Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అనాయాస మరణశిక్ష అసాధ్యం

మరణశిక్ష రద్దయ్యే దాకా ఈ అంశంపై న్యాయస్థానాల లోనూ, న్యాయకోవిదుల మధ్య, పౌరహక్కుల సంఘాలవారి లోనూ, లా కమిషన్‌లోనూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా సుప్రీంకోర్టులో మళ్లీ చర్చ మొదలైంది. అయితే ఇప్పుడు జరుగుతున్న చర్చ మరణ శిక్షను రద్దు చేయాలా వద్దా అన్న విషయం మీద కాదు. ఉరితీయడం ద్వారా కాకుండా మరణ శిక్ష అనాయాసంగా అమలు చేయాలని కోరుతూ న్యాయవాది రిషి మల్హోత్రా దాఖలుచేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టు విచారణలో ఉంది. ప్రాణాంతక ఇంజెక్షన్‌ ఇవ్వడం, విద్యుదాఘాతంతో అంత మొందించడం లాంటివి ఉరి తీయడంకన్నా అనాయాస మరణాలని రిషి మల్హోత్రా వాదిస్తున్నారు. ఈ లోగా గత మంగళవారం మరణ శిక్ష అమలు చేయడానికి ఉరికి బదులు ప్రత్యామ్నాయ మార్గాలను పరి శీలించడానికి ఓ కమిటీ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధ పడిరది. అంటే మరణ శిక్షను రద్దుచేసే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేనట్టే. ఇంతకు మునుపటి ప్రభుత్వాలదీ అదే వైఖరి. దీనికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌, జె.బి.పార్దీవాలాతో కూడిన బెంచి అంగీకరించింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు మళ్లీ జులైలో విచారిస్తుంది. లా కమిషన్‌ 187వ నివేదికలో కూడా ఉరి తీయడం ద్వారా మరణశిక్ష అమలు చేయడం ఆ శిక్షకు గురయ్యే వ్యక్తికి విపరీతమైన బాధ కలిగిస్తుందని అభిప్రాయపడిరదని మల్హోత్రా నివేదించారు. లా కమిషన్‌ మరణశిక్ష అమలుకు ప్రత్యామ్నాయ విధానాలు అన్వేషించాలని చెప్పిన సందర్భం వేరు. ఒకప్పుడు లా కమిషన్‌ మరణ శిక్షను రద్దుచేయడాన్ని వ్యతిరేకించింది. ఆ తరవాత 2015లో విడుదలచేసిన నివేదికలో మరణశిక్ష రద్దు చేయాలని సిఫార్సు చేసింది. అప్పుడూ న్యాయ మంత్రిత్వశాఖ ప్రతినిధులిద్దరు మరణశిక్ష రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అసమ్మతి పత్రాలు నివేదికకు జోడిరచారు. అనేక దేశాలు క్రమంగా మరణశిక్ష రద్దు చేస్తున్న వాస్తవాన్ని లా కమిషన్‌ గుర్తుచేసింది. తీవ్రవాదులకు, దేశం మీద యుద్ధం ప్రకటించే వారికే మరణశిక్ష విధించాలని చెప్పింది. అనేక దేశాలు మరణశిక్షను పూర్తిగా రద్దుచేస్తే అంతకన్నా ఎక్కువ దేశాలు చట్టపరంగా మరణ శిక్షను రద్దు చేయకపోయినా అమలు చేయడంలేదు. మన దేశంలో మరణశిక్ష ఇప్పటికీ అమలులోనే ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో జరుగుతున్న చర్చ ఈ శిక్షను ఆయాసం లేకుండా అమలు చేయడం ఎలా అన్న అంశం చుట్టే తిరుగుతోంది తప్ప మరణ శిక్షను రద్దు చేయడం గురించి కాదు. అరుదాతి అరుదైన సందర్భాలలో మాత్రమే మరణశిక్ష విధించాలని 1980లో బచ్చన్‌ సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఈ అరుదాతి అరుదైన సంఘటనలు ఏమిటో నిర్వచించే ప్రయత్నమూ జరిగింది. కానీ అమలు దగ్గరికి వచ్చేటప్పటికి ఏది అరుదాతి అరుదైన సంఘటనో నిర్ణయించడంలో నిర్దిష్ట కేసును విచారిస్తున్న న్యాయమూర్తి అభిప్రాయం కూడా కచ్చితమైన పాత్ర నిర్వహిస్తుంది. కొన్ని కేసులలో మరణశిక్ష విధించి తప్పు చేశామని ఆ తరవాత తీరికగా విచారం వ్యక్తంచేసిన న్యాయమూర్తులూ ఉన్నారు.
మరణశిక్ష విధించడం అనాగరకం అని వాదించే న్యాయమూర్తులూ ఉన్నారు. చట్టంలో ఉంది కనక విధిస్తున్నామని సమర్థించుకునే వారూ ఉన్నారు. కానీ ఏకపక్షంగా మరణశిక్ష విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన న్యాయమూర్తులూ ఉన్నారు. ఏకపక్షంగా వ్యవహరించడం అంటే న్యాయమూర్తులు తమ వ్యక్తిగత అభిప్రాయాల ప్రకారం నడుచుకోవడం. అందుకే అరుదాతి అరుదైన సందర్భాలేవో తేల్చడం కష్టం. బచ్చన్‌ కేసులో నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలు అమలులో విఫలమవు తున్నాయి. అన్ని దశల్లోనూ ఒక వ్యక్తికి మరణశిక్ష ఖరారైతే మిగిలిన మార్గమల్లా క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్రపతికి మొరపెట్టుకోవడమే. అక్కడా ఓ సమస్య ఉంది. ఈ అర్జీని రాష్ట్రపతి తేల్చడానికి గడువేమీ లేదు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీనుంచి ఇప్పటి వరకు వివిధ రాష్ట్ర పతులు 306 అర్జీలను పరిశీలించి 131 సందర్భాలలో క్షమా భిక్ష ప్రసాదించడానికి నిరాకరించారు. ఒక రాష్ట్రపతి అయితే ఒక్క అర్జీని కూడా తేల్చకుండానే అయిదేళ్ల పదవీకాలం పూర్తిచేశారు. మరణ శిక్ష ఎలా అమలు చేయాలన్న విషయంలో విచారణ పూర్తి అయిన తరవాత తీర్పు ఎలా వస్తుందో ఇప్పుడే చెప్పలేం. కానీ మల్హోత్రా పిటిషన్‌లో మరణశిక్ష రద్దు ప్రస్తావనే లేదు కనక రద్దుచేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పే అవకాశంలేదు. అసలుచర్చ జరగవలసింది కిరాతకానికి పాల్పడిన వ్యక్తిని శిక్షించడానికి మరణశిక్ష విధించాలా లేదా అన్న అంశంపైనే. మరణశిక్ష అమలు చేయడం అంటే ఆ శిక్షకు గురైన వ్యక్తిలో పరివర్తనకు అన్ని అవకాశాలనూ మూసేయడమే. శిక్ష లక్ష్యం ఎలాంటి నేరం చేసిన వారికి ఆ మోతాదులో శిక్ష విధించడం మాత్రమే కాదు. కంటికి కన్ను పంటికి పన్ను అన్న రీతిలో శిక్ష ఉండకూడదన్న భావన నాగరకత పెరుగుతున్న కొద్దీ మానవాళికి అలవడుతున్న సుగుణం. ఒక వ్యక్తి ప్రాణం తీయడాన్ని ఎవరూ సమర్థించనక్కర్లేదు. శిక్ష పడాల్సిందే. కానీ ఆ శిక్ష దోషిలో సంస్కరణకు వీలు లేకుండా ఉండకూడదు. మరణ శిక్ష కొనసాగాలనడం మన న్యాయశాస్త్రంలో ఉన్న ప్రధానమైన లోపం. దీన్ని గుర్తించకపోవడం మనం ఇంకా నాగరికులం కాలేదని నిర్ధారించడమే. తప్పు చేసిన వ్యక్తిని శిక్షించే అవకాశం ఉండాల్సిందే. దానికి అవసరమైన చట్టాలు, న్యాయపరిశీలన కూడా అవసరమే. కానీ ఎదుటి వ్యక్తి ప్రాణం తీసిన వ్యక్తిని శిక్షించడానికి అతని ప్రాణం తీయడమే తగిన శిక్ష అనుకోవడం అనాగరకమే. వ్యక్తి చేసిన తప్పును రాజ్య వ్యవస్థ కూడా చేయడమే. రాజ్య వ్యవస్థకు ప్రాణాలు తీసే అధికారం ఇవ్వడం నాగరిక సమాజం అంగీకరించవలసిన అంశం కాదు. మరణ శిక్ష విధించడాన్ని సమర్థించడం అంటే మన న్యాయ నిర్ణయ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి అంగీకరించకపోవడమే. తగిన సాక్ష్యాధారాలు లేక తప్పించుకుంటున్న వారు అసంఖ్యాకంగా ఉండ వచ్చు. కానీ అదే సాక్ష్యాధారాల లోపంవల్ల లేదా కూట సాక్ష్యాలవల్ల, తనకు పడిన మరణశిక్ష నుంచి తప్పించుకోవడానికి చివరిదాకా పోరాడే సామర్థ్యం లేని వారికి అన్యాయం జరిగినట్టే. ప్రాణం పోసే అవకాశం రాజ్యవ్యవస్థకు లేనప్పుడు నేరస్థుడి ప్రాణమైనా సరే తీసే అధికారం రాజ్యవ్యవస్థకు ఉండకూడదు. అలా ఉంటే హంతకుడితో పాటు రాజ్య వ్యవస్థ కూడా హంతకుడిగా మిగిలిపోక తప్పదు. మరణశిక్షను అమలు చేయని దేశాల్లో హత్యలు పెరిగిపోయిన దాఖలాలు లేనట్టే ఈ శిక్ష అమలులో ఉన్న దేశాల్లో హత్యలు తగ్గిన సూచనలూ లేవు. ప్రాణం తీయడం ఏ కిరాతక నేరాన్నీ నిరోధించలేదు. అది పౌరులకు ఉన్న జీవించే హక్కుని హరించడమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img