Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఉప ఎన్నికల గుణపాఠాలు

బిహార్‌లోని రెండు శాసనసభా నియోజకవర్గాలకు, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశాలోని ఒక్కో స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాలు సంపాదించింది. బిహార్‌లోని రెండుచోట్ల ఉపఎన్నికలు జరిగితే లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌.జె.డి.) ఒక స్థానం సంపాదించింది. ఒక సీటు బీజేపీకి దక్కింది. ఈ ఉపఎన్నికల్లో బాగా నష్టపోయింది కాంగ్రెస్‌. హర్యానాలోని ఆదంపూర్‌, తెలంగాణలోని మునుగోడు శాసన సభా స్థానాలు ఇంతకు ముందు కాంగ్రెస్‌ చేతిలో ఉండేవి. ఆదంపూర్‌లో బీజేపీ విజయం సాధిస్తే మునుగోడు స్థానాన్ని టిఆర్‌ఎస్‌ స్వాధీనం చేసుకుంది. ఆదంపూర్‌లో మాత్రమే కాంగ్రెస్‌ రెండవ స్థానంలో నిలిచింది. మునుగోడులో కాంగ్రెస్‌ 10.58 శాతం ఓట్లు సాధించి మూడో స్థానంలోకి వెళ్లడం విఘాతమే. ఒడిశాలోని ధాంనగర్‌లో కాంగ్రెస్‌ పరిస్థితి మరీ దిగజారి కేవలం 2.18 శాతం ఓట్లు మాత్రమే సాధించగలిగింది. ధాంనగర్‌లో బీజేపీ అభ్యర్థి సూర్యవంశి సూరజ్‌ బిజూ జనతాదళ్‌ అభ్యర్థిని ఓడిరచడం నవీన్‌ పట్నాయక్‌ పార్టీకి ఎదురుదెబ్బే. కానీ అక్కడ బిజూ జనతా దళ్‌ తిరుగుబాటు అభ్యర్థి ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బ తీశారు. బిహార్‌లోని గోపాల్‌ గంజ్‌ నియోజకవర్గాన్ని బీజేపీ నిలబెట్టుకోగలిగింది. ఉప ఎన్నికలకు ముందు బీజేపీ ఈ ఏడిరట్లో మూడు స్థానాలు ఉంటే ఇప్పుడు నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. హర్యానాలోని ఆదంపూర్‌ స్థానాన్ని బీజేపీ అదనంగా సాధించింది. బిహార్‌లో గోపాల్‌ గంజ్‌, మొకామా స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే గోపాల్‌ గంజ్‌ బీజేపీకి దక్కింది. ఈ స్థానం ఇంతకు ముందు బీజేపీ చేతిలోనే ఉండేది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సుభాష్‌సింగ్‌ మృతి కారణంగా ఉపఎన్నిక అవసరమైంది. బీజేపీ సుభాష్‌ సింగ్‌ భార్యను పోటీ చేయించింది. సాధారణంగా ఇలాంటి సందర్భాలలో మృతుడి కుటుంబానికి సానుభూతి ఉంటుంది కనక బీజేపీ విజయం మహత్తరమైంది ఏమీ కాదు. బిహార్‌లోని గోపాల్‌ గంజ్‌ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి కుసుందేవీ సాధించినప్పటికీ ఆర్‌.జె.డి. అభ్యర్థి మోహన్‌ ప్రసాద్‌ గుప్తా కన్నా కేవలం 1794 ఓట్ల మెజారిటీ మాత్రమే దక్కింది. అంటే అక్కడ ఆర్‌.జె.డి. గట్టి పోటీ ఇచ్చింది. బిహార్‌లో రెండు చోట్ల జరిగిన ఉపఎన్నికలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఇటీవలే ఆర్‌.జె.డి.తో కలిసి మూడు నెలల కింద ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మారిన రాజకీయ సమీకరణల ప్రభావం ఉంటుంది కనక ఈ రెండు స్థానాల ఫలితాలకూ ప్రత్యేకత ఉంది. మారిన రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకుంటే గోపాల్‌ గంజ్‌ నియోజకవర్గంలో బీజేపీ గెలవడం నితీశ్‌, తేజస్వీ యాదవ్‌ నాయకత్వంలోని మహాఘట్బంధన్‌కు ఎదురుదెబ్బ అని ప్రచారంచేసే ప్రయత్నం జరుగుతోంది. కానీ ఈ నియోజక వర్గంపై 2005 నుంచే బీజేపీ పట్టు ఉంది. అలాంటి చోట కూడా తక్కువ మెజారిటీతో గట్టెక్కడం బీజేపీ బలహీనతకిందే లెక్క. 2020లో ఇదే నియోజకవర్గాన్ని బీజేపీ 36,000 ఓట్ల మెజారిటీతో సాధించిన విషయాన్ని గుర్తుంచుకుంటే బలహీనపడినట్టే లెక్క. బీజేపీ గోపాల్‌గంజ్‌ నియోజకవర్గాన్ని నిలబెట్టుకోవడానికి మరో కారణం ఒవైసీ నాయకత్వంలోని ఎం.ఐ.ఎం. అక్కడ అభ్యర్థిని నిలబెట్టి ఆర్‌.జె.డి.ని సమర్థించే ముస్లింల ఓట్లను చీల్చింది.
ఎం.ఐ.ఎం. అభ్యర్థి అబ్దుల్‌ సలాంకు 12,000 ఓట్లు వచ్చాయి. అదీగాక లాలూతో సత్సంబంధాలు లేని ఆయన బావమరిది సాధూయాదవ్‌ తన భార్య ఇందిరాయాదవ్‌ను బహుజన్‌ సమాజ్‌ అభ్యర్థిగా నిలబెట్టారు. ఆమెకు 9000 ఓట్లు వచ్చాయి. ఈ రెండు ఆటంకాలూ లేకపోతే ఆర్‌.జె.డి. ఈ స్థానాన్ని సునాయాసంగా గెలవడమే కాక బీజేపీ గాలికి కొట్టుకు పోయేది. మొకామా స్థానాన్ని ఆర్‌.జె.డి. నిలబెట్టుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని గొలా గోకరణ్‌ నాథ్‌ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడంలో విఫలమైంది. మహారాష్ట్రలోని అంధేరీ తూర్పు నియోజవర్గం నుంచి ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి చెందిన అభ్యర్థి విజయం ఆ పార్టీకి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తుంది. ఎందుకంటే అక్కడ బీజేపీ పోటీ చేయలేదు.
బీజేపీకి అసలైన ఎదురుదెబ్బ తెలంగాణలోని మునుగోడులో తగిలింది. మునుగోడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ నాయకుడు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి బీజేపీలో చేరి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసినందువల్ల అక్కడ ఉప ఎన్నిక అవసరమైంది. ఇలాగే బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌ ఉపఎన్నికలో పోటీచేసి గెలిచారు. కానీ బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన రాజగోపాల్‌రెడ్డిని ఓడిరచడం ద్వారా కె.చంద్రశేఖరరావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రసమితి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలిగింది. ఈ విజయం ప్రతిపక్షాలు కలిసికట్టుగా ఉంటే బీజేపీని ఓడిరచడం అసాధ్యం కాదని రుజువు చేసింది. మునుగోడు చాలాకాలం కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)కి కంచుకోట. ఈ సారి బీజేపీని ఓడిరచి తీరాలన్న దృఢ సంకల్పంతో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు టి.ఆర్‌.ఎస్‌. అభ్యర్థికి మద్దతిచ్చాయి. మొన్నటి దాకా మునుగోడు తమ అధీనంలోని నియోజకవర్గమే కనక కాంగ్రెస్‌ పాల్వాయ్‌ గోవర్ధన్‌ రెడ్డి కూతురు స్రవంతిని పోటీ పెట్టినా ఆమెకు డిపాజిట్‌ కూడా దక్కలేదు. ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర తెలంగాణ ద్వారా సాగుతున్నందువల్ల కాంగ్రెస్‌ నాయకులు ఉప ఎన్నికపై పెట్టాల్సినంత శ్రద్ధ పెట్టలేదు అని సాకులు వెదకొచ్చు కానీ టి.ఆర్‌.ఎస్‌., వామపక్షాల కలయిక ప్రత్యర్థికి ఎలాంటి అవకాశమూ లేకుండా చేసింది. కొత్తగా బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాజగోపాల్‌ రెడ్డిని గెలిపించడానికి బీజేపీ సర్వప్రయత్నాలూ చేసింది. సకలవిధ మాయోపాయాలూ పన్నింది. విచ్చల విడిగా డబ్బులు వెదజల్లింది. ‘‘నేనే గుజరాత్‌’’అని బోర విరుచుకుని ప్రకటిస్తున్న మోదీ ఆటలు మునుగోడులో ఎంత మాత్రం సాగలేదు. ఈ ఉపఎన్నికలు దేశ రాజకీయాలను తారుమారు చేయక పోవచ్చు. ఆయితే 2023లో మేఘాలయ, నాగాలాండ్‌, త్రిపుర, కర్నాటక, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, తెలంగాణ శాసనసభలకు ఎన్నికలు జరగవలసి ఉంది. మోదీని ఓడిరచడానికి ఐక్యత ఎంత అవసరమో ప్రతిపక్షాలు గ్రహిస్తాయని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img