Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అకాల వర్షాలు`అపార నష్టం

రాష్ట్రంలో దాదాపు పదిహేను రోజులుగా కురిసిన అకాల వర్షాలకు రైతులు అపారంగా నష్టపోయారు. దీని ప్రభావం రైతుల వరకు మాత్రమే పరిమితంకాదు. ప్రజలందరిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. రాష్ట్రంలో 22 రకాల పంటలు వేశారని అధికారులు తెలిపారు. ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షాలు రాష్ట్రంలో దాదాపు 800 గ్రామాల పరిధిలోని పంటలను నాశనం చేశాయి. దాదాపు రూ.600 కోట్లకు పైగా నష్టం జరిగిందని అంచనా. వరి, జొన్న, మొక్కజొన్న, కొర్ర, మిర్చి, పసుపు, అరటి, మామిడి, నిమ్మ, చీనీ తదితర పంటలు బాగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాల వల్ల పంటలు ఆయా సీజన్లలో తడిసి, రంగుమారి, సరైన ధర రాక రైతులు నష్టపోతూనే ఉన్నారు. అయితే నిండు వేసవిలో రెండు వారాలకుపైగా కురిసిన వర్షాలు పంట పొలాలను ముంచెత్తాయి. వరి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలు కోసిన తర్వాత కల్లాల్లో, రోడ్డు పక్కన ఆరబెడతారు. ఇలా ఆరబెట్టిన వ్వవసాయ ఉత్పత్తులన్నీ తడిసిపోయి మొలకెత్తుతున్నాయి. అలాగే రంగు మారుతున్నాయి. వీటిని మార్కెట్‌లో అమ్ముకోవాలంటే తక్కువ ధర లభిస్తుందన్నది తెలిసిందే. అసలే పంట తడిసిపోయి మొలకెత్తిన వైనాన్నిచూసి రైతు బెంబేలు పడుతున్న సమయంలో కోసి కల్లాల్లో ఆరబెట్టుకున్న పంటలకు నష్టపరిహారం ఇవ్వలేమని రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పిన మాట రైతులకు శరాఘాతం అవుతుంది. పొలాల్లో కోయ కుండా ఉన్న దెబ్బతిన్న పంటలకు మాత్రమే నష్ట పరిహారం ఇస్తామని అన్నారు. అంతేకాదు జాతీయ, రాష్ట్ర విపత్తుల సహాయనిధి మార్గ దర్శకాల ప్రకారం, 33శాతం కంటే ఎక్కువగా దెబ్బతిన్న పంటలకు మాత్రమే పరిహారం ఉంటుందట. తడిసిన ధాన్యం వల్ల నష్టం రాకుండా ఉండేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచనలిస్తారట! ఈ నియమనిబంధనలు దశాబ్ద్దాలుగా అమలు చేస్తున్నారు. 33శాతం దెబ్బతిన్నాయని అంచనా వేయడానికి వెళ్లిన పరిశీలకులు నైపుణ్యాన్ని బట్టి నిర్ణయం ఉండవచ్చు. అప్పుడు కూడా నష్టపోయేది రైతే.
రాష్ట్రంలో దాదాపు ఆరు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిని ఉండవచ్చునని అనధికార అంచనా. 15 రోజులలో వ్యవసాయ అధికారులు పొలాలను పరిశీలించి నష్టాలను ఆంచనా వేస్తేగానీ పంటనష్టం జరిగిన భూవిస్తీర్ణం తెలియదు. అంటే రైతులు 15 రోజులుగా లబోదిబో మంటున్నా అధికారులు గానీ, మంత్రులుగానీ పెద్దగా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కనీసం ఏరియల్‌ సర్వేచేసి తాత్కాలిక పరిహారం కొంతైనా రైతులకు అందిస్తే కొంత ఉరట పొందే అవకాశం ఉండేది. నెలరోజుల తర్వాత నష్టాల అంచనా నివేదికను కేంద్రానికి పంపితే అప్పుడు ప్రభుత్వం తీరిగ్గా స్పందించవచ్చు. పరిశీలకులు బృందాన్ని పంపవచ్చు.
ప్రధానమంత్రితో సహా మంత్రివర్గమంతా కర్నాటకలో తిష్టవేసి ఎన్నికల ప్రచారంలో ఉండగా, అనేక రాష్ట్రాల్లో అకాలవర్షాలకు జరిగిన పంట నష్టం గురించి పట్టించుకొని స్పందించేదెవరు? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వేగంగా కదిలి రైతులను ఆదుకోవాలి. అలాగే కోసినపంట తడిసినప్పటికీ పరిహారం ఇవ్వలేమని చేతులెత్తేయడం ఎంత మాత్రం న్యాయం కాదు. ప్రతి రైతు ముఖంలో నవ్వు చూడాలి, అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్య మంత్రి చెప్పారు. అయితే ద్వివేది చెప్పినదానికి, ముఖ్యమంత్రి అదేశానికి చాలా తేడా ఉంది. తడిసి కల్లాల్లో ఉన్న ధాన్యానికి సైతం నష్టాన్ని అనుసరించి పరిహారం చెల్లించేందుకు ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలి. ఒకవైపు పంట ఇంకా కల్లాల్లో రోడ్లపక్కన ఉన్న సమయం లోనే తుపాన్‌ ముప్పు పొంచి ఉంది. ఆకాల వర్షాలతో తల్లడిల్లుతున్న రైతులకు ఈ వార్త వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఆగ్నేయ బంగాళా ఖాతంలో వాయు గుండం బలపడి తుఫానుగా మారే అవకాశాలు న్నాయని వాతావరణ పరిశోధనా సంస్థ హెచ్చరింది. ఈ నేపధ్యంలో వర్షాలు మళ్లీ రాష్ట్రంపై పెనుప్రభావం చూపే అవకాశం ఉంది. ధాన్యాన్ని మిల్లులకు, గిడ్డంగులకు తరలించడం ఆర్బీకేల ద్వారా ధాన్యాన్ని త్వరితంగా మద్దతు ధరకు కొనుగోలుచేసి, వెంటనే డబ్బు చెల్లించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
గత కొన్ని సంవత్సరాలుగా అకాల వర్షాలు రైతుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఎండలు మండే కాలంలో భారీ ఈదురుగాలులు, వడగండ్లు, పిడుగులతో కూడిన కుండపోత వర్షాలు రబీ పంటలను ఎంతగానో నష్టపరుస్తున్నాయి. చేతికి వస్తాయని రైతు అశపడుతున్న దశలో భారీగా నష్టపడి అంతిమంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. ఈ పరిస్థితి భూతాపం రోజురోజుకీ అధికం కావడం కారణం. భూతాపం పెరగడానికి మానవచర్యలే. అంతకంటే ముఖ్యంగా పాలక విధానాలు ఈ దుస్థితికి దారితీస్తున్నాయి. ప్రకృతిని ధ్వంసం చేశాము. పర్యావరణం తిరిగి బాగుచేయలేనంతగా కలుషితమైంది. భూతాపాన్ని కట్టడిచేసి విపత్తులు పెరగకుండా తగు చర్యలు తీసుకునేందుకు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 27 అంతర్జాతీయ సదస్సులు జరిగి తీర్మానాలు ఆమోదించారు. వీటిని అమలు చేయడంలోనే పాలకులు విఫలమవుతున్నారు. ప్రమాదకరమైన విషజ్వరాలు, అంటువ్యాధులు, అనావృష్టి, అధిక వర్షాలు, తదితర విపత్తులకు అంతులేకుండా పెరుగుతున్న భూ ఉష్ణోగ్రతలు ప్రధాన కారణం. భూ ఉష్ణోగ్రతలు తగ్గడానికి ప్రభుత్వాలు, ప్రజలు అవసరమైన చర్యలను తీసుకోకపోతే మున్ముందు విపత్తులు పెరుగుతాయని, మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని శాస్త్రవేత్తలు చేస్తున్న హెచ్చరికలను ఇప్పటికైనా పట్టించుకోవాలి. ధరిత్రిని పరిరక్షించుకునే బాధ్యత మనదే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img