Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అది నిరంకుశ జీవో

ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛకు రాజ్యాంగం హామీ ఇచ్చింది. పాలకులు ఎవరైనా ఈ విషయాన్ని నిరంతరం పాటిస్తే సామాజిక అలజడులు, ఉద్రిక్తతలకు, విషాదాలకు తావు ఉండదు. ఇక ఎన్నికల సమయంలోనేగాక ఆయా రాజకీయ పార్టీలు ప్రజలను కలుసుకొని నేరుగా తమ అభిప్రాయాలను వారికి తెలియజేసేందుకు సభలు, సమావేశాలు, ప్రదర్శనలు ముఖ్యమైన వేదికలు. అన్ని రాజకీయ పార్టీలకు ఈ అవకాశాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలు సజావుగా జరగడానికి నిర్వాహకుల కంటే అనుమతులిచ్చే పోలీసు శాఖకు బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ నాయకుడు చంద్రబాబునాయుడు కందుకూరులో నిర్వహించిన రోడ్డు షోలో తొక్కిసలాట జరిగి ఎనిమిదిమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇది వాస్తవంగా తీవ్రంగా పరిగణించవలసిన దుర్ఘటన. అయితే అటు పాలకపక్షం, ప్రతిపక్షం మధ్య ‘మాటల యుద్ధానికి’ దారితీయడం విచారకరం.
కందుకూరులో రోడ్డుషోలో విషాదం చోటుచేసుకున్న తర్వాత రోజుల్లోనే గుంటూరులో కానుకల పంపిణీ సభలో చంద్రబాబునాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరో ముగ్గురు చనిపోవడం రాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో సభలు, సమావేశాలు, రోడ్డు షోలపై జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తూ జీవో నెంబరు 1ని ఈ నెల 2 వ తేదీన జారీ చేసింది. జరిగింది తీవ్ర విషాదమే అయినా ప్రభుత్వం ఏకపక్షంగా జీవోలు జారీచేయడం నిరంకుశ చర్య అనిపించుకుంటుంది. నిజంగా ఇలాంటి విషాదాలు నివారించాలన్న చిత్తశుద్ది ఉంటే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. అందులో మరోసారి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారించడానికి ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది నిర్ణయించాలి. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అన్నిపార్టీలు కట్టుబడి తమ కార్యాచరణను నిర్ణయించుకొని అమలు చేయాలి. ఈ పని ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? ఒకరిపై మరొకరు దూషణలకే పూనుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలలో సంప్రదింపులకు ప్రథమ ప్రాధాన్యం కావాలి. ఈ మార్గాన్ని ఎంచుకోకుండా ప్రభుత్వం ఆంక్షల కొరడాను రaళిపించటం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. ప్రజలను కలుసుకొని ఆయా రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు తెలియజేయడానికి పోలీసులు విధించిన ఆంక్షలకు నిబద్దులై అన్ని రాజకీయ పార్టీలు పని చేయవలసి ఉండగా పాలక వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో అనేక చోట్ల ప్రదర్శనలు, సభలు జరిగాయని వార్తలు అందాయి. ఆంక్షలు కేవలం ప్రతిపక్షాలకే వర్తిస్తాయా? పాలక పార్టీ ఆంక్షలను పట్టించుకోకుండా ఇష్టానుసారం సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతించారని భావించవలసివస్తోంది. ప్రతిపక్షాలు తమ ఆంక్షల పరిథిలో ఉండాలని, వాక్‌ స్వాతంత్య్రానికి కళ్లెం వేయాలని ప్రభుత్వం భావిస్తున్నదనిపిస్తోంది. ప్రతిపక్షాల గొంతునొక్కి వేయడానికే అనేక విషయాలలో ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం నిరంకుశ పాలనను తలపిస్తుందన్న విమర్శలను సైతం సహించలేని పరిస్థితి నెలకొని ఉంది. ఇది ఎంత మాత్రం ప్రభుత్వానికి ప్రయోజనం కల్పించదు. నగరాలకు, పట్టణాలకు వెలుపల దూరంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తే సామాన్యులు, లేదా ఆయా పార్టీల అనుచరులు, అభిమానులు హాజరు కావడం చాలా కష్టంగా ఉంటుంది.
ప్రత్యేక పరిస్థితుల్లో రోడ్లపై సభలు, రోడ్‌షోల నిర్వహణకు అనుమతిస్తామని పేర్కొన్న జీవోలో రోడ్డు వెడల్పు, జరిగే ప్రదేశం, సభకు పట్టే సమయం, హాజరయ్యే జనం, రద్దీ నిర్వహణ చర్యలు తదితరాలను కూడా అధికారులకు ఇవ్వాలని మరిన్ని ఆంక్షలు పెట్టారు. ప్రత్యేక పరిస్ధితులను పోలీసు యంత్రాంగం అన్ని పార్టీలకు ఒకేవిధంగా వర్తింపజేసే పరిస్థితి నేటి రాజకీయాలలో ఉందా? సభలు జరుపు కోవడానికి కూడా ఆయా ప్రాంతాలను పోలీసులే ఎంపిక చేస్తారట. ఈ అవకాశం సైతం నిర్వాహకులకు ఉండదు.
జన సమీకరణ సంఖ్యపై కూడా ఆంక్షలు పెడతారేమో? గ్రామాలలో చిన్న చిన్న పట్టణాల్లో రోడ్లు ఎక్కువగా తక్కువ వెడల్పు ఉంటాయి. ప్రజలున్న ప్రాంతాలకు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు వెళ్లి ప్రచారం చేసుకోవడానికి ఈ ఆంక్షలు తీవ్ర అడ్డంకిగా నిలుస్తాయి. ఇటీవల విషాద ఘటనలు జరిగిన చోట్ల పోలీసుల బందోబస్త్‌ సైతం సక్రమంగా లేదని తీవ్ర విమర్శలొచ్చాయి. పాలక వైసీపీకి మాత్రం వారు జరిపే సభలు, సమావేశాలకు కొద్ది రోజుల ముందు నుంచే బందోబస్త్తు ఏర్పాటు చేస్తున్నారన్న విమర్శలకు పాలకులు ఏమి సమాధానం చెప్పగలరు. ఇందుకు ఉదాహరణగా గత ఏడాది జులైలో గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన వైసీపీి ప్లీనరీకి పదిరోజుల ముందే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారన్న విషయం ఆంక్షలు విధించిన ప్రభుత్వం గుర్తించాలి.
గుంటూరు సభకు కానుకల కోసం వేలాది మంది తరలి వస్తారని పోలీసులు అంచనా వేయలేరా? గతంలోనూ ఇలాంటి సందర్భాలు చాలా జరిగాయి. ఆ అనుభవం పోలీసులకు ఉంటుంది కదా! కేవలం రెండువందల మంది పోలీసులే బందోబస్తుకు వచ్చారని, వచ్చినవారు సైతం తగినంత శ్రద్ధ వహించలేదన్న విమర్శలు వచ్చాయి. కానుకల పంపిణీ సక్రమంగా జరిగేలా చూడటం పోలీసుల విధికాదా. ఈ ప్రభుత్వం నిరంకుశ విధానాలను వదిలేసి ప్రజాస్వామ్య పాలనను అవలంబించాలని సీపీఐ, సీపీఎం, తెలుగుదేశం చేస్తున్న డిమాండ్‌ పూర్తిగా సమర్థనీయమైంది. నిరంకుశ జీవోను తక్షణం ఉపసంహరించు కోవాలన్న న్యాయమైన ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించాలి. ప్రజాస్వామ్యంలో ఏకపక్ష, నిరంకుశ చర్యలకు తప్పక ఓటమి ఉంటుందని పాలకులు గుర్తించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img