Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

అవధుల్లేని బీజేపీ అధికార దాహం

అధికారం కోసం వెంపర్లాడే బీజేపీ లాంటి రాజకీయ పార్టీల అధికార దాహం ముందు సకల నియమ నిబంధనలు, సంప్రదాయాలు, ఆనవాయితీలు ఎందుకూ కొరగావు. నియమాలన్నింటినీ తుంగలో తొక్కి అందలాలెక్కడమే బీజేపీ లక్ష్యం. శాసనసభల్లో మెజారిటీ లేకపోయినా డబ్బు గుమ్మరించి ప్రజా ప్రతినిధులను కొని అధికార పీఠాలెక్కడంలో బీజేపీ ఆరితేరి పోయింది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో ఏ పార్టీ అయినా బీజేపీ ముందు దిగదుడుపే. దేశ రాజధాని దిల్లీలో బీజేపీ అధికారంలో లేక దాదాపు 28ఏళ్లు కావస్తోంది. పదిహేనేళ్లు కాంగ్రెస్‌ దిల్లీలో రాజ్యమేలితే 2013 నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్రం కాని రాష్ట్రం దిల్లీలో అధికారంలో ఉంది. సదా ఎన్నికలకు సిద్ధంగా ఉండే బీజేపీ యంత్రాంగం, ఎన్నికలలో గెలిపించడంలో రికార్డులు నెలకొల్పడంలో అద్వితీయు డనిపించుకున్న నరేంద్ర మోదీ దేశ ప్రధాని అయినా దిల్లీలో అధికారం లేకపోవడం మోదీ కీర్తికిరీటంలో పెద్ద లోటుగానే మిగిలిపోయింది. దిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు ఇటీవల జరిగిన ఎన్నికలలో కూడా బీజేపీ పరాజయం పాలైంది. అక్కడా అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వం లోని ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. దిల్లీ మునిసిపల్‌ కార్పోరేషన్‌లో మొత్తం 250 స్థానాలు ఉంటే ఆమ్‌ ఆద్మీ పార్టీ 134 స్థానాలు సాధించి బీజేపీకి పెద్ద సవాలు విసిరింది. పదిహేనేళ్ల నుంచి దిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ను ఏలిన బీజేపీ ఇటీవల 104 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. మామూలు దృష్టితో చూస్తే 134 స్థానాలు సంపాదించిన ఆమ్‌ ఆద్మీ పార్టీకే మేయర్‌ పదవి దక్కాలి. కానీ బీజేపీ ఈ ప్రజాస్వామ్య సూత్రానికి మోకాలు అడ్డుతోంది. దిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ స్థానం దక్కించుకోవాలంటే మెజారిటీ సీట్లలో గెలిస్తే సరిపోదు. మరో పదిమందిని దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నామినేట్‌ చేస్తారు. ముగ్గురు రాజ్యసభ సభ్యులు, 14 మంది శాసనసభ్యులు కూడా మేయర్‌ ఎన్నికలలో ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ స్థానంలో ఎవరుంటేవారికి ఎప్పుడూ ఉప్పు-నిప్పు సంబంధాలే ఉన్నాయి. అందువల్ల దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనా పదిమంది పెద్దలను(ఆల్డర్మెన్‌) నామినేట్‌ చేయడానికి ఉన్న అవకాశాన్ని బీజేపీకి అనుకూలంగా మార్చకుండా ఎందుకుంటారు! ఆ పదిమందీ బీజేపీకి అనుకూలురే అయి ఉంటారని చెప్పడానికి పెద్ద పాండిత్యం అక్కర్లేదు. కానీ దిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ చట్టం ప్రకారం ఈ పదిమంది పెద్దలు మేయర్‌ ఎన్నికలలో ఓటు వేయడానికి వీలులేదు. కానీ ఓడినా కార్పొరేషన్‌ను గుప్పెట్లో పెట్టుకోవడం బీజేపీ లక్ష్యం కనక లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆ పదిమంది పెద్దలకు కూడా ఓటేసే అవకాశం కల్పించారు. దీనిని ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గత డిసెంబర్‌లో కార్పొరేషన్‌ ఎన్నికలు ముగిశాక జనవరి 2న మేయర్‌ ఎన్నిక జరగాలి. బీజేపీ కుయుక్తుల వల్ల అది జరగలేదు. ఆ ఎన్నిక జనవరి ఆరుకు వాయిదా పడిరది. ఎన్నిక సోమవారం, ఫిబ్రవరి ఆరోతేదీ జరగాల్సింది. కానీ బీజేపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ మధ్య పేచీ కారణంగా మూడోసారి కూడా ఎన్నిక జరగనే లేదు. 

బీజేపీ ఆడుతున్న నాటకం ఇంతమేరకే అయితే పెద్ద పేచీలేదు. మేయర్‌ ఎన్నిక జరిపించడానికి, సభను నిర్వహించడానికి ఒక సభాధ్యక్షుడిని నియమిస్తారు. ఈ పద్ధతి పార్లమెంటులో, శాసనసభల్లో కూడా ఉంటుంది. అందరికన్నా ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తిని కొత్త సభ్యుల చేత ప్రమాణం చేయించడానికి సభాపతిగా నియమిస్తారు. ఆ తరవాతే స్పీకర్‌ ఎన్నిక జరుగుతుంది. ఈ సంప్రదాయం ప్రకారం అయితే ముఖేశ్‌ గోయల్‌ను సభాధిపతిగా నియమించాలి. కానీ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడమే తన కర్తవ్యం అనుకునే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సక్సేనా అందరికన్నా సీనియర్‌కాని సత్యశర్మకు సభాధిపత్యం అప్పగించారు. దీనిని ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యతిరేకిస్తోంది. 2012 దాకా దిల్లీ నగర పాలకసంస్థ ఒకే వ్యవస్థగా ఉండేది. కానీ తరవాత దాన్ని మూడుముక్కలు చేసి తూర్పు, దక్షిణ, ఉత్తర పురపాలక సంస్థలుగా విడగొట్టారు. వికేంద్రీకరణకోసం ఇలా చేశామన్నారు. గత సంవత్సరం ఆఖరులో దిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు జరగడానికి ముందు మూడు విభాగాలను కలిపి మళ్లీ ఒకే మునిసిపల్‌ కార్పొరేషన్‌గా మార్చారు. దీనివల్లా బీజేపీకి ఫలితం దక్కలేదు. తీరా ఇటీవల జరిగిన ఎన్నికలలో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయఢంకా మోగించింది.
పదిహేనేళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దింపింది. శాసనసభలో మెజారిటీ సంపాదించడానికి దాదాపు దశాబ్దంనుంచి బీజేపీ చేస్తున్న ప్రయత్నం ఎటూ సఫలం కావడంలేదు. ఇప్పుడు చేతిలోఉన్న కార్పొరేషన్‌ మేయర్‌ పదవీ దక్కించుకోవడానికి తగిన మెజారిటీ రాలేదు. జనవరి రెండున, ఆరున జరిగిన సమావేశంలో కూడా ఆమ్‌ ఆద్మీ పార్టీకి, బీజేపీకి చెందిన కార్పొరేటర్లు ఘర్షణ పడ్డారు. అక్రమంగా మేయర్‌ పదవి దక్కించుకోవడానికి బీజేపీ కుతంత్రాలను ఎండగట్టడానికి ఆమ్‌ఆద్మీ పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఆమ్‌ఆద్మీ పార్టీ షెల్లీ ఒబెరాయ్‌ని మేయర్‌గా నియమించాలనుకుంటోంది. కానీ మూడోసారి కూడా మేయర్‌ ఎన్నిక జరగడానికి పనిగట్టుకుని ఆటంకాలు కల్పించినందువల్ల ఆమ్‌ఆద్మీ పార్టీ నిర్ణీత తేదీన మేయర్‌ ఎన్నిక జరిపించాలని ఆదేశించాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టుకు ఎక్కింది. కానీ తాము ఈ పిటీషన్‌ను అనుమతిస్తే ఎన్నిక ప్రక్రియ ఆగిపోతుందని చెప్పడంతో ఆమ్‌ఆద్మీ పార్టీ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. బీజేపీ ఎత్తుగడల్లో మరో విచిత్రం కూడా ఉంది మేయర్‌, డిప్యూటీ మేయర్‌, స్థాయీ సంఘం కార్యనిర్వాహక సభ్యుల ఎన్నిక ఏకకాలంలో జరగాలని పేచీపెట్టింది. ఏ స్థానిక సంస్థలో అయినా ముందు మేయర్‌ను ఎన్నుకుంటారు. అప్పటిదాకా సభా కార్యకలాపాలను తాత్కాలికంగా నియమితులైన సభాపతి నిర్వహిస్తారు.
మేయర్‌ ఎన్నిక పూర్తిఅయిన తరవాత ఆయన ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరుగుతుంది. అలాగే స్థాయీ సంఘం కార్యనిర్వాహక సభ్యుల ఎన్నిక జరుగుతుంది. తమకు నచ్చిన వ్యక్తిని తాత్కాలికంగా సభాధ్యక్షస్థానంలో కూర్చోపెట్టడం, నామినేషన్‌ పద్ధతిలో నియమించే పదిమంది పెద్దలకు లేని ఓటు హక్కు కల్పించడం లాంటి ఎత్తుగడల ద్వారా ప్రజలిచ్చిన తీర్పును వమ్ముచేయడానికి బీజేపీ చేయని ప్రయత్నంలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img