Monday, September 26, 2022
Monday, September 26, 2022

హైదరాబాద్‌ చరిత్ర తస్కరులు

చరిత్రలో తమకు లేని స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవ డానికి బీజేపీ, తెలంగాణ రాష్ట్ర సమితి పోటీలు పడ్తున్నాయి. మొట్ట మొదటి సారి కేంద్ర ప్రభుత్వం శనివారం హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని పాటిస్తుందట. అమిత్‌ షా సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో హైదరాబాద్‌ విమోచన దినం సందర్భంగా త్రివర్ణ పతా కాన్ని అవిష్కరిస్తారట. ఈ సంబరానికి పొరుగు రాష్ట్రాలైన కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌ నాథ్‌ షిండేకు ఆహ్వానాలు వెళ్లాయి. వారు వేంచేస్తారట. ఈ రెండు రాష్ట్రాలలో కొంత భాగం ఇదివరకు హైదరాబాద్‌ సంస్థానంలో భాగంగా ఉండేది. హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయినప్పుడు అప్పటి హోం మంత్రి సర్దార్‌ పటేల్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు కనక ఇప్పుడు అమిత్‌ షా కూడా అదే పని చేస్తారట. అమిత్‌ షా ఒక్క రోజు హైదరాబాద్‌ పర్యటనలో మరో మహత్తర కార్యక్రమం కూడా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ‘‘సేవా కార్యక్రమం’’ చేపడ్తారట. ఆజాదీకా అమృతోత్సవంలో హైదరా బాద్‌ ‘‘విమోచన’’ను కూడా కేంద్ర ప్రభుత్వం కలిపేసింది. అమిత్‌ షా పాల్గొనే కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర రావు (కె.సి.ఆర్‌.) ను కూడా ఆహ్వానించారు. కానీ హైదరాబాద్‌ విలీన దినో త్సవ ఖ్యాతిలో ఆయనా తమకు భాగం ఉందనుకుంటున్నారు కనక ఆయన విలీన దినోత్సవాన్ని ‘‘తెలంగాణ సమైక్యతా దినోత్సవం’’గా జరపాలని నిర్ణ యించారు. అందువల్ల ఆయన అమిత్‌ షా సభకు వెళ్లకపోవచ్చు. కె.సి.ఆర్‌. కూడా ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. లేని కీర్తిని సొంతం చేసుకోవడానికి అమిత్‌ షా, కె.సి.ఆర్‌. ప్రయత్నిస్తున్నారు. కీర్తి అపహరణలో విడివిడిగా అయినా ఇద్దరూ ఒకే పాత్ర పోషిస్తున్నారు. తెలం గాణా రాజకీయాల్లో అసదుద్దీన్‌ ఒవైసీ నాయకత్వంలోని మజ్లిస్‌ ఇత్తెహా దుల్‌ ముస్లిమీన్‌ తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి నడుస్తోంది కనక సెప్టెం బర్‌ 17ను జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని ఒవైసీ అంటున్నారు. ఆయన అధ్వర్యంలో ‘‘తిరంగా బైక్‌ ర్యాలీ’’ జరుగుతుంది. అమిత్‌ షా సభకు, కె.సి.ఆర్‌. సభకు హాజరవుతారా అని ఒవైసీని అడిగితే వారు ‘‘జాతీయ సమైక్యతా దినం’’గా పాటిస్తే వెళ్తానంటున్నారు. కె.సి.ఆర్‌. ఏమో దీనికి తెలంగాణ సమైక్య దినంగా నామకరణం చేశారు. విచిత్రం ఏమిటంటే ఇంతవరకు బీజేపీ ప్రభుత్వం కానీ, మజ్లిస్‌ కానీ హైదరాబాద్‌ విలీనాన్ని నిర్వహించనే లేదు. మరో విశేషం ఏమిటంటే గుజరాత్‌ సమైక్య దినాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహించడం లేదు అని కె.సి.ఆర్‌. ప్రశ్నిస్తున్నారు. తెలంగాణాలో బలపడాలని బీజేపీ ఇటీవల అత్యుత్సాహం ప్రదర్శించడంవల్లే కె.సి.ఆర్‌. ఈ విషయంలో బీజేపీని నిలదీస్తున్నారు. 2018లో బీజేపీ తెలంగాణలో ఒక్క స్థానాన్నే సంపాదించింది కాని ఆ తరవాత జరిగిన ఉప ఎన్నికలలో మూడు స్థానాలు సాధించింది. హైదరా బాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలోనూ బీజేపీ మంచి ఫలితాలే సాధించింది. బీజేపీ బలపడితే కె.సి.ఆర్‌.కు నష్టం కనక ఈ మేరకు ఆయన బీజేపీ వ్యతిరేకే. ఇతరులు కష్టపడి సాధించిన విజయాలను తమ ఖాతాలో వేసుకోవడం సంఫ్‌ు పరివార్‌కు చేతనైనట్టుగా మరే పక్షానికి సాధ్యం కాదు. హైదరాబాద్‌ సంస్థానాధిపతిగా 37 ఏళ్లపాటు ఇష్టారాజ్యం చెలాయించి ప్రజలను పీల్చి పిప్పి చేసిన ఆఖరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ను గద్దె దించడంలో సంఫ్‌ు పరివార్‌ పాత్ర ఇసుమంతకూడా లేదు. కానీ ప్రతి ఏటా సెప్టెంబర్‌ 17వ తేదీ వచ్చే సరికి బీజేపీ సంబరాలు చేసుకోవాలని తెగ ఆయాసపడిపోతూ ఉంటుంది.
నిజాం గద్దె దిగడానికి సర్దార్‌ పంపిన సేనలే కారణమని నమ్మే వారికి కొదవ లేదు. కానీ సెప్టెంబర్‌ 13న పటేల్‌ పంపిన సేనలు హైదరాబాద్‌ పొలిమేరల్లోకి ప్రవేశించే నాటికే ఉస్మాన్‌ అలీ ఖాన్‌ జీవచ్ఛవంలా మారి పోయారు. భారత సేనలు ఒక్క తుపాకీ గుండైనా పేల్చకుండానే నిజాం లొంగిపోయాడు. మానసిక పరివర్తనవల్లో, చాంద్రాయణ వ్రతం చేసిన పిల్లిలాగా హఠాత్తుగా సాధు జీవి అయినందువల్లో ఆయన గద్దె వీడలేదు. అంతకుముందు 1946 నుంచి కమ్యూనిస్టు పార్టీ కొనసాగించిన చరి త్రాత్మక సాయుధ పోరాటం కారణంగానే నిజాం చేష్టలుడిగిపోయి ఉన్నారు. మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ గద్దెనెక్కిన దశాబ్దానికే హైదరాబాద్‌ సంస్థాన ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్ష పెరిగిపోయింది. 1930 నాటికి ఆంధ్ర మహాసభ అవతరించింది. ఆ రోజుల్లో రాజకీయాలు పాలకులకే పరిమితం. ప్రజలకు రాజకీయాలతో సంబంధం ఉండడానికే వీలు లేదు. తెలుగు భాషా, సంస్కృతి నిజాం ఏలుబడిలో కనుమరుగైనంత పనైంది. నిజాం తెలుగు భాషను విపరీతంగా ఈసడిరచే వారు. ‘‘తెలంగీ బేఢంగీ’’ అని ఎద్దేవా చేసేవారు. ఇలాంటి స్థితిలోనే ఆంధ్ర మహాసభ ఒక్కో అడుగే ముందుకు వేసింది. ఇంకో వేపు హిందూ మతంలో ఛాందసత్వాన్ని తొలగించడానికి, సంస్కరణలు ప్రవేశ పెట్టడానికి ఏర్పడిన ఆర్య సమాజం ప్రగతిశీల వైఖరి అనుసరించేది. ఆర్య సమాజంలో సంస్కరణ భావాలు ఉన్నందువల్ల దేశభక్తి ఉన్న వారు ఆర్య సమాజంతో కలిసి పని చేసేవారు. తొలి దశలో కమ్యూనిస్టులుగా మారిన వారిలో అనేక మంది ముందు ఆర్యసమాజంలో ఉండి తరవాత కమ్యూనిస్టులైన వారే. అలాగే పౌరహక్కుల కోసం ఆర్య సమాజం పాటు పడేది. ఆర్య సమాజం హిందూ మతోద్ధరణకు ఏర్పడ్డ సంస్థే అయినా హిందూమతోన్మాదం లేశమంత కూడా ఉండేది కాదు. ఈ ధోరణి ప్రగతిశీల శక్తుల్ని ఆకర్షించింది. కానీ 1939లో కమ్యూనిస్టు భావాల వేపు ఆకర్షితులైన మఖ్దూం మొహియుద్దీన్‌, డా. రాజ్‌ బహదూర్‌ గౌర్‌, జవాద్‌ రజ్వీ, ఆలం కుందుమిరి, చంద్ర గుప్త చౌదరి లాంటి వారు కామ్రేడ్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఆంధ్ర మహాసభను చాలా ప్రభావితం చేసింది. ఒక రకంగా ఇది హైదరాబాద్‌ సంస్థానంలో కమ్యూనిస్టు పార్టీ లాంటిదే. ఆంధ్ర మహాసభ కార్యకలాపాలలో నిమగ్నమైన రావి నారాయణ రెడ్డి, మఖ్దుం మొహియొద్దీన్‌, బద్దం ఎల్లా రెడ్డి 1946 జులై నాలుగున సాయుధ పోరాటానికి పిలుపు ఇచ్చారు. ఈ పోరాటంలో నాలుగు వేలమంది కమ్యూనిస్టులు నేలకొరిగారు. కమ్యూనిస్టు పార్టీ నిజాంకు వ్యతిరేకంగా భీకరమైన సాయుధ పోరాటం కొనసాగిస్తున్న దశలోనే కొత్తగా అధికారంలోకి వచ్చిన భారత ప్రభుత్వం 1947 నవంబర్‌ 29న నిజాంతో యథాతథ ఒప్పందం కుదుర్చుకుంది. అంటే నిజాం నిరంకుశత్వం కొనసాగడాన్ని అనుమతించింది. ఏమైతేనేమి 1948 సెప్టెంబర్‌ 17న నిజాం భారత యూనియన్‌లో విలీనం కావడానికి అంగీకరించారు. నిజాం ముస్లిం కనక ఆయనను గద్దె దించడాన్ని సంఫ్‌ు పరివార్‌ సంకుచిత మత దృష్టితోనే చూస్తోంది. స్వాతంత్య్ర పోరాట పుటల్లో తమకు స్థానమే లేదు కనక అసలు చరిత్రను సంఫ్‌ు పరివార్‌ వక్రీకరిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img