Friday, April 19, 2024
Friday, April 19, 2024

అధ్యక్షుడు శాశ్వతమే… మరి అధికారం?

వైఎస్‌ఆర్‌సీపీ రెండు రోజుల ప్లీనరీ ఆ పార్టీ అత్యంత తీవ్రంగా వ్యతిరేకించే అమరావతి సమీపంలో (సీఆర్‌డీఏ పరిధిలో) అట్టహాసంగా ముగిసింది. ప్రతి రాజకీయ పార్టీ రెండేళ్లకో…మూడేళ్లకో ప్లీనరీ అనో, మహానాడు అనో ఏదో ఒక పేరు పెట్టి మహాసభలను జరుపుకున్నాయి. ఇది సర్వసాధారణం. కాకపోతే, బూర్జువాపార్టీల సభల్లో జన సమస్యలపైనో, స్పష్టమైన విధాన ప్రకటనలపైనో ప్రసంగాలు, తీర్మానాలు ఉండవు. ఎంతసేపూ తిట్ల పురాణాలు, అసభ్యకర భాషణలే ఆధిపత్యం సాధిస్తూ వుంటాయి. ప్రతిపక్షంలో ఉన్న బూర్జువా పార్టీ జరుపుకునే మహాసభల్లో సహజంగానే పాలకపార్టీని దుమ్మెత్తి పోయడం, పాలకపార్టీ జరిపే సభల్లో ప్రతిపక్షాన్ని ఎండగట్టడం మామూలే. వైసీపీ ప్లీనరీలో ఈ పరిస్థితి మరీ అతిగా వున్నట్టనిపించింది. జనఘోష కన్నా జగన్‌ఘోషే ఎక్కువగావుంది. విజయమ్మ నిష్క్రమణ లాంఛనప్రాయం కాగా, తీర్మానాల్లో కొత్తదనమేమీ లేకపోవడం గమనార్హం.
వైసీపీ ప్లీనరీలో సీఎంతోపాటు ఎక్కువమంది ప్రసంగీకుల నోటి నుంచి అపసవ్య శబ్దాలతోపాటు ‘దైవకృప’, ‘దైవ నిర్ణయం’ వంటి పదాలు కూడా బయటకు రావడం విచిత్రమే. కాకపోతే, మోదీలాగ ఏ మతానికి చెందిన ‘దేవుని దయో’ స్పష్టత ఇవ్వలేదు. ‘నా ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా, అభ్యంతరం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నాను’ అని అమ్మ తీసుకున్న నిర్ణయం వెనుక ఉద్దేశాలు ఎవరికెరుక? షర్మిల తెలంగాణలో ఒంటరిగా పోరాటం చేస్తున్నదని, ఆమెకు అండగా నిలవాల్సిన అవసరం వుందని కూడా విజయమ్మ నమ్మకంగా చెప్పారు. ‘ఏపీలో ఈ గోల నేను భరించలేను. మీకోదండం’ అన్నది ఆమె పరమోద్దేశమా? లేక వారనుకుంటున్న దేవుళ్లు ఈ రెండు తెలుగు రాష్ట్రాలనూ అన్నాచెల్లెళ్లకు రాసిచ్చారని అనుకోవాలా? విజయమ్మ అంటున్నట్లుగా ‘షర్మిల పరిణామం’ అనూహ్యమని భావించాల్సిన పనిలేదు.
ఈ ప్లీనరీతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీకి శాశ్వత అధ్యక్షునిగా అవతరించారు. అధ్యక్షుడు శాశ్వతమనేది ప్రజాస్వామ్య దేశంలో సరికొత్త అంశమే. ఇది కచ్చితంగా అప్రజాస్వామ్యమే. కాకపోతే ఆ పార్టీకి వేరే దిక్కులేదనేది వాస్తవం. సొంత చెల్లెల్లో..ఇంకెవరో భవిష్యత్‌లో పితలాటకాలు పెట్టకుండా ముళ్లులేని మార్గాన్ని ఏర్పరుచు కునే పనిలో జగన్‌ పడుతున్న అవస్థ స్పష్టమవుతున్నది. చెల్లెలు షర్మిలను తెలంగాణ ఏలుబడికి పంపించడం వ్యూహమా? లేదా అనుకోని ఆ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొని, తప్పని పరిస్థితుల్లో శాశ్వత అధ్యక్ష తీర్మానం చేశారా? గౌరవాధ్యక్ష పదవి నుంచి విజయమ్మ తప్పుకున్నారా? లేదా తప్పించారా? ముళ్లదారి క్లియరెన్సులో భాగంగానే సాగిన ఎత్తుగడా?… ఇవన్నీ ప్లీనరీ చివరకు మిగిల్చిన ప్రశ్నలు. అది ఆ పార్టీ అంతర్గత విషయం కావచ్చు. కానీ పాలకపార్టీ పరిణామాలు ప్రజలపై నూటికి నూరుశాతం ప్రభావాన్ని చూపుతాయన్నది అవాస్తవం కాదుకదా!
మార్పు చూపించామని, ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేయగలిగామని, మ్యానిఫెస్టోలోని 95% హామీలను నెరవేర్చామని జగన్‌ తన రెండు కీలక ప్రసంగాల్లోనూ చెప్పుకొచ్చారు. చేసిన బాసలు చెరిగిపోవు…చేసిన పనులైతే కన్పిస్తాయి కదా! ఇచ్చిన హామీలైతే అమలు చేయడం మంచిదే కానీ, ప్రజలపై భారాన్ని 95% పెంచిన విషయాన్ని విస్మరించడం విడ్డూరం. అమ్మఒడిలో కోత, ఆంక్షల పేరుతో పరిధి తగ్గిన విద్యాదీవెన, 10 వేల పాఠశాలల రద్దు, 2.50 లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరం కావడం, ఆరోగ్యశ్రీకి ఆసుపత్రుల నిరాకరణ, 5 లక్షల మందికి పింఛన్ల తొలగింపు, మద్యనిషేధాన్ని గాలికొదిలేసి మద్యం ఆదాయాన్ని రూ.14 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్లకు పెంచడం, పట్టణాలు, నగరాల్లో చెత్తపన్ను, విద్యుత్‌ ఛార్జీల పెంపుదల, పెట్రోలు, గ్యాస్‌ ధరలను మోదీ సర్కారు పెంచినా నోరుమెదపకపోవడం, అమరావతిని అగాథంలోకి నెట్టేయడం, ప్రత్యేకహోదాను తొక్కేయడం… ఇలాంటివన్నీ (పూర్తయిన 95% హామీలు కాకుండా) మిగిలిన 5% శాతంలోనే ఉండిపోయాయని ప్రజలు సరిపెట్టుకోవాలా? ఇందులోని ఏ ఒక్క అంశమైనా ప్లీనరీలో ప్రస్తావనకు వచ్చిందా? మటన్‌ ధమ్‌ బిర్యానీ నుంచి బొమ్మిడాయిల పులుసు వరకు ఐస్‌క్రీమ్‌, కిళ్లీలను సైతం వదలకుండా 25 వంటకాలను తృప్తిగా ఆరగించిన (వైసీపీ అధికార పత్రిక ఇచ్చిన డేటా) పాలక పార్టీ నేతలకు ప్రజలపై పడిన భారాల్లో ఏ ఒక్కటీ గుర్తుకురాలేదా?
మహిళా సాధికారిత, వైద్య, ఆరోగ్య రంగాలు, విద్యావ్యవస్థ, నవరత్నాలుడీబీటీ, పారదర్శకపాలన, సామాజిక సాధికారత, పరిశ్రమలుఎంఎస్‌ఎంఈలు, వ్యవసాయ రంగాలపై వైసీపీ ప్లీనరీ ఏకగ్రీవ తీర్మానాలు చేసింది. టీడీపీలో మహిళలు తొడలు కొడుతున్నారంటూ మహిళా సాధికారత తీర్మాన చర్చలోనే పేర్కొనడం మహిళలకు అవమానంగా వైసీపీ భావించకపోవడం దురదృష్టకరం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రూ. 10 లక్షలకు కుదించడం, మూడేళ్లలో జనం నెత్తిన పడిన రూ.5 లక్షల కోట్ల అప్పు, రివర్స్‌ టెండరింగ్‌లతో ప్రాజెక్టుల పనిని జాప్యం చేయడం, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల తాగు, సాగునీటి ప్రయోజనాలకు గండికొట్టడం, అభయహస్తం నిధులను రూ.2,100 కోట్ల మేర దారిమళ్లించడం, మూడేళ్ల వ్యవధిలో కేవలం 64 వేల ఇళ్ల నిర్మాణానికే పరిమితం కావడం…ఇవన్నీ నేలరాలిన ‘నవరత్నాల్లో’ భాగం కాదా?
‘‘దేవుడు స్క్రిప్ట్‌ను అద్భుతంగా రాస్తాడు. నాయకుడిని, పార్టీని నడిపించేది వ్యక్తిత్వం విశ్వసనీయత మాత్రమే’’నని ప్లీనరీ ముగింపులో జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలు అక్షరసత్యాలని చెప్పలేం. అధికారిక పత్రికను వాలంటీర్ల చేత బలవంతంగా కొనిపించడం, పైసా కట్టకుండా రెండు రోజులపాటు ఆర్టీసీని, రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తాన్ని ప్లీనరీ అవసరాలకువాడుకోవడం, హక్కులకోసం మాట్లాడేవారిని లాఠీలతో కొట్టించడం, జైళ్లకు పంపించడం, కొన్ని పత్రికలు, ఛానల్స్‌పై కక్షబూని, వాటిని ఖతంచేయాలని చూడటం…ఇవన్నీ వ్యక్తిత్వం విశ్వసనీయత కిందకు వస్తాయోరావో జగన్‌ సార్‌ లేదా ఆయన సలహాదారులే చెప్పాలి. వైసీపీ ప్లీనరీపార్టీ అధ్యక్షుడిని శాశ్వతం చేయ గలదేమో…అధికారాన్ని శాశ్వతం చేయలేదని జగన్‌ గుర్తెరగాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img