Friday, April 19, 2024
Friday, April 19, 2024

అనవసర రగడ

అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఉత్తమ మార్గం ఇతరేతర అంశాల మీద వివాదాలు రేకిత్తించడం. నిర్హేతుకత రాజ్యమేలుతున్న తరుణంలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉండే అవకాశమే లేదు. లోకసభలో తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యురాలు మహువా మొయిత్రా కాళిక దేవి మీద చేసిన వ్యాఖ్యలలో నిజా నిజాలేమిటి అన్న విషయాన్ని పక్కన పెడితే ఆమె అభిప్రాయాలు తీవ్ర వివాదం రేకెత్తించాయి. ఎక్కడో ఎవరో ఒక వ్యాఖ్య చేస్తే మరెక్కడో పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు సత్వరం ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేయడం సర్వసాధారణమైంది. మధ్యప్రదేశ్‌లో ఓ టీకొట్టు నడిపే వ్యక్తి మొయిత్రా మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేశారు. ఈ ఫిర్యాదు స్ఫూర్తితో బెంగాల్‌ లో కూడా మరి కొంతమంది ఆమె మీద ఫిర్యాదు చేశారు. ఒక అపరాధం రుజువైతే దానికి ఒకే శిక్ష ఉంటుందని తెలిసినా ఇలా వరసపెట్టి ఫిర్యాదులు దాఖలు చేయడంలో ఆంతర్యం తాము వార్తల్లోకి ఎక్కాలన్న ఆరాటమే. మహమ్మద్‌ ప్రవక్త మీద బీజేపీ అధికార ప్రతినిధి హోదాలో నూపుర్‌ శర్మ ప్రతికూల వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఇలాగే అనేక చోట్ల ఎఫ్‌.ఐ.ఆర్‌.లు దాఖలైనాయి. ఇన్ని చోట్ల విచారణకు హాజరు కావడం సాధ్యం కాదుగనక అన్నింటినీ దిల్లీకి మార్చాలని అర్జీ పెట్టుకోవడం ఆమె హక్కు. కానీ ఘనత వహించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సూర్యకాంత్‌, పార్దీవాలా తమ ముందు విచారణకు వచ్చిన అంశాన్ని పరిశీలించడం మానేసి నూపుర్‌ శర్మ మీద విరుచుకుపడ్డారు. న్యాయమూర్తులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే ప్రజలకు ఇక దిక్కెవరో చెప్పడం కష్టం. ప్రత్యర్థులుగా ఉన్న రాజకీయ పక్షాల నాయకులు కూడా ఏ అంశం తలెత్తినా వెంటనే ఖండన మండనలకు పాల్పడుతున్నారు. ఎదుటి వారు అవునన్నది కాదనే ధోరణే తప్ప తమ వాదన హేతుబద్ధమా కాదా అన్న ఆలోచనే లేదు. ఎఫ్‌.ఐ.ఆర్‌.లు దాఖలు చేసే వారికన్నా ప్రత్యర్థి పక్షాల నాయకులు ఒకడుగు ముందుకు వేసి మహువా మొయిత్రాను అరెస్టు చేయాలని డిమాండు చేస్తున్నారు. బెంగాల్‌ శాసనసభలో ప్రతిపక్ష బీజేపీ నాయకుడు సువేందు అధికారి ఆత్రం మరీ ఏహ్యంగా ఉంది. మత భావాలకు విఘాతం కల్గించి నందుకు మహువా మొయిత్రాను అరెస్టు చేయాలంటున్న బీజేపీ నాయకు లకు నూపుర్‌ శర్మ వ్యాఖ్యలూ బేసబబే అన్న ఆలోచన ఎందుకు తట్టదో అంతుపట్టదు. మహువా, నూపుర్‌ శర్మ వ్యాఖ్యలు రెండూ అభ్యంతర కరమైనవే అనుకుంటే తీసుకోవలసిన చర్య కూడా సమానం గానే ఉండాలి. ప్రజల మనోభావాలకు విఘాతం కలిగించే వ్యాఖ్యలు చేసిన ఈ ఇద్దరి వైఖరిలో ఒక తేడా మాత్రం గమనించవచ్చు. మహువా మొయిత్రా తాను అనుసరించే మతానికి సంబంధించిన దేవత మీద ప్రతికూల వ్యాఖ్యలు చేస్తే నూపుర్‌ శర్మ ఇస్లాం మత ప్రవక్త మీద విరుచుకుపడ్డారు. మహువా మొయిత్రాను అరెస్టు చేయాలని కోరే సువేందు అధికారి లాంటి వారికి నూపుర్‌ శర్మకు కూడా అదే సూత్రం వర్తింపచేయాలన్న ఊహే తట్టకపో వడం విచిత్రమే. మహువా మొయిత్ర మాత్రం తాను కాళికాదేవి భక్తురాలినే నంటున్నారు. తాను ఆరాధించే దేవత ఎలా ఉంటుందో ఊహించుకునే హక్కు తనకు ఉందంటు న్నారు. మహువా మొయిత్ర, నూపుర్‌ శర్మ వ్యాఖ్యలు సబబైనవా కావా, హేతుబద్ధమైనవా కావా అన్న చర్చ ఎటూ తెగేది కాదు. భక్తి విశ్వాసాలు హేతువుకు అందేవి కావు. ఏకోశ్వరోపాసన, బహుదేవతా రాధన అన్న తేడాలు రావడానికి ప్రధాన కారణం విశ్వాసాలలో హేతుబద్ధత లేకపోవడమే. విశ్వాసం శాస్త్ర పరిశీలనకు కూడా లొంగదు. పిడివాదం ఏ మతానికైనా ప్రధాన ఊతంగా ఉంటుంది.
మొయిత్రా కేసులో మరో మలుపు ఈ వివాదం కన్నా ఆశ్చర్యకరమైంది. లోకసభలో తన ఘాటు ప్రసంగాలవల్ల మొయిత్రా అందరి దృష్టినీ ఆకర్షిం చారు. సమర్థురాలైన పార్లమెంటేరియన్‌గా ప్రసిద్ధులయ్యారు. తృణమూల్‌ వాదనలను సవ్యంగా, సూటిగా, వాటంగా పార్లమెంటులో వినిపించ గలిగారు. ఇవన్నీ తృణమూల్‌ కాంగ్రెస్‌ కు ఆమోదయోగ్యమైనాయి. ఆమె సామర్థ్యం చూసి తృణమూల్‌ నాయకులు పొంగి పోయారు. మమతా బెనర్జీతో మొయిత్రాకు ఉన్న సాహిత్యం అపారమైంది. కానీ ఒక్కసారి మొయిత్రా వ్యాఖ్యలు వివాదా స్పదం కాగానే బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు సన్నిహితురాలు, సమర్థురాలు అన్న మొయిత్రాకు అండగా ఉండడానికి నిరాకరించారు. మొయిత్రా వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆమె వ్యక్తిగతమైనవి, తృణమూల్‌కు వాటితో సంబంధం లేదు అని వాటంగా తప్పించుకుంటున్నారు. ఇందులోనూ రాజకీయ దృక్పథమే కనిపిస్తోంది తప్ప హేతుబద్ధత జాడ కూడా లేదు. మహువా మొయిత్రాను వెనకేసుకొస్తే హిందువుల ఓట్లు ఎక్కడ కోల్పోతామోనన్న భయం మమతా బెనర్జీని పీడిరచడమే దీనికి కారణం. కానీ సత్యాసత్య వివేచన, సంవాదం, చర్చ అన్న అంశాల ప్రస్తావనే ఆమె తీసుకు రాదలచుకోలేదు. మన రాజకీయ నాయకులలో చాలా మందికి దైవ భక్తి, మత విశ్వాసాలు మెండు గానే ఉన్నాయి. అయితే అనువైనప్పుడు వాటిని సామాజికాంశాలుగా మార్చడం కాకపోతే వివాదాస్పద వ్యాఖ్యలు ఆ నాయకుల వ్యక్తిగత విశ్వాసం అని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏ పార్టీలో అయినా అందరి అభిప్రా యాలు, ఆలోచనలు, వ్యక్తీకరణలు మూస పోసినట్టు ఒకే రీతిలో ఉండవు. కాని ఏక సూత్రత అయినా ఉండకపోతే అది పక్షపాత దృష్టో లేక అవకాశవాదమో అవుతుంది. మహువా మొయిత్రా కాళికా దేవి మీద చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అని సరిపెట్టుకుందామనుకున్నా వాటి ప్రభావం సమాజం మీద ఉన్నప్పుడు, అవి విస్తారమైన చర్చకు దారి తీసినప్పుడు ప్రభుత్వ అధినేతలు, పార్టీ నాయకులకు నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేయవలసిన బాధ్యత ఉండకపోతే ఎలా. మతం వ్యక్తికి పరిమితమైందిగానే ఉండాలనడంలో విప్రతిపత్తి లేదు. కానీ మత సంబంధమైన అభిప్రాయాల ప్రకటన సార్వజనీనమవుతున్నప్పుడు వ్యక్తిగతం అని వాదించడం అవకాశవాదమే. మొయిత్రా వ్యాఖ్యల సంగతి పక్కన పెడ్తే ఆమె లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ఎవరికైనా కష్టమే. కామాఖ్యా ఆలయానికి వెళ్లినప్పుడు అస్సాం ముఖ్యమంత్రులు దేవతకు ఏమేం అర్పిస్తారో చెప్పగలరా అని ఆమె నిలదీస్తున్నారు. దీనికి అస్సాం ముఖ్య మంత్రే కాదు మరే ముఖ్యమంత్రీ సమాధానం చెప్పలేరు. మతం వ్యక్తిగతమైం దని తప్పించుకోవడానికి మమతా బెనర్జీ లాంటి వారు ఎంత ప్రయత్నించినా భిన్న మతాల వారి ఓట్లు ఎక్కడ కోల్పోతామోనన్న చింత అన్ని పార్టీల్లోనూ ఉన్నదే. దేవతారాధన దేశమంతా ఒకేలా లేదు. ఉండడానికి అవకాశమే లేదు. అంతెందుకు పేదల దేవుళ్లకు, కలిగిన వారి లేదా కులీన దేవతలకే తేడా స్పష్టంగానే కనిపిస్తోందిగా. హిందూ మతానుయాయులు కాని గిరిజనులను హిందుత్వ పరిధిలోకి లాగడానికి బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తోందో రహస్య మేమీ కాదు. పండగలు, పబ్బాలు జరుపుకునేప్పుడు వివిధ ప్రాంతాల, తెగల, అనుయాయుల మధ్య భిన్న విధానాలు వైఖరులు ఉన్నాయి. వాటిని అంగీకరించవలసిందే. వ్యక్తిగత స్థాయికి పరిమితం కావలసిన మతాన్ని రాజకీయ ప్రయోజనం కోసం సార్వజనీనం చేయడంతోనే అసలు సమస్య ఎదురైంది. మొయిత్రా లాంటి నాయకులు కూడా తమ సొంత భావనలను బహిరంగంగా వ్యక్తం చేసేటప్పుడు వాటి ప్రభావం సమాజం మీద ఎలా ఉంటుందో ఆలోచించే సంయమనం పాటించాలి. వ్యక్తిగత భావాలు జనంలోకి వస్తే అవి వ్యక్తిగతం కాకుండా పోతాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img