Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అన్యాయ మార్గ పాలన

మతాన్ని రాజకీయాలతో మిళితం చేసి ఎన్నికలలో లబ్ధి పొందిన రాజకీయ పార్టీలు ఉండవచ్చు. ఆ పార్టీలు హిందుత్వను అనుసరిస్తూ ఉండవచ్చు. కానీ అభివృద్ధి, హిందుత్వం తన ఎజెండా అని బహిరంగంగా ప్రకటించే సాహసానికి ఒడిగట్టడం మాత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌ నాథ్‌ షిండేకే సాధ్యం. ప్రధానమంత్రి మోదీ, ఆయన అనుంగు అనుచరుడు అమిత్‌ షా కూడా హిందుత్వ విధానాలను అనుసరిస్తున్నా తాము హిందుత్వ మార్గాన్ని అనుసరిస్తున్నామని బహిరంగంగా ప్రకటించిన దాఖలాలు లేవు. కానీ హిందుత్వకు అభివృద్ధి ముసుగు తొడగడంలో మోదీ, అమిత్‌ షా ద్వయం ఆరితేరిపోయారు. రెండున్న రేళ్లకు పైగా కాంగ్రెస్‌, శివసేన, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తరవాతి స్థానంలో ఉన్న షిందేకు ఇటీవలే హిందుత్వ గుర్తుకు వచ్చింది. ఆయన తిరుగుబాటు చేసిన తరవాతే ఉద్ధవ్‌ ఠాక్రే కాంగ్రెస్‌, నేషనలిస్టు కాంగ్రెస్‌తో కలిసి కూటమి ఏర్పాటు చేయడం శివసేన స్వభావానికి విర్దుద్ధమని గుర్తుకు వచ్చింది. సోమవారం శాసన సభలో మెజారిటీ నిరూపించుకునే లాంఛనం పూర్తి అయిన తరవాత షిందేకు హిందుత్వం మీద ఎక్కడ లేని అభిమానం ఒలికి పోయింది. 2019 ఎన్నికల ఫలితాలు వెలువడిన తరవాత శివసేన బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి ఉందని ఆయన అంటున్నారు. ఏ పరిస్థితిలో ఉద్ధవ్‌ ఠాక్రే మహా వికాస్‌ అగాధీ ఏర్పాటుకు సిద్ధమయ్యారో షిందేకు తెలియనిది ఏమీ కాదు. రెండున్నరేళ్ల కాలం ప్రభుత్వంలో ఉన్నందువల్ల సమకూరే వనరులను వినియోగించుకున్న తరవాత, సకల సదుపాయాలను అనుభవించిన తరవాత ఉద్ధవ్‌ ఠాక్రేకు వ్యతిరేకంగా మెజారిటీ శాసన సభ్యులను కూడగట్టడం సాధ్యమైన నేపథ్యంలోనే ఆయనకు హిందుత్వ ప్రాశస్త్యం గుర్తుకు వచ్చింది. 2019 శాసనసభ ఎన్నికల తరవాత ఉన్న పరిస్థితిని తలుచుకుని షిందే నిండు సభలో కన్నీళ్లు పెట్టుకుని మోదీ నాటకీయ ప్రవర్తనను తలదన్నేలా ప్రవర్తించారు. రెండున్నరేళ్ల పాటు మహా వికాస్‌ అగాధీలో భాగమైనందువల్ల దావూద్‌ ఇబ్రహీంతో సంబంధం ఉన్న వారి మీద చర్య తీసుకోలేక పోయానని ఆయన అంటున్నారు. వీర సావర్కర్‌ను కీర్తించడం కూడా సాధ్యం కాలేదట. ఎందుకంటే కాంగ్రెస్‌తో ఉన్నందువల్ల అని షిందే చెప్తున్నారు. మరి ఇప్పుడు బీజేపీ అండతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు కనక దావూద్‌ ఇబ్రహిం అనుచరుల మీద తక్షణం చర్య తీసుకోవడానికి అడ్డు ఉండకూడదుగా! మరో వేపు నృత్యాలు జరిగే 16 బార్లను తాను స్వయంగా ధ్వంసం చేశానని షిందే గొప్పగా చెప్పుకుంటున్నారు. యువతను పెడదారి పట్టించే అలాంటి బార్లను మూసి వేయించడం సబబే కావచ్చు. కానీ ఆ పని చట్ట రీత్యా జరగాలని గ్రహించకపోవడం మంచి పని కోసమైనా చట్టాన్ని ఉల్లంఘించడం తప్పని షిందేకు తెలియదనుకోవాలా?
హిందుత్వ మీద వీరాభిమానం ముస్లింల మీద ద్వేషాన్ని పెంచి పోషిస్తోంది. ఇది ప్రజల మధ్య చీలికలు తేవడానికే ఉపకరిస్తోంది. సమా జాన్ని నిలువునా చీల్చి అధికారం సంపాదించడానికి లేదా అధికారంలో కొనసాగడానికి చట్టం అంగీకరించదు. మన సంస్కృతీ సమ్మతించదు. భారతీయ తత్వానికి విఘాతం కలగడాన్ని ఆమోదించలేం. విద్వేష ప్రచారంవల్ల ఎన్ని దారుణాలు జరుగు తున్నాయో చూస్తూనే ఉన్నాం. బూటకపు వార్తల గుట్టు విప్పే జుబేర్‌ను అరెస్టు చేయడం, గుజరాత్‌ మారణ కాండలో ప్రాణాలు కోల్పోయిన వారికి, నిరాధారంగా మిగిలిన వారికి న్యాయం అందేట్టు చూడడానికి రెండు దశాబ్దాల నుంచి పోరాడుతున్న మానవ హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌ను అరెస్టు చేయడం దుస్సహమైన విషయం. ఈ అరెస్టు జరగడానికి అనుకూలమైన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు నడవడిక న్యాయమార్గ పాలనకు గండి కొడ్తోంది. ఏదో అపరాధం చేసినందుకు తీస్తా సెతల్వాడ్‌ అరెస్టు కాలేదు. బాధితులకు న్యాయం చేయడానికి, కిరాతకంగా హత్యకు గురైన మాజీ ఎంపీ ఎహసాన్‌ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీకి న్యాయం జరగడానికి ప్రయత్నించినందుకు ఆమెను జైల్లో తోశారు. అదీ సుప్రీంకోర్టు ప్రతికూల వ్యాఖ్యల ఆధారంగా. సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఆ వ్యాఖ్యల ఆధారంగా ఎవరి మీదా చర్య తీసుకోలేదు. అంటే విద్వేష వాతావరణాన్ని వినియోగించుకోవడంలో న్యాయవ్యవస్థ కూడా భాగస్వామి అవుతోందన్న అనుమానం కలుగుతోంది. ఈ విద్వేష ప్రచారం రాను రాను తార స్థాయికి చేరి వికృత పరిణామాలకు దోహదం చేస్తోంది. మానెసర్‌లో జరిగిన పంచాయత్‌లో ముస్లింలను ఆర్థికంగా వెలేయాలని పిలుపు ఇవ్వడం ఆశ్చర్యకరమే కాదు భయానకం కూడా. బజరంగ్‌ దళ్‌, విశ్వహిందూ పరిషత్‌కు చెందిన దాదాపు 200 మంది ఈ పంచాయత్‌లో పాల్గొన్నారు. ముస్లింలను ఆర్థికంగా వెలేయడానికి గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ వెలివేతను అమలు చేయాలని పరిపాలనా విభాగానికి హెచ్చరిక కూడ జారీ చేశారు. తాము హిందూ సమాజ ప్రతినిధులమని ఈ సమావేశంలో పాల్గొన్నవారు ప్రకటించారు. గుర్గావ్‌, మానేసర్‌లో అనేక మంది రొహింగ్యాలు, బంగ్లాదేశీయులు, పాకిస్తానీలు అక్రమంగా నివాసం ఉంటున్నారని ఈ సమావేశంలో పాల్గొన్నవారు ఆరోపించారు. అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించడానికి పాలనా విభాగానికి వారం రోజుల గడువు ఇచ్చామని ఆ తరవాత మరో పంచాయత్‌ నిర్వహించి భవిష్యత్‌ కార్యక్రమం నిర్ణయిస్తామని చెప్తున్నారు. హిందుత్వ వాదుల ఆగడాలవల్ల ముస్లింలు బితుకుబితుకుమని కాలం వెళ్లబుచ్చాల్సి వస్తోంది. పనిగట్టుకుని ముస్లింలను వేటాడుతున్నారు. ఆల్ట్‌ న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్‌ జుబేర్‌ను నాలుగేళ్ల కింద సామాజిక మాధ్యమంలో చేసిన వ్యాఖ్య ఆధారంగా అరెస్టు చేయడం ముస్లింలను వేటాడడానికి ప్రబల నిదర్శనం. 1983లో హృషీకేశ్‌ ముఖర్జీ నిర్మించిన సినిమాపై 2018లో జుబేర్‌ చేసిన వ్యాఖ ఆధారంగా ఇప్పుడు అరెస్టు చేయడం అంతుపట్టని వ్యవహారమే. జుబేర్‌ చేసిన వ్యాఖ్య అభ్యంతరకరమైందని మాట వరసకు అనుకున్నా ఆ వ్యాఖ్య చేసిన నాలుగేళ్లలోనూ ఆ కారణంగా ఎలాంటి దుర్ఘటన జరగలేదుగా. అలాంటప్పుడు ఇప్పుడే జుబేర్‌ను అరెస్టు చేయడంలో ఆంతర్యం ఆయన ముస్లిం కావడమేనేమో! తీస్తా సెతల్వాడ్‌ కు వర్తింప చేసిన సూత్రాన్నే ఈ వ్యవహారంలోనూ అమలు చేస్తే జుబేర్‌ను అరెస్టు చేయడంలో నాలుగేళ్ల జాప్యానికి కారకులైన వారి మీద కూడా చర్య తీసుకుంటారా? మహమ్మద్‌ ప్రవక్తను టీవీ చానళ్లలో బహిరంగంగా అవమానించిన నూపుర్‌ శర్మ మీద మాత్రం ఎలాంటి చర్యా ఉండదు. చట్టం అయిన వారికి చుట్టం అంటే ఇదే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img