్టీలకు మద్దతిస్తున్నారు. విజయానికి హిందువుల ఓట్లూ అవసరమేనన్న ఆంటోనీ కమిటీ నివేదికనూ యథాతథంగా అమలు చేయడం సాధ్యం కాదు.
సెక్యులర్‌ విధానాలను పరిపుష్టం చేయడం ద్వారానే బీజేపీకి అనుకూలంగాఉన్న హిందువుల ఓట్లలో ఎవరైనా తగిన వాటా సంపాదించగలరు. దీనికి కావాల్సింది హిందుత్వం వేపు మొగ్గడంకాదు. సెక్యులర్‌ విధానాలను నిటారుగా నిలబడి అనుసరించడం. ఈ ధర్మ సూక్ష్మాన్ని గుర్తించే దశలో కాంగ్రెస్‌ ఉన్నట్టు లేదు. ప్రస్తుత పరిస్థితిలో సెక్యులరిజం అంటే ఏమిటో కాంగ్రెస్‌ నికరంగా సైద్ధాంతిక నిర్ధారణకు రావాల్సి ఉంది. ఆంటొనీ నివేదిక గురించి కాంగ్రెస్‌ వారికి, ముఖ్యంగా ఆ పార్టీ అధికార ప్రతినిధులకు మళ్లీ గుర్తుచేయవలసిన అగత్యం ఉంది. గోదీమీడియా మోదీ కీర్తిగానంలో తలమునకలై ఉండొచ్చు. అంతమాత్రంచేత టీవీ చానళ్లలో చర్చలకు, సంవాదాలకు కాంగ్రెస్‌ దూరంగా ఉంటే చివరకు లబ్ధిపొందేది బీజేపీనే. కాంగ్రెస్‌ హిందువుల ఓట్ల కోసం వెంపర్లాడుతోందన్న విమర్శలు అప్పుడే మొదలైనాయి. ఇంతకాలం కాంగ్రెస్‌ హిందువులను అవమానించిందన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. ‘‘హిందూ తీవ్రవాదం’’, ‘‘కాషాయ తీవ్రవాదం’’, హిందుత్వను కాంగ్రెస్‌ బోకో హరాం, ఐ.ఎస్‌.ఐ.ఎస్‌.తో సమానంగా పరిగణిస్తోందన్న విమర్శల వెనక ఉన్న ఈ నేపథ్యాన్ని విస్మరించకూడదు. దేశవనరుల మీద ముస్లింలకు మొదటి హక్కు ఉందని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ అనలేదా అని ప్రశ్నించడానికి అవకాశం ఏర్పడుతోంది. సెక్యులరిజానికి కాలం చెల్లలేదు అని గ్రహిస్తే తప్ప కాంగ్రెస్‌కు దారి కనిపించదు. హిందుత్వకు మరో రకమైన హిందుత్వం ఎప్పటికీ సమాధానం కాదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img