Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఈ పాపం యోగీదే

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ తమ రాష్ట్రంలో నేరస్థులను అదుపు చేయడానికి ఎన్‌కౌంటర్ల మార్గాన్ని అనుసరించారు. నేరాలకు పాల్పడడంతో జీవితం మొదలు పెట్టి రాజకీయాల్లోనూ ఎదిగిన అతీఖ్‌ అహమద్‌ను ఆయన సోదరుడు అష్రాఫ్‌ను పోలీసుల సమక్షంలోనే బాహాటంగా కాల్చి చంపడం యోగీ ఆదిత్యనాథ్‌ పాలనలో రాజకీయాలు, నేరాలు ఎలా పెనవేసుకు పోయాయో రుజువు చేస్తోంది. తమ పని ముగిసిన తరవాత ఆ ముగ్గురూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకుండా లొంగిపోవడం ఊహాతీతమైంది. పైగా హత్య చేసిన లవలేశ్‌ తివారీ, సన్నీ సింగ్‌, అరుణ్‌ మౌర్య ‘‘జై శ్రీ రాం’’ నినాదాలు చేయడం ఈ హత్యలో హిందుత్వ రాజకీయాలు కూడా ఇమిడి ఉన్నాయన్న అనుమానాలకు తావిస్తున్నాయి. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ వెంటనే ముగ్గురు సభ్యులతో కూడిన దర్యాప్తు సంఘాన్ని నియమించడం మెచ్చదగిన చర్యే కావచ్చు. రెండు నెలల్లోగా నివేదిక అందినా అది నేరపూరిత రాజకీయాలను కట్టడి చేయడానికి ఏ మేరకు ఉపయోగపడ్తుందో తెలియదు. పోలీసు బందోబస్తులో ఉన్న అతీఖ్‌ అహమద్‌, అష్రాఫ్‌ను ముగ్గురు యువకులు బాహాటంగా కాల్చి చంప గలిగారంటే యోగీ రాజ్యంలో నేరాలు ఎంత బలాదూరుగా కొనసాగు తున్నాయో ఊహించుకోవచ్చు. నేరాలను అదుపు చేయడం అంటే నేరస్థులను హతమార్చడం కాదు. కానీ యోగి అనుసరించిన విధానం ఇదే. నేరస్థులను పట్టుకుని వారిని కోర్టులో హాజరుపరిచి శిక్ష విధించే పనిని న్యాయస్థానాలకు వదిలేయాలని యోగీ ప్రభుత్వం అనుకోనే లేదు. నిందితులైనా, నేరస్థులైనా వారికి కోర్టు శిక్ష విధించే దాకా తగిన భద్రత కల్పించడం పోలీసుల, ప్రభుత్వ బాధ్యత. ఈ బాధ్యత పూర్తిగా మాయమైపోయింది. పైగా చీకటి పడ్డ తరవాత అతీఖ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లవలసిన అవసరం ఏమిటో ఎంత తరచి చూసినా అంతు పట్టదు. ఒకవేళ ఆ అవసరమే వస్తే మరింత కట్టుదిట్టంగా భద్రత కల్పించి తీసుకెళ్లాలన్న స్పృహ పోలీసులకు లేకపోవడంలో కూడా ఏదో నిగూఢమైన లక్ష్యం ఉందేమో అన్న అనుమానానికి అవకాశం ఉంది. పైగా హత్యకు పాల్పడినవారు అతి దగ్గరి నుంచి మొత్తం తొమ్మిదిసార్లు కాల్పులు జరిపినా పోలీసులు కిమ్మనకపోవడం కూడా మొత్తం ఈ సంఘటననే అనుమానించవలసి వస్తోంది. ఈ హత్యకు పాల్పడడంలో తమ లక్ష్యం పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికట. నేరంచేసి ప్రసిద్ధులై పోవాలన్న కాంక్ష ఆ యువకుల్లో ఉందంటే నేరస్థులకు ఉన్న పలుకుబడి ఏమిటో అర్థం అవుతోంది. ప్రభుత్వమే ఎన్‌కౌంటర్లు చేసి నేరస్థులను అంతమొందిస్తుంటే తామే ఆ పని ఎందుకు చేయకూడదన్న అభిప్రాయం కలగడంలో వింతేమీలేదు. అతీఖ్‌ కొడుకు అసద్‌ను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు కొద్దిరోజుల కిందే అంతమొందించారు. అతీఖ్‌ అహమద్‌ మీద మొత్తం 104 కేసులు ఉన్నాయి. ఆయన సోదరుడు అష్రాఫ్‌ మీద కూడా బోలెడు కేసులు ఉన్నాయి. అతీఖ్‌ అహమద్‌ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలవగలిగాడంటే రాజకీయాలలో నేరస్థులు ఎంతగా చొరబడ్డారో చూస్తే కళ్లు చెదిరిపోతాయి. ఈ పరిణామాలు సాధారణ పౌరులను విచలితం చేస్తాయి. అతీఖ్‌ కుమారుడు అసద్‌ను, ఆయన వత్తాసుదారు గులాంను ఏప్రిల్‌ 13న ఎన్‌కౌంటర్‌ చేసినప్పుడే గగ్గోలు మొదలైంది.
ప్రభుత్వమే ఎన్‌కౌంటర్లను ప్రోత్సహించడమే కాక వాటి గురించి గొప్పగా ప్రచారం చేసుకోవడం పోలీసులు తమ విధి నిర్వహణను నిర్లక్ష్యం చేయడానికి దోహదం చేయక తప్పదు. తేడా ఏమిటంటే ఈసారి పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయలేదు. పుండు మీద కారం చల్లినట్టు ఉత్తరప్రదేశ్‌ సీనియర్‌ మంత్రి సురేశ్‌ఖన్నా ఈ పరిణామాన్ని దైవసంకల్పం అనడం ఘోరాతి ఘోరం. అంటే ప్రభుత్వం చట్టబద్ధ పాలనకు బొత్తిగా విలువ ఇవ్వడంలేదని రుజువు అవుతోంది. రాజ్యాంగం మీద ప్రమాణంచేసి మంత్రి పదవి చేపట్టిన వారే ఈ హత్యాకాండను దేవుడి పేరు చెప్పి కప్పిపుచ్చడానికి ప్రయత్నించడం సంపూర్ణంగా ఆటవిక పాలన కొనసాగించడమే. పోలీసు నిర్బంధంలో ఉన్న వారి ప్రాణాలకే రక్షణ లేనప్పుడు సామాన్య మానవులు సురేశ్‌ ఖన్నా చెప్పినట్టు దేవుడిమీద భారంవేసి బిక్కు బిక్కుమంటూ బతకాల్సిందే. ముగ్గురు సభ్యులతో కూడిన దర్యాప్తు కమిటీ ఏమితేల్చినా యోగీ ఆదిత్యనాథ్‌ ప్రభుత్వ ప్రతిష్ఠ మాత్రం ఈ పరిణామంవల్ల మరింత దిగజారింది.
హత్యకు గురైన ఇద్దరు ముస్లింలు కావడం హత్యకు పాల్పడ్డ వారు హిందువులు కావడం అంతిమంగా బీజేపీ మతతత్వ రాజకీయాలకు మరింత ఊతం ఇచ్చినా ఆశ్చర్యపడవలసింది లేదు. పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ హత్యలు జరగడంలో ఆంతర్యం ఏమై ఉండొచ్చునో అర్థం చేసుకోవడానికి అసమానమైన ప్రతిభ అక్కర్లేదు. పోలీసు నిర్బంధంలో ఉన్న వ్యక్తులను ఇతరులెవరో హతమార్చ గలగడం బహుశ: ఇదే మొదటిసారి కావచ్చు. యోగీ ఆదిత్యనాథ్‌ ఫిబ్రవరి 25వ తేదీన ‘‘మాఫిీయాను మట్టిలో కలిపేస్తాం’’ అన్నారు. ఈ మాటే ఆ ముగ్గ్గురు యువకులకు ప్రేరణగా పనిచేసి ఉండవచ్చు. యోగీ ఆదిత్యనాథ్‌ క్రతువులో తామూ పాత్రధారులు కావాలని భావించి ఉండవచ్చు. పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు తనకు రక్షణ కల్పించాలని అతీఖ్‌ అహమద్‌ మార్చి 28న కోరాడు. తాను ఎన్‌కౌంటర్‌కు గురవుతానని ఆయన అనేకసార్లు ఆందోళన వ్యక్తంచేశాడు. మరీ విచిత్రం ఏమిటంటే హత్యకు పాల్పడిన ముగ్గురిని పోలీసు నిర్బంధంలో ఉంచుకోకుండా జ్యుడీషియల్‌ కస్టడీకి పంపడానికి అంగీకరించడం విచిత్రాతి విచిత్రం. ఈ ముగ్గురి గురించి తాము దర్యాప్తు చేయాలని పోలీసులు భావించడం లేదా? అతీఖ్‌ను, ఆయన సోదరుడిని రాత్రి పదిన్నరకు ఆసుపత్రికి తీసుకెళ్తారని ‘‘హంతకులు’’ అనుకుంటున్న వారికి ఎలా తెలిసింది? వారికి ఎవరైనా ఈ సమాచారం అందించారేమో! అందుకే వారు తొమ్మిది బుల్లెట్లు పేల్చినా పోలీసులు మెదలకుండా ఉండిపోయారనుకోవాలా? ఈ ప్రశ్నలన్నింటికీ యోగీ ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం సమాధానం చెప్తుందను కోవడమూ భ్రమే. అధికారంలోకి వచ్చిన తరవాత తన మీద ఉన్న కేసులను తానే రద్దుచేసుకున్న యోగీ ఆదిత్యనాథ్‌ చట్టబద్ధపాలన కొనసాగిస్తారని అనుకోవడానికి ఆస్కారమే లేదు. ఈ ఉదంతానికి బాధ్యులైన పోలీసు సిబ్బందిమీద చర్య తీసుకోకపోవడం యోగి ప్రభుత్వ పనితీరును మరింత అనుమానాస్పదం చేస్తోంది. ప్రభుత్వమే చట్టానికి కట్టుబడి ఉండనప్పుడు నేరాలకు పాల్పడి పేరు సంపాదించుకోవాలన్న ఆలోచన రావడంలో ఆశ్చర్యం లేదు. అందువల్ల ఈ పాపం కచ్చితంగా యోగీదే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img