Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అడకత్తెరలో జమ్మూ-కశ్మీర్‌

రాష్ట్ర ప్రతిపత్తి తొలగించి జమ్మూ-కశ్మీర్‌ను ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాక్‌ను మరో కేంద్ర ప్రాలిత ప్రాంతంగా మార్చిన తరవాత అక్కడి పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. పరిస్థితి కుదుటపడ్తోందని, తీవ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పడ్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆలపిస్తున్న యుగళ గీతానికీ వాస్తవానికి బొత్తిగా పొంతనే లేదు. గవర్నర్‌ పాలనలో 2019 నుంచి ప్రభుత్వం తీవ్ర మైన దమనకాండకు పాల్పడుతుండడం స్థానిక ప్రజల అనుభవం మాత్రమే కాదు. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంత ప్రజల వాక్‌ స్వాతం త్య్రాన్ని, భావప్రకటనా స్వేచ్ఛను, వ్యక్తిగత స్వేచ్ఛను, కడకు భద్రతను కూడా హరించి వేస్తున్నాయి అని అంతర్జాతీయ క్షమా సంస్థలాంటివి ఘోషిస్తు న్నాయి. జనం ఇష్టానుసారం తిరగడానికీ వీలు లేదు. న్యాయం అందని మ్రాని పండు అయిపోయింది. జమ్మూ-కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక పరి స్థితిని లాగేసిన తరవాత ఒక వేపు పాలక వర్గ దాష్టీకాలు తీవ్ర స్థాయికి చేరితే మరో వేపు ప్రపంచం అక్కడి పరిణామాలను నిశి తంగా పరిశీలించడం మొదలైంది. ఐక్య రాజ్యసమితి పౌరహక్కుల విభాగం లాంటి వ్యవస్థలు జమ్మూ-కశ్మీర్‌లో పౌరుల స్వేచ్ఛకు కలుగుతున్న విఘాతంపై విపరీతమైన విమర్శలు గుప్పిస్తున్నాయి. అంతర్జా తీయ నివేదికలను తాము నమ్మబోమని మోదీ ప్రభుత్వం వితండ వాదానికి దిగుతోంది. ఆ ప్రమాణాలను మేం ఒప్పం అని చెప్పడానికి సాహసిస్తోంది. అంతర్జాతీయ క్షమా సంస్థ గత జులై నుంచి ఆగస్టు వరకు జమ్మూ కశ్మీర్‌ లోని వివిధ వర్గాల వారిని సంప్రదించి సేకరించిన సమాచారం దిగ్భ్రాంతి కరంగా ఉంది. ఆ సంస్థ అక్కడి పత్రికా రచయితలను, పౌర సమాజాన్ని, న్యాయవాదులను, మానవ హక్కుల కార్యకర్తలను, ఒక మాజీ న్యాయ మూర్తిని కూడా సంప్రదించింది. అంతర్జాతీయ క్షమా సంస్థను జమ్మూ-కశ్మీర్‌లోని వారితో మాట్లాడడానికి కూడా మోదీ ప్రభుత్వం అనుమతిం చడం లేదు. ప్రభుత్వం ఎటూ నిజం చెప్పదు. పైగా ప్రభుత్వ వాదనే సరైన దని మొరాయిస్తోంది. అందువల్ల అంతర్జాతీయ క్షమా సంస్థ బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం మాత్రమే సేకరించగలిగింది. ప్రభుత్వ సమాచారంతో దీన్ని బేరీజు వేసి చూస్తే అసలు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం అవుతుంది. రాజకీయ అణచివేత విపరీతంగా పెరిగి పోయింది. మానవ హక్కుల కార్యకర్తలను, పౌరహక్కుల కార్యకర్తలను, పత్రికా రచయితలను ఎలాంటి అధికారిక విధానాలు పాటించకుండానే ఇంటరాగేషన్‌ పేరుతో వేధిస్తున్నారు. చెప్పా పెట్టకుండా అరెస్టు చేస్తున్నారు. నిర్బంధిస్తున్నారు. వారి మీద నిఘా పెడ్తున్నారు. జమ్మూ-కశ్మీర్‌ అస్తిత్వ స్వరూపమే మారిపోయినప్పటి నుంచీ ఇదే తంతు. పోలీసుల చట్ట విరుద్ధ, బూటకపు ఎన్‌ కౌంటర్లు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. 2020 ఏప్రిల్‌ 2022 మార్చి మధ్య బూటకపు ఎన్‌కౌంటర్లు భారీగా పెరిగిపోయాయి. 370వ అధికరణం రద్దయిన దగ్గర్నుంచి అధికారవర్గాల ఆగడాలు పెచ్చరిల్లి పోయాయి. మరో వేపు మిలిటెంట్లు మైనారిటీ వర్గాల వారిని కడతేరు స్తున్నారు. మిలిటెంట్లు పోలీసులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కశ్మీర్‌లో పని చేసుకుని బతుకు వెళ్లదీస్తున్న వారిని కూడా హతమారుస్తున్నారు. అంతర్జాతీయ క్షమా సంస్థను మన దేశంలో పని చేయనివ్వడం లేదు కనక ఉత్తరప్రత్యుత్తరాల ద్వారా మాత్రమే సమాచారం సేకరించగలుగుతోంది. ఈ సమాచారం ప్రకారం 370వ అధికరణం రద్దు చేసిన దగ్గర నుంచి భద్రతా దళాలు లేదా మిలిటెంటు బృందాల హత్యాకాండ మునుపటికన్నా 20 శాతం పెరిగింది. సమాచార హక్కు చట్టాన్ని మోదీ ప్రభుత్వం ఇప్పటికే చాలావరకు నీరుగార్చింది. మోదీ ప్రభుత్వం రాజకీయ పార్టీలను ఈ చట్టం పరిధి నుంచి మినహాయించింది. సమాచార కమిషనర్లు స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం లేకుండా పోయింది. 2005లో అప్పటి యు.పి.ఎ. ప్రభుత్వం సమాచార హక్కు చట్టం తీసుకు రాక ముందే జమ్మూ-కశ్మీర్‌లో సమాచార హక్కు చట్టం ఉండేది. ఇప్పుడు దాని ఊసే కనిపించడం లేదు. దేశ భద్రత నెపంతో కిరాతకమైన చట్టాలు జమ్మూ-కశ్మీర్‌లో మరింతగా అమలవుతున్నాయి. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం, ప్రజా భద్రతా చట్టం లాంటివీ అక్కడ అమలులో ఉన్నాయి.
న్యాయ వ్యవస్థ దేశవ్యాప్తంగా అధికార పక్షానికి జీ హుజూర్‌ అన్న రీతిలో మెలగుతోంది అన్న విమర్శలు వెల్లువెత్తిన సమయంలో జమ్మూ-కశ్మీర్‌ పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు 585 హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు దాఖలైతే పరిష్కారం అయినవి ఉదాహరణ ప్రాయంగా పద్నాలుగే. దీనితో అనుమానం మీదో, మరో రకంగా కొన సాగుతున్న నిర్బంధాలకు గురయ్యే వారి గోడు వినిపించుకునే వారే లేరు. జమ్ము-కశ్మీరు హైకోర్టు వెబ్‌ సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం 1,346 హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు దాఖలైనాయి. అంటే వీటి సంఖ్య 32 శాతం పెరిగింది. ప్రజా భద్రతా చట్టం కింద పిటిషన్లు కూడా ఎక్కువే. 2019 కన్నా ముందు ఇవి ఆరేడు నెలల్లో తేలిపోయేవి. ఇప్పుడు సంవత్సరం అయినా తెమలడం లేదు. పత్రికా స్వేచ్ఛకు దిక్కే లేదు. పోలీసు శాఖలోని సి.ఐ.డి., రాష్ట్ర దర్యాప్తు సంస్థ, కేంద్ర ప్రభుత్వ గూఢచార సంస్థ, సైనిక గూఢచార సంస్థ మొదలైనవి పత్రికా రచయితలను విలేకరులను వెంటాడుతూ ఉంటాయి. పిలిపించడానికి లిఖిత సమాచారం ఏమీ ఉండదు. 2019 ఆగస్టు తరవాత కశ్మీర్‌లో 27 మంది పత్రికా రచయితలను నిర్బంధించారు. విచిత్రం ఏమిటంటే ఈ నిర్బంధం అంతా ప్రజా భద్రతా చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం లాంటి వాటి పరిధిలో చట్టబద్దంగానే కొనసాగుతున్నట్టు లెక్క. రాష్ట్ర ప్రతిపత్తి తొలగించిన రెండున్నరేళ్ల తరవాత మోదీ ఆ ప్రాంతానికి గత ఏప్రిల్‌లో మాత్రమే వెళ్లారు. అమిత్‌ షా కూడా 2021 అక్టోబర్‌లో తప్ప వెళ్లలేదు. తీవ్రవాద కార్యకలాపాలు గత మూడేళ్ల కాలంలో 600 శాతం తగ్గాయని ప్రభుత్వం చెప్తోంది. కానీ 2019 ఆగస్టు 5 కన్నా మూడేళ్ల మందు 126 మంది పౌరులు తీవ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోతే ఆ తరవాతి మూడేళ్ల కాలంలో ఈ సంఖ్య 116కు మాత్రమే తగ్గింది. అంటే తీవ్రవాద కార్యకలాపాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్న మాట. 370వ అధికరణమే జమ్మూ-కశ్మీర్‌లో తీవ్రవాదానికి కారణం కనక దాన్ని తొలగిస్తున్నామని మోదీ సర్కారు చెప్పింది. హత్యా కాండ నామమాత్రంగానే తగ్గింది కనక ఏం సాధించినట్టో! మామూలు స్థాయిలో రాజకీయ కార్యకలాపాలు ఇప్పటికీ దుర్లభంగానే ఉన్నాయి. ఈ లెక్కన ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు, వాగ్దానం చేసినట్టుగా రాష్ట్ర ప్రతిపత్తి ఎప్పుడు కల్పిస్తారు అన్నవి సమాధానం లేని ప్రశ్నలే. ఆ ప్రాంత ప్రజల పరిస్థితి మాత్రం అడకత్తెరలో పోకచెక్కలాగే ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img