Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అవధుల్లేని అహంభావం

బుధవారం లోకసభలో కనిపించిన దృశ్యాలు, వినిపించిన నినాదాలు అసలు విషయాలు ఏవీ ప్రస్తావించకుండానే గంటన్నర సేపు సాగిన మోదీ ప్రసంగం ఈ ‘అమృత’ కాలంలో తప్ప ఇదివరకు ఎప్పుడూ కనని, విననివే. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి కృతజ్ఞతలు తెలియజేసే తీర్మానం సందర్భంగా ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు మోదీ ప్రత్యక్షంగా దేనీకీ సమాధానం చెప్పనే లేదు. పరోక్షంగా సమాధానం ఇచ్చారనిపించిన సందర్భంలోనూ ప్రతిపక్షాలపై దాడికే ఆయన గంటన్నర వెచ్చించారు. మోదీ ప్రసంగించడానికి లేచి నిలబడగానే బీజేపీ సభ్యులు ‘‘మోదీ, మోదీ, మోదీ’’ నినాదాలతో హోరెత్తించారు. దీనికి జవాబుగా ప్రతిపక్ష సభ్యులు ‘‘అదానీ, అదానీ’’ అని గట్టిగా అరిచారు. కానీ ప్రతిపక్షాలు మోదీని బోనులో నిలబెట్టడానికి ఎంత ప్రయత్నించినా ఆయన ఏమాత్రం ఖాతరు చేయలేదు. ప్రతిపక్షాల ఆరోపణల విషయంలో మౌనమే ఆయన సమాధానం అయింది. దీనికి బయటకు కనిపించే కారణం తనకు ఎదురులేదని మోదీకి అపరిమితమైన విశ్వాసం ఉండడమూ కావచ్చు. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర తరవాత దేశ రాజకీయాలలో స్పష్టంగా కనిపిస్తున్న మార్పు మోదీని అంతరాంతరాలలో కలవర పెడుతూ ఉండొచ్చు. ఒక వేళ ఆయన ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పినా అది సత్యమేనని మాటవరసకు అంగీకరించడానికి కూడా ఆయన అహంభావం అడ్డుపడ్తూనే ఉంటుంది. తన సమాధానం ఉన్న తరవాత జనం చెప్పిన మాటలన్నీ అంగీకరిస్తారన్న అతి విశ్వాసం ఆయనలో ఉండి ఉండొచ్చు. మంగళవారం జరిగిన చర్చ సమయంలో పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాలు అదానీకి సంబంధించి అనేక ప్రశ్నలు లేవనెత్తారు. వాటికి మోదీ సమాధానం ఇస్తారని అనుకున్న అమాయకులూ ఉండే ఉంటారు. కానీ మోదీ అదానీ పేరైనా ఎత్తలేదు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ ప్రతిపక్షాలను ఐక్యం చేశాయన్న వాస్తవాన్ని మాత్రం మోదీ అంగీకరించక తప్పలేదు. ఒక వ్యక్తి చుట్టూ, ఆ వ్యక్తి పేరు ఆధారంగా ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ ఇరుసు నలిగిపోతోంది. ఆయన ఆధారంగానే స్టాక్‌ మార్కెట్‌ జారుడు బండ మీదకు చేరుకుంది. ఆ వ్యక్తి మీదే రాహుల్‌ మంగళవారం అనేక ప్రశ్నలు సంధించారు. ఆయన అడిగిన ప్రశ్నలు గర్భితార్థం ఉన్నవీ కావు. వాటికి వ్యాఖ్యానమూ అవసరమూ లేదు. ఆయన అడిగిన ప్రశ్నల్లా అదానీ మీతోపాటు ఎన్నిసార్లు విదేశాల్లో పర్యటించారు? ఆ తరవాత అదానీ ఎన్ని సార్లు ఆ దేశాలు వెళ్లారు? ఏ దేశంలో అదానీకి కాంట్రాక్టు దొరికిందో మీరు ఆ దేశానికి ఎప్పుడు వెళ్లారు? మీరు ఆ దేశం వెళ్లిన తరవాత అదానికి ఏ కాంట్రాక్టులు దొరికాయి? అదానీ బీజేపీకి ఇచ్చిన విరాళాల రూపంలో ఇచ్చిన మొత్తం ఎంత? ఇందులో ఒక్క ప్రశ్నకూ మోదీ సమాధానం చెప్పలేదు. అన్నింటినీ వాటంగా దాట వేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలియజేసే తీర్మానంపై జరిగిన చర్చ తరవాత ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు మోదీ నించి సమాధానం వస్తుందని ఎవరైనా అనుకుంటారు. ఎందుకంటే ఇది మన పార్లమెంటులో కొనసాగుతున్న సంప్రాదాయం.
కానీ మోదీ ఈ సంప్రదాయాలను ఎన్నడు ఖాతరు చేశారు కనక. అయితే రాహుల్‌ అడిగిన ప్రశ్నలు మోదీని కలవరపెడ్తున్నాయని మోదీ ముఖకవళికలను గమనించిన ఎవరికైనా అనిపిస్తుంది. అదానీ పేరు, రాహుల్‌ గాంధీ పేరు ప్రస్తావించక పోయినప్పటికీ తన మీద అసత్య, నీచమైన ప్రచారం చేయడమేకాక దూషణలకు దిగుతున్నారని మోదీ ఆక్రోశం వ్యక్తం చేశారు. తన ప్రతిష్ఠను దిగజారుస్తున్నారన్నారు. కానీ ఈ దూషణలు, తనను అప్రతిష్ఠ పాలు చేసే ప్రయత్నాలు తనను ఏమీ చేయలేవనీ ఎందుకంటే దేశవాసులందరి మద్దతు తనకు దండిగా ఉందని, ఏ దూషణ అయినా తనను చేరుకోవాలంటే 140 కోట్ల మంది ప్రజలను దాటుకుని రావాల్సి వస్తుందని మోదీ అవధుల్లేని అహంభావ పూరితంగా మాట్లాడారు. ప్రసంగం పొడవునా తొమ్మిదేళ్లుగా తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ఏకరువు పెట్టడానికే ఆయన గంటన్నర సేపూ వెచ్చించారు. ఈ విజయాలూ అసత్యాలన్నది వేరే విషయం. 2004 నుంచి 2014 దాకా అంటే కాంగ్రెస్‌ నాయకత్వంలో యు.పి.ఎ. ప్రభుత్వం కొనసాగిన దశాబ్ద కాలమంతా శూన్యమేనని, అంతా వృథా ఐందని ఆయన జంకు గొంకు లేకుండా ప్రసంగించేశారు. యు.పి.ఎ. హయాంలో 2జి స్పెక్ట్రం, కామన్వెల్త్‌ క్రీడలు, బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించి కుంభకోణాలు జరిగాయన్న ఆరోపణలు దండిగానే వచ్చాయి. వాటిలో నిజమూ ఉండొచ్చు. కానీ వీటన్నింటిపై ముఖ్యంగా 2జి కుంభకోణంపై దర్యాప్తులు జరిగాయి. ఎవరూ దోషులుగా తేలలేదు. అంతమాత్రం చేత ఏ కుంభకోణమూ జరగలేదన్న భ్రమ ఎవరికీ అవసరం లేదు. ఈ కుంభకోణాలను టముకు వేసి చాటి చెప్పిన అప్పటి కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆ తరవాత బీజేపీ అండన చేరి అనేక పదవులు అనుభవించిన వాస్తవాన్నీ కాదనలేం. ఈ అవినీతి ఆరోపణలే మోదీ అధికారంలోకి రావడానికి నిచ్చెన మెట్లయ్యాయి. అయితే యు.పి.ఎ. సర్కారు తమ మీద వచ్చిన ఆరోపణలపై దర్యాప్తుకు ఆదేశించింది. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే మోదీ సర్కారుమీద ఎన్ని ఆరోపణలు వచ్చినా ఒక్క సందర్భంలోనూ దర్యాప్తు ప్రశ్నే లేదు. రాఫేల్‌ కుంభకోణం మొదలుకుని సరిహద్దులో చైనా దుందుడుకు వ్యవహారం దాకా ఎన్ని విమర్శలు వచ్చినా మోదీ సర్కారు వాటన్నింటినీ చాపకిందకు తోసేస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దేశం అయిదో స్థానంలో ఉందని విరామం ఎరగకుండా సొంత డబ్బా వాయించుకుంటున్న మోదీ యు.పి.ఎ. హయాంలోనే ఆర్థికవృద్ధి రేటు అత్యధికంగా ఉందన్న విషయాన్ని మాత్రం ఒకోవడం లేదు.
బీజేపీ ప్రభుత్వాలు ఇంతకు ముందూ ఉన్నాయి. అటల్‌ బిహారీ వాజపేయి నాయకత్వంలో ఆరేళ్లు ఎన్‌.డి.ఎ. ప్రభుత్వం కొనసాగింది. అప్పుడు వచ్చిన ఆరోపణలపై ఎన్‌.డి.ఎ. ఇంత మంకు పట్టు పట్టిన దాఖలాలు లేవు. బీజేపీ అధికారంలో లేనప్పుడు బీజేపీ అగ్ర నాయకుడు లాల్‌ కృష్ణ అద్వాణీ మీద జైన్‌ డైరీల వ్యవహారంలో ఆరోపణలు గుప్పు మన్నాయి. అప్పుడు ఆయన అధికారంలో లేకపోయినా ఈ ఆరోపణల మీద దర్యాప్తు జరిపించాలని స్వయంగా కోరారు. తాను నిర్దోషినని తేలితే తప్ప పార్లమెంటులో అడుగుపెట్టబోనని భీష్మించారు. డర్యాప్తు జరిగింది. అడ్వాణీ దోషి అని తేలలేదు. ఆ సంప్రదాయం మోదీకి గుర్తుకే రావడం లేదు. జిన్నా గురించి అడ్వాణీ, జస్వంత్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యల మీద దుమారం రేగినప్పుడూ ఆ నాయకులిద్దరూ చాలా హుాందాగా వ్యవహరించారు. మోదీకి ఇవేవీ పట్టవు.
అధికార పక్షం, ప్రతిపక్షం పరస్పర ఆరోపణలు గుప్పించుకోవడంలో ఆశ్చర్యం లేదు. కొత్త కూడా కాదు. కానీ తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తు జరిపించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో రివాజు. బుధవారం మోదీ ప్రసంగించినప్పుడు ఏ ఆరోపణకూ సమాధానం చెప్పలేదన్న మాటేగానీ వాటిని గమనించకుండా వదలలేదు. తన మీద వచ్చిన ఆరోపణలను ప్రజలు పట్టించుకోరని చెప్పేశారు. కానీ ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలకు పార్లమెంటు వేదిక మీంచి సమాధానాలు రాకపోవచ్చు. కానీ ఈ ప్రశ్నలు ప్రజలకు చేరకుండా ఉండవుకదా!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img