Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఉత్సవాల మాటున మతోన్మాదం

మతకలహాలు మన దేశంలో కొత్త కాదు. ఇప్పుడు మనం మతకలహాలు అంటున్నది హిందూ-ముస్లింల మధ్యన జరిగే కలహాలే. కానీ కొన్ని సహస్రాబ్దాలు, శతాబ్దాల కింద ఒకే మతంలోని భిన్న శాఖల మధ్య కూడా కలహాలు జరిగాయి. బౌద్ధులకు, హిందువులకు మధ్య జరిగిన మత కలహాలు ఉన్నట్టే హిందూ మతంలోని శైవ, వైష్ణవ సంఘర్షణలకూ మతకలహాల స్వరూపం ఉంది. కలహాలు భిన్న మతాల మధ్యే జరగనక్కర్లేదు అని మన చరిత్ర నిరూపిస్తోంది. మత విశ్వాసాల ఆధారంగా జరిగిన మతకలహాలు ఉన్నట్టే పనిగట్టుకుని మత విద్వేషం రెచ్చగొట్టడానికి కలహాలు రేపిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న మతకలహాలు పనిగట్టుకుని, ఒక సాకు వెతుక్కుని రెచ్చగొడ్తున్నవే. బ్రిటిష్‌ వారు రాజకీయంగా ఆధిపత్యం సంపాదించడం కోసం హిందువులు-ముస్లింల మధ్యన కలహాలు రెచ్చగొట్టిన మాట వాస్తవమే. కానీ బ్రిటిష్‌ వారు నిష్క్రమించి 75 ఏళ్లు అయినా ఇంకా కొనసాగడానికి మరో కారణం ఏదైనా ఉండాలిగదా! ఈ కోణంలో తరచిచూస్తే మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే క్రమంలోనే కలహాలు రేగుతున్నాయని తేలుతుంది. ఈ నాటి మతకలహాలలో విశ్వాసం ప్రధాన కారణం అని అంగీకరించలేం. ఏవి మత కలహాలు ఏవి మత మారణ హోమాలు అన్న విషయంలో కూడా మనలో చాలా గందరగోళం, అస్పష్టత ఉంది. ఉదాహరణకు ఇందిరా గాంధీ హత్య తరవాత 1984లో సిక్కులమీద కొనసాగిన మారణకాండను మత కలహాల జాబితాలో కట్టేస్తున్నాం. నిజానికి అది సిక్కులపై జరిగిన మారణ హోమం. సిక్కులు కలహానికి దిగలేదు. అలాగే 2002లో గుజరాత్‌లో జరిగిన కలహాలు ముస్లింలమీద కొనసాగిన మారణకాండే. బలహీనమైన వర్గం మీద మారణకాండ కొనసాగుతున్న దశలో అక్కడక్కడ ఆ బలహీనవర్గం ఎదురుదాడివల్ల మరణించిన వారు ఉండొచ్చు. నెల్లీ మారణకాండ సైతం చాలా భీకరమైందే. ఏ రాజకీయపక్షం అధికారంలో ఉన్నప్పుడు లేదా ఏ రాజకీయ పక్షం అధికారం సంపాదించడానికి మత కలహాలు రెచ్చగొట్టిందో అందరికీ తెలిసిన రహస్యమే. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడూ కలహాలు రేగాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరవాతా మత కలహాలు జరుగు తున్నాయి. గుజరాత్‌ మారణకాండలో మృతులలో ఏ మతంవారు ఎక్కువో పరిశీలిస్తే ఈ వాస్తవం బయట పడ్తుంది. సిక్కులకు 1984లో ప్రతిఘటించే అవకాశమే లేకుండా పోయింది. లాల్‌ కృష్ణ అడ్వాణీ రథయాత్ర నిర్వహించినప్పుడూ దేశంలోని చాలా ప్రాంతాలలో మతకలహాలు జరిగాయి. 1993లో బొంబాయి మత కలహాలలో రక్తపుటేరులు పారాయి. మన దేశంలో బ్రిటిష్‌ పరిపాలనలోనే 1893 ఆగస్టులో భారీ స్థాయిలో మొదటిసారి మతకలహాలు రేగాయి. ఈ కలహాల్లో దాదాపు వందమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరవాత 1921 నుంచి 1940 మధ్య మతకలహాలు చాలా తరచుగా జరిగాయి. 1931లో కాన్పూర్‌లో జరిగిన మతకలహాలు భీకరమైనవి. ఈ కలహాల మీద నిజనిర్ధారణకోసం కాంగ్రెస్‌ ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ దాదాపు 250 పేజీల నివేదిక ఇచ్చింది. చాలా సందర్భాలలో మత సంబంధమైన ఊరేగింపులు మతకలహాలకు దారి తీశాయి. ఇందులో ఎవరిపాత్ర ఎంత అని ఆరా తీయవచ్చు. మతకలహాలకు మెజారిటీ వర్గం కారణమా, మైనారిటీ వర్గం బాధ్యత ఉందా అని తరచి చూడడంవల్ల ప్రయోజనం పరిమితమైందే. రెండు గంధపు చెక్కలను రాపాడినా నిప్పు రవ్వలు వస్తాయి.
తాజాగా రామనవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రలలో భాగంగా బెంగాల్‌, గుజరాత్‌, మహారాష్ట్రలో మతకలహాలు జరిగాయి. పండగల చాటున మతకలహాలు రెచ్చగొట్టడం పరిపాటి అయిపోయింది. ఎవరి మత విశ్వాసాల ప్రకారం వారు నడుచుకుంటే అభ్యంతరం ఉండనక్కర లేదు. ఎవరి పండగలు వారు జరుపుకోవచ్చు. అలాగే ఊరేగింపులూ నిర్వహించుకోవచ్చు. కానీ ఉత్సవాలను, ఊరేగింపులను, పండగలను సాకుగా తీసుకుని ఎదుటి మతం వారిపై దాడిచేయడం అలవాటై పోయింది. ఇటీవలే సుప్రీంకోర్టు విద్వేష ప్రచారాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పార్టీలు విద్వేషం రెచ్చగొట్టకుండా ఉంటే కలహాలకు అవకాశం ఉండదు అని చెప్పింది. ఆ మాట చెప్పడానికి సమాంతరంగానే మూడు రాష్ట్రాల్లో మతచిచ్చు రేగింది. గత సంవత్సరం కూడా శ్రీరామనవమి శోభాయాత్రలు మతోన్మాద వికృతరూపాన్ని చూపించాయి. స్వాతంత్య్రం సంపాదించిన తరవాత దేశంలోని అనేక ప్రాంతాలలో మతోన్మాదులు రెచ్చిపోయారు. పనిగట్టుకుని మరో మతం వారు అధికసంఖ్యలో ఉండే ప్రాంతాలనుంచి ఊరేగింపులు నిర్వహించి, ఊరేగింపు ఆ ప్రాంతాలకు చేరిన తరవాత రెచ్చగొట్టే నినాదాలు చేయడంవల్ల కలహాలు అనివార్యం అవుతున్నాయి. పరిపాలనా యాంత్రాంగం నిర్దిష్ట ప్రాంతంద్వారా మత సంబంధ ఊరేగింపులకు అనుమతించకపోయినా, పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించి ఊరేగింపులు నిర్వహించడం మతాధిపత్యం చాటుకోవడానికి ఉపకరణం అవుతోంది. ఒక మతం వారు ఊరేగింపులు నిర్వహించినప్పుడు మరోమతానికి చెందిన ప్రార్థనాస్థలాల దగ్గర విజృంభించి నినాదాలు చేయడం, అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం, సంగీత వాద్యాలను అభ్యంతరకరమైన రీతిలో వినియోగించడం కలహాలకు ఆజ్యం పోస్తోంది. ఊరేగింపుల సందర్భంగా ఆయుధాలు అనుమతించకపోయినా ఆ షరతునూ జవదాటడం లేదా లాఠీలు అనుమతించకపోతే ఆ లాఠీలకు మతసంబంధ పతాకాలు కట్టడం, అవసరమైనప్పుడు వాటిని ఆయుధాలుగా మలచడం బాగా పెరుగుతోంది. కొన్నిసార్లు ఈ శోభ యాత్రలకు ప్రతీకాత్మకంగా కోరిన మార్గంలో అనుమతించి, ప్రధాన ఊరేగింపు మరో మార్గంలో వెళ్లాలని నిర్దేశించినా ఆ ప్రతీకాత్మక మార్గాన్నే ప్రధాన మార్గంగా మలిచి కలహాలురేపిన ఉదంతాలు దశాబ్దాలుగా కనిపిస్తున్నాయి. శ్రీరామ నవమి మాత్రమే కాకుండా శివాజీ జయంతి, హనుమత్‌ జయంతి, అనంత చతుర్దశి, వినాయక నిమజ్జనం సమయంలో ఊరేగింపులు మతకలహాలకు దారితీస్తున్నాయి. కలహాలు జరుగుతాయని పోలీసులకు అవగాహనఉన్నా ఊరేగింపు నిర్వహించే వారి కోరికను మన్నించి వారు కోరిన మార్గంలో అనుమతించడం పోలీసుల నిస్సహాయతకు నిదర్శనం. హిందువుల, ముస్లింల పండగలు ఒకే సమయంలో జరిగినా కలహాలు మామూలు అయిపోయాయి. గత ఏడున్నర దశాబ్దాలకాలంలో ఇలాంటి సంఘటనలు తక్కువేం కాదు. కానీ అప్పటికీ, ఇప్పటికీ ఒక స్పష్టమైన తేడా ఉంది.
ఇంతకు మునుపు మతకలహాలు జరిగితే పాలకవర్గాలు, పోలీసులు కనీసం విచారం వ్యక్తంచేసేవారు. ఆ సంఘటనలపై దర్యాప్తు కమిషన్లు ఏర్పాటు చేసేవారు. నిందితులను ఉదాహరణ ప్రాయంగానైనా అరెస్టు చేసేవారు. బాధితులకు పరిహారం చెల్లించేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో యోగీ ఆదిత్యనాథ్‌ హయాంలో బాధితులకు పరిహారం ఊసేలేదు. కానీ ఎక్కడ కలహాలు చెలరేగాయో అక్కడికి బుల్డోజర్లు తరలివెళ్లి ఉన్న ఇళ్లను కూల్చేస్తున్నారు. అదేమంటే అవన్నీ అనుమతి లేకుండా ఆక్రమించుకుని నిర్మించినఇళ్లు అని దబాయిస్తున్నారు. రెచ్చగొట్టినవారిని వెనకేసుకొస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img