Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అదానీ తెంపరితనం

కష్టకాలం వచ్చినప్పుడే భగవన్నామస్మరణ చేసే వారున్నట్టుగా తమ మోసాలు బయటపడ్డప్పుడు అమాంతం దేశభక్తుల, జాతీయవాదుల అవతారం ఎత్తాలని చూసేవారు బయలు దేరారు. త్రివర్ణ పతాకం విలువ తెలియనివారు, జాతీయ పోరాటంతో ఎలాంటి సంబంధం లేనివారూ ఇవే మాటలను పుక్కిటపడ్తున్నారు. వారిని ఆశ్రయించి ఎనిమిది, తొమ్మిదేళ్లకాలంలో ప్రపంచ కుబేరులలో అగ్రభాగాన నిలవాలని ప్రయాసపడ్తున్న గౌతం అదానీ సరిగ్గా ఇదే పని చేస్తున్నారు. అదానీగ్రూపు సంస్థల నిర్వాకాన్ని, తమ కంపెనీల వాటాల విలువను 85 శాతం పెంచి చూపించి కోట్లు మూటగట్టుకున్న అదానీ బండారాన్ని హిండెన్‌ బర్గ్‌ సంస్థ గత వారం బట్టబయలు చేసింది. అప్పటినుంచి అదానీ కంపెనీల వాటలు షేర్‌మార్కెట్లో జరజరా పతనం అవుతున్నాయి. ఆ కంపెనీల్లో ఇదివరకే పెట్టుబడిపెట్టిన వారు నెత్తిన గుడ్డేసుకుని కూర్చునే దుస్థితికి చేరుకున్నారు. ఈ మునిగిపోవడంలో జీవితబీమా సంస్థ(ఎల్‌.ఐ.సి.) వాటా మరీ పెద్దది. ఇప్పటికే ఆ సంస్థ 18,000 కోట్ల మేర నష్టపోయిం దంటున్నారు. ఎల్‌.ఐ.సి. పెట్టిన పెట్టుబడి ప్రజల సొమ్మే. అంటే అంతిమంగా జనం డబ్బు గంగపాలైంది. బ్యాంకులూ అదే వరసలో ఉన్నాయి. అదానీ అవినీతికి, మోసానికి పాల్పడ్డారని హిండెన్‌ బర్గ్‌ ఆరోపించి సంచలనం సృష్టించింది. అదానీ కంపెనీలో ప్రధానమైన సంస్థ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తమ వాటాలను బహిరంగ వాటాల జారీ పద్ధతిలో విడుదల చేయాలనుకుంది. ఆ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలోనే హిండెన్‌ బర్గ్‌ అదానీ మోసాలను రట్టుచేసి నగ్నంగా నెలబెట్టింది. కొత్తగా పెట్టుబడివారికి, ఇదివరకే అదానీ కంపెనీలో వాటాదార్లయిన వారికి ఈ షేర్లు కేటాయిస్తారు. బహిరంగ మార్కెట్లో ఇంతటి స్థాయిలో వాటాల విక్రయం మన దేశంలో ఇదివరకు ఎన్నడూ ఏ కంపెనీ చేయలేదంటున్నారు. ఒక్కో వాటాను రూ.3,112 నుంచి రూ.3,276 దాకా విక్రయించాలని అదానీ తలపెట్టారు. హిండెన్‌ బర్గ్‌ నివేదిక వెల్లడి అయిన తరవాత ఈ వాటా షేర్‌మార్కెట్లో గత శుక్రవారం కేవలం రూ.2,761 మాత్రమే పలికింది. అంటే అనుకున్న దానికన్నా 20 శాతం తక్కువ ధరకు మాత్రమే అమ్ముడవుతున్నాయి. అంటే అదానీ ఒక్కో వాటా షేర్‌ మార్కెట్లో చాలా తక్కువకే దొరుకుతోంది. అయితే ఆర్థిక సంస్థలు, సంపన్నులు అదానీ చెప్పిన ధరకు కొనొచ్చు. షేర్ల అమ్మకం మందకొడిగా ఉంది అంటే షేర్‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారి ఆసక్తి సహజంగానే తగ్గిపోతుంది. ఇది అదానీకి విఘాతమే. 

హిండెన్‌ బర్గ్‌ వెల్లడిరచిన నివేదికలో అదానీ చేసిన మోసాలను వెల్లడిరచడంతో పాటు 88 ప్రశ్నలు సంధించింది. ఆ నివేదిక 106 పేజీలు ఉంది. హిండెన్‌ బర్గ్‌ ఆరోపణలను నిరాకరిస్తూ అదానీ గ్రూపు ఇప్పటికే రెండు వివరణలు జారీ చేసింది. దానితో పాటు సమాధానంగా 413 పేజీల బృహద్‌ గ్రంథంగా హిండెన్‌ బర్గ్‌కు పంపింది. హిండెన్‌ బర్గ్‌ అదానీకి 88 ప్రశ్నలు సంధిస్తే కేవలం పదహారింటికి మాత్రమే సమాధానం చెప్పారు. మిగతా 66 ప్రశ్నల మీద ఏ వివరణా లేదు. ఈ వివరణలో, ఖండంలోనో అదానీ ఒక వ్యాపారవేత్తగా పంపించిన దానిలా లేదు. ఆయన మోసాల మీద దాడిచేయడం అంటే దేశంమీద, జాతీయవాదం మీద దాడి అని వాదించారు. మోదీ దృష్టిలో అదానీ మహా పురుషుడే కావచ్చు. ఆయన ప్రపంచ అగ్రశ్రేణి సంపన్నులలో అగ్రభాగాన నిలిచి ఉండొచ్చు. తనమీద విమర్శను దేశంమీద దాడి అని వాదించడం దుస్సాహసమే. మోసాన్ని మరో మోసంతో జయించాలని చూస్తున్నారు. అదానీ షేర్‌ మార్కెట్లో వాటాలు విక్రయిస్తున్న దశలోనో హిండెన్‌ బర్గ్‌ ఈ ఆరోపణలు ఎందుకు చేసింది అని అడిగే వారూ ఉంటారు. ఇందులో హిండెన్‌ బర్గ్‌ ఉద్దేశం వెనక ఏదైనా మతలబు ఉన్నా ఉండొచ్చు. కానీ నిగ్గు తేలాల్సింది ఆరోపణల విషయంలోనే. ఇంత భారీస్థాయి మోసం బయటపడ్డా మోదీ ప్రభుత్వం చలించలేదు. పెదవి విప్పలేదు. దేశవాసులందరినీ కలచివేస్తున్న సమస్యలపై స్పందించే లక్షణం మోదీకి లేదు. ఆయన మౌనముద్రలో ఉండడం దాదాపు గత తొమ్మిదేళ్లుగా చేస్తున్నపనే. ఈ అంశంపై దర్యాప్తుకు ఆదేశించవలసిన బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంది. అలాంటి ఆలోచనేదీ ఇప్పటివరకు ఉన్నట్టు లేదు. ఇది అన్నింటికన్నా పెద్ద ప్రమాదం. అదానీ జాతీయవాదం ముసుగులో ఆత్మరక్షణకు ప్రయత్నించడాన్ని బీజేపీకి సన్నిహితవర్గాలు సమర్థించడంలో ఆశ్చర్యంలేదు. బీజేపీకి, మోదీకి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసినవే. అదానీని వెనకేసుకొచ్చిన వారిలో మోదీ ప్రభుత్వానికి ఆర్థికవ్యవహారాల ప్రధాన సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. అదానీ కంపెనీ ఆడిటింగ్‌ ప్రమాణాలు బలహీనంగా ఉన్నాయన్నది ఆయన సమర్థన. మోదీ ప్రభుత్వం సుబ్రహ్మణ్యంను అంతర్జాతీయ ద్రవ్య నిధిసంస్థ(ఐ.ఎం.ఎఫ్‌.) కు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సత్కరించింది కనక అదానీని వెన్నుకాయడంలో ఆశ్చర్య పడవలసింది ఏమీలేదు. అదానీకి దన్నుగా నిలిచిన ప్రముఖులలో గతంలో బీజేపీ తరఫున పార్లమెంటు సభ్యురాలిగా ఉన్న కొత్తపల్లి గీత కూడా ఉన్నారు. ఆమె కూడా బోలెడు స్వామిభక్తి ప్రదర్శిస్తూ హిండెన్‌ బర్గ్‌ ఆరోపణలు భారత్‌ మీద దాడిగా పేర్కొన్నారు. ఆర్థికంగా, రాజకీయంగానూ మన దేశాన్ని బలహీనపరచడానికి కుట్ర జరుగుతోందన్నది ఆమె సమర్థింపులో ప్రధానమైంది. ఇలాంటి దాడిని ఎదిరించాలని కూడా ఆమె హితోపదేశం చేశారు. గౌతం అదానీ ఒక వ్యక్తి కాదని, దేశానికి గర్వ కారకుడని ఆమె కీర్తి గానానికి దిగారు. హిండెన్‌ బర్గ్‌ భారత వ్యవస్థల మీద, న్యాయవ్యవస్థ మీద, నియంత్రణా వ్యవస్థల మీద దాడి చేస్తోందన్న అదానీ వాదననే కొత్తపల్లి గీత లాంటి వారు మరోరూపంలో అదే రాగం ఎత్తుకుంటున్నారు. మోదీ ప్రభుత్వాన్ని, పాలనా విధానాన్ని విమర్శించే వారిని దేశద్రోహులుగా, చిత్రిస్తున్నప్పుడు బీజేపీ వాదనలనే అదానీ ముందుకు తోయడంలో ఆశ్చర్యమే లేదు. ఈ ధోరణి 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటినుంచే మొదలైంది. మోదీ ప్రభుత్వం శుష్కవాగ్దానాల మీద, బూటకపు వాగ్దానాల మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్న రీతిలోనే అదానీ కూడా జాతీయవాద ముసుగు కప్పుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో తక్షణావసరం మాత్రం ఆరోపణల్లో నిజానిజాలు తేల్చడమే. ఇది సాధ్యం కావాలంటే ఈ ఆరోపణలపై నిష్పాక్షికంగా, దాపరికంలేని రీతిలో దర్యాప్తు జరగవలసిందే. అప్పుడు కానీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, ముఖ్యంగా గుప్పెడు వ్యాపార సంస్థలతొ మోదీ సర్కారుకు ఉన్న సాన్నిహిత్యం చుట్టూ ఉన్న మంచు తెరలు తొలగవు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img