Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఉప ఎన్నికల గుణపాఠాలు

పధ్నాలుగు రాష్ట్రాలలో 29 శాసన సభా స్థానాలకు, మూడు లోకసభా స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ ప్రాబ ల్యానికి అడ్డుకట్ట వేశాయి. కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుంది. ప్రాంతీయ పార్టీలు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో బద్వేల్‌ నియోజకవర్గంలో గెలవడం ద్వారా వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ పలుకుబడి చెక్కు చెదరలేదని రుజువైంది. తెలంగాణాలో మాత్రం టి.ఆర్‌.ఎస్‌. ఎదురుదెబ్బ తినాల్సి వచ్చింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల కోసమే అన్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటించిన దళిత బంధు పథకం ఎందుకూ కొరగాకుండా పోయింది. బూటకపు వాగ్దానాలను ప్రజలు నమ్మే స్థితి లేదని అర్థమైంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడం భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి రావడానికి సోపానం అని సంబరపడ్తు న్నారు కాని అది ప్రధానంగా రాజేందర్‌ వ్యక్తిగత విజయం కిందే లెక్క. 2009 నుంచి ఆయన ఆ నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తూనే వస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ తన బలాన్ని మరింతగా నిరూపించు కుని పోటీ చేసిన నాలుగు స్థానాలనూ స్వాధీనం చేసుకుంది. బీజేపీ అధి కారంలో ఉన్న రాష్ట్రాలలో ఆధిపత్యం కొనసాగినా, అస్సాంలో బీజేపీ మిత్ర పక్షం విజయం సాధించినా బీజేపీ ఆధిక్యాన్ని ఇతర రాష్ట్రాలు నిలవరిం చాయి. బీజేపీ అభివృద్ధి మంత్రం అస్సాంలో బాగానే పని చేసింది. అధి కారం చేతిలో ఉన్న అస్సాంలో బీజేపీ తన శక్తిని నిలబెట్టుకోగలిగింది. ఏ ఎన్నిక ఫలితాలైనా స్థానిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటాయన్నది నిజమే అయినా బీజేపీ పతనం ప్రారంభానికి ఈ ఉప ఎన్నికలు శ్రీకారం చుట్టినట్టే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఆరంభంలో పంజాబ్‌, అస్సాం, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, మణిపూర్‌ రాష్ట్రాల శాసన సభ ఎన్నికలు బీజేపీ సామర్థ్యానికి పరీక్షగా నిలవక తప్పదు. ఉత్తరప్రదేశ్‌లో మినహా శాసనసభ ఎన్నికలు జరగవలసిన అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్‌ బీజేపీని ఎదుర్కోవడంలో తన సత్తా నిరూపించవలసి ఉంది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌ వాదీ పార్టీ బీజేపీకి సవాలు విసరనున్నది. కాంగ్రెస్‌లో అంతర్గత సమస్యలు ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో బీజేపీని నిలవరించే సత్తా ఉందని ఆ పార్టీ నిరూపించ గలిగింది. అట్టడుగు స్థాయిలో కాంగ్రెస్‌ను ఆదరించే వారు ఇప్పటికీ ఉన్నారు. ఇతర ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ మిత్ర పక్షాలు మంచి ఫలితాలే సాధించాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో గత రెండు విడతలుగా బీజేపీయే అధి కారంలో ఉన్నా కాంగ్రెస్‌ అనూహ్యంగా పుంజుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌ శాసనసభకు కూడా త్వరలోనే ఎన్నికలు జరగవలసి ఉన్న తరుణంలో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం కొత్త జవసత్వాలు పుంజుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. రాజస్థాన్‌, మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పట్టు సడలలేదు. బెంగాల్‌కు సంబంధించినంత వరకు కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకు పోయినట్టే. అధికారంలో ఉన్న తృణమూల్‌ బీజేపీ చేతిలో ఉన్న రెండు స్థానాలను కైవశం చేసుకుని, తన చేతిలో ఉన్న రెండు నియోజక వర్గాలను నిలబెట్టుకోగలిగింది. బెంగాల్‌లో శాసన సభ ఎన్నికలు జరిగి ఆరు నెలలు తిరగకముందే బీజేపీ తన పట్టు కోల్పోయింది. బీజేపీకి ఉన్న 30 శాతం ఓట్లు రెండు నియోజక వర్గాలలో పది శాతానికి తగ్గిపోయాయి. అంటే శాసనసభ ఎన్నికల సమయంలో బీజేపీ దూకుడు ప్రజలు మెచ్చలేదు అని మరోసారి రుజు వైంది. కత్తిగట్టినట్టు ప్రవర్తించిన బీజేపీ తీరు బెంగాల్‌ ఓటర్లకు మింగుడు పడలేదు. ఒక్క సీటులో మాత్రం బీజేపీ 23.3 శాతం ఓట్లు సంపాదించింది. అక్కడ తృణమూల్‌ 54.8 శాతం ఓట్లు సంపాదించి తన సత్తా చాటుకుంది. 2019లో లోకసభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు అనూహ్యమైనవే. కానీ మమతా బెనర్జీ తప్పటడుగులు వేయకుండా ఉంటే మళ్లీ ఘన విజయం సాధించే అవకాశాలు ఉంటాయి.
బెంగాల్‌ ఎన్నికలలో వామపక్ష ఫ్రంట్‌ పోటీ చేసిన చోట్ల ఓటింగ్‌ సరళిని చూస్తే వామపక్షాల పరిస్థితి మెరుగైనట్టు తేలుతోంది. ఉప ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లో వామపక్ష ఫ్రంట్‌ మూడో స్థానంలో ఉన్నప్పటికీ ఇటీవల శాసన సభ ఎన్నికల్లో కేవలం అయిదు శాతం ఓట్లే సాధించిన సీపీఎం ఈ సారి 19 శాతం ఓట్లు రాబట్టడం గమనించదగిన సానుకూల పరిణామమే. బెంగాల్‌లో నాలుగు సీట్లకు ఉప ఎన్నికలు జరిగితే సీపీఎం రెండు స్థానాల్లో పోటీ చేసి మిగతా రెండు సీట్లు మిత్రపక్షాలకు వదిలేసింది. ఒక స్థానంలో సీపీఎం 19.57 శాతం ఓట్లు, మరో స్థానంలో 10.39 శాతం ఓట్లు సంపాదించింది. ఉప ఎన్నికలలో సీపీఎం ఓట్లు బాగా పుంజు కున్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో సగటున సాధించిన అయిదు శాతం ఓట్లతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి మెరుగు పడినట్టే. దీన్నిబట్టి వామపక్ష ఫ్రంట్‌, ముఖ్యంగా సీపీఎం జాతీయ పరిస్థితిని సవ్యంగా అంచనా వేస్తే, అన్ని స్థాయిల్లో పార్టీ శ్రేణులను ఉత్తేజపరచ గలిగితే ఇంకా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. వామపక్షాలు ప్రజలతో సంబంధాలను పునరుద్ధరించుకో గలిగితే మునుపటి బలాన్ని కూడదీసుకోవడం అసాధ్యం కాదు. అంత సులభం కాదు. కానీ దీర్ఘ కాలిక ప్రణాళిక ఉంటే అసాధ్యమూ కాదు. యువతరాన్ని ప్రోత్సహించాలి. ఇంతకు ముందు చురుకుగా ఉన్న వారు నెమ్మది నెమ్మదిగా సీపీఎం వేపు తిరిగి వస్తునారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి. బీజేపీ మతతత్వ పునాదులు కదుల్తున్నాయి. ఒకప్పుడు వామపక్షాలు, తృణమూల్‌ కూడా నచ్చని వారు బీజేపీ వేపు వెళ్లారు. ఇప్పుడు వారు వామపక్షాల వేపు తిరిగి వస్తున్నారు. బెంగాల్‌లో కాంగ్రెస్‌తో పాటు పౌర సమాజం కూడా చురుకుగానే ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సీపీఎం కృషి చేయాలి. తృణమూల్‌ అవినీతి పాలనను ఎప్పటికప్పుడు ఎండగట్ట గలగాలి. మధ్య ప్రదేశ్‌లో ఓటమి నుంచి తేరుకుని కాంగ్రెస్‌ ఇదివరకటి బలం సంపా దించడం సాధ్యమే. 2023 చివరలో మధ్యప్రదేశ్‌ శాసన సభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. గోవాలో తృణమూల్‌ పోటీ చేయాలనుకుంటున్నందువల్ల కాంగ్రెస్‌ మరింత జాగ్రత్తగా పరిస్థితిని ఎదుర్కోగలగాలి. పంజాబ్‌ కాంగ్రెస్‌లో కుమ్ములాటలు విజయావకాశాలకు గండి కొడ్తున్నాయి. అక్కడ బీజేపీ పరిస్థితీ సవ్యంగా లేదు. కాంగ్రెస్‌ సమైక్యంగా వ్యవహరిస్తే అకాలీలను, ఆం ఆద్మీ పార్టీని ఎదుర్కోవడం సులభమే. ఉత్తరాఖండ్‌లో అధికారం నిలబెట్టుకోవడానికి బీజేపీ సకల ప్రయత్నాలు చేస్తున్నా అక్కడ కాంగ్రెస్‌ ఎదురొడ్డి నిలబడడానికి అవకాశం లేకపోలేదు. మణిపూర్‌లో బీజేపీకి వ్యతిరేకమైన చిన్న పార్టీలను కాంగ్రెస్‌ చేరదీయగలగాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img