Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆర్బీఐని బలిపశువు చేసే యత్నం

ప్రధాని నరేంద్ర మోదీ అసంబద్దంగా మాట్లాడటం, అబద్దా లాడటంలోనూ అందెవేసిన చేయిగా అనేకమార్లు నిరూపించు కున్నారు. దేశ ప్రజల్లో కల్లోలంరేపిన పెద్దనోట్లరద్దు విషయంలో ఆర్బీఐని బలిపశువును చేసేందుకు పూనుకున్నారు. ఆర్బీఐతో విస్త్రతంగా చర్చలు జరిపి ముందుగా అన్ని ఏర్పాట్లు చేసుకొని పెద్దనోట్లు రద్దు చేసినట్లు నాలుగురోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థను కుదేలు పరిచిన పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని మోదీనే తీసుకున్నారని ఆయన నోట్ల రద్దు ప్రకటన చేసినప్పుడు ఆయన ప్రసంగమే స్పష్టంచేసింది. తన మంత్రివర్గసభ్యులకు సైతం తెలియ కుండా మోదీ సొంతంగా నిర్ణయం తీసుకుని 2016 నవంబరు 8న చేసిన ప్రసంగం విన్న వారంతా తెలుసుకున్నారు. ప్రకటన చేయడానికి ముందు మాట మాత్రం ఆర్బీఐతో సంప్రదించారు. నవభారతం నిర్మిస్తానని చెప్పిన మోదీ నోట్లురద్దుచేసి కల్లోల భారతం సృష్టించారు. నల్లధనం వెలికితీసేందుకు, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడానికి, అవినీతిని రద్దుచేసి నకిలీ నోట్లు చెలామణిలో లేకుండా చేసేందుకు పెద్దనోట్ల రద్దు అవసరమైందని చెప్పారు. ఈ చర్య అత్యంత రహస్యం. తప్పనిసరి. ఇప్పుడే మీకు తెలియజేస్తున్నాను. బ్యాంకులు, పోస్టాఫీసులు, రైల్వేలు, ఆస్పత్రులు తదితర సంస్థలకు తెలియజేశారు. దేశప్రజలు కొద్దిరోజులు ఇబ్బంది పడవచ్చు. దేశమంతా ప్రక్షాళన అవుతుంది. ఆ మహాయజ్ఞంలో ప్రతిపౌరుడు పాల్గొంటారన్న పూర్తి విశ్వాసం నాకుంది’’. అని మోదీ చేసిన ప్రకటన నోట్ల్ల రద్దు మోదీ నిర్ణయమేనని వెల్లడిచేస్తోంది. అనేక సంవత్సరాలుగా అవినీతి, నల్లధనం దేశాన్ని పట్టిపీడిస్తోందన్న మోదీ ఈ సమస్యలను పరిష్కరించారా? ఆయన ప్రస్తావించిన సమస్యలు పెరిగాయేగానీ తరగలేదు. నోట్ల రద్దును దేశంలోనే గాక విదేశాల్లోనూ ఆర్థిక నిపుణులు తప్పుపట్టారు. నల్లధనం దాచుకున్న కార్పొరేట్లు తమ పలుకుబడిని ఉపయోగించి తెల్లధనంగా మార్చుకున్నారు. తమదగ్గరున్న కొద్దిపాటి పెద్దనోట్లను మార్చుకోవడానికి జనం నానాయాతన పడ్డారు. చేతిలో కరెన్సీ లేక ఏటీఎంల దగ్గర పెద్దవయస్సు వాళ్లు కూడా గంటల తరబడి లైన్‌లో నిలబడవలసి వచ్చింది. ఈ క్రమంలో వందలాదిమంది చనిపోయారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎనలేని కష్టాలు పడ్డారు. సామాన్యులకు, పేదలకు పీడకలలా మిగిలిపోయింది. పేదలు పూర్తిగా దివాలా తీశారు. నోట్లరద్దువల్ల ఒకేసారి 16లక్షల కోట్లకుపైగా ప్రజలకు అందుబాటులో లేకుండాపోయింది. 17లక్షల కోట్లకుపైగా వెనక్కి తిరిగివచ్చిందని,లక్షా 40వేల కోట్ల నల్లధనాన్ని వెలికి తీయగలిగామని మోదీ ప్రభుత్వం చెప్తోంది. చెలామణిలో ఎక్కువధనం ఉండటం కూడా రద్దుకు కారణమని చెప్పారు. ప్రస్తుతం దాదాపు 32లక్షల కోట్ల రూపాయలు చెలామణిలో ఉన్నాయని అంచనాలున్నాయి. ఇంత ధనం చెలామణిలో ఉన్నప్పుడు నల్లధనం పెరిగినట్లు కాదా? ఎన్నికల బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు చేరే కోట్ల రూపాయలు నల్లధనం కాదా? ఈ ధనంలో 75శాతం పైగా బీజేపీకి చేరుతోంది. ఇది నల్లధనం కాకపోతే బాండ్ల్లను ఎవరు కొనుగోలు చేస్తున్నారు? బాండ్లు కొనుగోలు చేసేవారు పన్ను చెల్లిస్తున్నారా? ఈ విషయాలను ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు… బీజేపీ ఈ ధనాన్ని ఎలా ఖర్చు చేస్తున్నదని వెల్లడిస్తోందా? ఈ వ్యవహారాలన్నీ రహస్యంగా ఉంచుతున్నారంటే తప్పు చేస్తున్నట్లే కదా.
నోట్లరద్దుతో అనేక వేల మధ్యతరహా, సూక్ష్మ, చిన్న పరిశ్రమలు మూతపడిపోయి యజమానులు దివాలా తీశారు. ఈ పరిశ్రమల యజమానులు వందలాదిమంది దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. జరగబోయే పరిణామాల మీద విస్త్రతమైన చర్చలు లేకుండా ముందుగానే ఇంటి వ్యవహారాలపై ఆర్బీఐ మాజీ గవర్నర్లు హెచ్చరించినా పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు చేస్తున్న మోదీ గురించి ప్రజలకు బాగా తెలుసు. ఆర్బీఐ మాజీ గవర్నరు రఘురామరాజన్‌ 2016 సెప్టెంబరులోనే తన పదవి నుంచి వైదొలిగారు. తాను కానీ, ఆర్బీఐ కానీ నోట్లరద్దు కోరుకోలేదన్న వాస్తవాన్ని వెల్లడిరచారు. ఆయన అనేక ప్రసంగాల సంకలనాన్ని ప్రచురించారు. నేను ఏమి చేయగలనో అదే చేశాను అని ఈ పుస్తకంలో రాజన్‌ పేర్కొన్నారు. తాను పనిచేసిన కాలంలో ఏ సందర్భంలోనూ పెద్దనోట్ల రద్దును కోరలేదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టుకు ప్రభుత్వం అందించిన అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలు అబద్దమని ప్రజలకు మరోసారి తేటతెల్లమైంది. నోట్ల రద్దుకు తాను అనుకూలంకాదని, విధ్వంసకర నిర్ణయం దీర్ఘకాలంగా కష్టాలు కలగజేస్తుందని రాజన్‌ తన పుస్తకంలో తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంతో సంబంధాలే ఏమాత్రం సజావుగా లేవని తెలిపారు. కానీ ఎక్కువ వివరాలను పేర్కొనలేదు. రూ.500, రూ.1000 పెద్దనోట్లు ఎక్కువగా చెలామణిలో ఉన్నందున రద్దుచేయవలసి వచ్చిందని మరో కారణాన్ని అఫిడవిట్‌లో ప్రభుత్వం పొందిపరచింది. రద్దు తర్వాత రూ.2000 నోట్లు ముద్రించింది. అదే సమయంలో రూ.500 నోట్లు ముద్రించి చెలామణిలో పెట్టారు. అప్పటికంటే ఎక్కువగా కరెన్సీ చెలామణిలో ఉన్నాయని మరోసారి రద్దు చేస్తారా? వినాశకర విధానాలను రూపొందించి అమలు చేయడం వల్లనే బ్యాంకులు దివాలా తీశాయి.
పేదరికం పెరిగింది. మానవాభివృద్ధిలో చిన్నచిన్న దేశాలకంటే వెనుకబడి ఉన్నప్పుడు దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారని బీజేపీ ప్రచారం చేసుకోవడంలో అర్థం లేదు. రాజన్‌ నోట్ల రద్దును వ్యతిరేకించడం ఇది మొదటిసారి కాదు. 2014లో ఈ విషయం చర్చకు రాకముందే ఒక ప్రసంగంలో లెక్కల్లోచూపని సంపద కలిగిఉన్న సంపన్నులు తమ ఆస్తులను వివిధ రూపాల్లో దాచుకుంటారని, ఎక్కువగా బంగారం కొనుగోలు రూపంలో దాచుకుంటారని అందువల్ల నల్లధనం రూపుమాపడం సాధ్యంకాదని చెప్పారు. మోదీ పాలనా కాలంలో కార్పొరేట్లు చెల్లించవలసిన 12లక్షల కోట్లరూపాయలను బ్యాంకులు రద్దు చేశాయి. ఈ ధనం ప్రజల సొమ్ముకాదా. సామాన్యులను దగాచేసి సంపన్నులకు దోచిపెట్టడమే కదా బకాయిల రద్దు వ్యవహారం. ఇంతవరకు తీసుకున్న నిర్ణయాలలో ఏదీ ప్రజలకు ప్రయోజనం కలిగించలేదు. ఇప్పటికైనా ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి తగువిధంగా స్పందించాలి. లేకపోతే మున్ముందు మరిన్ని కష్టాలు తప్పవు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img