Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఆక్రమిత కశ్మీర్‌పై ప్రగల్భాలు

భయమేసినప్పుడల్లా చాలామంది భగవంతుడిని తలుచు కుంటారు. గట్టిగా ఉరిమితే ‘‘అర్జున, ఫల్గుణ…’’ అని అంటూ ఉంటారు. మోదీ ప్రభుత్వం కూడా అలాగే అవసరమైనప్పుడల్లా పాకిస్తాన్‌ బూచి చూపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడూ ఒంటికాలు మీద లేస్తుంది. తీరా చూస్తే ఇవన్నీ ప్రగల్భాల కింద మిగిలి పోతాయి. కార్గిల్‌ యుద్ధంలో మనం విజయం సాధించిన సంద ర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కార్గిల్‌ దినోత్సవం జరుగుతోంది. ఆ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మరోసారి పాకిస్తాన్‌ మీద విరుచుకు పడ్డారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ను స్వాధీనం చేసుకుంటామని హుంకరించారు. ఇలాంటి ఒట్టి మాటలు చెప్పడంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ ఒంటరి వాడేమీ కాదు. ప్రధానమంత్రి మోదీ తరచుగానే ఈ మాట చెప్తూనే ఉంటారు. మోదీ అయితే ఏకంగా బలూ చిస్థాన్‌కు స్వాతంత్య్రం ఇప్పిస్తానని ఒకానొక స్వాతంత్య్ర దినోత్సవ ప్రసం గంలో చెప్పారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు పాకిస్తాన్‌ మీద దాడి చేస్తాం అనే దాకా వెళ్లారు. ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకు తీరతామన్నారు. అయినా ఆక్రమిత కశ్మీర్‌ పాకిస్తాన్‌ అధీనంలోనే ఉంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోనే చైనా-పాకిస్తాన్‌ ఆర్థిక వసారాను చైనా నిర్మించే సింది. మోదీ సర్కారులోని మంత్రులకు అప్పుడప్పుడు ఆక్రమిత కశ్మీర్‌ గుర్తొస్తూ ఉంటుంది. సాధారణంగా ప్రధానో, రక్షణ మంత్రో అధీన రేఖ దగ్గర ఉన్నప్పుడు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమనీ, దాన్ని స్వాధీనం చేసుకుంటామనీ గర్జిస్తుంటారు. ఈ అధీన రేఖే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు భారత్‌ అధీనంలో ఉన్న కశ్మీర్‌కు విభజన రేఖ లాంటిది. భారత నాయకులకు గుర్తొచ్చినప్పుడో, అవసరం వచ్చినప్పుడో ఇలాంటి ప్రకటనలు గుప్పిస్తూ ఉంటే బలూచిస్థాన్‌ ప్రజలు ఎప్పుడు స్వతంత్రం అవుతామా అన్న ఆశలు పెంచుకుంటారేమోనన్న అభిప్రాయం కలుగుతుంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను పాకిస్తానీయులు ‘‘ఆజాద్‌ కశ్మీర్‌’’ అంటారు. కానీ అక్కడ ఉండే కశ్మీరీలను మాత్రం ఎందుకనో స్వతంత్ర కశ్మీర్‌లో ఉండే వారిగా భావించరు. నిజానికి తమ అధీనంలో ఉన్న ఆక్రమిత కశ్మీర్‌ను పాకిస్తాన్‌ ‘‘స్వతంత్ర దేశం’’ గానే భావిస్తుంది. అయితే దాని సంరక్షకులం తామే అన్నట్టుగా పాకిస్తాన్‌ ప్రవర్తిస్తుంది. అధీన రేఖకు భారత్‌ వేపున ఉండే వారిని పాకిస్తాన్‌ తోడేళ్లలా చిత్రీకరిస్తుంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని మన నాయకులు అప్పుడప్పుడూ చెప్పడం వింటూనే ఉన్నాం. మరి మన శత్రుదేశం అనుకుంటున్న పాకిస్తాన్‌ చేతిలో ఎందు కుందో మాత్రం ఎవరూ సమాధానం చెప్పరు. గుర్తొచ్చినప్పుడల్లా హుంక రించినంత మాత్రాన ఆక్రమిత కశ్మీర్‌ అమాంతం భారత్‌లో అంతర్భాగం అయిపోయే మార్గమైతే కనిపించడం లేదు. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటామని బీరాలు పలికే నాయకులకు కొదవ లేదు కానీ స్వాధీనం చేసుకోవడానికి ఏం చేస్తారో, ఏం చేయాలనుకుంటున్నారో ఎవరూ చెప్పరు. ఆక్రమిత కశ్మీర్‌ మన అధీనంలోకి ఎప్పుడొస్తుంది అని అడిగినా ఎవరి దగ్గరా సమాధానం ఉండదు. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు జరగవలసి ఉన్నప్పుడో లేదా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి అనుకున్న ప్పుడో బీజేపీ నాయకులు ఆక్రమిత కశ్మీర్‌ ప్రస్తావన తీసుకొస్తుంటారు. ఆ సమయంలో బీజేపీ నాయకుల్లో జాతీయత కట్టలు తెంచుకుని పొంగి పొరలుతూ ఉంటుంది. ఎన్నికల సమయంలో కశ్మీర్‌, ఆక్రమిత కశ్మీర్‌, పాకి స్తాన్‌ అన్న మాటలు దొర్లించకుండా బీజేపీ నాయకులు ప్రసంగించే సంద ర్భాలే ఉండవు. మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి చైనా ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు. చైనా దూకుడును సహించబోం అని గంభీరమైన ప్రకటనలు జారీ చేస్తూ ఉంటారు. కానీ సరిహద్దులో చైనా పాల్పడుతున్న ఆగడాలను ఎదుర్కోవడం అటుంచి కనీసం ప్రస్తావించే సాహసం కూడా బీజేపీ నాయకులు చేయలేరు. ఇవన్నీ అసలు సమస్యల నుంచి జనం దృష్టి మళ్లించడానికి బీజేపీ నాయకులు అప్పనంగా ఉపయోగించుకుంటూ ఉంటారు. దానివల్ల బీజేపీకి ఎన్నికల్లో ఫలితమూ దక్కుతుంది. సరిహద్దులో అంటే భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి చైనా ఒక గ్రామాన్నే నిర్మించిం దంటున్నారు. దీనికి మాత్రం దేశభక్తి పేరెత్తితే శివాలయ్యలు అయిపోయే బీజేపీ నాయకుల నోరే పెకలదు.
ఇంకా విచిత్రం ఏమిటంటే ఆక్రమిత కశ్మీర్‌ గురించి మాట్లాడడానికి మోదీ సర్కారులో కాబినెట్‌ మంత్రులే కానక్కర్లేదు. సహాయ మంత్రులు కూడా గొంతు చించుకోగలరు. పంచాయతీ రాజ్‌ శాఖ సహాయ మంత్రి కపిల్‌ పాటిల్‌ మహారాష్ట్రలోని ఠానేలో మాట్లాడుతూ పూనకం వచ్చినట్టు ప్రవర్తించారు. ‘‘మోదీ ప్రధానమంత్రి అయింది ఉల్లిపాయలు, బంగాళా దుంపల ధరలు తగ్గించడానికి కాదు. 2024కల్లా ఏదో జరుగుతుంది చూడండి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం అయిపోతుంది. ఈ మాట అనుకోవడానికి ఇబ్బందేమీ ఉండదు. ప్రధానమంత్రి మోదీ మాత్రమే ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగం చేయగలరు’’ అని పాటిల్‌ సెలవిచ్చారు. జనంలో భావోద్రేకాలు రెచ్చగొట్టడానికైతే ఇలాంటి మాటలు రంజుగా ఉంటాయి. మాటలకు చేతలకు అపారమైన అంతరం ఉంటుందని ఆచరణలో రుజువు అవుతూ ఉంటుంది. అయినా బీజేపీ నాయకులు మళ్లీ ఆక్రమిత కశ్మీర్‌ ప్రస్తావన తీసుకొస్తూనే ఉంటారు. మంత్రివర్గ సమావేశాల్లో ఇలాంటి మాటల ప్రస్తావన వచ్చినందువల్లే పాటిల్‌ లాంటి వారు ఇంతగా సాహసించి మాట్లాడగలరు. మోదీ, అమిత్‌ షా మనసులో ఎప్పుడూ ఎన్ని కలే ఉంటాయి. ఎన్నికల్లో గెలవడానికి వ్యూహ రచన చేయడం, ఎత్తులు పై ఎత్తులు వేయడంలోనే ఎప్పుడూ ఈ ఇద్దరు అగ్ర నాయకులు తలమునకలై ఉంటారు. అలాంటి సమయంలో దారి తెన్నూ కనిపించకపోతే ఆక్రమిత కశ్మీర్‌ ప్రస్తావన తీసుకొస్తారు. కార్గిల్‌ దివస్‌ ఓ సందర్భం కనక రాజ్‌నాథ్‌ సింగ్‌ జూలు విదిలించారు. ఇలాంటి మాటలవల్ల భావోద్వేగాలు రెచ్చ గొట్టడం సులభం అని వారికి తెలుసు. జమ్మూ ప్రాంతానికి చెందిన డా. జితేందర్‌ సింగ్‌ అనే మంత్రి అయితే సంవత్సరానికి ఒక్కసారి ఆక్రమిత కశ్మీర్‌ గురించి మాట్లాడతారు. ఆ తరవాత సందడే కనిపించదు. మరుసటి సంవత్సరం ఆయనకు ఆక్రమిత కశ్మీర్‌ హఠాత్తుగా గుర్తొస్తుంది. విదేశాంగ మంత్రి జైశంకర్‌ కూడా ‘‘ఆక్రమిత కశ్మీర్‌ మనదే. ఏదో ఒక రోజు మన గుప్పెట్లోకి రాక మానదు’’ అంటూ ఉంటారు. ఎప్పుడొస్తుంది అన్న ప్రశ్నకు మాత్రం ఛోటా మోటా బీజేపీ నాయకుల దగ్గర్నించి రక్షణ మంత్రి, హోం మంత్రి, ప్రధానమంత్రి దాకా ఎవరి దగ్గరా సమాధానమే ఉండదు. ఆక్ర మిత కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం అయితే హర్షించని భారతీయులు ఎవరూ ఉండకపోవచ్చు. కానీ విజ్ఞత ఉన్న వారు ఎవరైనా సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించి తీరుతారు. ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవ డానికి పాకిస్తాన్‌ మీద దండయాత్ర చేసే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుత పరిస్థితిలో దాడి అసాధ్యం అని వివేచనా శక్తి ఉన్న వారికెవరికైనా తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img