Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

ఊరటైనా లేని బడ్జెట్‌

తొమ్మిదేళ్ల పాటు మాటలకు, చేతలకు సంబంధం లేకుండా సాగిన మోదీ సర్కారు 2024లో ఎన్నికలు ఎదుర్కోవలసి వస్తుంది కనక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్‌లో కూడా మునుపటి ఆర్థిక విధానాలను ప్రజానుకూలంగా మార్చడానికి ప్రయత్నించిన దాఖలాలు ఎక్కడా లేవు. 2024లో మోదీ ప్రభుత్వానికి మహా అయితే అనామతు బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశమే ఉండొచ్చు. 2023లో తొమ్మిది రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. 2024లో సార్వత్రిక ఎన్నికలతోపాటు ఒక శాసనసభకు ఎన్నికలు జరగవలసి ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం లోకసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో చెల్లింపని వాగ్దానాలకు సమాధానం చెప్పే పరిస్థితి లేనందువల్ల భవిష్యత్తు మరింత శోభాయమానంగా ఉంటుందన్న భ్రమ కలిగించడానికి చేయవలసిందంతా చేశారు. కీలకమైన కొన్ని ఆర్థిక కొలమానాల విషయంలో మోదీసర్కారు పనితీరు గత తొమ్మిదేళ్ల కాలంలోనూ నిరాశామయంగానే ఉంది. ఆర్థికాభివృద్ధిపై మోదీ సర్కారు చెప్తున్న లెక్కలకు, వాస్తవ పరిస్థితికి పొంతన కుదిరిన సందర్భం ఆయన ఏలుబడిలో ఏనాడూ లేదు. బుధవారం ప్రతిపాదించిన బడ్జెట్‌లో కూడా ఈ అభిప్రాయాన్ని మార్చగలిగే అంశాలు ఏమీ లేవు. గత 45 ఏళ్లకాలంలో ఎప్పుడూ లేనంతటి నిరుద్యోగం పెరిగిపోయింది అని ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తే కేంద్రప్రభుత్వం వాటిని వాటంగా చాప కిందకు తోసేసింది. ఈ అంశంపై ఎన్ని విమర్శలు వచ్చినా మోదీ సర్కారు ఇంతకాలం చలించనట్టుగానే కొత్త బడ్జెట్‌లోనూ ప్రభుత్వ ఆలోచనాధోరణి మారిన దాఖలాలు లేవు. కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామని 2019 ఎన్నికలకు ముందు  మోదీ ఆకర్షణీయమైన వాగ్దానం చేశారు. చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోవడం మామూలే. కానీ మోదీ ప్రత్యేకత ఏమిటంటే మాయచేసి వాటి ప్రస్తావన లేకుండా చేయగలరు. రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేస్తామని నమ్మబలికారు. కానీ దాని జాడే కనిపించడం లేదు. వచ్చే సంవత్సరం సార్వత్రక ఎన్నికలు జరగనున్నాయి కనక వరసగా మూడోసారి విజయ ఢంకా మోగించడమే బీజేపీ లక్ష్యం కనక మళ్లీ భ్రమాన్విత వాగ్దానాలను, ప్రకటనలనే ఈ బడ్జెట్‌లోనూ ఆశ్రయించారు. షరా మామూలుగా మోదీ భక్తవర్గాలు నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించిన బడ్జెట్‌ ‘‘గజ్జెల గుర్రం’’ అని ప్రశంసలజల్లు కురిపించినా ఆచరణలో ఇదీ జనం బతుకుల్లో గొప్ప మార్పు తీసుకొచ్చే ఆశలైతే ఎక్కడా కనిపించడం లేదు. అధికారంలో ఏ ప్రభుత్వంఉన్నా ప్రతిపక్షాలు షరా మామూలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను పడికట్టు పదాలతో విమర్శించడం మామూలే. ఇది ఎన్నికలకు ముందు ప్రతిపాదించిన ఆఖరి బడ్జెట్‌ కనక ఇది ‘‘ఎన్నికల బడ్జెట్‌’’, ‘‘ఎన్నికల ప్రణాళిక’’ లాంటిది అనడంలో ఆశ్చర్యం ఏమీలేదు. బడ్జెట్‌ను నిరపేక్షంగా విశ్లేషించి చెప్పగలిగిన మీడియా దాదాపుగా అంతర్ధానం అయిపోయింది కనక సామాన్యులకు దీని లోతుపాతులు అర్థంచేసుకునే మార్గమే లేకుండా పోయింది. ఈ పరిస్థితి కారణంగానే నిర్మలా సీతారామన్‌ మరోసారి బీజేపీకి విజయం చేకూర్చడానికి అనువైన బడ్జెట్‌ ప్రతిపాదించారు. పెరుగుతున్న నిరుద్యోగానికి కళ్లెం వేయడానికి ఈ బడ్జెట్‌లో చెప్పుకోదగ్గ ప్రయత్నం ఏమీకనిపించలేదు. అలాగే అసమానతలు తగ్గించడం అసలు బీజేపీ దృష్టిలోఉన్న దాఖలాలే లేవు. గ్రామీణప్రాంతాలలో అనేక రకాలుగా సంక్షోభం చుట్టుముడ్తున్నా మోదీ సర్కారు ఎంతసేపు పై మెరుగుల మీదే ఆధారపడ్తోంది తప్ప మౌలిక సమస్యలను పరిష్కరించే ప్రయత్నమైనా చేయడంలేదు. మధ్య తరగతి ప్రజల ఓట్లు కీలకం అని భావిస్తోంది కనక వారికి తాయిలాలనిపించే కొద్దిపాటి ప్రయత్నంమాత్రం స్పష్టంగా ద్యోతకం అవుతోంది. ఆర్థికవ్యవస్థ అంతా సవ్యంగానే ఉంది అన్న బీజేపీ వాదనను కొనసాగించే ప్రయత్నం ఈ బడ్జెట్‌ లోనూ కొట్టొచ్చినట్టుగా ఉంది. 

వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండానే అనేక కీలక రంగాలకు కేటాయించిన మొత్తం అత్యంత నిరాశాజనకంగా ఉంది. విద్య, ఆరోగ్యం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీపథకం, ఆహార భద్రత, ఇతర సామాజికాభివృద్ధి రంగాలకు కేటాయింపు అంతంత మాత్రంగానే ఉన్నాయి కనక సామాన్య ప్రజలు ఈ బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకో వలసిన అవసరమే లేదు. ఈ అవాస్తవిక దృక్పథం కారణాంగానే పేదల ఆకలి తీరడం లేదు. వారి బతుకులు అంతకంతకూ కునారిల్లి పోతున్నాయి. గ్రామీణ ప్రాంతాలను పట్టించుకుంటున్నామన్న అభిప్రాయం కలగచేయ డానికి సకల ప్రయత్నాలూ చేసిన ఈ బడ్జెట్‌ వ్యవసాయరంగానికి కేటాయింపులను రూ.8,500 కోట్లు కోత వేసింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పెట్టుబడి సమకూర్చడంలో శుష్క వాగ్దానాలే కనిపిస్తున్నాయి. 80కోట్ల మందికి ఉచితంగా అయిదేసి కిలోల ఆహార ధాన్యాలు సరఫరా చేస్తున్నామని టముకు వేస్తున్న ఈ ప్రభుత్వం ఆహార రంగానికి ఇదివరకు ఉన్న రూ. 2.8 కోట్ల కేటాయింపును రూ.1.97 కోట్లకు కుదించింది. సమగ్ర శిశు అభివృద్ధి పథకానికి కేటాయింపులు గత సంవత్సరం ఎక్కడ చతికిల పడ్డాయో అక్కడే నిలిచిపోయాయి. కనీసం పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుకూలంగానైనా నిధులు అదనంగా కేటాయించలేదు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం మీద మోదీకి ఉన్న అయిష్టత ఈసారీ కొనసాగింది. కిందటి సారి దీనికోసం రూ. 89,000 కోట్లు కేటాయిస్తే ఈ సారి అది రూ. 60,000 కోట్లకు దిగజారింది. వెరసి సామాజికాభివృద్ధికి దోహదంచేసే అన్ని రంగాల కేటాయింపులూ కుంచించుకు పోయాయి. మధ్య తరగతి వర్గం బడ్జెట్‌ ప్రతిపాదనల కోసం వెయ్యికళ్లతో ఎదురు చూస్తుంటుంది. ప్రస్తుతం సంవత్సరానికి అయిదు లక్షలకు మించి సంపాదన ఉన్న వారు పన్ను చెల్లించవలసి వస్తుండగా దాన్ని ఏడు లక్షలకు పెంచారు. అది కూడా కొత్త పన్ను విధానాన్ని అంగీకరించే వారికి మాత్రమే వర్తిస్తుంది. మధ్య తరగతి వారికి ఊరట కలిగించే మరో రాయితీ ఏమిటంటే ఇదివరకు ఆరు స్లాబులు ఉంటే ఇప్పుడు వాటిని అయిదు స్లాబుల కింద మార్చారు. దీనివల్ల ఇది వరకు రూ.60,000 ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు ఇప్పుడు రూ.45,000 చెల్లిస్తే సరిపోతుందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అత్యధిక పన్ను శాతం ఇదివరకు 42.74శాతం ఉంటే ఇప్పుడు దాన్ని 39 శాతానికి తగ్గించడంవల్ల అధికాదాయ వర్గాల వారికి మాత్రమే ఊరట కలుగుతుంది. రక్షణ శాఖకు పెంచినట్టు కనిపిస్తున్న మొత్తం ఇతరేతర ఖర్చులు భరించడానికే తప్ప రక్షణ దళాల సామర్థ్యం పెంచడానికి కాదు. అయితే తమకు ఎదురుచెప్పే వారిని ఇరుకున పెట్టడానికి ప్రధాన ఉపకరణంగా ఉన్న సీబీఐకి మాత్రం 4.4శాతం కేటాయింపులు పెరిగాయి. సార్వత్రిక ఎన్నికల దృష్టితో రూపిందించిన ఈ బడ్జెట్‌లోనూ ఏ వర్గమూ ఎగిరి గంతులేసే పరిస్థితి అయితే లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img