Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

ఆక్రమణల తొలగింపు చాటున అస్సాంలో ముస్లింలపై విద్వేషం

సెప్టెంబర్‌ 23వ తేదీన సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో విస్తారంగా కనిపించింది. ఆ వీడియో చూస్తే లుంగీ కట్టు కున్న ఒక వ్యక్తి అక్కడున్న దాదాపు 20 మంది పోలీసుల దగ్గరకు వెళ్లాడు. ఆ తరవాత కొద్ది క్షణాల్లోనే పోలీసులు అతడిని కాల్చి పారేశారు. తూటా తగిలి ఆయన కింద పడ్డాడు. దాదాపు డజన్‌ మంది పోలీసులు వచ్చి కొన ఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని బూటు కాళ్లతో ఇష్టం వచ్చినట్టు తన్నారు. ఈ వీడియోలో నిస్సహాయ స్థితిలో పడి ఉన్న ఆ వ్యక్తి మీద మామూలు దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి దూకుతున్నాడు. ఆ వ్యక్తి ప్రభుత్వ ఫొటోగ్రాఫర్‌ అని తరవాత తెలిసింది. పోలీసు తూటాలకు నేలకొరిగిన వ్యక్తి పేరు మొయినుల్‌ హఖ్‌. పోలీసులు దాష్టీకానికి పాల్పడడానికి ఆ వ్యక్తి ముస్లిం అయితే చాలు కదా! బీజేపీ అధికారంలో ఉన్న చోట ముస్లింలను హింసించడానికి ప్రత్యేక కారణం అవసరం ఏముంటుంది? ఈ సంఘటనలోనే షేక్‌ ఫరీద్‌ అనే మరో వ్యక్తి కూడా పోలీసు కాల్పులకు బలయ్యాడు. ఇది మధ్యయుగాల నాటి బర్బరత్వం అని వాదించేవారు ఉండవచ్చు. అస్సాంలోని దరాంగ్‌ జిల్లా ధోల్పూర్‌లో ఈ అమానుష సంఘటన జరిగింది. ఎన్నికలు జరగ డానికి ముందు భూమిని ఆక్రమించిన వారందరినీ ఖాళీ చేయిస్తామని పేర్కొన్న బీజేపీ ఎన్నికల ప్రణాళిక అమలులో భాగంగానే ఈ అమానుషత్వం కొనసాగుతోంది. బీజేపీ ఖాళీ చేయిస్తున్నది ముస్లింలను మాత్రమే. అంటే ఈ ఆక్రమణల తొలగింపు వెనక రాజకీయ కారణాలున్నాయని చెప్పక్కర్లేదు. ఇంతవరకు 800 మందిని ఖాళీ చేయించామని ప్రభుత్వం చెప్తుండగా నిజనిర్ధారణ కమిటీ 20 వేల మందిని ఖాళీ చేయించారని వెల్లడిరచింది. రాజకీయాలు మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలపై ద్వేషం నింపడానికేనని మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచీ రుజువు అవుతూనే ఉంది. అస్సాంలో ముస్లింల పరిస్థితి చాలా విచిత్రమైంది. బ్రిటిష్‌ వారి హయాం లోనే 19వ శతాబ్దంలోనే తేయాకు తోటల్లో పని చేయడానికి ప్రభుత్వమే బెంగాల్‌ నుంచి అనేక మందిని అస్సాంకు తరలించింది. ఈ తరలింపు 20వ శతాబ్దం ప్రథమార్థం దాకా కొనసాగింది. బెంగాల్‌ నుంచి అస్సాంకు తరలివచ్చిన వారు నదీ తీరాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే నదుల ప్రవాహగతి మారినప్పుడు వీరు నిర్వాసితులవుతారు. మరో చోట ఆవాసం ఏర్పాటు చేసుకోవలసి వస్తుంది. ఇలా తరలి వచ్చిన వారిలో ఎక్కువ మంది ముస్లింలు. అప్పటి నుంచి ఇలా తరలి వచ్చిన వారు అస్సాం సంస్కృతిని భాషను అలవర్చుకున్నారు. అయినా వారు ముస్లింలు కనక బీజేపీ దృష్టిలో వారు ‘‘ఇతరులే’’. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చినవారే. ముస్లిం లను వేధించడానికి అస్సాంలో సుదీర్ఘ చరిత్రే ఉంది. వారిని ‘‘గేడాలు’’ అంటారు. అంటే అక్రమంగా వలస వచ్చిన వారు, బంగ్లాదేశీలు, అను మానాస్పదులైన బంగ్లా దేశీయులు, ఆక్రమణదార్లు. ముస్లింలను ముఖ్యంగా బెంగాలీ మాట్లాడే మియా ముస్లింలను వేధించడానికి సంఫ్‌ు పరివార్‌ అనేక మార్గాలు అనుసరించింది. జాతీయ పౌరుల జాబితా (ఎన్‌.ఆర్‌.సి.) అలాంటి ఆయుధమే. ఆ తరవాత పౌరసత్వ సవరణ చట్టం అనే మరో ఆయుధానికి పదును పెట్టారు. ముస్లింలను అనుమానాస్పదమైన ఓటర్లుగా భావించడం మొదలైంది. వేలాది మంది మియా ముస్లింల పౌరసత్వం అనుమానాస్పదంగా తయారైంది.
అస్సాంలో ముస్లింలను వేధించడానికి అనేక పద్ధతుల్లో ఆక్రమణల తొలగింపు తాజా ఎత్తుగడ. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం నెరవేర్చే నెపంతో ఇప్పుడు ‘‘ఆక్రమణదార్లను తొలగించడం’’ అన్న ముద్దు పేరు పెట్టింది. స్థానిక యువతకు ఉపాధి కల్పించడానికే ఆక్రమణలను తొలగిస్తా మంటున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఆక్రమణల తొలగింపు పేర ప్రభు త్వమే ఒక మతం వారిపై బాహాటంగా చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా అక్కడి పౌర సమాజం సైతం గొంతెత్తే స్థితిలో లేదు. అమిత్‌ షా అంతటి వారు ముస్లింలను ‘‘చెదలు’’ అన్న తరవాత పరిస్థితి ఇంతకన్నా భిన్నంగా ఉండే అవకాశమే లేదు. రాజ్యాంగం పౌరులందరూ సమానమే అంటుంది. కానీ బీజేపీ ఏలికలకు ఆ విషయమే పట్టదు. అస్సాంలో భూమి లేని పేదలు వేల సంఖ్యలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది అంతర్గతంగా నిర్వా సితులైన వారే. ధోల్‌పూర్‌ సంఘటన తరవాత పౌరహక్కుల పరిరక్షణా సంఘం (ఎ.పి.సి.ఆర్‌.) అస్సాం వెళ్లి నిజ నిర్ధారణ చేసి సోమవారం నాడు దిల్లీలో నివేదిక విడుదల చేసింది. నిజనిర్ధారణ సంఘంలో సామాజిక కార్యకర్తలు, పత్రికా రచయితలు, పరిశోధకులు కూడా ఉన్నారు. ధోల్‌ పూర్‌లో జరిగిన పోలీసుకాల్పులపై అధికారవర్గాల వారు పాత కథే వల్లించారు. పోలీసుల మీద లాఠీలు, రాళ్లతో దాడికి దిగినందువల్లే ‘‘ఆత్మ రక్షణ కోసం’’ కాల్పులు జరపవలసి వచ్చిందని చెప్పారు. ఆక్రమణదార్లుగా గుర్తించిన వారికి పునరావాసం కల్పిస్తామంటే వారు ఆ మాట నమ్మి దానికి సిద్ధపడ్డారు కూడా. తమ వస్తువులను తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఒక్క ఉదుటున పోలీసులు వారి మీద విరుచుకుపడ్డారు. ఎవరైనా ఆక్రమణ లకు పాల్పడ్డారనుకున్నప్పుడు వారిని ఖాళీ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కానీ దీనికి ఓ పద్ధతి ఉంటుంది. ముందు నోటీసులివ్వాలి. కనీసం 24 గంటల నోటీసైనా ఇవ్వలేదు. పెద్ద ప్రతిఘటన కూడా లేక పోయినా మరిన్ని పోలీసు బలగాలను రప్పించి అమాంతం విరుచుకుపడ్డా రని నిజనిర్ధారణ కమిటీ పరిశీలనలో తేలింది. హేమంత బిస్వ శర్మ బీజేపీ తీర్థం పుచ్చుకుని ముఖ్యమంత్రి అయిన తరవాత ముస్లింలపై వేధింపు విపరీతంగా పెరిగింది. బెంగాలీ మాట్లాడే ముస్లింలను విపరీతంగా వేధిస్తు న్నారు. ఇందులో మరో విచిత్రమూ ఉంది. 2019లో మూడేళ్ల కన్నా ఎక్కువకాలం నుంచి ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ఉన్న వారికి ప్రభుత్వం ఆ భూములకు పట్టాలిచ్చింది. అయితే ఇందులోనుంచి ముస్లిం లను పనిగట్టుకుని మినహాయించారు. వీరందరూ ‘‘ఆక్రమణదార్లు’’ లేదా ‘‘బంగ్లాదేశీయు’’ల కిందే లెక్క. ఇప్పుడు ప్రభుత్వం ఖాళీ చేయిస్తున్నది వీరినే. అంటే ముస్లింలను తరిమేయడానికే ఆక్రమణల తొలగింపు కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వ దమనకాండను హింసా మార్గంలో ప్రతిఘటిం చినా శాంతియుత పద్దతుల్లో నిరసన తెలియజేసినా ప్రభుత్వ స్పందన మాత్రం ఒకే రకంగా ఉంటుంది. అది బల ప్రయోగమే. బీజేపీ హయాంలో న్యాయమార్గ పాలన అన్న మాటకు విలువే లేదు. భూ ఆక్రమణదార్ల ప్రక్షా ళన పేరుతో తుపాకి రాజ్యమే నడుస్తోంది. బీజేపీ అమలు చేస్తున్న విధా నాలకు పేరేదైనా అది చివరకు విద్వేష ప్రచారంగానే వ్యక్తం అవుతుంది. అందుకే ఈ సందర్భంగా భూ ఆక్రమణదార్లను ‘‘భూ జిహాదీలు’’ అంటు న్నారు. ‘‘లవ్‌ జిహాదీలు’’ అన్న మాటను ప్రచారంలో పెట్టిన సంఫ్‌ు పరివార్‌ అన్నింటికీ జిహాద్‌ అన్న మాట చేర్చి ముస్లింల మీద విద్వేషాగ్ని రగిలి స్తోంది. తన దుష్ట విధానాలు బయటపడకుండా ఉండడానికి ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రాంతాలకు ప్రతిపక్షాలను వెళ్లనివ్వకపోవడం మామూలు విధానంగా తయారైంది. ఇంకెక్కడి న్యాయమార్గ పాలన!?

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img