Friday, April 19, 2024
Friday, April 19, 2024

అబద్ధాల సర్కారు

అబద్ధాలు చెప్పడం అలవాటైన వారు కలలో కూడా నిజం చెప్పరేమో. మోదీ సర్కారు పరిస్థితి అలాగే ఉంది. కరోనా మహమ్మారి ఆవహించి ఏడాదిన్నర కావస్తోంది. ఈ మహమ్మారికి ఇప్పటి దాకా నాలుగు లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా సోకిన వారు అధికారిక లెక్కల ప్రకారమే మూడు కోట్ల పది లక్షల 26 వేల 829 మంది ఉన్నారు. కరోనా సోకినవారి సంఖ్య, మృతుల సంఖ్య కూడా ప్రభుత్వం అధికారికంగా అంగీకరించిందే తప్ప వాస్తవం కాకపోవచ్చు. ఈ లెక్క కచ్చితంగా లేకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది వ్యాధి సోకిన, మరణించిన వారందరి వివరాలు ప్రభుత్వం లెక్కల్లో చేరి ఉండకపోవచ్చు. ఈ లెక్కలను తు.చ. తప్పకుండా సేకరించాలన్న నిష్ఠ కానీ, తగిన యంత్రాంగం కానీ ప్రభుత్వానికి కొరవడి ఉండవచ్చు. గ్రామీణ ప్రాంతాలలోని కరోనా వివరాలన్నీ నికరంగా నమోదయ్యాయని చెప్పలేం. రెండవది ప్రభుత్వ లోపాలు ఎక్కడ బయట పడతాయోనన్న భయం వల్ల సమాచారం ఇవ్వరు. కరోనాను ఎదుర్కోవడంలో మోదీ ప్రభుత్వం సంసిద్ధంగా లేకపోవడమో, అడుగులు తడబడడమో, అంచనాలు తప్పడమో అయితే అర్థం చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితిలోనూ సత్యం పలకకూడదన్నది మోదీ సర్కారు ప్రతినలా కనిపిస్తోంది. రెండో దశ కరోనా ఉధృతంగా ఉన్నప్పుడు టీకాలు సేకరించడంలో, వేయించడంలో ప్రభుత్వ విధానం అస్తవ్యస్తంగా ఉందని మీడియా విమర్శలు గుప్పించినప్పుడూ ప్రభుత్వం బుకాయింపులతోనే కాలం గడిపింది. సీరం ఇనిస్టిట్యూట్‌ నుంచి 10 కోట్ల కోవీషీల్డ్‌ డోసులు, భారత్‌ బయోటెక్‌ నుంచి 2 కోట్ల డోసులు తెప్పించడానికి ఏర్పాట్లు చేశామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. నిజమే కావచ్చునని జనం అనుకోవచ్చు. ఈ మాట చెప్పింది మార్చి 2021లో. గత మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కూడా ప్రభుత్వం టీకా ఔషధం సేకరించడానికి ఏ ప్రయత్నమూ చేయలేదు. ప్రభుత్వం టీకాలు సేకరించడానికి ప్రయత్నించనైనా లేదని మీడియాలో వచ్చిన విమర్శలు రూఢ అయ్యాయి. టీకాలు తెప్పించలేదన్న మాట నిఖార్సైన అసత్యం అని ప్రభుత్వ అధీనంలోని ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరో (పి.ఐ.బి.) తెలియజేసింది. ‘‘ఈ సమాచారంలో లేశమంతైనా నిజం లేదు’’, ఇది ‘‘పూర్తిగా నిరాధారం’’ అని పి.ఐ.బి. తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెచ్‌.ఎల్‌.ఎల్‌. సంస్థ ద్వారా టీకా డోసులు తెప్పిస్తూ ఉంటుంది. ప్రభుత్వం గత మార్చి, ఏప్రిల్‌ నెలల్లో తెప్పించిన టీకా డోసులెన్నో సమాచార హక్కు చట్టం కింద తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అసలు విషయం బయట పడిరది. మీడియా చెప్పిన మాటే నిజమైంది. టీకా ఔషధం సేకరణ గురించి మీడియాలో వచ్చిన సమాచారాన్ని ఖండిస్తూ పి.ఐ.బి. మే 3వ తేదీన ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. టీకాల కోసం ప్రభుత్వం అసలు ఆర్డరే చేయలేదంటున్నారు. ప్రభుత్వం ఆఖరు సారి టీకాల కోసం ఆర్డర్‌ జారీ చేసింది 2021 మార్చిలోనని మీడియా వార్తలు చెబుతున్నాయని పి.ఐ.బి. తెలియజేసింది. ఈ వార్తలు అసత్యాలు, నిరాధారమైనవి అని పి.ఐ.బి. కొట్టి పారేసింది. ప్రభుత్వం కొత్తగా టీకా డోసులు తెప్పించడం లేదనడం అవాస్తవమని కూడా పి.ఐ.బి. విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఈ విషయం నిగ్గు తేల్చడానికి సమాచార హక్కు చట్టం కింద వివరాలు రాబట్టడంలో క్రియాశీలంగా ఉండే ఉద్యోగ విరమణ చేసిన కమడోర్‌ లోకేశ్‌ బత్ర ఆరోగ్య శాఖకు దరఖాస్తు చేశారు. ఆరోగ్య శాఖ హెచ్‌.ఎల్‌. లైఫ్‌ కేర్‌ ద్వారా టీకాలు తెప్పిస్తుంది. మార్చి రెండవ వారం నుంచే టీకాలు తెప్పించడం మొదలైందని ఈ సంస్థ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు స్పష్టంగా చెప్పడంతో ప్రభుత్వం దాచిపెడ్తున్నదేమిటో స్పష్టం అయింది. అయితే కమడోర్‌ లోకేశ్‌ బత్ర సమాచార హక్కు చట్టం కింద పెట్టుకున్న దరఖాస్తుకు వచ్చిన సమాధానం భిన్నంగా ఉంది. మార్చి రెండవ పక్షం నుంచి తమ మంత్రిత్వ శాఖ తరఫున హెచ్‌.ఎల్‌.ఎల్‌. లైఫ్‌ కేర్‌ కొత్తగా టీకాలేమీ ఆర్డర్‌ చేయలేదని చెప్పింది. మే 3వ తేదీన పి.ఐ.బి. పత్రికా ప్రకటన విడుదల చేసే దాకా కూడా కొత్తగా టీకాలు ఆర్డర్‌ చేయలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వివిధ మంత్రిత్వ శాఖల కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం నిర్వర్తించవలసి ఉన్న పి.ఐ.బి. తప్పుడు సమాచారం ఎక్కడి నుంచి సేకరించినట్టు? టీకాలు కొనడానికి మొత్తం ఆరు ఆర్డర్లు పెట్టామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బత్రాకు సమాచారం అందించింది.
బత్రా సమాచార హక్కు చట్టం కింద వివరాల కోసం మే 19న దరఖాస్తు చేస్తే మొదట సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు. ఈ దరఖాస్తు కింద కోరుతున్న సమాచారం 2005 నాటి సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 8(1)(ఎ) ప్రకారం వ్యూహాత్మకమైంది, శాస్త్ర సంబంధమైంది, ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించింది కనక ఈ సమాచారం ఇవ్వలేమని చెప్పారు. పైగా ఈ సమాచారం సేకరించడం వల్ల నెరవేరే ప్రజా ప్రయోజనం ఏమీ లేదని కూడా తెలియజేశారు. అయితే ఇది కచ్చితంగా ప్రజా ప్రయోజనాలకు సంబంధించిందేనని బత్రా వాదించారు. మొదట సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినప్పుడు సమాచారం ఇవ్వవలసిన బాధ్యత ఉన్న అధికారి ఈ వివరాలన్నీ అదివరకే మీడియాలో వచ్చిన వాస్తవాన్ని కూడా గుర్తించలేదు. తాను కోరిన సమాచారం ప్రజా ప్రయోజనాలతో కూడుకున్నదని, అది ప్రజల ఆరోగ్య హక్కుకు, జీవించే హక్కుకు సంబంధించిందని బత్రా గుర్తు చేశారు. ఆయన వాదనకు అనుగుణంగా సుప్రీంకోర్టు ఉత్తర్వును కూడా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు 2021 మే 31న జారీ చేసిన ఉత్తర్వులో ప్రభుత్వం ఎప్పుడు, ఎన్ని టీకా డోసులు సేకరించిందో తెలియజేయాలని ఆదేశించింది. ఏ కంపెనీ దగ్గర ఎంతెంత కొన్నారో కూడా చెప్పాలని కోరింది. అయితే ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందజేసిన పత్రాలను పరిశీలిస్తే ఈ ఆర్డర్లు ఎలా ఇచ్చారన్న విషయంలో అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయని బత్రా అంటున్నారు. 2021 మే 5న టీకా కొనడానికి ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసినా ఏప్రిల్‌ 22న కానీ టీకాలు ఆర్డర్‌ చేయలేదు. ఇలా జాప్యం చేయడమే టీకాల కొరతకు కారణమేమో అన్న ప్రశ్నా ఎదురవుతోంది. మొదటి దశలో సమాచారం ఇచ్చిన అధికారి ఏప్రిల్‌ 22న 5.5 కోట్ల కోవాక్సిన్‌ కొనడానికి ఆర్థిక మంజూరీ లభిస్తే తీరా కొన్నది 5 కోట్ల డోసులే. అంటే మధ్యలో 50 లక్షల డోసులకు కత్తెర ఎవరు వేసినట్టు? ఇలాంటి లోపాలు ఉంటాయి కనకే అధికారులు ఏ సమాచారాన్ని అయినా వెల్లడిరచడానికి వెనుకాడతారు. తెలిసిన సమాచారం ఎటూ చెప్పరు. చెప్పినా అసత్య సమాచారమే చెప్తారని మోదీ నుంచి మొదలుకొని ఏ మంత్రిని చూసినా అర్థం అవుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img