Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఎనిమిది పదుల అ.ర.సం.

దాదాపు ఒక వంద సంవత్సరాల వ్యవధిలోనే మరోసారి పునర్వికాసోద్యమ అవసరం ఏర్పడడం విచిత్రమైన పరిస్థితే. కానీ తెలుగు నేల మాత్రమే కాకుండా మొత్తం దేశమంతటా పునర్వికాసోద్యమం అనివార్యంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్య మూలాలనే కూకటివేళ్లతో సహా పెకలించడానికి ప్రజా సంస్కృతి పొడగిట్టని వారు రాజ్యమేలుతున్న దశలో ఈ ఆవశ్యకత ఏర్పడడం ఆశ్చర్యకరమేమీ కాదు. జాతీయోద్యమంలో పునర్వికాసోద్యమం, సంస్కరణోద్యమం సహా ప్రజాసంస్కృతి పరిరక్షించుకునే క్రమంలోనే తెలుగు నేలలో అభ్యుదయ రచయితల సంఘం, ప్రజానాట్యమండలి అవతరించాయి. ప్రజా సంస్కృతి పరిరక్షణ బాధ్యత బుజానికెత్తుకున్నాయి. సంక్షుభిత వాతావరణం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు ఆ సంక్షోభం నుంచి ప్రజా సంస్కృతిని పరిరక్షించుకునే ప్రయత్నం కూడా జరిగి తీరుతుంది. 1943 ఫిబ్రవరి 12, 13 తేదీలలో ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో జరిగిన సమావేశం పర్యవసానంగా అభ్యుదయ రచయితల సంఘం అవతరించింది. ప్రథమ సమావేశానికి ప్రముఖ రచయిత తాపీ ధర్మారావు అధ్యక్షత వహించారు. అభ్యుదయ రచయితల సంఘం 80వ వార్షికోత్సవాలు మళ్లీ అదే తెనాలిలో నిర్వహించడం యాదృచ్చికం అయితే కావచ్చు కానీ, ఇది ఒక చారిత్రక సందర్భం. అభ్యుదయ రచయితల సంఘం స్వర్ణోత్సవాలు కూడా తెనాలిలోనే 1994 ఫిబ్రవరి 12, 13 తేదీలలో జరిగాయి. 1936లో లక్నోలో అభ్యుదయ రచయితల సంఘం అవతరించడానికి పూర్వం మొత్తం ప్రపంచంలో, మన దేశంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉండేవో సరిగ్గా అవే పరిస్థితులు ఇప్పుడూ ఉన్నాయి. వికృత రాజకీయ పరిణామాలకు, విచ్ఛిన్నకర సాంస్కృతిక ప్రభావాలకు సాహితీరంగం అతీతంగా ఉండడం కుదరదు. నిజానికి ప్రజల పక్షాన నిలబడేవారు ఎవరైనా పట్టనట్టు కూర్చోవడానికి వీలు లేదు. అందుకే కలం యోధులు తెనాలిలో అభ్యుదయ రచయితల సంఘం 80వ వార్షికోత్సవంలో భాగస్వాములు అవుతున్నారు. తెనాలి సభ కేవలం అభ్యుదయ రచయితల సంఘానికి పరిమితమైన వ్యవహారం కాదు. ప్రారంభ సభలోనే దళితోద్యమ దీపధారి కత్తి పద్మారావు కీలకోపన్యాసం చేయడం, మొదటిరోజు సభలోనే జనసాహితి నాయకులు కొత్తపల్లి రవిబాబు లాంటి వారితో సహా నిర్మాణాత్మకంగా అభ్యుదయ కామన ఉన్న అభ్యుదయ రచయితల సంఘంతో మమేకం కాని వారు కూడా ఈ 19వ మహాసభల్లో పాల్గొనడం ఆ వేదిక విస్తృతికి నిదర్శనం. ప్రగతిశీల సాహిత్య, సాంస్కృతిక శక్తులపై దాడిమీద ప్రత్యేకంగా ఓ పూట సదస్సు నిర్వహించడం సమాకాలీన పరిణామాలకు అభ్యుదయ రచయితల సంఘం ఎంత చురుకుగా స్పందిస్తుందో చెప్పడానికి తార్కాణం. ప్రగతిశీల భావాలుగల వారు, వామపక్ష వాదులు, కమ్యూనిస్టులు మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిఘటించడానికి ఏ మాత్రం వెనుకాడలేదు. సాహిత్య కళా రంగాలలో అభ్యుదయ రచయితల సంఘం తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే వస్తోంది. సాంస్కృతిక పునర్వికాసోద్యమంలో అనేకమంది ప్రముఖుల పేర్లు ఏకరువు పెట్టొచ్చు. కానీ ఈ సందర్భంలో నిస్సందేహంగా గుర్తుంచుకోవలసింది 1935 నుంచి 1947 దాకా సీపీఐ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పి.సి.జోషీ పేరే. స్వాతంత్య్రానికి ముందు, స్వాతంత్య్రం తరవాత ఆయన అభ్యుదయ రచయితల సంఘం, ప్రజానాట్యమండలి అవతరణకు స్ఫూర్తి ప్రదాతగా పనిచేశారు. కార్మికులను, కర్షకులను సమైక్యం చేయడంలో ఆయన కృషి ఎంత విస్తారమైందో సాంస్కృతిక రంగంలో సాహితీవేత్తలను, కళాకారులను సమీకరించడంలో ఆయన పాత్ర అంతే అద్వితీయమైంది. ఆయన నాయకత్వంలోనే కమ్యూనిస్టు పార్టీ ఆధునిక సాంస్కృతిక పునర్వికాసానికి మునుము పట్టగలిగింది. దేశంలో సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాలు బలపడడానికి, అభ్యుదయ రచయితల సంఘం, ప్రజా నాట్యమండలి ఏర్పడడానికి ఆ రంగాలలోని ప్రముఖులతో పాటు పి.సి.జోషీకి కూడా అంతే ప్రమేయం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు 1935 జూన్‌ 21వ తేదీన ప్రపంచ రచయితల మహాసభ జరిగింది. ఆంద్రే గిడే, మాక్సిం గోర్కీ, ఆంద్రే మల్రాక్స్‌, ఎ.ఎం.ఫార్స్టర్‌ తదితరులు ఈ మహాసభకు ఏర్పాటు చేశారు. ఈ మహాసభకు అప్పుడు లండన్‌లో ఉంటున్న సజ్జాద్‌ జహీర్‌ హాజరయ్యారు. ఈ మహాసభ కారణంగానే ఫాసిజం నుంచి సంస్కృతిని పరిరక్షించుకోవడానికి రచయితల అంతర్జాతీయ సంఘం ఏర్పడిరది. ఆ సమయంలో మేధావివర్గం ఫాసిజాన్ని తీవ్రంగా ఎదిరించింది. అదే సమయంలో విశిష్ట శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్స్టీన్‌ను జర్మనీ నుంచి తరిమేయడానికి జరిగిన ప్రయత్నాలను విస్మరించకూడదు. హిట్లర్‌ ప్రభావం మరో మూడు నాలుగేళ్లకు కానీ రెండో ప్రపంచ యుద్ధ రూపంలో కాటేయలేదు. కాని సంస్కృతిపై దాడి మాత్రం మొదలైంది. అసమ్మతిని సహించకపోవడం ఫాసిస్టుల లక్షణం. ఇప్పుడు మనం అదే విషమదశలో ఉన్నాం.
అఖిలభారత అభ్యుదయ రచయితల సంఘం అవతరిం చకముందే ఆ సంకల్పం 1930ల తొలి నాళ్లలోనే పొటమరించింది. సృజనశీలురైన రచయితలు ఫాసిస్టు పోకడలను, సామ్రాజ్యవాద ధోరణులను నిరోధించడానికి ముందుకొచ్చారు. ఈ ఆకాంక్షే 1936లో అఖిలభారత అభ్యుదయ రచయితలసంఘం ఏర్పడడానికి చోదకశక్తి అయింది. ప్రగతిశీల భావాలున్న రచయితలు తమ సృజనాత్మక శక్తితో ఉద్యమానికి కొత్త ఉత్తేజం కల్పించారు. ఫాసిస్టు కారుమబ్బులు ముసురు కోవడమే ఈ రచయితలను సంఘటితం కావడానికి ప్రేరేపించింది. దేశంలో ఆధునిక సాహిత్య అభివృద్ధి చెందడానికి అణచివేసే తత్వంగల శక్తులు అడ్డు తగలడాన్ని ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ లాంటి వారే 1938 కల్లా గుర్తించారు. నిజమైన దేశభక్తి అంటే ఏమిటో తెలియజెప్పింది దేశవ్యాప్తంగా ఉన్న అభ్యుదయ రచయితులు, కళాకారులే. శ్రమజీవులే తమ సృజనా వ్యాసంగం కేంద్రం అని భావించారు. ఈ నేపథ్యమే తెలుగునాట అభ్యుదయ రచయితలసంఘం ఆవిర్భావానికి ఉపకరించింది. అఖిలభారత అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపక సభకు 1936లో మున్షీ ప్రేం చంద్‌ అధ్యక్ష స్థానంలో ఉంటే 1943లో తెనాలిలో అభ్యుదయ రచయితల సంఘ ప్రథమ మహాసభలో తాపీ ధర్మారావు అధ్యక్షోపన్యాసం చేశారు. జాతీయ స్థాయిలో చూసినా, తెలుగునాట బేరీజు వేసినా అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపరంగా ఆవిర్భవించడానికి ముందే ప్రగతిశీల సాహిత్యం, కళలు ఉన్నాయి. అభ్యుదయ రచయితల సంఘం చేసిందల్లా ఈ భావాలను ప్రోది చేయడానికి, ముందుకు తీసుకెళ్లడానికి ఓ వేదిక ఏర్పాటు చేయడమే. పునర్వికాసోద్యమంలో కీలకపాత్ర పోషించిన కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి పంతులు వెలిగించిన కాగడాను అభ్యుదయ రచయితల సంఘం దేదీప్యమానంగా ప్రకాశింపచేసింది. సమాజ పరిణామాలకు స్పందించడం, సృజనాత్మకత ప్రదర్శించడం ప్రగతిశీల రచయితల మూలకందం. ఆ పనిచేసిన రచయితలు దేశంలోనూ, తెలుగునాట కొల్లలుగా ఉన్నారు. వాస్తవానికి ప్రధాన స్రవంతి అభ్యుదయ రచయితలదే. ఎనిమిది దశాబ్దాల కింద ఏ దుష్ట సంస్కృతిని ఎదిరించడానికి అభ్యుదయ రచయితలసంఘం నడుం కట్టిందో అంతకన్నా విపత్కర పరిస్థితులు ప్రస్తుతం వికటాట్టహాసం చేస్తున్నాయి. ఆ జ్యోతిని మరింత ప్రజ్వరిల్లేట్టు చేయడం తెనాలి మహాసభ పరమ లక్ష్యం కావాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img